ఉప రాష్ట్రపతి సచివాలయం
గుజరాత్‌లోని ఏక్తా నగర్లో సర్దార్ @ 150 ఏకతా మార్చ్ - జాతీయ పాదయాత్ర ముగింపు కార్యక్రమానికి హాజరైన ఉపరాష్ట్రపతి శ్రీ సీపీ రాధాకృష్ణన్
560కి పైగా సంస్థానాలను ఏకం చేసి అఖండ భారత్‌కు పునాది వేసిన సర్దార్ పటేల్‌కు భారత్ ఎప్పుడూ రుణపడి ఉంటుంది: ఉపరాష్ట్రపతి
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో సర్దార్ పటేల్ కలలుగన్న దృఢమైన, స్వావలంబన సాధించిన భారత్ సాకారం కాబోతుంది: ఉపరాష్ట్రపతి
గడచిన దశాబ్దంలో ఆర్థికంగా, సామాజికంగా, సైనికపరంగా, వ్యూహాత్మకంగా భారత్ వేగంగా పురోగతి సాధించింది: ఉపరాష్ట్రపతి
ఆవిష్కరణలు, అభివృద్ధిలో దేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా మార్చే ప్రతిభా శక్తి భారత యువతకు ఉంది: ఉపరాష్ట్రపతి
భారత రక్షణ సామర్థ్యాలు అనేక రెట్లు పెరిగాయి, దేశ సంకల్పాన్ని ఆపరేషన్ సిందూర్ ప్రదర్శించింది: ఉపరాష్ట్రపతి
కార్మికులకు న్యాయమైన, సమగ్రమైన, ప్రగతి విధానాలను అందించే నాలుగు కార్మిక నియమాల గురించి వివరించిన ఉపరాష్ట్రపతి
प्रविष्टि तिथि:
06 DEC 2025 5:04PM by PIB Hyderabad
గుజరాత్‌లోని ఏక్తా నగర్లో ఐక్యతా విగ్రహం వద్ద జరిగిన సర్దార్ @150 ఏకతా మార్చ్- జాతీయ పాదయాత్ర ముగింపు కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి శ్రీ సీపీ రాధాకృష్ణన్ ఈ రోజు హాజరయ్యారు.
ఈ సందర్భంగా సభను ఉద్దేశించి మాట్లాడిన ఉపరాష్ట్రపతి.. చరిత్రాత్మకమైన ఈ పాదయాత్ర ముగింపు కార్యక్రమానికి హాజరవడం తనకు దక్కిన గౌరవమన్నారు. ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మహాత్మాగాంధీ, సర్దార్ పటేల్‌కు జన్మనిచ్చిన ఈ పవిత్ర భూమికి ఇది తన తొలి అధికారిక పర్యటనని తెలిపారు.
సంవిధాన్ దివస్ సందర్భంగా నవంబర్ 26న మొదలైన ఈ పాదయాత్ర ప్రాముఖ్యాన్ని ఆయన వివరించారు. దీనిలో భాగంగా నిర్వహించిన 1,300కి పైగా పాదయాత్రల్లో 14 లక్షల మంది యువత పాల్గొని సర్దార్ వల్లభభాయి పటేల్ రగిలించిన ఐక్యతా స్ఫూర్తిని ప్రదర్శించారని వెల్లడించారు.
నదుల అనుసంధానం, ఉగ్రవాద నిర్మూలన, ఉమ్మడి పౌరస్మృతి అమలు, అంటరానితనాన్ని నిర్మూలించడం, మాదకద్రవ్యాలను ఎదుర్కోవడం తదితర అంశాలపై తాను చేపట్టిన 19,000 కి.మీ.ల రథయాత్రతో పాటు తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించిన వివిధ పాదయాత్రల గురించి ఆయన గుర్తు చేసుకున్నారు. ప్రజలతో మమేకమవ్వడానికి, ఐకమత్యం, జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన సందేశాన్ని ప్రచారం చేయడానికి ఇలాంటి పాదయాత్రలు శక్తిమంతమైన మార్గాలుగా పని చేస్తాయని ఉపరాష్ట్రపతి తెలిపారు.
560కి పైగా సంస్థానాలను విలీనం చేయడంలో సర్దార్ పటేల్ పోషించిన చరిత్రాత్మక పాత్రకు ఘన నివాళి అర్పిస్తూ.. ‘‘అఖండ భారత్‌కు బలమైన పునాది వేసి దేశాన్ని ఏకం చేసిన ఈ ఉక్కుమనిషికి దేశం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుంది’’ అని అన్నారు.
బలమైన, స్వావలంబన సాధించిన భారత్‌ను తయారు చేయాలన్న సర్దార్ పటేల్ కల ఇప్పుడు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో సాకారమవుతోందని ఉపరాష్ట్రపతి అన్నారు.
గడచిన దశాబ్దంలో ఆర్థికంగా, సామాజికంగా, సైనికపరంగా, వ్యూహాత్మకంగా భారత్ వేగంగా వృద్ధి సాధించిందన్నారు. అలాగే ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారేందుకు స్థిరంగా ముందుకు సాగుతోందన్నారు.
భారత్ భవిష్యత్తుకు యువతే శక్తి కేంద్రమని ఉపరాష్ట్రపతి చెప్పారు. ఐకమత్యం, క్రమశిక్షణ, జాతీయ లక్ష్యంతో మార్గనిర్దేశం చేసిప్పుడు.. ఆవిష్కరణలు, అభివృద్ధిలో భారత్‌ను ప్రపంచంలోనే అగ్రగామిగా వారు మార్చగలరన్నారు.
మాదకద్రవ్యాలకు బానిస కావొద్దని యువతకు పిలుపునిస్తూ.. సామాజిక మాధ్యమాలను బాధ్యతాయుతంగా వినియోగించాలని, డిజిటల్ అక్షరాస్యత, సైబర్ భ్రదతకు తమ వంతు సహకారం అందించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొన్న మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ.. నారీశక్తి వందన్ అధీనియం చూపే ప్రభావాన్ని వివరించారు. ఇది మహిళా సాధికారత నుంచి మహిళా నేతృత్వంలో అభివృద్ధి దిశగా మన దృష్టిని మళ్లించిదన్నారు.
దేశ భద్రత గురించి వివరిస్తూ.. భారత రక్షణ సామర్థ్యాలు అనేక రెట్లు పెరిగాయన్నారు. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడటంలో, సీమాంతర ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో దేశానికున్న దృఢచిత్తాన్ని ఆపరేషన్ సిందూర్ ప్రదర్శించిందని వివరించారు.
సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్ అనే సూత్రాలను ప్రతిబింబిస్తూ.. చేపట్టిన ప్రధాన సంస్కరణలైన నాలుగు కొత్త కార్మిక నియమాల గురించి ఆయన వివరించారు. ఇవి ఆధునికమైన, పారదర్శకమైన కార్మిక కేంద్రక వ్యవస్థగా కార్మిక రంగాన్ని మార్చాయన్నారు.
ప్రపంచంలోనే అతి ఎత్తయిన విగ్రహం వద్ద జాతీయ స్థాయి పాదయాత్రను ముగించడాన్ని సర్దార్ పటేల్ అందించిన వారసత్వానికి మాత్రమే కాకుండా..నూతన భారత స్ఫూర్తికి అందించే నివాళిగా వర్ణిస్తూ.. ఉపరాష్ట్రపతి తన ప్రసంగాన్ని ముగించారు. ఈ అమృత కాలంలో.. 2047 నాటికి వికసిత్ భారత్ సాధించాలనే లక్ష్యంతో దేశం ముందుకు సాగుతోందని, ఈ మార్గంలో మనల్ని నడిపించే శక్తిగా సర్దార్ పటేల్ ఆశయాలు తోడ్పాటు అందిస్తాయన్నారు.
అంతకుముందు.. ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారి ఏక్తా నగర్ వచ్చిన శ్రీ సీపీ రాధాకృష్ణన్ గౌరవ వందనం స్వీకరించారు. అలాగే ఐక్యతా విగ్రహం వద్ద సర్దార్ వల్లభభాయి పటేల్‌కు ఆయన పుష్పాంజలి ఘటించారు.
కరంసద్ నుంచి ఐక్యతా విగ్రహం వరకు 180 కిలోమీటర్ల మేర చేపట్టిన ఈ పాదయాత్ర 10 రోజులు కొనసాగింది. ఇది స్వావలంబనకు, పర్యావరణ స్పృహకు చిహ్నంగా నిలిచింది. ఏక భారత్, శ్రేష్ఠ భారత్ అనే ప్రధానమంత్రి దార్శనికతకు అనుగుణంగా ఈ కార్యక్రమం రూపుదిద్దుకుంది.
ఈ కార్యక్రమంలో గుజరాత్ గవర్నర్ శ్రీ ఆచార్య దేవవ్రత్, గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్, కేంద్ర పంచాయతీరాజ్, మత్స్య, పశుసంవర్ధక శాఖ మంత్రి శ్రీ రాజీవ్ రంజన్ సింగ్, కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన, యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ, కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా శాఖ సహాయ మంత్రి శ్రీమతి రక్షా ఖడ్సే, కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల సహాయ మంత్రి శ్రీ టోకన్ సాహు, ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
***
(रिलीज़ आईडी: 2200032)
आगंतुक पटल : 35