ఆర్థిక మంత్రిత్వ శాఖ
పన్నుల ప్రయోజనాలకు పారదర్శకత, సమాచార మార్పిడిపై 18వ గ్లోబల్ ఫోరం ప్లీనరీ సమావేశాన్ని
ప్రారంభించిన కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్
18వ గ్లోబల్ ఫోరం ప్లీనరీ సమావేశానికి న్యూఢిల్లీలో భారత్ ఆతిథ్యం
प्रविष्टि तिथि:
02 DEC 2025 8:37PM by PIB Hyderabad
పన్నుల ప్రయోజనాలకు పారదర్శకత, సమాచార మార్పిడిపై 18వ గ్లోబల్ ఫోరం ప్లీనరీ సమావేశాన్ని కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ఇవాళ న్యూఢిల్లీలో ప్రారంభించారు.
పన్ను ప్రయోజనాల కోసం పారదర్శకత, సమాచార మార్పిడిపై న్యూఢిల్లీలో డిసెంబర్ 2 నుంచి 5, 2025 వరకు జరుగుతున్న 18వ గ్లోబల్ ఫోరం ప్లీనరీ సమావేశానికి భారత్ ఆతిథ్యమిచ్చింది. "పన్ను పారదర్శకత: ఉమ్మడి లక్ష్య సాధనకు అంతర్జాతీయ సహకారం" అనే ఇతివృత్తంతో ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు.
172 సభ్య దేశాలున్న గ్లోబల్ ఫోరం, ప్రపంచవ్యాప్తంగా పన్ను పారదర్శకతకు సంబంధించి అంతర్జాతీయ ప్రమాణాలను అమలు చేసే ప్రముఖ సంస్థ. అభ్యర్థనపై సమాచార మార్పిడి (ఈఓఐఆర్), ఆర్థిక ఖాతా సమాచార స్వయంచాలక మార్పిడి (ఏఈఓఐ), అన్ని జీ20 దేశాలు ఇందులో సభ్యులు కాగా, ప్రపంచవ్యాప్తంగా పన్ను ఎగవేత, చట్టవిరుద్ధ ఆర్థిక లావాదేవీలను ఎదుర్కోవటంలో ఇది కీలకంగా వ్యవహరిస్తుంది.
ప్రారంభోత్సవానికి కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి శ్రీ పంకజ్ చౌదరి, ఆర్థిక మంత్రిత్వ శాఖ, రెవెన్యూ విభాగం కార్యదర్శి శ్రీ అరవింద్ శ్రీ వాస్తవ, గ్లోబర్ ఫోరం అధ్యకులు శ్రీ గాయెల్ పెర్రాడ్ హాజరయ్యారు.
ప్రారంభంలో ప్రసంగిస్తూ, భారత్‌లో జరుగుతున్న ప్లీనరీ సమావేశానికి విచ్చేసిన ప్రతినిధులు, ప్రముఖులకు కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ స్వాగతం పలికారు. ప్రపంచ ఆర్థిక రంగలో వచ్చిన కీలక మార్పులపై ఆమె మాట్లాడారు. గోప్యత ఆధిపత్యం వహించిన ప్రపంచం నుంచి న్యాయం, బాధ్యతాయుతమైన పాలనకు పారదర్శకత అవసరమని గుర్తించిన ప్రపంచానికి మనం మారినట్లు చెప్పారు.
భారతదేశం దృష్టిలో న్యాయం, బాధ్యత అనే సూత్రాలపై ఆర్థిక పాలన ఆధారపడి ఉండాలన్న అంశాన్ని పారదర్శకత స్పష్టం చేస్తుందని కేంద్రమంత్రి అన్నారు. పారదర్శకత కేవలం నియమాలను పాటించే సాధనం మాత్రమే కాదని, సుస్థిర అభివృద్ధికి మూలమని, జాతీయ సంపదను చట్టబద్ధమైన పన్ను పరిధి నుంచి తప్పించినప్పుడు.. అది ఆదాయంలోనూ, అభివృద్ధిలోనూ ఖాళీని సృష్టిస్తుందన్నారు.
