ప్రధాన మంత్రి కార్యాలయం
నైపుణ్య శిక్షణ కోర్సు ముగింపు సందర్భంగా ప్రధానమంత్రి వీడియో సందేశం
प्रविष्टि तिथि:
12 OCT 2023 1:08PM by PIB Hyderabad
నమస్కారం!
నైపుణ్యాభివృద్ధికి సంబంధించిన ఈ ఉత్సవం నిజంగా ఎంతో ప్రత్యేకమైనది. దేశవ్యాప్తంగా ఉన్న సంస్థల సమష్టి నైపుణ్య ప్రదర్శనగా జరుగుతున్న ఈ కౌశల్ దీక్షాంత సమారోహ్ ఒక ప్రశంసనీయమైన కార్యక్రమం. ఇది సమకాలీన భారత్ ప్రాధాన్యతలను స్పష్టంగా ప్రతిబింబిస్తుంది. ఈ రోజు వేలాది మంది యువత ఈ కార్యక్రమానికి సాంకేతికత ద్వారా అనుసంధానమై ఉన్నారు. వీరందరికీ ఉజ్వల భవిష్యత్తు కోసం నా హృదయపూర్వక శుభాకాంక్షలు.
నా యువ మిత్రులారా,
ప్రతి దేశానికి సహజ సంపదలు, ఖనిజ వనరులు, లేదా విస్తారమైన తీరప్రాంతాలు వంటి ప్రత్యేకమైన బలాలు ఉంటాయి. అయితే, ఈ బలాలను సక్రమంగా వినియోగించే అసలైన శక్తి యువశక్తి. యువత ఎంత శక్తివంతంగా, సమర్థవంతంగా ఉంటే, దేశం అంత వేగంగా అభివృద్ధి చెందుతుంది. అలా అభివృద్ధి చెందుతున్న దేశం తన వనరులను సమానత్వంతో, న్యాయంగా వినియోగించగలదు. ఈ రోజు, భారత్ ఇదే దృక్పథంతో దేశ యువతకు సాధికారత కల్పిస్తోంది, ఈ దిశగా మొత్తం వ్యవస్థలో విప్లవాత్మక మార్పులతో దేశం రెండంచెల వ్యూహాన్ని అమలు చేస్తోంది. నైపుణ్యం, విద్య ద్వారా కొత్త అవకాశాల నుంచి ప్రయోజనం పొందేందుకు యువతను సిద్ధం చేస్తున్నాం. దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత, మేం కొత్త జాతీయ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టాం. వైద్య కళాశాలలు, ఐఐటిలు, ఐఐఎంలు,ఐటిఐలు వంటి అనేక నైపుణ్యాభివృద్ధి సంస్థలను పెద్ద సంఖ్యలో ప్రారంభించాం. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన (ప్రధానమంత్రి నైపుణ్యాభివృద్ధి పథకం) కింద లక్షలాదిమంది యువకులు శిక్షణ పొందారు. మరోవైపు, ఉపాధినిచ్చే సాంప్రదాయ రంగాలను బలోపేతం చేస్తూనే, ఉద్యోగాలు, పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించే కొత్త రంగాలను కూడా అభివృద్ధి చేస్తున్నాం. వస్తువులు, మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్, సేవలు, రక్షణ ఎగుమతుల్లోనూ, తయారీలోనూ భారత్ ఈ రోజు కొత్త రికార్డులను నెలకొల్పుతోంది. అదే సమయంలో, దేశం అంతరిక్షం, స్టార్టప్‌లు, డ్రోన్లు, అనిమేషన్, ఎలక్ట్రిక్ వాహనాలు, సెమీకండక్టర్‌లు తదితర అనేక రంగాల్లో, మీ యువతకు విస్తృతమైన అవకాశాలను సృష్టిస్తోంది.
మిత్రులారా,
ఈ శతాబ్దం భారతదేశానిదేనని నేడు ప్రపంచమంతా అంగీకరిస్తోంది. దానికి ప్రధాన కారణం మన దేశం కలిగి ఉన్న విస్తృతమైన యువ జనాభా. . ప్రపంచంలోని అనేక దేశాల్లో వృద్ధ జనాభా పెరుగుతుండగా, భారత్ లో మాత్రం యువ జనాభా పెరుగుతోంది. ఇది మన దేశానికి ఒక గొప్ప ప్రయోజనం. ఒక అసాధారణమైన బలం. ప్రపంచం నైపుణ్యాలతో కూడిన భారత యువత వైపు ఆశతో చూస్తోంది. ఇటీవల జరిగిన జీ20 సదస్సులో, గ్లోబల్ స్కిల్ మ్యాపింగ్ గురించి భారత్ చేసిన ప్రతిపాదనకు ఆమోదం లభించింది. ఇది రాబోయే రోజుల్లో యువతకు మరింత మంచి అవకాశాలను తీసుకురానుంది. దేశంలోనైనా, ప్రపంచంలోనైనా మనకు లభించే ఏ అవకాశాన్నీ మనం వదులుకో రాదు. భారత ప్రభుత్వం మీ వెంట నిలబడి, మీ ప్రతి అవసరంలో మద్దతు అందిస్తోంది. గతంలో, నైపుణ్యాభివృద్ధికి పూర్వ ప్రభుత్వాలు తగినంత ప్రాధాన్యం ఇవ్వలేదు. కానీ మా ప్రభుత్వం నైపుణ్యాల అసలు విలువను గుర్తించి, దానికి ప్రత్యేకంగా శాఖను ఏర్పాటుచేసి, ప్రత్యేక బడ్జెట్ కూడా కేటాయించింది. ఈరోజు భారత్ తన యువత నైపుణ్యాల మీద ఎన్నడూ లేనంతగా పెట్టుబడి పెడుతోంది. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన యువతను అట్టడుగు స్థాయి నుంచి శక్తిమంతం చేసింది. ఈ యోజన కింద ఇప్పటివరకు సుమారు 1.5 కోట్లమంది యువతకు శిక్షణ లభించింది. పారిశ్రామిక ప్రాంతాల చుట్టూ కొత్త నైపుణ్య కేంద్రాలు ఏర్పాటు అవుతున్నాయి. తద్వారా పరిశ్రమలు తమ అవసరాలను నైపుణ్యాభివృద్ధి సంస్థలతో పంచుకోగలుగుతున్నాయి. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా యువతలో అవసరమైన నైపుణ్యాలను అభివృద్ధి చేస్తే, వారు సులభంగా శ్రామిక శక్తిలో కలిసిపోతారు.
మిత్రులారా,
కాలం ఎంత వేగంగా మారుతోందో మీకు తెలుసు. ఒక నైపుణ్యాన్ని నేర్చుకుని అది జీవితాంతం సరిపోతుందనే పరిస్థితి ఇప్పుడు లేదు. ఇప్పుడు మనందరికీ నైపుణ్యం నేర్చుకోవడం (స్కిల్లింగ్), దానిని ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకోవడం(అప్‌స్కిల్లింగ్), ఒక రంగంలో నైపుణ్యాన్ని మరో రంగంలో ఉపయోగించేందుకు కొత్త నైపుణ్యాన్ని నేర్చుకోవడం (రీస్కిల్లింగ్) అనే నిరంతర ప్రక్రియను అనుసరించవలసిన అవసరం ఏర్పడింది. ఉద్యోగాల స్వరూపం, వాటికి కావాల్సిన నైపుణ్యాలు వేగంగా మారుతున్నాయి. కాబట్టి, మనం కూడా మన నైపుణ్యాలను ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటూ ఉండాలి. ఈ మార్పులకు అనుగుణంగా పరిశ్రమలు, పరిశోధన సంస్థలు, నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు కాలానుగుణంగా తమను తాము నవీకరించుకోవడం అత్యవసరం. గతంలో నైపుణ్యాల ప్రత్యేకతను గుర్తించడం, వాటి ఆవశ్యకతను అంచనా వేయడంపై అంతగా దృష్టి ఉండేది కాదు. కానీ ఇప్పుడు అదే కీలకంగా మారింది. ఇప్పుడు ఈ పరిస్థితి కూడా మారుతోంది. గత తొమ్మిదేళ్లలో దేశంలో దాదాపు 5,000 కొత్త ఐటీఐలు ఏర్పాటయ్యాయి. దీనివల్ల దేశవ్యాప్తంగా ఐటీఐలలో నాలుగు లక్షలకు పైగా కొత్త సీట్లు పెరిగాయి. ఈ సంస్థలను మోడల్ ఐటీఐలుగా అప్‌గ్రేడ్ చేస్తున్నారు. సమర్థవంతమైన, ఉన్నత ప్రమాణాలతో కూడిన శిక్షణను అందించడంతో పాటు ఉత్తమ పద్ధతులను పొందుపరచడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.
