ప్రధాన మంత్రి కార్యాలయం
ముంబయిలో జరిగిన 141వ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సమావేశ ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం
प्रविष्टि तिथि:
14 OCT 2023 10:10PM by PIB Hyderabad
ఐవోసీ అధ్యక్షులు శ్రీ థామస్ బాచ్, గౌరవనీయ ఐవోసీ సభ్యులు, అన్ని అంతర్జాతీయ క్రీడా సమాఖ్యల ప్రతినిధులు, దేశంలోని జాతీయ సమాఖ్యల ప్రతినిధులు, సోదరీ సోదరులారా! ఈ ప్రత్యేక సందర్భంలో 140 కోట్ల మంది భారతీయుల తరపున నేను మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం పలుకుతూ... శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అంతర్జాతీయ ఒలింపిక్ అసోసియేషన్ 141వ సమావేశాలు భారత్‌లో నిర్వహించడం నిజంగా ముఖ్యమైనది. 40 సంవత్సరాల తర్వాత భారత్‌లో ఐవోసీ సమావేశాలు నిర్వహించడం మాకు చాలా గర్వకారణం.
మిత్రులారా,
కొద్ది నిమిషాల కిందటే అహ్మదాబాద్‌లోని ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియంలో భారత్ అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఈ చరిత్రాత్మక విజయం సాధించిన టీం భారత్‌కు, తోటి భారతీయులందరికీ నేను అభినందనలు తెలియజేస్తున్నాను.
మిత్రులారా,
క్రీడలు మన సంస్కృతి, జీవనశైలి, భారత చరిత్రలో అంతర్భాగంగా ఉన్నాయి. మీరు భారత్‌లోని గ్రామాలను సందర్శిస్తే... క్రీడలు లేకుండా పండగ ఏదీ సంపూర్ణం కాదని మీరు తెలుసుకుంటారు. భారతీయులుగా మేమంతా కేవలం క్రీడా ప్రేమికులం మాత్రమే కాదు... మేం క్రీడలను మా జీవితంలో భాగం చేసుకుని జీవిస్తున్నాం. ఇది వేల సంవత్సరాల మా చరిత్రలో ప్రతిబింబిస్తుంది. అది సింధు లోయ నాగరికత అయినా, వేద కాలం అయినా, తరువాతి యుగాలైనా... క్రీడలు ఎల్లప్పుడూ భారత వారసత్వంలో కీలక భాగంగా ఉన్నాయి. వేల సంవత్సరాల కిందట రాసిన మన పురాతన గ్రంథాలు 64 కళల్లో ప్రావీణ్యాన్ని ప్రస్తావిస్తాయి. వీటిలో చాలా వరకు గుర్రపు స్వారీ, విలువిద్య, ఈత, కుస్తీ, వంటి మరెన్నో క్రీడలకు సంబంధించినవి. ఈ నైపుణ్యాలను ముఖ్యమైనవిగా పరిగణించారు. ధనుర్వేద సంహిత వంటి పవిత్ర గ్రంథం విలువిద్య కళకు అంకితమైంది. ఈ సంహితలో ఈ ప్రస్తావన ఉంది:
ధనుశ్చ కరంచ కుంతంచ ఖడ్గంచ క్షురికా గదా।
సప్తమం బాహుయుద్ధం స్యాదేవం యుద్ధాని సప్తధా॥
అంటే ధనుస్సు, చక్రం, కొడవలి, ఖడ్గం, కత్తి, గద ఇవన్నీ ఆరు రకాల ఆయుధ యుద్ధాలు. ఏడోది బాహుయుద్ధం. అంటే చేతులతో చేసే మల్లు యుద్ధం. మొత్తంగా యుద్ధాలు ఏడు విధాలుగా ఉంటాయి.
