హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సైబర్ భద్రత మౌలిక సదుపాయాలు

प्रविष्टि तिथि: 02 DEC 2025 3:24PM by PIB Hyderabad

సైబర్ ముప్పు నిరోధం దిశగా ప్రభుత్వం దేశవ్యాప్తంగా సమగ్ర-సమన్వయ సహిత వ్యవస్థను సంస్థాగతీకరించింది. ఈ మేరకు జాతీయ భద్రత మండలి సచివాలయం (ఎన్‌ఎస్‌సీఎస్‌) పరిధిలోని జాతీయ సైబర్ భద్రత సమన్వయ సంస్థ (ఎన్‌సీఎస్‌సీ) వివిధ సంస్థల మధ్య సమన్వయాన్ని పర్యవేక్షిస్తుంది. ఇక భారత సైబర్ నేర సమన్వయ కేంద్రం (ఐ4సీ) ప్రభావశీల రీతిలో, సమన్వయం ద్వారా సైబర్ నేరాలను పరిష్కరిస్తుంది.

సైబర్‌ భద్రత సంబంధిత ఉదంతాలపై ప్రతిస్పందనకు వీలుగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) చట్టం-2000లోని సెక్షన్ 70బి నిబంధనలకు అనుగుణంగా జాతీయ సంస్థ హోదాతో ‘ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్’ (సెర్ట్‌-ఇన్‌) ఏర్పాటైంది. ముప్పు తగ్గింపు దిశగా వివిధ రంగాల్లోని సంస్థలతో సంయుక్తంగా నిర్దేశిత ముందస్తు హెచ్చరికల జారీలో స్వయంచలిత నిఘా ఆదానప్రదాన వేదికగా ‘సెర్ట్‌-ఇన్‌’ పనిచేస్తుంది. ఈ మేరకు సైబర్ భద్రత ముప్పులను గుర్తించేందుకు ‘సెర్ట్‌-ఇన్‌’ పరిధిలోని జాతీయ సైబర్ సమన్వయ కేంద్రం (ఎన్‌సీసీసీ) సైబర్‌ ప్రపంచంలో నిశిత పరిశీలన బాధ్యత నిర్వర్తిస్తుంది. నేరాలపై చర్యల సంబంధిత వ్యవస్థలు, రాష్ట్ర ప్రభుత్వాలు,  భాగస్వామ్య సంస్థలతో ‘ఎన్‌సీసీసీ’ సమాచారాన్ని పంచుకుంటుంది. అలాగే, తాజా సైబర్ ముప్పులు-దౌర్బల్యాలపై ఎప్పటికప్పుడు హెచ్చరికలు, సలహాలు జారీ చేస్తూంటుంది.

దేశవ్యాప్త కీలక సమాచార మౌలిక సదుపాయాల రక్షణ నిమిత్తం ఐటీ చట్టం-2000లోని సెక్షన్ 70ఎ నిబంధనల కింద ‘నేషనల్ క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొటెక్షన్ సెంటర్’ (ఎన్‌సీఐఐపీసీ)ని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మరోవైపు వివిధ ఈ-పరిపాలన అంశాలపై కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, సంస్థలు సహా రాష్ట్ర ప్రభుత్వాలు, జిల్లా పాలన సంస్థలకు ‘ఎన్‌ఐసి’ సమాచార సాంకేతిక మద్దతిస్తుంది. అంతేగాక సైబర్ దాడుల నిరోధం, డేటా రక్షణ లక్ష్యంగా పరిశ్రమ ప్రమాణాలు-పద్ధతులకు తగిన సమాచార భద్రతా విధివిధానాలను ఇది అనుసరిస్తుంది.

సైబర్ నేరాలు, గూఢచర్యం, ఉగ్రవాదం, భద్రత ముప్పులు, జాతీయ భద్రతను దెబ్బతీసే సాంకేతిక పరిజ్ఞాన దుర్వినియోగం తదితర సమస్యల సమర్థ నిరోధం-పరిష్కారం దిశగా దేశీయ వ్యవహారాల మంత్రిత్వశాఖ బహుళ సంస్థల కేంద్రాన్ని (ఎంఏసీ)ని ఏర్పరచింది. ఈ వేదిక కింద ‘ఐబీ, సిరా, డీసీవైఏ, డీఓటీ, సెర్ట్‌-ఇన్‌, ఐ4సీ, ఎన్‌సీఐఐపీసీ, ఎన్‌ఐసీ’ల భాగస్వామ్యంతో ‘సైబర్ మల్టీ ఏజెన్సీ సెంటర్’ (సైమాక్‌)ను ఏర్పాటు చేసింది. సైబర్ భద్రత సంస్థలలో సైబర్‌ పునరుత్థాన సామర్థ్యం పెంపు లక్ష్యంగా ఈ ఏకీకృత-వ్యూహాత్మక వేదిక పనిచేస్తుంది. ప్రత్యక్ష పర్యవేక్షణ, ముప్పులపై నిఘా సమాచార భాగస్వామ్యం, సమన్వయ సహిత ప్రతిస్పందన సామర్థ్యాల పెంపునకు తోడ్పడుతుంది. తద్వారా సైబర్ భద్రత ముప్పుల ముందస్తు గుర్తింపు, సమర్థ నిర్వహణకు తగిన సంయుక్త నిఘా-విశ్లేషణను సమకూరుస్తుంది. జాతీయ సైబర్ రక్షణ బలోపేతం సహా భారతీయ సమాచార-కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ) మౌలిక సదుపాయాల పరిరక్షణ కోసం ఈ వ్యవస్థతో పూర్తి అనుసంధానం దిశగా అన్ని సంస్థలనూ ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది.

ప్రధానంగా ఈశాన్య భారత్‌ సహా సిక్కిం రాష్ట్ర పరిధిలోని అన్ని ‘ఎల్‌ఈఏ’లకు సైబర్ ఫోరెన్సిక్ సదుపాయాల కల్పన, డిజిటల్ దర్యాప్తు సామర్థ్యాల పెంపు నిమిత్తం అస్సాంలో ఏర్పాటు చేసిన కొత్త జాతీయ సైబర్ ఫోరెన్సిక్ (దర్యాప్తు) ప్రయోగశాల 29.08.2025 నుంచి పనిచేయడం ప్రారంభించింది.

నేర దర్యాప్తులో దేశంలోని ‘ఎల్‌ఈఏ’లు, ఇతర కేంద్ర సంస్థలకు ఫోరెన్సిక్ తోడ్పాటునిచ్చేందుకు 2019లో ‘ఐ4సీ’ కింద న్యూఢిల్లీలోని ద్వారకలో ‘నేషనల్ సైబర్ ఫోరెన్సిక్ (ఇన్వెస్టిగేషన్) లేబొరేటరీ’  {ఎన్‌సీఎఫ్‌ఎల్‌(ఐ)} పేరిట అత్యాధునిక కేంద్రాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ సదుపాయాన్ని, సేవలను దేశంలోని వివిధ రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు ఉపయోగించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో సైబర్ నేరాలకు సంబంధించి ‘ఎన్‌సీఎఫ్‌ఎల్‌’ 31.10.2025దాకా 12,952 సైబర్ కేసులలో ‘ఎల్‌ఈఏ’లకు తన సేవలందించింది. అంతేకాకుండా ‘ఎల్‌ఈఏ’లకు సంబంధించిన 2118 మందికి ఆధునిక ఫోరెన్సిక్ ఉపకరణాలు, పద్ధతులపై శిక్షణ ఇచ్చారు.

దేశవ్యాప్తంగా 2018లో ప్రారంభించిన మహిళలు-బాలలపై సైబర్ నేరాల నివారణ (సీసీపీడబ్ల్యూసీ) కార్యక్రమం కింద రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రభుత్వం సైబర్ ఫోరెన్సిక్ లేబొరేటరీలను ఏర్పాటు చేసింది. అలాగే సైబర్ ఫోరెన్సిక్ కన్సల్టెంట్ల నియామకం కోసం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర హోంశాఖ రూ.131.60 కోట్ల సాయం అందించింది. ఈ నిధులతో మొత్తం 33 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ‘సైబర్ ఫోరెన్సిక్-కమ్-ట్రెయినింగ్‌’ లేబొరేటరీలను ప్రారంభించారు.

సైబర్ భద్రతకు సంబంధించి సమన్వయం, సమాచార భాగస్వామ్య సౌలభ్యం దిశగా ఈశాన్య ప్రాంతం సహా రాష్ట్రాల్లో చర్చాగోష్ఠులు, ఇతరత్రా కసరత్తులను ‘సెర్ట్‌-ఇన్‌’ నిర్వహించింది.

ఇండియన్‌ సైబర్‌ క్రైమ్‌ కోఆర్డినేషన్‌ సెంటర్‌ (ఐ4సీ) పరిధిలో మేవాట్, జమ్‌తారా, అహ్మదాబాద్, హైదరాబాద్, చండీగఢ్, విశాఖపట్నం, గువహటి నగరాల్లో 7 సంయుక్త సైబర్ సమన్వయ బృందాలు (జేసీసీటీ) ఏర్పాటయ్యాయి. ఇవి దేశవ్యాప్తంగాగల బహుళ-అధికార పరిధిలోని సమస్యలున్న ప్రాంతాల ఆధారంగా సైబర్ నేరాల కేంద్రాలు/ప్రాంతాలను పర్యవేక్షిస్తాయి. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని ‘ఎల్‌ఈఏ’ల మధ్య సమన్వయ చట్రాన్ని బలోపేతం చేయడం దీని లక్ష్యం.

సైబర్ నేరాల సమాచార భాగస్వామ్యం-విశ్లేషణలో ‘ఎల్‌ఈఏ’లకు తోడ్పడే మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (ఎంఐఎస్‌) కింద సమాచార భాండాగారం, సమన్వయం దిశగా ‘సమన్వయ’ వేదిక ఏర్పాటైంది. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో సైబర్‌ నేరాలు, నేరగాళ్ల విశ్లేషణ ప్రాతిపదికగా అంతర్రాష్ట్ర అనుసంధాన సౌకర్యం కల్పిస్తుంది. అలాగే, నేరగాళ్ల స్థావరాలు, నేరాలకు పాల్పడే మార్గాలను ‘ప్రతిబింబ్’ మాడ్యూల్ పటం రూపంలో అందిస్తుంది. తద్వారా ఆయా అధికార పరిధుల్లోని అధికారులకు సాదృశ సమాచారం లభిస్తుంది. అలాగే, ‘ఐ4సీ’తోపాటు ఇతర ‘ఎస్‌ఎంఈ'ల నుంచి సాంకేతిక-చట్టపరమైన సహాయం కోరడం-స్వీకరించడంలో ‘ఎల్‌ఈఏ’లకు మార్గం సుగమం చేస్తుంది. ఈ సౌలభ్యం ద్వారా 1,05,129 సైబర్ దర్యాప్తు అభ్యర్థనల ద్వారా 16,840 మంది నిందితులు అరెస్టయ్యారు.

దేశవ్యాప్తంగా సైబర్ నేరాల దర్యాప్తు, ఫోరెన్సిక్స్, విచారణలో పోలీసు, న్యాయ అధికారుల  సామర్థ్యం పెంచేందుకు ‘సైట్రైయిన్’ పేరిట ‘మాసివ్ ఓపెన్ ఆన్‌లైన్ కోర్సుల’ (మూక్‌) పోర్టల్‌ అందుబాటులో ఉంది. దీనిద్వారా ధ్రవీకరణ సహిత ప్రామాణిక ఆన్‌లైన్ కోర్సులలో శిక్షణ లభిస్తుంది. అన్ని సంస్థల పరిధిలో ఏకరూప నైపుణ్యాభివృద్ధికి ఇది భరోసా ఇస్తుంది. దీనికింద 31.10.2025 వరకు 1,44,895 మంది పోలీసు అధికారులు, న్యాయమూర్తులు, విచారణాధికారులు, ‘సీపీఓ’లు, ‘సీఏపీఎఫ్‌’లు నమోదు చేసుకోగా, ఈ పోర్టల్‌ ద్వారా 1,19,628 ధ్రువీకరణ పత్రాలు జారీ అయ్యాయి.

హోం శాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిస్తూ ఈ సమాచారం వెల్లడించారు.


(रिलीज़ आईडी: 2197940) आगंतुक पटल : 4
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Assamese , Tamil