మిత్రులారా,
భారత్‌లో నైపుణ్యాభివృద్ధి పరిధి నిరంతరం విస్తరిస్తోంది. మనం కేవలం మెకానిక్‌లు, ఇంజనీర్లు, టెక్నాలజీ లేదా మరేదైనా నిర్దిష్ట సేవకే పరిమితం కాలేదు. ఇప్పుడు, మహిళా స్వయం సహాయక బృందాలకు డ్రోన్ టెక్నాలజీలో శిక్షణ ఇస్తున్నారు. అదేవిధంగా, మన విశ్వకర్మ సహచరులు కూడా ఉన్నారు. వారు మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగం. వారు లేకుండా ఏ పనీ సజావుగా సాగదు. సాంప్రదాయకంగా, వారు తమ నైపుణ్యాలను వారి పెద్దల నుంచి నేర్చుకుంటారు. వాటిని ఇతరులకు అందిస్తారు. ఇప్పుడు, పీఎం విశ్వకర్మ యోజనతో, వారి సాంప్రదాయ నైపుణ్యాలను ఆధునిక సాంకేతికత, సాధనాలతో అనుసంధానిస్తున్నాం.
నా యువ మిత్రులారా,
భారత్ ఆర్థిక వ్యవస్థ విస్తరిస్తున్న కొద్దీ, మీలాంటి యువకులకు కొత్త అవకాశాలు లభిస్తున్నాయి. ఇటీవలి సర్వేలో భారత్‌లో ఉద్యోగాల కల్పన కొత్త శిఖరాలకు చేరుకుందని వెల్లడైంది. ప్రస్తుతం, గత ఆరేళ్లుగా భారత్‌లో నిరుద్యోగం రేటు అత్యల్ప స్థాయిలో ఉంది. నేను ఇక్కడ నిరుద్యోగం గురించి మాట్లాడుతున్నాను. భారత్‌లోని గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో నిరుద్యోగం వేగంగా తగ్గుతోంది. అంటే, అభివృద్ధి ఫలాలు గ్రామాలు, నగరాలు అనే తేడా లేకుండా అందరికీ సమానంగా అందుతున్నాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కొత్త అవకాశాలు సమానంగా పెరుగుతున్నాయని ఇది సూచిస్తోంది. ఈ సర్వేలోని మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, దేశంలోని శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యం అపూర్వంగా పెరగడం. ఇటీవలి సంవత్సరాలలో భారత్‌లో మహిళా సాధికారత కోసం చేపట్టిన వివిధ ప్రణాళికలు, ప్రచారాలు సానుకూల ప్రభావాన్ని చూపుతున్నాయి.
మిత్రులారా,
అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) మీ అందరి ఉత్సాహాన్ని పెంచే గణాంకాలను విడుదల చేసింది. వాటి ప్రకారం, రాబోయే సంవత్సరాల్లో భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుంది. ప్రపంచంలోని మొదటి మూడు ఆర్థిక వ్యవస్థల జాబితాలోకి భారత్‌ను తీసుకువస్తానని నేను ఇచ్చిన హామీని మీరు గుర్తుంచుకోవచ్చు. రాబోయే మూడు, నాలుగు సంవత్సరాలలో భారత్ ప్రపంచంలోని మొదటి మూడు ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా ఉంటుందని ఐఎంఎఫ్ కూడా పూర్తి విశ్వాసంతో ఉంది. అంటే మీకు ఉపాధి, పరిశ్రమల ఏర్పాటుకు మరిన్ని అవకాశాలు లభిస్తాయి.
మిత్రులారా,
మీ ముందు అవకాశాలు అనంతంగా ఉన్నాయి. మనం భారత్‌ను ప్రపంచంలోనే నైపుణ్యం కలిగిన మానవశక్తికి అతిపెద్ద కేంద్రంగా మార్చాలి. మనం ప్రపంచానికి స్మార్ట్, నైపుణ్యం కలిగిన మానవశక్తి పరిష్కారాలను అందించాలి. నేర్చుకోవడం, బోధించడం, పురోగమించడం అనే ప్రక్రియ కొనసాగాలి. జీవితంలో ప్రతి అడుగులోనూ మీరు విజయం సాధించాలి. మీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు. శుభాకాంక్షలు.
గమనిక: ఇది ప్రధానమంత్రి హిందీ సందేశానికి సుమారు తెలుగు అనువాదం.
***
(रिलीज़ आईडी: 2197370)
आगंतुक पटल : 12
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Kannada
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam