రాష్ట్రపతి సచివాలయం
భారతీయ సైన్య సెమినార్ ‘చాణక్య రక్షణ చర్చ-2025’ మూడో సంచిక ప్రారంభ కార్యక్రమంలో ప్రసంగించిన రాష్ట్రపతి
మనం అమలుచేస్తున్న ఉగ్రవాద నిరోధక, నివారణ ప్రధాన వ్యూహంలో
ఆపరేషన్ సిందూర్ సాఫల్యం ఓ మేలుమలుపు: రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము
భారత్ శాంతిని కోరుకుటుందని మన దౌత్యం, ఆర్థిక వ్యవస్థ, సాయుధ దళాలు కలసి చాటిచెప్తున్నాయి...
అలాగే దేశ సరిహద్దుల్నీ, దేశ పౌరుల్నీ కాపాడుకోవడానికి శక్తితో, దృఢ సంకల్పంతో ఇండియా సదా సన్నద్ధంగా ఉంటుందని కూడా చాటిచెబుతున్నాయి
Posted On:
27 NOV 2025 12:19PM by PIB Hyderabad
‘చాణక్య రక్షణ చర్చ-2025’ పేరిట భారతీయ సైన్య సెమినార్ మూడో సంచికను ఈ రోజు (2025 నవంబరు 27)న న్యూఢిల్లీలో మొదలుపెట్టారు. సెమినార్ ప్రారంభ కార్యక్రమంలో రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపదీ ముర్ము పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్రపతి ప్రసంగిస్తూ, దేశ సార్వభౌమత్వాన్ని పరిరక్షించడంలో భారతీయ సాయుధ దళాలు ప్రదర్శిస్తున్న వృత్తినైపుణ్యమూ, దేశభక్తీ మార్గదర్శకమన్నారు. భద్రత పరంగా సవాలు ఎదురైనప్పుడల్లా.. అది సాంప్రదాయక సవాలు కావచ్చు, లేదా ఉగ్రవాద నిరోధం కావచ్చు లేదా మానవీయ పరమైన సవాలు కావచ్చు.. మన సేనలు అసాధారణ రీతిన తగిన విధంగా ప్రతిస్పందిచడంతో పాటు, దృఢ సంకల్పాన్ని కూడా వ్యక్తం చేశాయన్నారు. ఇటీవల చేపట్టిన ఆపరేషన్ సిందూర్ విజయవంతం కావడం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా, నివారణ ప్రధానంగా మనం అనుసరిస్తున్న వ్యూహంలో మేలుమలుపుగా నిలిచిందని రాష్ట్రపతి అన్నారు. దీంతో భారత సైన్య సత్తాను ప్రపంచం గమనించడమే కాకుండా శాంతి పరిరక్షణ దిశగా దృఢత్వంతోనూ, జవాబుదారీతనంతోనూ పనిచేయడంలో భారత్ నైతిక స్పష్టతను కూడా ప్రపంచ దేశాలు గ్రహించాయన్నారు. మన సరిహద్దుల్ని పటిష్టపరచడంతో పాటు మౌలిక సదుపాయాల కల్పన, సంధానం, పర్యటన, విద్య వంటి వాటి ద్వారా సరిహద్దు ప్రాంతాల అభివృద్ధిలో సేనలు తోడ్పడ్డాయని రాష్ట్రపతి అన్నారు.
ప్రస్తుతం భౌగోళిక రాజకీయ ముఖచిత్రం శరవేగంగా మారుతోందని రాష్ట్రపతి అన్నారు. అధికార కేంద్రాల సంఘర్షణ, సాంకేతిక అంతరాయాలు, మారుతున్న కూటములు అంతర్జాతీయ వ్యవస్థను సరికొత్తగా ఆవిష్కరిస్తున్నాయని శ్రీమతి ద్రౌపదీ ముర్ము చెప్పారు. సైబర్ జగతి, అంతరిక్షం, సమాచారం, ప్రజల ఆలోచన విధానంపై దాడులు చేసే రణతంత్రం.. ఇవి ప్రపంచ దేశాలు పోటీపడుతున్న కొత్త రంగాలుగా ప్రస్తుతం రూపుదాల్చి శాంతికీ, సంఘర్షణకీ మధ్య ఉన్న రేఖలను చెరిపి వేస్తున్నాయన్నారు. మన నాగరికత మనకు ‘‘వసుధైవ కుటుంబకమ్’’ సిద్ధాంతాన్ని నేర్పిందనీ, దీని మార్గదర్శకత్వంలో వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి అనేది ప్రపంచం పట్ల జవాబుదారీతనంతో కలసి మనుగడ సాగించగలదని మనం నిరూపించామని రాష్ట్రపతి అన్నారు. శాంతిని కోరుకొనే భారత్‌నూ, సరిహద్దులనే కాక పౌరులను కూడా రక్షించుకొనేందుకు శక్తితో, దృఢ సంకల్పంతో ముందుకు కదలడానికి తయారుగా ఉన్న భారత్‌నూ మన దౌత్యం, ఆర్థిక వ్యవస్థ, సాయుధ దళాలు కలిసికట్టుగా పనిచేస్తూ ప్రపంచం కళ్లెదుట నిలుపుతున్నాయని శ్రీమతి ద్రౌపదీ ముర్ము అన్నారు.
మార్పు ప్రధాన లక్షణంగా ఉన్న దశాబ్దకాలంలో సైన్యం ప్రామాణిక కొలమానాల ద్వారా తనని తాను మార్చుకొంటూ ఉండటాన్ని గమనించాననీ, ఇది తనకు సంతోషాన్ని కలిగించిందనీ రాష్ట్రపతి చెప్పారు. సైన్యం తన స్వరూపంలో సంస్కరణలకు చోటును ఇస్తూ, సిద్ధాంతాలకు కొత్త రూపును కల్పిస్తూ, రాబోయే కాలపు అవసరాల్ని గుర్తెరిగి తలచుకున్న పనిని సాధించి తీరేందుకు అన్ని రంగాల్లోనూ సామర్థ్యాల్ని పునర్‌నిర్వచించుకొంటోందని రాష్ట్రపతి చెప్పారు. రక్షణకు సంబంధించిన ఈ సంస్కరణలు భారత్‌ను స్వయంసమృద్ధంగా తీర్చిదిద్దుతాయన్న విశ్వాసం తనకు ఉందని శ్రీమతి ద్రౌపది ముర్ము అన్నారు.
యువత పైనా, మానవ వనరులపైనా సైన్యం ప్రత్యేకంగా దృష్టిని సారిస్తోందని రాష్ట్రపతి తెలిపారు. విద్య, ఎన్‌సీసీ విస్తరణ, క్రీడల ద్వారా యువతీయువకుల్లో దేశభక్తిని సైన్యం పెంపొందిస్తోందని శ్రీమతి ద్రౌపదీ ముర్ము చెప్పారు. నెరవేర్చాల్సిన విధులు, హోదా.. ఈ రెండిటి పరంగా చూసినప్పుడు యువ మహిళా అధికారులు అందిస్తున్న తోడ్పాటు పరిధి అంతకంతకూ విస్తరిస్తుండటం సమ్మిళిత భావనను ప్రోత్సహిస్తుందని రాష్ట్రపతి స్పష్టం చేశారు. అంతేకాక ఇది మరింత మంది యువతులు భారతీయ సైన్యంలో చేరాలన్న, ఇతర వృత్తుల వైపు కూడా దృష్టి సారించాలన్న స్ఫూర్తిని కూడా అందించ గలుగుతుందని శ్రీమతి ముర్ము అన్నారు.
చాణక్య రక్షణ చర్చ-2025 లో చోటు చేసుకొనే సంభాషణలూ, ఈ కార్యక్రమ ఫలితాలూ మన జాతీయ విధాన భావి రూపురేఖల్ని తీర్చిదిద్దడానికి విధాన రూపకర్తలకు ఎంతో విలువైన లోతైన అవగాహనను అందజేయగలవన్న విశ్వాసాన్ని రాష్ట్రపతి వ్యక్తం చేశారు. మన సాయుధ దళాలు శ్రేష్ఠత్వ సాధన కోసం ఇప్పటి కన్నా ఎక్కువగా కృషి చేస్తాయన్న, 2047 కల్లా వికసిత్ భారత్ గమ్యాన్ని చేరుకొనే దిశగా సంకల్పంతోనూ, దృఢదీక్షతోనూ ముందుకు కదులుతాయన్న నమ్మకం కూడా తనకు ఉందని శ్రీమతి ద్రౌపదీ ముర్ము అన్నారు.
రాష్ట్రపతి ప్రసంగాన్ని పూర్తిగా చదవడానికి కింద క్లిక్ చేయండి..
Please click here to see the President's Speech-
****
(Release ID: 2195637)
Visitor Counter : 3