మిత్రులారా,
వేల సంవత్సరాల నాటి మన క్రీడా వారసత్వానికి అనేక శాస్త్రీయ ఆధారాలున్నాయి. ప్రస్తుతం మనం ఉన్న ముంబయి నుంచి దాదాపు 900 కిలోమీటర్ల దూరంలో ఉన్న కచ్‌లో... ధోలావీరా అనే యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం ఉంది. 5,000 సంవత్సరాల కిందట ధోలావీరా ఒక పెద్ద, సంపన్నమైన ఓడరేవు నగరం. ఈ పురాతన నగరంలో పట్టణ ప్రణాళిక మాత్రమే కాకుండా, క్రీడా మౌలిక సదుపాయాల అద్భుతమైన నమూనా కూడా ఉంది. తవ్వకాల సమయంలో ఇక్కడ రెండు స్టేడియంలను గుర్తించారు. వాటిలో ఒకటి ఆ కాలంలో ప్రపంచంలోనే అత్యంత పురాతనమైనది, అతిపెద్దది అయిన ఒక స్టేడియం. 5,000 సంవత్సరాల పురాతనమైన ఈ స్టేడియంలో 10,000 మంది కూర్చునే సామర్థ్యం ఉంది. భారత్‌లోని మరొక పురాతన ప్రదేశం రాఖీగర్హి. ఇది క్రీడలకు సంబంధించిన నిర్మాణాలనూ వెల్లడిస్తుంది. ఈ భారత వారసత్వం యావత్ ప్రపంచానికీ వారసత్వమే.
మిత్రులారా,
క్రీడల్లో ఓడిపోయినవారు ఉండరు... విజేతలు, అభ్యాసకులు మాత్రమే ఉంటారు. క్రీడల భాష, స్ఫూర్తి సార్వత్రికమైనవి. క్రీడలు కేవలం పోటీ గురించి మాత్రమే కాదు. అవి మానవాళి తన పరిధులను విస్తరించుకోవడానికి అవకాశాన్ని అందిస్తాయి. ఎవరు రికార్డులు బద్దలు కొట్టినా యావత్ ప్రపంచం వారిని స్వాగతిస్తుంది. క్రీడలు మన "వసుధైక కుటుంబం" - ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు అనే భావననూ బలోపేతం చేస్తాయి. అందుకే మా ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించడానికి ప్రతి స్థాయిలో శ్రద్ధగా కృషి చేస్తోంది. ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్, ఖేలో ఇండియా యూత్ గేమ్స్, ఖేలో ఇండియా వింటర్ గేమ్స్, పార్లమెంటు సభ్యుల క్రీడా పోటీలు, రాబోయే ఖేలో ఇండియా పారా గేమ్స్ భారత్‌లో క్రీడల అభివృద్ధి పట్ల మా నిబద్ధతకు ఉదాహరణలు. దేశంలో క్రీడల పురోగతిలో సమ్మిళితత్వం, వైవిధ్యంపైనా మేం నిరంతరం దృష్టి సారిస్తున్నాం.
మిత్రులారా,
భారత్‌లో క్రీడలపై ప్రధానంగా దృష్టి సారించడం వల్లే దేశం ఈ రోజు అంతర్జాతీయ ఈవెంట్లలో అద్భుతమైన ప్రదర్శన చేస్తోంది. గత ఒలింపిక్స్‌లో చాలా మంది భారతీయ అథ్లెట్లు అద్భుతమైన ప్రదర్శన చేశారు. ఇటీవల ముగిసిన ఆసియా క్రీడల్లోనూ భారత్ చరిత్రాత్మక ప్రదర్శన చేసింది. దీనికి ముందు మన యువ అథ్లెట్లు ప్రపంచ విశ్వవిద్యాలయ క్రీడల్లో సరికొత్త రికార్డులు సృష్టించారు. ఈ సంఘటనలు దేశంలో మారుతున్న, వేగంగా అభివృద్ధి చెందుతున్న క్రీడా దృశ్యాన్ని సూచిస్తాయి.
మిత్రులారా,
ఇటీవలి సంవత్సరాల్లో భారత్ వివిధ ప్రపంచస్థాయి క్రీడా టోర్నీలు నిర్వహించే సామర్థ్యాన్ని నిరూపించుకుంది. మేం ఇటీవల చెస్ ఒలింపియాడ్‌ను నిర్వహించాం. ఇందులో ప్రపంచవ్యాప్తంగా 186 దేశాలు పాల్గొన్నాయి. మేం అండర్-17 ఫుట్‌బాల్ ప్రపంచ కప్, మహిళల ప్రపంచ కప్, పురుషుల హాకీ ప్రపంచ కప్, మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్, షూటింగ్ ప్రపంచ కప్ వంటి ఈవెంట్‌లనూ నిర్వహించాం. భారత్ ప్రతియేటా ప్రపంచంలోని అతిపెద్ద క్రికెట్ లీగ్‌లలో ఒకదానికి ఆతిథ్యం ఇస్తోంది. ప్రస్తుత క్రికెట్ ప్రపంచ కప్ కూడా భారత్‌లోనే జరుగుతోంది. ఈ ఉత్సాహభరితమైన వాతావరణంలో... ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చాలని ఐవోసీ ఎగ్జిక్యూటివ్ బోర్డు ప్రతిపాదించిందని విని అందరూ సంతోషిస్తున్నారు. ఈ విషయంపై త్వరలో సానుకూల వార్తలు అందుతాయని మేం ఆశిస్తున్నాం.
మిత్రులారా,
ప్రపంచస్థాయి కార్యక్రమాలను నిర్వహించడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలను స్వాగతించే అవకాశం లభిస్తుంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ, బాగా అభివృద్ధి చెందిన మౌలిక సదుపాయాలతో భారత్ ప్రధాన ప్రపంచస్థాయి కార్యక్రమాల నిర్వహణకు సిద్ధంగా ఉంది. భారత్ జీ20కి అధ్యక్షత వహించిన సమయంలో ప్రపంచం దీనిని చూసింది. మేం దేశవ్యాప్తంగా 60కి పైగా నగరాల్లో కార్యక్రమాలను నిర్వహించాం. లాజిస్టిక్స్, ఇతర అంశాల్లో మా నిర్వహణ సామర్థ్యాన్ని ప్రదర్శించాం. అందువల్ల 140 కోట్ల మంది భారతీయుల మనోభావాలను ఈరోజు మీ ముందు వ్యక్తపరచాలనుకుంటున్నాను. భారత్ తన గడ్డపై ఒలింపిక్స్ నిర్వహించడం పట్ల ఉత్సాహంగా ఉంది.
2036లో భారత్‌లో ఒలింపిక్స్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని అవకాశాలను వినియోగించుకుంటున్నాం. ఇది 140 కోట్ల మంది భారతీయుల దశాబ్దాల కల, ఆకాంక్ష. మీ అందరి మద్దతుతో మేం సాకారం చేసుకోవాలనుకుంటున్న కల ఇది. 2036 ఒలింపిక్స్‌కు ముందే... 2029లో యూత్ ఒలింపిక్స్‌ను నిర్వహించడానికి భారత్ ఆసక్తిగా ఉంది. ఐవోసీ నుంచి భారత్ నిరంతర మద్దతును పొందుతూనే ఉంటుందని నేను నమ్ముతున్నాను.
మిత్రులారా,
క్రీడలు పతకాలు గెలుచుకునే సాధనం మాత్రమే కాదు... హృదయాలను గెలుచుకునే మార్గం. క్రీడలు అందరికీ చెందినవి... అందరి కోసం గలవి. ఇవి ఛాంపియన్లను రూపొందించడమే కాకుండా శాంతి, పురోగతి, శ్రేయస్సులనూ ప్రోత్సహిస్తాయి. అందువల్ల ప్రపంచాన్ని అనుసంధానించడానికి క్రీడలు మరొక శక్తిమంతమైన మాధ్యమం. వేగంగా, ఉన్నతంగా, బలంగా, కలిసికట్టుగా అనే మా ఒలింపిక్ నినాదాన్ని మీ ముందు పునరుద్ఘాటించాలనుకుంటున్నాను. 141వ ఐవోసీ సమావేశానికి హాజరైన అధ్యక్షుడు థామస్ బాచ్, ప్రతినిధులకు, అతిథులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రాబోయే కొన్ని గంటల్లో మీరు చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలి. నేను ఇప్పుడు ఈ సమావేశం ప్రారంభమైనట్లు ప్రకటిస్తున్నాను.
గమనిక: ఇది ప్రధానమంత్రి హిందీలో చేసిన ప్రసంగానికి అనువాదం.
***
(रिलीज़ आईडी: 2197350)
आगंतुक पटल : 11
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam