ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
ఎస్‌సీఎల్ మొహాలి ఆధునికీకరణకు భారత ప్రభుత్వం రూ. 4,500 కోట్ల పెట్టుబడి... ప్రైవేటీకరణ ఉండబోదని హామీ విద్యార్థులు రూపొందించిన 28 ఎస్‌సీల్ తయారీ చిప్‌లు అందజేత
प्रविष्टि तिथि:
28 NOV 2025 6:56PM by PIB Hyderabad
మొహాలిలోని సెమీకండక్టర్ లాబొరేటరీని సందర్శించి పనుల పురోగతిని, కొనసాగుతున్న ఆధునికీకరణ కార్యకలాపాలను కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్, కేంద్ర సహాయ మంత్రి శ్రీ రవ్‌నీత్ సింగ్ సమీక్షించారు.
ఎస్‌సీఎల్ అప్‌గ్రేడ్, విస్తరణ కోసం భారత ప్రభుత్వం రూ. 4,500 కోట్లు పెట్టుబడి పెడుతుందని ఈ పర్యటన సందర్భంగా శ్రీ అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. “ఎటువంటి సందేహం లేదు. ఎస్‌సీఎల్ మొహాలీ ఆధునికీకరణ జరుగుతుంది. దానిని ప్రైవేటీకరించడం జరగదు. ఒక పెద్ద ప్రయాణం ముందుంది... భారత్ దానికి సిద్ధంగా ఉంది” అని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. ఎస్‌సీఎల్ మొహాలిలో 17 విద్యాసంస్థల విద్యార్థులు రూపొందించిన 28 చిప్‌లను అందజేసే కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి తన ప్రసంగంలో ఈ వివరాలను వెల్లడించారు.
చిప్స్ టు స్టార్ట్-అప్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు అందించిన ఎలక్ట్రానిక్ డిజైన్ ఆటోమేషన్ సాధనాలను ఉపయోగించి వారు ఈ చిప్‌లను రూపొందించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు రూపొందించిన మొత్తం 56 చిప్‌లను ఎస్‌సీఎల్‌లో తయారు చేశారు.
సెమీకండక్టర్ ప్రాసెస్ గ్యాలరీని, అభ్యుతనం ట్రైనింగ్ బ్లాక్‌నూ కేంద్ర మంత్రి ప్రారంభించారు. మునుపటి తరం ఫ్యాబ్రికేషన్ సాధనాలతో కూడిన క్లీన్ రూమ్ ల్యాబ్‌ను సెమీకండక్టర్ ప్రాసెస్ గ్యాలరీ ప్రదర్శిస్తుంది. ఇది విద్యార్థులకు సెమీకండక్టర్ ఫ్యాబ్, ఏటీఎంపీ కేంద్రాల వాస్తవిక అనుభూతిని అందిస్తుంది. అభ్యుతనం ట్రైనింగ్ బ్లాక్‌లో ఆన్లైన్, ఆఫ్‌లైన్ సెమీకండక్టర్ శిక్షణ మాడ్యూళ్ళు, ప్రత్యక్ష భాగస్వామ్యంతో ఫైర్ - సేఫ్టీ శిక్షణ ఉంటాయి.
ఎస్‌సీఎల్ మొహాలీ కోసం రోడ్‌మ్యాప్
ఎస్‌సీఎల్ మొహాలి కోసం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్పష్టమైన రోడ్ మ్యాప్ రూపొందించారని, కీలకమైన దార్శనిక రంగాలను ఆయన వివరించారని శ్రీ అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.
ఆధునిక విధానాల్లో ఎస్‌సీఎల్ అప్‌గ్రేడ్ జరుగుతుంది. దీని కోసం భారత ప్రభుత్వం రూ. 4500 కోట్లు పెట్టుబడి పెడుతుంది. ప్రస్తుత స్థాయికి 100 రెట్లు వేఫర్‌ల ఉత్పత్తి లక్ష్యంగా ఉత్పత్తి సామర్థ్యం గణనీయంగా పెంచనున్నారు.
విద్యార్థులు, పరిశోధకులు, అంకురసంస్థలు రూపొందించే చిప్ డిజైన్‌లను నిజమైన సిలికాన్‌గా మార్చే తయారీ కేంద్రాలను అందించడం ద్వారా ఎస్‌సీఎల్ మొహాలీ వారికి మద్దతును కొనసాగిస్తుంది.
ప్రపంచ స్థాయి ఈడీఏ సాధనాలు
ప్రభుత్వ మద్దతుతో అందించిన ప్రపంచ స్థాయి ఈడీఏ సాధనాలను ఉపయోగించి దాదాపు 300 విశ్వవిద్యాలయాల విద్యార్థులు సెమీకండక్టర్ చిప్‌లను రూపొందిస్తున్న అతి కొద్ది దేశాల్లో భారత్ ఒకటిగా ఉంది. ఈ వ్యవస్థ ప్రపంచంలోనే ప్రత్యేకమైనదని శ్రీ అశ్వినీ వైష్ణవ్ అన్నారు.
నైపుణ్యాభివృద్ధి, ఆవిష్కరణలు, అంకురసంస్థలకు ఎస్‌సీఎల్ ఒక వేదికగా ఉంటుందని ఆయన పునరుద్ఘాటించారు. ఇప్పటివరకు ఎస్‌సీఎల్ అందించిన ఈ తయారీ మద్దతు భవిష్యత్తులో మరింత పెరుగుతుందన్నారు.
ఎస్‌సీఎల్ ఆధునికీకరణ కార్యక్రమానికి మద్దతుగా 25 ఎకరాల భూమిని కేటాయించాలని పంజాబ్ ప్రభుత్వాన్ని భారత ప్రభుత్వం కోరినట్లు ఆయన తెలిపారు.
వ్యూహాత్మక రంగాల్లో స్వయం-సమృద్ధి
వ్యూహాత్మక రంగాల్లో స్వయం-సమృద్ధి అత్యంత అవసరమనీ... స్వదేశీ చిప్ అభివృద్ధికి భారత్ ఒక వ్యవస్థను నిర్మిస్తోందని కేంద్ర మంత్రి తెలిపారు.
సీడీఏసీ, డీఆర్డీవో, ఇతర సంస్థలతో కూడిన బలమైన కన్సార్టియం స్వదేశీ చిప్‌ల రూపకల్పన, ఉత్పత్తి అభివృద్ధి, తయారీ కోసం కలిసి పనిచేస్తుంది.
***
(रिलीज़ आईडी: 2196707)
आगंतुक पटल : 13