రైల్వే మంత్రిత్వ శాఖ
వృద్ధులు, 45 ఏళ్ల వయసు అంతకన్నా పైబడిన మహిళలకు ఆటోమేటిక్‌గా దిగువ బెర్తుల కేటాయింపు
వృద్ధులు, 45 ఏళ్లు పైబడిన మహిళా ప్రయాణికులు, గర్భిణీ స్త్రీలకు కేటాయించిన దిగువ బెర్తుల కోటా.. 6 నుంచి 7 స్లీపర్ క్లాస్, 4 నుంచి 5- 3ఏసీ, 3 నుంచి 4- 2ఏసీ క్లాస్ బెర్తులు
దాదాపు అన్ని మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లలో దివ్యాంగులకు ప్రత్యేక కంపార్టుమెంట్లు
వందేభారత్ రైళ్లలో మొదటి, చివరి కోచ్‌లలో వీల్ ఛైర్ కోసం స్థలాలతో పాటు దివ్యాంగులకు అనుకూలంగా మరుగుదొడ్ల సౌకర్యం
प्रविष्टि तिथि:
05 DEC 2025 4:27PM by PIB Hyderabad
వృద్ధులు, దివ్యాంగులతో సహా ప్రయాణికుల సౌకర్యార్థం పలు సదుపాయాల కల్పనకు భారతీయ రైల్వేలు నిరంతరం ప్రయత్నిస్తున్నాయి. వృద్ధులు, దివ్యాంగులకు కల్పించిన కొన్ని సదుపాయాల జాబితా:
1. ప్రత్యేకంగా ఎంచుకోకపోయినా, లభ్యతను బట్టి వృద్ధులు.. 45 ఏళ్లు, అంతకన్నా ఎక్కువ వయసున్న మహిళా ప్రయాణికులకు ఆటోమేటిక్‌గా దిగువ బెర్తులు కేటాయిస్తారు.
2. వృద్ధులు.. 45 ఏళ్లు, అంతకన్నా ఎక్కువ వయసున్న మహిళా ప్రయాణికులు, గర్భిణీలకు స్లీపర్ క్లాస్ కోచ్‌లో 6 నుంచి 7 బెర్తులు,3ఏసీక్లాస్‌లో 4 నుంచి 5, 2ఏసీ క్లాస్‌లో 3 నుంచి 4 బెర్తులు (రైలులో ఆయా తరగతుల కోచ్‌లు ఎన్ని ఉన్నాయనే దానిపై ఆధారపడి ఈ బెర్తుల సంఖ్య ఉంటుంది) ప్రత్యేక కోటా ద్వారా కేటాయిస్తారు.
3. రాజధాని, శతాబ్ధి వంటి రైళ్లతో సహా అన్ని మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లలో దివ్యాంగులు, వారి సహాయకులకు రిజర్వేషన్ కోటాను ఈ విధంగా అమలుచేస్తారు.
-
స్లీపర్ క్లాస్‌లో నాలుగు బెర్తులు (ఇందులో రెండు దిగువ, రెండు మధ్యనుండే బెర్తులు)
-
3ఏసీ, 3ఈ క్లాస్‌లో నాలుగు బెర్తులు (ఇందులో రెండు దిగువ, రెండు మధ్య బెర్తులు)
-
రిజర్వ్ చేసిన సెకండ్ సిట్టింగ్ (2ఎస్), ఏసీ చైర్ కార్ (సీసీ)లో నాలుగు సీట్లు
4. రైలులో ఖాళీ దిగువ బెర్తులను వృద్ధులు, దివ్యాంగులు, గర్భిణీలకు (వీరికి అప్పటికే మధ్య, పైన బెర్తులు కేటాయించి ఉంటే) ప్రాధాన్యతపై కేటాయిస్తారు.
భద్రత, ప్రయాణికుల అనుభవాన్ని మెరుగుపరిచేందుకు వివిధ రకాల కోచ్‌లను రూపొందించి, అభివృద్ధి చేశారు. రిజర్వ్ చేసిన కోచ్‌లలో ప్రవేశం, నిష్క్రమణ ద్వారాలను గుర్తుల ద్వారా సూచిస్తారు. 'ప్రవేశం’, 'నిష్క్రమణ'ను సూచించే బోర్డులు ప్రయాణికులు ప్రవేశించే ద్వారం వద్ద అందుబాటులో ఉంటాయి. జనరల్ కోచ్‌లలో ఏ ద్వారం నుంచైనా ప్రవేశించి, నిష్క్రమించవచ్చు.
ప్రయాణికుల సౌలభ్యం, సౌకర్యాన్ని పెంచాలన్న లక్ష్యంతో భారతీయ రైల్వే అనేక రకాల సదుపాయాలను కల్పిస్తుంది. అవి:
1. దాదాపు అన్ని మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లలో దివ్యాంగులకు ప్రత్యేకంగా కేటాయించిన బోగీ ఉంటుంది. వెడల్పయిన ప్రవేశ ద్వారాలు, బెర్తులు, కంపార్టుమెంట్లు, వెడల్పయిన ద్వారాలు గల మరుగుదొడ్లు, వీల్ ఛైర్ పార్కింగ్ స్థలాలతో పాటు మరుగుదొడ్ల లోపల ఆసరా కోసం పట్టుకునే చేతి కడ్డీలు, తగిన ఎత్తులో వాష్ బేసిన్, అద్దం వంటి అదనపు సౌకర్యాలుంటాయి.
2. దృష్టి లోపం ఉన్న ప్రయాణికుల సౌకర్యార్థం, సాధారణ సంకేతాలపై బ్రెయిలీ లిపిని జోడించి, సమగ్ర బ్రెయిలీ సంకేతాలను అందుబాటులో ఉంచారు.
3. దివ్యాంగుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆధునిక అమృత్ భారత్, వందే భారత్ రైళ్లను రూపొందించారు. వందే భారత్ రైలు మొదటి, చివరి కోచ్‌లలో వీల్ ఛైర్ కోసం ప్రత్యేక స్థలం, దివ్యాంగులకు అనుకూలంగా ఉండే విశాలమైన మరుగుదొడ్లు ఉన్నాయి. వందే భారత్ రైలు కోచ్, అమృత్ భారత్ రైలులోని లగేజీ-కమ్-దివ్యాంగుల కోచ్‌లలో సులభంగా ఎక్కటానికి, దిగటానికి వీలుగా దివ్యాంగులకు మాడ్యులర్ ర్యాంపు ఏర్పాటు చేశారు.
ఇవాళ రాజ్యసభలో అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర రైల్వే శాఖ, సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ, ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ ఈ సమాచారాన్ని లిఖితపూర్వకంగా అందించారు.
***
(रिलीज़ आईडी: 2199664)
आगंतुक पटल : 12