నౌకారవాణా మంత్రిత్వ శాఖ
గ్రీన్-టెక్ దిశగా భారత్ ముందడుగు.. మొదటి ఆల్-ఎలక్ర్టిక్ టగ్ బోట్ ప్రాజెక్టును ప్రారంభించిన కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్
పర్యావరణహిత, భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే సముద్రయాన రంగంలో నరేంద్ర మోదీ దార్శనికతను స్పష్టం చేసిన సోనోవాల్
హరిత నౌకా రవాణా పరివర్తనకు ప్రపంచానికి నాయకత్వం వహించటమే భారత్ లక్ష్యం..
భారత నౌకా నిర్మాణ వ్యవస్థ పునరుద్ధరణకు మోదీ ప్రభుత్వ కృషి
प्रविष्टि तिथि:
03 DEC 2025 8:26PM by PIB Hyderabad
భారతదేశపు మొదటి ఆల్-ఎలక్ట్రిక్ గ్రీన్ టగ్ బోట్ కోసం స్టీల్-కటింగ్ వేడుకను కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ వర్చువల్‌గా ప్రారంభించారు. ఇది సుస్థిర, శక్తి-సామర్థ్యాలతో కూడిన సముద్రయాన కార్యకలాపాల్లో మార్పునకు కీలక ఘట్టాన్ని సూచిస్తుంది. కాండ్లలోని దీన్ దయాళ్ పోర్టు అథారిటీ (డీపీఏ) కోసం రూపొందించిన ఈ టగ్ బోటును, గ్రీన్ టగ్ ట్రాన్సిషన్ ప్రోగ్రామ్ (జీటీటీపీ) ద్వారా కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ అభివృద్ధి చేస్తున్నది.
ఈ కార్యక్రమానికి కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ సహాయమంత్రి శాంతను ఠాకూర్, ఎంఓపీఎస్ డబ్ల్యూ కార్యదర్శి ఐఏఎస్ విజయ్ కుమార్, ఐఆర్ఎస్ఎంఈ, డీపీఏ ఛైర్మన్ సుశీల్ కుమార్ సింగ్, కాండ్ల డీపీఏ సీనియర్ అధికారులు, నెటిన్కాన్, రిప్లే ప్రతినిధులు, కాంగ్స్బెర్గ్ సాంకేతిక నిపుణులు, టగ్ నిర్మాణం చేపడుతున్న ఆత్రేయ షిప్ యార్డ్ ఇంజినీర్లు వర్చువల్‌గా హాజరయ్యారు.
దేశంలోనే మొదటి ఆల్-ఎలక్ట్రిక్ గ్రీన్ టగ్ బోటు ఆవిష్కరణ, సముద్రయాన రంగంలో స్వచ్ఛ ఇంధన అనుసంధానం పట్ల భారత ప్రాధాన్యతను ప్రతిబింబిస్తుందని సోనోవాల్ అన్నారు. సుస్థిరాభివృద్ధి, సాంకేతిక ఆవిష్కరణ, పర్యావరణహిత సముద్రయాన సామర్థ్యాల్లో ప్రపంచానికి నాయకత్వం వహించాలనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతను ఈ ప్రాజెక్టు ప్రతిబింబిస్తుందని సోనోవాల్ స్పష్టం చేశారు.
"పరిశుభ్రమైన, సుస్థిరమైన సముద్రయాన భవిష్యత్తు సంకల్పాన్ని ఈ కీలక ఘట్టం బలపరుస్తుంది" అని సర్బానంద సోనోవాల్ అన్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చైతన్యవంతమైన నాయకత్వంలో పర్యావరణ అనుకూల వృద్ధికి ఆశయాలతో కూడిన ప్రణాళికను భారత్ రచించింది. పర్యావరణ పరిరక్షణ, ఇంధన మార్పు, భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే మౌలిక సదుపాయాలను ప్రధానమంత్రి నిరంతరం ప్రోత్సహిస్తున్నారు. ఇవాళ్టి స్టీల్-కటింగ్ వేడుక పర్యావరణహితమైన, దృఢమైన, స్వయం-సమృద్ధిగల సముద్రయాన పర్యావరణ వ్యవస్థను నిర్మించాలనే ఆయన ప్రాధాన్యతను ప్రతిబింబిస్తుంది.
