రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

స్వదేశీ అధునాతన స్టెల్త్ ఫ్రిగేట్ పరిజ్ఞానంతో 17ఏ ప్రాజెక్టు కింద నిర్మించిన నీలగిరి క్లాస్‌ నాలుగో నౌక ‘తారాగిరి’ అప్పగింత

प्रविष्टि तिथि: 29 NOV 2025 11:00AM by PIB Hyderabad

నీలగిరి శ్రేణి (ప్రాజెక్ట్ 17ఏ చెందిన నాలుగో నౌక, మజగాన్ డాక్ షిప్‌బిల్డింగ్ సంస్థ నిర్మించిన మూడవ నౌక తారాగిరి (యార్డ్ 12653)ని 2025 నవంబర్ 28న ముంబైలోని ఎండీఎల్‌ వద్ద భారత నౌకాదళానికి అప్పగించారు. ఇది యుద్ధ నౌకల రూపకల్పన, నిర్మాణంలో స్వయం సమృద్ధిని సాధించడంలో ఒక మైలురాయిని సూచిస్తుంది. ప్రాజెక్ట్ 17ఏ ఫ్రిగేట్‌లు బహుముఖ, బహుళ-మిషన్ వేదికలు. వీటిని సముద్ర రంగంలో ప్రస్తుత, భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనే విధంగా రూపొందించారు.

తారాగిరి నౌక అనేది ఒకప్పటి ఐఎన్‌ఎస్‌ తారాగిరికి పునర్జన్మ. పాత ఐఎన్ఎస్ తారాగిరి ఒక లియాండర్ క్లాస్ ఫ్రిగేట్. ఇది 1980 మే 16 నుంచి 2013 జూన్ 27 వరకు భారత నావికా దళంలో భాగమై దేశానికి 33 సంవత్సరాల పాటు అద్భుతమైన సేవలను అందించింది. ఈ అత్యాధునిక ఫ్రిగేట్ నావికా రూపకల్పన, గోప్యతా, ఫైర్‌పవర్, ఆటోమేషన్, మనుగడ సామర్థ్యం వంటి అంశాల్లో గొప్ప పురోగతిని ప్రతిబింబిస్తుంది. యుద్ధనౌకల నిర్మాణంలో ఆత్మనిర్భర్‌ భారత్‌కు ప్రతీకగా నిలుస్తుంది.

ప్రాజెక్ట్ 17ఏ ఫ్రిగేట్‌లను యుద్ధనౌక రూపకల్పన విభాగం రూపొందించింది. ముంబైలోని యుద్ధనౌక పర్యవేక్షక బృందం ఈ నిర్మాణాన్ని పర్యవేక్షించింది. పీ17ఏ ఫ్రిగేట్‌లు స్వదేశీ నౌక రూపకల్పన, గోప్యత, మనుగడ, పోరాట సామర్థ్యాల్లో ఇవి గణనీయమైన పురోగతిని ప్రతిబింబిస్తాయి. సమీకృత నిర్మాణ సిద్దాంతాన్ని సనుసరిస్తూ ఈ నౌకను నిర్మించడం వల్ల నిర్ణీత కాలపరిమితిలోనే నిర్మాణం పూర్తి చేసి అప్పగించారు.

ప్రాజెక్ట్ 17ఏ నౌకలను పాత పీ17 (శివాలిక్) శ్రేణి నౌకలతో పోలిస్తే అత్యాధునిక ఆయుధాలు, సెన్సార్‌ల సముదాయాన్ని కలిగి ఉన్నాయి. ఈ నౌకల్లో కంబైన్డ్ డీజిల్ లేదా గ్యాస్ చలన వ్యవస్థను అమర్చారు. ఇవి డీజిల్ ఇంజిన్‌, గ్యాస్ టర్బైన్ కలిసి పనిచేసి ప్రతి షాఫ్ట్‌కు అనుసంధానించిన కంట్రోలబుల్‌ పిచ్ ప్రొపెల్లర్‌ను నడుపుతాయి.

ఈ నౌకలు అత్యంత ఆధునికమైన ఇంటిగ్రేటెడ్ ప్లాట్‌ఫామ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను (ఐపీఎంఎస్‌) కూడా కలిగి ఉన్నాయి. నౌక మొత్తం నిర్వహణను సమర్థవంతంగా చేయడానికి ఇవి వీలు కల్పిస్తాయి.

పీ17ఏ నౌకలో శక్తివంతమైన ఆయుధాలు, సెన్సార్ల సముదాయాన్ని అమర్చారు. ఇందులో బ్రహ్మోస్ ఎస్‌ఎస్‌ఎం, ఎంఎఫ్‌ఎస్‌టీఏఆర్, ఎంఆర్‌ఎస్‌ఏఎం కాంప్లెక్స్, 76 మిల్లీమీటర్ల ఎస్‌ఆర్‌జీఎం, 30 మిల్లీమీటర్లు, 12.7 మిల్లీమీటర్ల సమీప రక్షణ ఆయుధ వ్యవస్థలు ఉన్నాయి. వీటితోపాటు జలాంతర్గామి వ్యతిరేక యుద్ధం కోసం రాకెట్లు మరియు టార్పెడోలు కూడా అమర్చారు.

తారాగిరి గత 11 నెలల్లో భారత నౌకాదళానికి అప్పగించిన నాలుగో పీ17ఏ నౌక. మొదటి రెండు నౌకల నిర్మాణంలో వచ్చిన అనుభవంతో కొత్త తారాగిరి నిర్మాణాన్ని 81 నెలలకు తగ్గించగలిగారు. పాత నీలగిరి నిర్మాణానికి 93 నెలల సమయం పట్టింది. ప్రాజెక్ట్ 17ఏ కింద మిగిలిన మూడు నౌకలను 2026 ఆగస్టు నాటికి దశలవారీగా భారత నౌకాదళానికి అందించేందుకు ప్రణాళికలు రూపొందించారు. వీటిలో ఒక నౌక ఎండీఎల్‌లో, రెండు నౌకలు జీఆర్‌ఎస్‌లో నిర్మిస్తున్నారు.

తారాగిరి నౌకను సమయానికి అందించడమనేది, స్వదేశీ రూపకల్పన, నౌక నిర్మాణం, ఇంజినీరింగ్ నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తుంది. ఇది నౌక రూపకల్పనలోనూ, నిర్మాణంలోనూ ఆత్మనిర్భరతపై భారత నౌకాదళం అలుపెరుగుని కృషిని స్పష్టంగా ప్రదర్శిస్తుంది. 75% స్వదేశీకరణతో కూడిన ఈ ప్రాజెక్టులో 200కి పైగా ఎంఎస్‌ఎంఈలు భాగస్వామ్యం అయ్యాయి. దీని ఫలితంగా సుమారు 4,000 మందికి ప్రత్యక్షంగా, 10,000 కంటే ఎక్కుమ మంది పరోక్షంగా ఉపాధి అవకాశాలు అందనున్నాయి.

 


(रिलीज़ आईडी: 2196696) आगंतुक पटल : 34
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Marathi , Bengali , Bengali-TR , English , Urdu , हिन्दी , Gujarati , Tamil