కేవలం అమలు చేయటం ద్వారా మాత్రమే కాక, స్పష్టత, సరళీకరణ, నమ్మకాన్ని పెంచటానికి నిరంతరం ప్రయత్నించటం ద్వారా భారతదేశంలో స్వచ్ఛందంగా పన్ను నిబంధనలను పాటించటం మెరుగుపడిందని శ్రీమతి సీతారామన్ స్పష్టం చేశారు. సమాచార విశ్లేషణలో సాంకేతికత, ఏఐ సామర్థ్యాన్ని అంగీకరించినప్పటికీ, వివేకం, విధానాల పట్ల అంచంచలమైన గౌరవంతో ఆవిష్కరణలను సమతుల్యం చేయాలని ఆమె సూచించారు. న్యాయ పరిధుల మధ్య నమ్మకానికి స్పష్టమైన ఆర్థిక విలువ ఉందని, ఆర్థిక వ్యవస్థ డిజిటలైజేషన్, లబ్ధిదారుల యాజమాన్యంలో మారుతున్న వ్యవస్థల వంటి నూతన సవాళ్ల నిర్వహణకు నిరంతర సహకారం అవసరమని ఆమె పిలుపునిచ్చారు.
పన్నుల నిర్వహణకు నియమాల ఆధారిత, సహకార విధానాన్ని ఏర్పరచటంలో సాధించిన పురోగతిని ఈ సమావేశం తెలియజేస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి శ్రీ పంకజ్ చౌదరి అన్నారు. గతంలో వివిధ దేశాల నుంచి సంబంధిత సమాచారాన్ని సకాలంలో పొందటం సమస్యగా ఉండేదని, ఇప్పుడు ఆచరణాత్మక వాస్తవంగా మారిందని చెప్పారు. దీనివల్ల అమలు ప్రక్రియ బలోపేతమై, పన్ను చెల్లింపుదారుల విశ్వాసం మెరుగుపడిందని వ్యాఖ్యానించారు. సులభంగా, సహజంగా నిబంధనలను పాటించేలా చేసేందుకు పారదర్శకత, సౌలభ్యం ఏకకాలంలో ముందుకు సాగే సమతుల్య విధానాన్ని ఆయన సమర్థించారు. సమ్మిళితత్వం కేవలం నినాదం కాదని, అదొక కార్యాచరణ సూత్రమని స్పష్టం చేస్తూ, అభివృద్ధి చెందుతున్న దేశాలకు సామర్థ్య పెంపుదలను, సాంకేతిక మార్గదర్శకత్వాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు. వాణిజ్య డిజిటలైజేషన్, కొత్త ఆస్తి అంశాలను పరిష్కరించటానికి ప్రమాణాలు తప్పనిసరిగా మారాలని, అదే సమయంలో గోప్యతను, నిజాయితీని పాటించాలన్నారు.
గ్లోబల్ ఫోరమ్‌ను బహుళ దేశాల సహకారానికి అత్యంత విజయవంతమైన ఉదాహరణల్లో ఒకటిగా రెవెన్యూ శాఖ కార్యదర్శి శ్రీ అరవింద్ శ్రీవాస్తవ అభివర్ణించారు. బ్యాంకింగ్ గోప్యత నుంచి ప్రపంచ పారదర్శకత ప్రమాణాల దిశగా జరిగిన పరివర్తన గురించి చెప్పారు. 2017 నుంచి ఆర్థిక ఖాతా సమాచార స్వయంచాలక మార్పిడి (ఏఈఓఐ) ప్రమాణాలను భారత్ విజయవంతంగా అమలు చేసిందని.. సురక్షిత ఐటీ వ్యవస్థలు, డేటా అనలిటిక్స్‌ను ఉపయోగించి, సమాచారాన్ని ఉపయోగించుకోగలిగేలా మార్చిందని తెలిపారు. అంతర్జాతీయ సహకారంతో పాటు నల్ల ధన చట్టం, బినామీ లావాదేవీల చట్టం వంటి దేశీయ చర్యలు పన్ను సమగ్రతను కాపాడేందుకు సహకరించాయని ఆయన చెప్పారు. దక్షిణ దేశాల సహకారానికి భారత్ ప్రాధాన్యతను తెలియజేస్తూ, పారదర్శకత ప్రయోజనాలను సమానంగా పంపిణీ చేయాలని స్పష్టం చేశారు. డిజిటల్ ఆర్థిక వ్యవస్థ పన్ను విధింపు, క్రిప్టో ఆస్తుల ఫిర్యాదు వ్యవస్థలు తదుపరి ఉమ్మడి చర్యలకు అత్యంత ప్రాధాన్యత గల అంశాలుగా మారతాయన్నారు.
ప్లీనరీ గురించి
గ్లోబల్ ఫోరమ్‌కి సంబంధించి ఏకైక నిర్ణయాధికార సంస్థ గ్లోబల్ ఫోరమ్ ప్లీనరీ. సభ్య దేశాలు, అంతర్జాతీయ సంస్థలు, అభివృద్ధి భాగస్వాములు ఈ ప్లీనరీలో సమావేశమవుతాయి. ప్రతి సభ్య దేశం సమాన ప్రాతిపదికన పాల్గొంటుంది. సాధారణంగా ఏకాభిప్రాయంతో నిర్ణయాలు తీసుకుంటారు. పన్ను పారదర్శకత ప్రమాణాలైన ఈఓఐఆర్, ఏఈఓఐ అమలులో సాధించిన పురోగతిని సమీక్షించేందుకు, భవిష్యత్ ప్రాధాన్యతలను నిర్ణయించటానికి ఏటా ప్లీనరీ సమావేశం జరుగుతుంది.
ప్లీనరీ సమావేశంలో ఉన్నత స్థాయి ప్యానెల్ చర్చలు, సమకాలీన సమీక్షల నుంచి తాజా సమాచారం, ప్రాంతీయ కార్యక్రమాల (ఆఫ్రికా, ఆసియా, లాటిన్ అమెరికా) వివరాలు, వార్షిక పని ప్రణాళికపై ప్రజెంటేషన్లు, క్రిప్టో-ఆస్తుల ఫిర్యాదు వ్యవస్థ (సీఏఆర్ఎఫ్), గ్రూప్ ఆన్ రిస్క్‌కు సంబంధించిన చర్చలుంటాయి. పన్ను విభాగ పాలనాధిపతులు, కాంపిటెంట్ అథారిటీలు ఈ చర్చల్లో పాల్గొంటారు. మొదటి రోజున కొన్ని దేశాల నుంచి మంత్రివర్గ స్థాయిలో ప్రాతినిధ్యం కూడా ఉంటుంది.
గ్లోబల్ ఫోరమ్ లో వ్యవస్థాపక సభ్య దేశంగా 2009 నుంచి భారత్ క్రీయాశీలకంగా నాయకత్వం వహించింది. ప్రస్తుతం స్టీరింగ్ గ్రూపు, ఈఓఐఆర్, ఏఈఓఐకి సంబంధించిన పీర్ రివ్యూ గ్రూపులు, గ్రూప్ ఆన్ రిస్క్, సీఏఆర్ఎఫ్ గ్రూపులో కీలక పదవుల్లో ఉంది. ఆసియా ఇనిషియేటివ్ 2023-24కు సహ-అధ్యక్ష బాధ్యతను భారత్ చేపట్టింది. సెమినార్లు, శిక్షణా కార్యక్రమాలు, ప్రాంతీయ సంప్రదింపుల ద్వారా అభివృద్ధి చెందుతున్న దేశాలకు సామర్థ్యాన్ని పెంపొందించుకోవటానికి మద్దతిచ్చింది.
భారత్ ప్రాధాన్యత
పన్నుల పారదర్శకత, అంతర్జాతీయ సహకారానికి బలమైన ప్రాధాన్యతనిస్తున్నట్లు భారత్ స్పష్టం చేసింది. 2023లో జీ20 సదస్సుకు నాయకత్వం వహించిన సమయంలో ప్రపంచ పన్ను పారదర్శకతకు భారత్ ప్రోత్సహించిన ఒక సమ్మిళిత దృక్పథం ద్వారా నిబంధనల అనుసరణ, నష్టభయ అంచనాకు మార్చుకున్న సమాచారాన్ని విస్తృతంగా ఉపయోగించటం, సీఆర్ఎస్ ద్వారా ఏఈఓఐలో అభివృద్ధి చెందుతున్న దేశాల భాగస్వామ్యాన్ని పెంచేందుకు దోహదపడింది. అప్పట్నుంచి గ్లోబల్ ఫోరం, ఓఈసీడీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న పని కార్యక్రమాలుగా ఇవి పరిణతి చెందాయి.
రాబోయే రోజుల్లో జరిగే సమావేశాల్లో నిబంధనల అమలును బలోపేతం చేయటం, పరిపాలనా సామర్థ్యాన్ని పెంచటం, అధికార దేశాల పరిధి, పరిపాలనా సామర్థ్యంతో సంబంధం లేకుండా పారదర్శకత ప్రయోజనాలను అందరికీ చేరేలా చూడటంపై దృష్టి సారిస్తారు.
ప్రతినిధులందరికీ న్యూఢిల్లీకి స్వాగతం పలుకుతూ, పరస్పరం నమ్మకాన్ని దృఢపరచి, న్యాయమైన, పారదర్శకమైన, సమ్మిళితమైన అంతర్జాతీయ పన్ను వ్యవస్థ లక్ష్యాన్ని సాధించేందుకు నిర్ణయాత్మక చర్చలకు భారత్ ఎదురుచూస్తోంది.
***
(रिलीज़ आईडी: 2198507)
आगंतुक पटल : 30