"వికసిత భారత్" కోసం ప్రధానమంత్రి దార్శనికత, ఆర్థిక పరివర్తనకు కేంద్రంగా భారత సముద్రయానంలో పురోగతి ఉంటుందని సోనోవాల్ తెలిపారు. "జాతీయ ప్రగతి ఆవిష్కరణను ఎలా నడిపించగలదో ప్రధానమంత్రి మోదీ చూపించారు. పూర్తిగా విద్యుత్తుతో నడిచే ఈ గ్రీన్ టగ్ బోటు.. మన పోర్టులకు సేవ చేయగల, పర్యావరణాన్ని రక్షించగల, అంతర్జాతీయంగా మన స్థాయిని పెంచగల, ప్రపంచ-స్థాయి ఆస్తులుగా ఆయన దార్శనికతను వాస్తవ రూపంలోకి భారత్ ఎలా మారుస్తుందో చెప్పటానికి ఒక గొప్ప ఉదాహరణ" అని సోనోవాల్ పేర్కొన్నారు.
డీపీఏ కొత్త గ్రీన్ టగ్ కు, 60 టన్నుల బోల్లార్డ్ పుల్ సామర్థ్యం ఉంది. దీనికి రహస్య కార్యకలాపాలను నిర్వహించగల, కర్బన ఉద్గార రహిత, సరైన శక్తి సామర్థ్యాలున్నాయి. భారతదేశంలోని ప్రధాన పోర్టులన్నింటిలో తదుపరి తరం నౌకాదళం ఆధునీకరణకు ఈ టగ్ ప్రామాణికంగా మారుతుందని అధికారులు తెలిపారు. విద్యుత్ చోదక వ్యవస్థ, అధునాతన నావిగేషన్ ఫీచర్లు, తక్కువ నిర్వహణ గల రూపకల్పన వల్ల ఈ బోటు నిర్వహణ ఖర్చులు, కర్బన తీవ్రత గణనీయంగా తగ్గుతాయని అంచనా.
2030 నాటికి 50 పర్యావరణహిత టగ్ బోట్లను ప్రవేశపెట్టటమే కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖ ప్రారంభించిన జీటీటీపీ లక్ష్యం. మొదటి దశలో 2024, 2027 మధ్య 16 టగ్ బోట్లను ప్రవేశపెడతారు. ఫేజ్-1లో డీపీఏ, పారాదీప్ పోర్టు అథారిటీ, జవహర్లాల్ పోర్టు అథారిటీ, వీ.ఓ. చిదంబరనార్ పోర్టు అథారిటీల్లో ఒక్కొక్క దానికి రెండు చొప్పున పర్యావరణహిత టగ్గులను కేటాయిస్తారు. మిగిలిన ఎనిమిది ప్రధాన ఓడరేవుల్లో ఒక్కొక్క దానికి ఒకటి చొప్పున ఇస్తారు. డీపీఏ, వీపీఏ, జేఎన్ పీఏ, వీఓసీపీఏ అనే నాలుగు ప్రధాన ఓడరేవులు ఇప్పటికే ఒక్కొక్క టగ్ బోటును ప్రవేశపెట్టేందుకు ఆదేశాలు జారీ అయ్యాయి. అధికారికంగా టగ్ బోట్ల నిర్మాణాన్ని ప్రారంభించిన మొదటి పోర్టుగా డీపీఏ నిలిచింది.
జీటీటీపీని కార్యరూపంలోకి తీసుకురావటం ద్వారా డీపీఏ నాయకత్వం, హరిత ఇంధన పరిష్కారాల దిశగా భారత పోర్టులు నిర్ణయాత్మకంగా సాగుతున్నాయని తెలుస్తుందని సోనోవాల్ తెలిపారు. "పర్యావరణహిత పోర్టులు, సుస్థిర సముద్ర రవాణా పట్ల భారత్ ప్రాధాన్యతను డీపీఏ కార్యక్రమాలు ప్రపంచానికి తెలియజేస్తాయి. ఇది కేవలం సాంకేతికంగా ఎదగటం మాత్రమే కాదు.. పరివర్తనాత్మకతకు ముందడుగు" అని కేంద్రమంత్రి చెప్పారు.
పోర్టుల ఆధునికీకరణ ప్రయత్నాలకు మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ది వరల్డ్ వంటివి దిశానిర్దేశం చేస్తున్నాయని మంత్రి స్పష్టం చేశారు. ఆత్రేయ షిప్ యార్డ్ లో ఈ గ్రీన్ టగ్ బోటు నిర్మాణం, భారత నౌకా నిర్మాణ పర్యావరణ వ్యవస్థకు మద్దతిస్తుందని, దేశీయ ఉత్పాదక సామర్థ్యాలను బలోపేతం చేస్తుందన్నారు. "ఈ టగ్ బోటు కేవలం దేశ పోర్టుల కోసం మాత్రమే కాదు.. భారత నిర్మాణ సామర్థ్యాన్ని ప్రపంచానికి తెలియజేసేందుకు ఉద్దేశించినది. సముద్రయాన ఆవిష్కరణల్లో ప్రపంచకేంద్రంగా మనం మారాలనే ఆశయాన్ని ఇది స్పష్టం చేస్తుంది" అని తెలిపారు.
టగ్ బోట్ నిర్మాణ షెడ్యూల్, నౌకా కార్యకలాపాల్లో ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ ను స్వీకరించటంలో భారత్ ను అగ్రస్థానంలో నిలబెడుతుందని డీపీఏ అధికారులు వివరించారు. ఓడలను నడిపించటం, ఇతర నౌకలతో వెళ్లటం, అత్యవసర ప్రతిస్పందన కార్యకలాపాలకు నౌకాశ్రయంలో టగ్ సేవలు మద్దతిస్తాయి. ఈ కార్యకలాపాలన్నీ కాలుష్యరహితంగా ఉంటాయి. భవిష్యత్తులో భారత గ్రీన్ టగ్ విస్తరణకు ఉపయోగపడే విలువైన డేటాను, అంతర్గత కార్యాచరణను ఈ ప్రాజెక్టు అందించనుంది.
మంత్రిత్వ శాఖ ప్రధాన సుస్థిర కార్యక్రమాల్లో ఒకటైన గ్రీన్ టగ్ ట్రాన్సిషన్ ప్రోగ్రామ్ అంతర్జాతీయంగా కర్బన ఉద్గారాలను తగ్గించే వ్యవస్థ ద్వారా భారత ప్రాధాన్యతలకు మద్దతిస్తుంది. అంతేకాక, మారిటైమ్ ఇండియా విజన్ 2030, అమృత్ కాల్ ప్రాధాన్యతలకు అనుగుణంగా ఉంది.
ప్రసంగాన్ని ముగిస్తూ, పర్యావరణహిత సముద్రయాన సాంకేతికతలో భారత్ సాధించిన పురోగతికి ప్రధానమంత్రి నాయకత్వంలోని ఉమ్మడి జాతీయ ప్రయత్నమే కారణమని కేంద్రమంత్రి సర్బానంద సోనోవాల్ అన్నారు. "ఇవాళ మనం చేపట్టిన ప్రతి నూతన ఆవిష్కరణ వికసిత్ భారత సముద్రయాన రంగ బలోపేతానికి మూలం. విస్తృతంగా ఆలోచించటానికి, నిర్ణయాత్మకంగా చర్యలు తీసుకోవటానికి మనకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధైర్యాన్నిచ్చారు. భారతదేశ ఓడరేవుల్లో ఈ హరిత టగ్ బోటు నూతన శకానికి నాంది మాత్రమే" అని కేంద్రమంత్రి సర్బానంద్ సోనోవాల్ తెలిపారు.







***
(रिलीज़ आईडी: 2199161)
आगंतुक पटल : 3