బొగ్గు మంత్రిత్వ శాఖ
స్థానిక అభివృద్ధిలో బొగ్గు గనుల సహకారం
प्रविष्टि तिथि:
03 DEC 2025 4:53PM by PIB Hyderabad
జార్ఖండ్‌లోని మగధ్, ఆమ్రపాలి గనులు సంయుక్తంగా 2024-25లో సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్ సంస్థ మొత్తం బొగ్గు ఉత్పత్తిలో 50 శాతం వాటా కలిగి ఉన్నాయి. తద్వారా ఇవి ఆత్మనిర్భర్ భారత్ దార్శనికత కింద విద్యుత్ ఉత్పత్తికి నమ్మకమైన బొగ్గు సరఫరా అందించాలనే జాతీయ లక్ష్యానికి మద్దతునిస్తున్నాయి. మగధ్, ఆమ్రపాలి బొగ్గు గనులు వరుసగా 854.91 మెట్రిక్ టన్నులు, 456.34 మెట్రిక్ టన్నుల గనుల నిల్వల అంచనాతో పాటు... 2025-26 ఆర్థిక సంవత్సరంలో వరుసగా రూ. 2,812 కోట్లు, రూ. 2,367 కోట్ల నికర అమ్మకాల ఆదాయాన్ని ఉత్పత్తి చేస్తాయని అంచనా. ఈ గనులు ప్రాజెక్ట్ ప్రభావిత వ్యక్తులు, సమీప గ్రామస్తులకు ఉపాధిని, జీవనోపాధి మద్దతును అందించడం ద్వారా స్థానిక అభివృద్ధికి దోహదం చేస్తున్నాయి. మగధ్-సంఘమిత్ర ప్రాంతంలో 808 మందికి, ఆమ్రపాలి-చంద్రగుప్త ప్రాంతంలో 210 మందికి ఇప్పటికే ఉపాధి లభించింది.
నామ్చిక్ నాంఫుక్ బొగ్గు గని సంవత్సరానికి 0.2 మిలియన్ టన్నుల బొగ్గును అందించడం ద్వారా అరుణాచల్ ప్రదేశ్ ఇంధన భద్రతకు గణనీయంగా దోహదపడుతోంది. ఈ స్థిరమైన సరఫరా రాష్ట్ర ఇంధన డిమాండ్లను మరింత విశ్వసనీయంగా తీర్చడంలో సహాయపడుతుంది. ఈ గని 14.97 మెట్రిక్ టన్నుల భూగర్భ నిల్వల అంచనాతో... దాదాపు 270 మందికి ఉపాధి కల్పించడంతో పాటు రూ. 173 కోట్ల వార్షిక ఆదాయాన్నీ సృష్టిస్తుంది.
మిషన్ గ్రీన్ (గ్రో, రీస్టోర్, ఎన్రిచ్ - ఎంపవర్ నేచర్) బొగ్గు రీజియన్‌ల కింద గల బొగ్గు-లిగ్నైట్ ప్రభుత్వ రంగ సంస్థలైన (పీఎస్‌యులు) కోల్ ఇండియా లిమిటెడ్, ఎన్‌ఎల్‌సి ఇండియా లిమిటెడ్, సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్‌లు... పర్యావరణ సమతుల్యతను నిర్ధారించడం, బొగ్గు-లిగ్నైట్ మైనింగ్ ప్రాంతాల్లో సమాజ భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా వరుస చర్యలను చేపట్టాయి. మైనింగ్ తర్వాతి, ఇతర అనుకూలమైన ప్రాంతాలను సుస్థిర పర్యావరణ వ్యవస్థలుగా మార్చడానికి రూపొందించిన ఈ మిషన్ ఐదు సంవత్సరాల దార్శనికతను వివరిస్తుంది. పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవడానికి మైనింగ్ ప్రాంతాల్లో, చుట్టుపక్కల ప్రాంతాల్లో విస్తృతమైన అటవీకరణ, పర్యావరణ పునరుద్ధరణ, పునరుత్పాదక ఇంధనాలను ప్రోత్సహించడం, స్థిరమైన గని-నీటి వినియోగం, పునరుత్పాదక వనరుల నిర్వహణ పద్ధతులను అమలు చేయడంపై మిషన్ ప్రధానంగా దృష్టి సారిస్తుంది. పర్యావరణపరంగా బాధ్యతాయుతమైన రీతిలో స్థానిక ఆర్థిక వ్యవస్థలను పలు విధాలుగా అభివృద్ధి చేయడం లక్ష్యంగా గని ఆధారిత పర్యాటకం, గ్రీన్-ఎకానమీ నమూనాల వంటి కార్యక్రమాలను ముందుకు తీసుకువెళుతున్నారు. కమ్యూనిటీ భాగస్వామ్యం మిషన్ గ్రీన్‌లో ఒక ప్రధాన అంశం. సుస్థిర అభివృద్ధి కార్యకలాపాల్లో స్థానిక సంఘాలు, స్వయం సహాయక బృందాల భాగస్వామ్యం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. మిషన్ సమర్థంగా అమలు చేయడానికి బొగ్గు మంత్రిత్వ శాఖ మిషన్ గ్రీన్ కోల్ రీజియన్‌ల నిరంతర పర్యవేక్షణ కోసం ఒక కమిటీని ఏర్పాటు చేసింది.
జార్ఖండ్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లోని పైన పేర్కొన్న మూడు బొగ్గు గనులు... దిగుమతి చేసుకున్న బొగ్గుపై ఆధారపడటాన్ని తగ్గించడం ద్వారా భారత ప్రభుత్వ ఆత్మనిర్భర్ భారత్ దార్శనికతతో జతకట్టాయి. తద్వారా ఇంధన ఉత్పత్తిలో స్వయం-సమృద్ధికి మద్దతునిస్తున్నాయి. గనుల అభివృద్ధి... రవాణా, లాజిస్టిక్స్ వంటి మౌలిక సదుపాయాలకు మద్దతునివ్వడంతో పాటు గణనీయమైన పెట్టుబడులనూ ఆకర్షిస్తుంది. ఇది విస్తృతమైన ఉపాధి అవకాశాలనూ సృష్టిస్తుంది. ఈ సమగ్ర అభివృద్ధి విధానం రీజియన్‌లలో సమ్మిళిత వృద్ధి, ఆర్థిక ఏకీకరణను ప్రోత్సహిస్తుంది.
ఈ సమాచారాన్ని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి ఈరోజు లోక్‌సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.
***
(रिलीज़ आईडी: 2198495)
आगंतुक पटल : 2