సహకార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

గుజరాత్‌లోని వావ్ - థరడ్ జిల్లాలో బనాస్ డెయిరీ నిర్మించిన కొత్త బయో సీఎన్‌జీ, ఎరువుల ప్లాంట్‌ ప్రారంభోత్సవం, 150 టన్నుల పౌడర్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేసిన కేంద్ర హోం, సహకార శాఖల మంత్రిశ్రీ అమిత్ షా

శ్వేత విప్లవం 2.0 కోసం భారీ లక్ష్యాలను నిర్దేశించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
జాతీయ గోకుల్ మిషన్, పశుసంవర్ధక మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి, పునర్నిర్మించిన జాతీయ పాడి ప్రణాళిక, జాతీయ పశు వ్యాధి నియంత్రణ కార్యక్రమం ద్వారా శ్వేత విప్లవం 2.0 విజయం తధ్యం
బయో సీఎన్‌జీ ప్లాంట్ల ఏర్పాటులో బనాస్ డెయిరీ నెలకొల్పిన సంప్రదాయం దేశవ్యాప్తంగా ఉన్న సహకార సంఘాలకు ఒక నమూనా
మహిళల అవిశ్రాంత కృషితో రూ. 24,000 కోట్లకు చేరుకున్న బనాస్ డెయిరీ వ్యాపారం

బనస్కాంత,మెహసానాలో నీటి సంరక్షణ, నీటి ద్వారా సాధించిన పురోభివృద్ధిపై పరిశోధనలు

పాల సహకార సంఘాలు అధిక విలువ కలిగిన ఉత్పత్తుల తయారిపై దృష్టి పెడితే మరింత అభివృద్ధి

సహకార సంఘాలలోనే పశువుల దాణా ఉత్పత్తి ద్వారా నేరుగా మహిళల బ్యాంకు ఖాతాలలోకి లాభాలు

చక్రభ్రమణ ఆర్థిక వ్యవస్థ ద్వారా 20 శాతం కంటే ఎక్కువగా పాడి రైతులకు ఆదాయం

డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్ మహాపరినిర్వాణ దినం సందర్భంగా ఆయనకు నివాళులర్పించిన శ్రీ అమిత్ షా

అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగంతో దళితులు, పేదలు, గిరిజనులు వెనుకబడిన తరగతులు గౌరవప్రదమైన జీవితాన్ని గడపగలిగే వ్యవస్థ ఏర్పాటు

प्रविष्टि तिथि: 06 DEC 2025 5:56PM by PIB Hyderabad

గుజరాత్‌లోని వావ్-థరడ్ జిల్లాలో బనాస్ డెయిరీ నిర్మించిన నూతన బయో సీఎన్‌జీ, ఎరువుల ప్లాంట్లను కేంద్ర హోం, సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా ఈ రోజు ప్రారంభించారు. 150 టన్నుల పౌడర్ ప్లాంట్‌కు ఆయన శంకుస్థాపన కూడా చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో గుజరాత్ అసెంబ్లీ స్పీకర్ శ్రీ శంకర్ చౌదరి, కేంద్ర సహకార శాఖ సహాయ మంత్రులు శ్రీ కృష్ణ పాల్ గుర్జార్,   శ్రీ మురళీధర్ మొహోల్, కేంద్ర సహకార శాఖ కార్యదర్శి డాక్టర్ ఆశిష్ కుమార్ భూటానీ సహా పలువురు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

 

ఈ కార్యక్రమంలో శ్రీ అమిత్ షా మాట్లాడుతూ, బనస్కాంతలో బనాస్ డెయిరీని స్థాపించిన గల్బాభాయ్ నంజీభాయ్ పటేల్ ప్రస్థానం క్రమంగా ఎంతగానో వృద్ధి చెంది, ఈ రోజు డెయిరీ టర్నోవర్ రూ. 24,000 కోట్ల వరకు చేరిందని అన్నారు. దేశంలో ఎక్కడికి వెళ్లినా, గుజరాత్ గ్రామాలను సుసంపన్నం చేసే పనిని రాష్ట్రంలోని తల్లులు, అక్కాచెల్లెళ్ళు సాధించారని గర్వంగా ప్రకటిస్తానని ఆయన అన్నారు. “ఈ ప్రాంతంలోని రైతులు, ముఖ్యంగా సహకార ఉద్యమ మార్గదర్శకులు, గ్రామ స్థాయి పాల సంఘాల చైర్మన్లు,  బనాస్ డెయిరీ డైరెక్టర్లు తాము ఎంత పెద్ద అద్భుతాన్ని సాధించారో గ్రహించకపోవచ్చు. రూ. 24,000 కోట్ల కంపెనీని నిర్మించడం అనేది అతిపెద్ద కార్పొరేట్ సంస్థలకు కూడా చెమటలు పట్టించే పని. అయినప్పటికీ బనస్కాంత మహిళలు,  రైతులు కంటి మీద కునుకు లేకుండా రూ. 24,000 కోట్ల కంపెనీని నిర్మించగలిగారు” అని ఆయన వివరించారు.

