రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
కష్టాలను శక్తిగా మార్చిన రాయ్‌పూర్-వైజాగ్ కారిడార్ ప్రభావం
प्रविष्टि तिथि:
07 DEC 2025 9:45AM by PIB Hyderabad
త్వరలో అందుబాటులోకి రానున్న రాయ్‌పూర్-విశాఖపట్నం ఆర్థిక కారిడార్ ఈ రెండు నగరాల మధ్య రవాణాపై ఆధారపడి జీవనోపాధి పొందే అనేక మందికి చాలా కాలంగా ఎదురుచూస్తున్న సమాధానంగా మారింది. రహదారి రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేస్తున్న రాయ్‌పూర్-విశాఖపట్నం ఆర్థిక కారిడార్... ఛత్తీస్‌గఢ్ అడవులు, ఒడిశాలోని ఖనిజ సంపద కలిగిన ప్రకృతి దృశ్యాలు, ఆంధ్రప్రదేశ్‌లోని కొండల మీదుగా విస్తరించి ఉంది. మొత్తం రూ.16,482 కోట్లతో నిర్మిస్తున్న ఈ కారిడార్... 2026 డిసెంబర్ నాటికి పూర్తవుతుందని అంచనా. ఇది ప్రస్తుత 26వ నంబరు జాతీయ రహదారితో అనుసంధానం ద్వారా మొత్తం ప్రయాణ దూరాన్ని 597 కిలోమీటర్ల నుంచి 465 కిలోమీటర్లకు తగ్గించనుంది. దీని ద్వారా 132 కిలోమీటర్ల దూరం... దాదాపు ఏడు గంటల ప్రయాణ సమయం ఆదా అవుతుంది. ఇది ప్రధానంగా ఇంధన ఆదాను సృష్టిస్తుంది. ప్రజలకు, సరుకు రవాణా ఆపరేటర్లకు రవాణా ఖర్చులను తగ్గిస్తుంది.
ప్రస్తుతం 12 గంటలుగా ఉన్న ప్రయాణ సమయం ఈ కారిడార్ ద్వారా కేవలం కేవలం 5 గంటలకు తగ్గనుంది. ప్రధానమంత్రి గతి శక్తి దార్శనికత కింద వేగవంతమైన సరుకు రవాణా, ఎలాంటి ఇబ్బంది లేని కనెక్టివిటీకి అవకాశం ఏర్పడుతుంది. ఛత్తీస్‌గఢ్, ఒడిశాలోని పరిశ్రమలు... విశాఖపట్నం ఓడరేవు, చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారికి నేరుగా అనుసంధానమవడంతో వాణిజ్యానికి పెద్ద ఎత్తున ప్రోత్సాహం లభిస్తుంది. అంటే ఓడరేవులు, పారిశ్రామిక కేంద్రాలకు మెరుగైన కనెక్టివిటీ, వేగవంతమైన ఎగుమతులు, సాఫీగా సరుకు రవాణా, వాణిజ్యానికి శక్తిమంతమైన ప్రోత్సాహం, లాజిస్టిక్స్ సామర్థ్యం కోసం భారీ ప్రోత్సాహానికి ఇది దారితీస్తుంది. ఈ కారిడార్ పర్యాటకాన్నీ ప్రోత్సహిస్తుంది, ఉద్యోగ కల్పనతో పాటు రియల్ ఎస్టేట్ అభివృద్ధి ద్వారా ఆర్థిక వృద్ధిని ప్రేరేపిస్తుంది.
సంక్షిప్త సమాచారం
• 6 లేన్ల గ్రీన్‌ఫీల్డ్ కారిడార్ ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌లను కలుపుతుంది
• ఇది 465 కిలోమీటర్ల పొడవైన జాతీయ రహదారి
• 7 గంటల ప్రయాణ సమయం, 132 కి.మీ దూరాన్ని ఆదా చేయడంలో సహాయపడుతుంది
• 2026-27 ఆర్థిక సంవత్సరంలో ప్రజలకు అందుబాటులోకి వస్తుంది
• గిరిజన, మారుమూల ప్రాంతాలకు వేగంగా వెళ్లవచ్చును.
రాత్రి వేళల్లో ఇంటి నుంచి దూరంగా గడిపే లారీ యజమానులకు తమ ఉత్పత్తులు మార్కెట్లకు చేరుకోవడానికి ఆత్రుతగా ఎదురుచూసే రైతులకు... కొత్త అవకాశాల కోసం వెతుకుతున్న కుటుంబాలకు... ఈ కారిడార్ మరింత ఆశాజనకమైన భవిష్యత్తుకు ఒక మార్గంగా అనిపిస్తుంది. రాయ్‌పూర్ నుంచి విశాఖపట్నానికి నిరంతరం వస్తువులను పంపే లారీ యజమాని విశాల్ మాట్లాడుతూ... ఈ కొత్త కారిడార్ రవాణాదారుల పని విధానాన్ని పూర్తిగా మార్చివేస్తుందన్నారు. “గతంలో, ప్రయాణం ఒకటిన్నర రోజులు పట్టింది. ఇప్పుడు, నేను పగటిపూట ప్రారంభించి రాత్రికి గమ్యస్థానాన్ని చేరుకోగలను" అని ఆయన చెప్పారు. దూరం తగ్గడం వల్ల డీజిల్ వినియోగం తగ్గుతుందని, ట్రక్కులు ఎక్కువ రోజుల మన్నికను అందించడంతో తనలాంటి ఆపరేటర్లకు స్పష్టమైన ఆర్థిక ఉపశమనం లభిస్తుందని ఆయన వివరించారు.
రైతులు తమ ఆర్థిక దృక్పథంలోనూ స్పష్టమైన మార్పును గమనిస్తున్నారు. గ్రీన్‌ఫీల్డ్ హైవే ప్రాజెక్ట్ ప్రారంభమైనప్పటి నుంచి భూముల ధరలు ఎలా పెరిగిందీ ఒక రైతు వివరిస్తున్నారు. కనెక్టివిటీ ఆధారిత అభివృద్ధి గ్రామీణస్థాయిలో అవకాశాలను ఎలా పునర్నిర్మిస్తున్నదో సూచిస్తూ.... “మా భూమి విలువ గతంలో ఎకరానికి రూ. 15 లక్షలు ఉండేది. ఇప్పుడు అది రూ. 1.5 కోట్లకు దగ్గరగా ఉంది. ఇక్కడి రైతులు నిజంగా సంతోషంగా ఉన్నారు” అని ఆయన తెలిపారు.
విజయనగరం నివాసి ఒకరు... ఈ ప్రాజెక్టు తమ ప్రాంతాన్ని ఎలా ప్రభావితం చేసిందో నిజాయితీగా వివరించారు. “మేం రైతులం. మొదట్లో, గ్రీన్‌ఫీల్డ్ హైవే కోసం మా భూమిని ఇవ్వడానికి మేం బాధపడ్డాం. అది అంత సులభం కాదు. కానీ ఇప్పుడు కారిడార్ సిద్ధమవుతున్నందున మేం ఎంతో ఆశతో దీని కోసం ఎదురుచూస్తున్నాం. మా భూమి విలువ రెట్టింపు కంటే ఎక్కువైంది. ఈ అభివృద్ధి మా కుటుంబాలకు మరిన్ని అవకాశాలను తెస్తుందని మాకు తెలుసు. మేం కోల్పోయింది ఇప్పుడు మాకు మంచి భవిష్యత్తుగా మారుతోంది” అని సంతోషంగా చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాలో గల జామి గ్రామంలో నివసిస్తున్న మరో రైతు శ్రీనివాసులు తన సొంత అనుభవాన్ని పంచుకున్నారు. “నేను గ్రీన్‌ఫీల్డ్ హైవే కోసం 1.10 ఎకరాల భూమినిచ్చాను. దానికి నాకు న్యాయమైన పరిహారం లభించింది. ఇంకా మిగిలిన భూమి విలువ గణనీయంగా పెరిగింది. రాబోయే ఈ గ్రీన్‌ఫీల్డ్ హైవే గురించి గ్రామస్తులు, రైతులు సంతోషంగా ఉన్నారు” అని ఆయన చెప్పారు.
ఆర్థిక ప్రయోజనాలకు తోడు... రాయ్‌పూర్-విశాఖపట్నం కారిడార్ గిరిజన, మారుమూల జిల్లాలైన ధమ్తారి, కేష్కల్, కాంకేర్ (ఛత్తీస్‌గఢ్), బోరిగుమ్మ, నబరంగ్‌పూర్, కోరాపుట్ (ఒడిశా), రామభద్రపురం, అరకు (ఆంధ్రప్రదేశ్) ప్రాంతాలకు రవాణాను గణనీయంగా మెరుగుపరుస్తుంది. ఈ ప్రాంతాలను ప్రధాన మార్కెట్లు, ముఖ్యమైన సేవలకు చేరువ చేయడం ద్వారా ఈ కారిడార్... వాటిని ప్రధాన ఆర్థిక వ్యవస్థతో మరింత సమర్థంగా అనుసంధానించడం లక్ష్యంగా పెట్టుకుంది. కొత్త యాక్సెస్-నియంత్రిత, 6-వరుసల రాయ్‌పూర్-విశాఖపట్నం ఆర్థిక కారిడార్...26వ నంబరు జాతీయ రహదారిపై పాత రెండు వరుసల రహదారి కారణంగా ఏర్పడిన రద్దీని తగ్గిస్తుంది. ప్రయాణ సౌకర్యం, రహదారి భద్రతను మెరుగుపరుస్తుంది. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా రూపొందించిన ఈ మార్గం ప్రయాణికులకు, సరుకు రవాణా ఆపరేటర్లకు తక్కువ సమయంలో ప్రయాణం, విశ్వసనీయతలను అందిస్తూ వారి ఖర్చులను ఆదా చేసుకునేందుకు హామీనిస్తుంది.
మూడు రాష్ట్రాల్లో 15 ప్రణాళికాబద్ధమైన ప్యాకేజీల ద్వారా నిర్మించిన రాయ్‌పూర్-విశాఖపట్నం ఆర్థిక కారిడార్ జీవితాలను మార్చే మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంలో ఎమ్ఓఆర్‌టీహెచ్ నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తుంది. ప్రాజెక్ట్ పూర్తయ్యే సమయానికి... లక్షలాది మంది కోసం ప్రాంతాలను మాత్రమే కాకుండా అవకాశాలనూ అనుసంధానించే రహదారులను నిర్మించాలనే మంత్రిత్వ శాఖ దార్శనికతను ఇది ప్రతిబింబిస్తుంది.
***
(रिलीज़ आईडी: 2200022)
आगंतुक पटल : 22