పార్లమెంటు ఉభయ సభలైన లోక్‌సభ, రాజ్యసభ సభ్యులను ఈరోజు తనతో పాటు తీసుకువచ్చానని శ్రీ అమిత్ షా తెలిపారు. వచ్చే జనవరిలో, దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 250 మంది డెయిరీల ఛైర్మన్లు, మేనేజింగ్ డైరెక్టర్లు ఈ సహకార డెయిరీ రంగంలో జరిగిన అద్భుతాన్ని స్వయంగా చూసేందుకు బనస్కాంతకు వస్తున్నారని ఆయన చెప్పారు. 1985–87 కరువు తర్వాత తాను ఈ ప్రాంతాన్ని సందర్శించి రైతులను అడిగినప్పుడు, వారు ఏడాది పొడవునా కేవలం ఒకే ఒక పంట పండించగలమని చెప్పేవారని ఆయన గుర్తు చేశారు. కానీ ఇప్పుడు, బనస్కాంత రైతు ఏడాదికి మూడు పంటలు పండిస్తున్నాడని,  వేరుశనగ, బంగాళాదుంప, వేసవిలో సజ్జలు, అలాగే ఖరీఫ్ పంటను కూడా వేస్తున్నాడని తెలిపారు. కేవలం ఇరవై ఐదేళ్ల క్రితం, బనస్కాంతలో మూడు పంటలు పండించడం కేవలం కల గా ఉండేదని పేర్కొన్నారు. 

 

నీరు సమృద్ధిగా ఉన్న ప్రాంతాల నుంచి మిగులు జలాలను మళ్లించడం ద్వారా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గుజరాత్‌లో నీటి కొరత ఉన్న ప్రాంతాలకు నీటి సౌకర్యం కల్పించారని శ్రీ అమిత్ షా తెలిపారు. సుజలాం-సుఫలాం పథకం కింద నర్మదా, మహి నదుల నుంచి  అదనపు జలాలను బనస్కాంతకు తీసుకువచ్చారని ఆయన అన్నారు. గతంలో ఇక్కడి రైతులు ఇతరుల పొలాల్లో కూలీలుగా పనిచేయాల్సి వచ్చేదని,  ఈరోజు, అదే రైతు తన భూమిని స్వర్గంగా మార్చుకుని, మొత్తం బనస్కాంతను సుసంపన్నం  చేశాడని పేర్కొన్నారు. 

మనం సాధించిన ఏ గొప్ప విజయ చరిత్రనూ పూర్తిగా డాక్యుమెంట్ చేయడం లేదా వ్రాయడం మన సంప్రదాయం లేదా అలవాటు కాదని శ్రీ అమిత్ షా అన్నారు. అయితే బనస్కాంత,  మెహసానాలో నీటి సంరక్షణ ప్రయత్నాలు, నీటి ద్వారా సాధించిన ప్రగతి,  ఫలితంగా ప్రజల జీవితాల్లో వచ్చిన మార్పుపై వివరణాత్మక, డాక్యుమెంట్ ఆధారిత పరిశోధనను సిద్ధం చేసే బాధ్యతను రెండు విశ్వవిద్యాలయాలకు అప్పగించినట్లు శ్రీ షా చెప్పారు. బనస్కాంత కఠోర శ్రమ సువర్ణాక్షరాలతో లిఖితమవుతుందని దేశవ్యాప్తంగా గ్రామీణాభివృద్ధి చరిత్రలో స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని ఆయన అన్నారు.

 

ఈ విజయంలో మహిళల అపారమైన సహకారం అత్యంత సంతోషకరమైన విషయమని కేంద్ర హోంమంత్రి అన్నారు. ఈ భారీ రూ. 24,000 కోట్ల వ్యాపారంలో, పాలను సేకరించే శ్రమ అంతా బనస్కాంతలోని అక్కచెల్లెళ్ళు,  కుమార్తెలు, తల్లుల చేతుల మీదుగానే జరిగిందని శ్రీ షా అన్నారు. మహిళా సాధికారత గురించి మాట్లాడే ప్రపంచంలోని అన్ని ఎన్జీఓల ముందు ఈ మహిళలు అత్యంత శక్తిమంతమైన,  గొప్ప సజీవ ఉదాహరణను ప్రదర్శించారని ఆయన అన్నారు. ఎటువంటి ఉద్యమం గానీ, నినాదం గానీ లేకుండా, సేకరించిన పాలకు పూర్తి చెల్లింపు ప్రతి వారం నేరుగా ఈ తల్లులు,  అక్కచెల్లెళ్ళ బ్యాంకు ఖాతాలలోకి చేరే విధంగా పారదర్శకమైన వ్యవస్థను ఏర్పాటు చేశారని ఆయన తెలిపారు.

బనాస్ డెయిరీ ఇప్పుడు ఆసియాలోనే అతిపెద్ద పాలను ఉత్పత్తి చేసే డెయిరీగా అవతరించిందని, ఈ ఘనతలో గల్బా కాకా (గల్బాభాయి నంజీభాయ్ పటేల్) కృషి అపారమని శ్రీ అమిత్ షా అన్నారు. గల్బా కాకా కేవలం రైతుల సంక్షేమాన్నే తన హృదయంలో నింపుకున్న వ్యక్తి. 1960లో కేవలం రెండు తాలూకాలైన వడ్గాం, పాలన్‌పూర్‌లోని ఎనిమిది గ్రామాల పాల సొసైటీలతో ప్రారంభమైన ప్రయాణం నేడు రూ. 24,000 కోట్ల టర్నోవర్‌కు చేరుకుంది.

గల్బాభాయ్ పటేల్ ప్రారంభించిన సంప్రదాయం ప్రధాన మంత్రం చాలా సాధారణం.  ‘మన దగ్గర డబ్బు తక్కువగా ఉండొచ్చు, కానీ మనుషులు ఎక్కువగా ఉన్నారు’ అని గల్బాభాయ్ ను ఉటంకిస్తూ శ్రీ అమిత్ షా తెలిపారు. ‘చిన్న మొత్తాలను చాలా మంది కలిసి సమకూర్చితే పెద్ద పనులు సాధ్యమవుతాయి’ అనే గల్బాభాయ్ ఆలోచన ఇప్పుడు మహా వటవృక్షమైందని,  ఈ వృక్షం నేడు భారత సహకార ఉద్యమానికే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సహకార ఉద్యమాలకు కూడా స్ఫూర్తిగా నిలుస్తోందని ఆయన తెలిపారు. 

 

ఈ రోజు బాబాసాహెబ్ డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పిస్తూ, బాబాసాహెబ్ ఈ దేశానికి అందించిన రాజ్యాంగం దళితులు, పేదలు, గిరిజనులు, వెనుకబడిన తరగతుల వారు కూడా గౌరవప్రదమైన జీవితం గడిపేందుకు వీలుగా ఒక బలమైన వ్యవస్థను సృష్టించిందని శ్రీ అమిత్ షా అన్నారు. 

ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవాల్లో భాగంగా గుజరాత్ వ్యాప్తంగా నిర్వహించిన భారీ పాదయాత్ర ముగింపు కార్యక్రమం ఈ రోజు జరుగుతున్న సందర్భాన్ని కూడా శ్రీ షా ప్రస్తావించారు. రైతులు,  సహకారం అనే భావన సర్దార్ సాహెబ్ ఆలోచనేనని ఆయన అన్నారు. గుజరాత్ దానిని స్వీకరించిందని, ఈ రోజు ఆ ఆలోచన ఒక పెద్ద మర్రివృక్షంగా ఎదిగిందని పేర్కొన్నారు. 

ఈ రోజు ఇక్కడ బయో సీఎన్‌జీ ప్లాంట్, పాలపొడి ప్లాంట్ ప్రారంభోత్సవంతో పాటు, అత్యాధునిక ప్రోటీన్ ప్లాంట్, హైటెక్ ఆటోమేటెడ్ పనీర్ ప్లాంట్‌ను జాతికి అంకితం చేయడం వంటి అనేక కొత్త కార్యక్రమాలు జరిగాయని శ్రీ అమిత్ షా తెలిపారు. బయో సీఎన్‌జీ ప్లాంట్‌ను స్థాపించే బనస్ డెయిరీ సంప్రదాయం దేశవ్యాప్తంగా ఉన్న సహకార సంఘాలకు ఒక నమూనాగా నిలుస్తుందని ఆయన అన్నారు.సంప్రదింపుల కమిటీలో సభ్యులుగా ఉన్న పార్లమెంటు సభ్యులకు బనస్ డెయిరీ చక్రభ్రమణ ఆర్థిక వ్యవస్థలో నిర్వహించిన వినూత్న ప్రయోగాలను ప్రదర్శిస్తామని ఆయన అన్నారు. ఇప్పటి వరకు అముల్ నాయకత్వంలో గుజరాత్ డెయిరీలు పాలను సేకరించి, వాటిని ఉత్పత్తులుగా మార్చి, విక్రయించి, లాభాలను నేరుగా అక్కాచెల్లెళ్ళు, రైతుల బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేస్తున్నాయని,  ఈ విషయంలో మనం ప్రపంచంలోనే ముందున్నామని ఆయన అన్నారు. అయితే ఇప్పుడు పాడి రంగాన్ని పూర్తి చక్రభ్రమణ ఆర్థిక వ్యవస్థగా మార్చాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన తెలిపారు.

ఆవు లేదా గేదె పేడ ఒక్క గ్రాము కూడా వృధా కారాదని, దానిని సేంద్రియ ఎరువుగా, బయో-గ్యాస్‌గా, విద్యుత్‌గా మార్చాలని, దాని ద్వారా వచ్చే ఆదాయం కూడా రైతుకే చెందాలని శ్రీ షా స్పష్టం చేశారు. ప్రపంచంలో ఎన్నో అధిక విలువ కలిగిన పాల ఉత్పత్తులు ఉన్నాయని, అవి ఇంకా భారతదేశంలో తయారు కావడం లేదని ఆయన అన్నారు. అటువంటి ఉత్పత్తుల పూర్తి జాబితాను తాను ఈరోజే అముల్ ఛైర్మన్‌కు అందజేస్తున్నానని, తద్వారా వాటి ఉత్పత్తి వెంటనే ప్రారంభమవుతుందని ఆయన ప్రకటించారు. ఈ ఉత్పత్తులకు చాలా అధిక ధరలు ఉంటాయని,  ప్రపంచ మార్కెట్లో వీటికి భారీ డిమాండ్ ఉందని చెప్పారు. మనం కేవలం పెరుగు, నెయ్యి,  పనీర్ ఉత్పత్తి చేయడమే కాకుండా, ఈ అధిక విలువ కలిగిన ఉత్పత్తులపై దృష్టి పెడితే, మన రైతు సోదరీ సోదరులు చాలా రెట్లు ఎక్కువ లాభం పొందుతారని  పేర్కొన్నారు. 

ఇప్పుడు డెయిరీతో పాటు బయోగ్యాస్, బయో సీఎన్‌జీ ఉత్పత్తిని కూడా ప్రారంభించాలని శ్రీ అమిత్ షా అన్నారు. ఇప్పటి నుంచి దేశవ్యాప్తంగా ఉన్న సహకార డెయిరీలు పశువుల దాణాను బహిరంగ మార్కెట్ నుంచి కొనుగోలు చేయబోవని, దానిని కూడా సహకార స్థాయిలోనే ఉత్పత్తి చేస్తారని, పశువుల దాణా తయారీ ద్వారా వచ్చే లాభం నేరుగా మన అక్కచెల్లెళ్ళ బ్యాంకు ఖాతాల్లోకి వెళ్తుందని ఆయన తెలిపారు. ఇందుకు అవసరమైన టెక్నాలజీ, ఆర్థిక సహాయం  అందించే పూర్తి వ్యవస్థను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాటు చేసిందని ఆయన తెలిపారు. 

రైతుల ప్రయోజనాల కోసం భారత ప్రభుత్వం మూడు కొత్త జాతీయ స్థాయి సహకార సంస్థలను -  ఒకటి విత్తనాల ఉత్పత్తి, పంపిణీ కోసం, మరొకటి సేంద్రీయ ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం, ఇంకొకటి వ్యవసాయ ఎగుమతుల కోసం - ఏర్పాటు చేసిందని శ్రీ అమిత్ షా తెలిపారు. అదే సమయంలో, పాడి పరిశ్రమ కోసం ప్రత్యేకంగా మూడు జాతీయ స్థాయి బహుళ రాష్ట్ర సహకార సంస్థలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ ఆరు సహకార సంస్థలు కలిసి ఇప్పుడు వ్యవసాయం,  పశుపోషణకు సంబంధించిన ప్రతి అంశాన్ని - అది చీజ్, ప్రొటీన్, డెయిరీ వైట్నర్, ఖోయా, ఐస్ క్రీం, బేబీ ఫుడ్,  వంట నూనెల ప్యాకేజింగ్, పిండి, తేనె ఉత్పత్తి, కోల్డ్ స్టోరేజీలను నడపడం, బంగాళాదుంప చిప్స్, విత్తన ఉత్పత్తి అయినా లేదా పశువుల దాణా తయారీ వంటివి అయినా - ఈ కార్యకలాపాలన్నీ డెయిరీ ఆర్థిక వ్యవస్థ పరిధిలోకి వస్తాయని,  మొత్తం లాభం నేరుగా పశువుల రైతుల ఖాతాల్లోకి చేరుతుందని ఇది భారత ప్రభుత్వ స్పష్టమైన, దృఢమైన ప్రణాళిక అని శ్రీ అమిత్ షా వివరించారు. 

ఐదేళ్లలో, ఒక్క పాల ఉత్పత్తి  పెరుగుదల వల్ల మాత్రమే కలిగే ప్రయోజనాలు గణనీయంగా ఉంటాయని, అయితే ప్రస్తుత పాల ఉత్పత్తి పరిమాణంతో కూడా, చక్రభ్రమణ ఆర్థిక వ్యవస్థ నమూనా ద్వారా వారి ఆదాయం కనీసం 20 శాతం పెరుగుతుందని బనస్కాంత సోదరీ సోదరులకు తాను హామీ ఇస్తున్నానని శ్రీ షా అన్నారు. దీనికోసం ఒక సమగ్ర ప్రణాళికను సిద్ధం చేశామని, బనాస్ డెయిరీ ప్రధాన కార్యాలయం ఈ మొత్తం ప్రణాళికకు కేంద్రంగా ఉండటం చాలా అదృష్టమని ఆయన అన్నారు. బనస్కాంత వంటి పశువుల రైతులు, రైతుల ఆదాయాన్ని పెంచే ఈ నమూనా దేశవ్యాప్తంగా విజయవంతమవుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

ప్రతి గ్రామ పాల సహకార సంఘానికి ఒక మైక్రో-ఏటీఎంను అందించామని, దీనివల్ల ఘనీభవించిన వీర్యం నిర్వహణ ప్రక్రియ చాలా సులభతరం అయిందని శ్రీ అమిత్ షా అన్నారు. రాబోయే రోజుల్లో, ఈ మైక్రో-ఏటీఎంల ద్వారా ఆర్థిక సేవలను కూడా ప్రారంభించనున్నట్టు చెప్పారు. ప్రధాన మంత్రి మోదీ శ్వేత విప్లవం 2.0 కోసం అనేక ప్రతి ప్రతిష్ఠాత్మక లక్ష్యాలను నిర్దేశించారని, నాలుగు స్తంభాల - జాతీయ గోకుల్ మిషన్, పశుసంవర్ధక మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి, పునర్నిర్మించిన జాతీయ డెయిరీ ప్రణాళిక,  జాతీయ పశు వ్యాధుల నియంత్రణ కార్యక్రమం - మద్దతుతో శ్వేత విప్లవం 2.0 ఖచ్చితంగా విజయవంతమవుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. బనాస్ డెయిరీ నెలకొల్పిన సంప్రదాయం కేవలం బనస్కాంతకే పరిమితం కాదని, దేశవ్యాప్తంగా లక్షలాది పశువుల పెంపకందారుల సౌభాగ్యానికి ఇది ఒక ఆదర్శంగా మారుతుందని ఆయన అన్నారు.

 

 

***


(रिलीज़ आईडी: 2200020) आगंतुक पटल : 46
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Gujarati , English , Urdu , हिन्दी , Punjabi , Odia , Tamil , Kannada