యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో నవంబర్ 26 నుంచి సర్దార్@150 జాతీయ ఐక్యతా యాత్ర ప్రారంభం
హాజరు కానున్న గుజరాత్, త్రిపుర ముఖ్యమంత్రులు, ఇతర ప్రముఖ నాయకులు
వల్లభ్ విద్యానగర్ నుంచి ఐక్యతా మూర్తి విగ్రహం వరకు 11 రోజుల పాటు జరిగే ఐక్యతా యాత్రలో యువత భాగస్వామ్యానికి 'మై భారత్' వాలంటీర్ల నాయకత్వం
150 ప్రత్యేక ప్రదేశాల్లో విరామాలు, గ్రామసభలు, స్వచ్ఛతా కార్యక్రమాలు, స్వదేశీ ప్రచారం ద్వారా సమకాలీన సమాజ బాధ్యతతో సర్దార్ పటేల్ వారసత్వ అనుసంధానం
నాడు పోస్టు చేయడమైనది:
25 NOV 2025 5:44PM by PIB Hyderabad
నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవాన్ని పుర్కరించుకుని యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ (ఎంవైఏఎస్) ,మై భారత్ తో కలసి సర్దార్@150 జాతీయ ఐక్యతా యాత్రను ప్రారంభిస్తోంది. వల్లభ్ విద్యానగర్‌లోని శాస్త్రి మైదాన్ నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్ర గత కొన్ని వారాలుగా దేశవ్యాప్తంగా నెలకొన్న ఉత్తేజభరిత వాతావరణాన్ని కొనసాగిస్తూ, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతతో స్ఫూర్తి పొందిన విస్తృతమైన ఐక్యత ఆధారిత ఉద్యమానికి ముగింపుగా ఈ జాతీయ ఐక్యతా యాత్ర చేపడుతున్నారు.
గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్రభాయ్ పటేల్, త్రిపుర ముఖ్యమంత్రి డాక్టర్ మాణిక్ సాహా, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ శాఖ సహాయ మంత్రి శ్రీమతి నిముబెన్ బంభానియా, కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ సహాయ మంత్రి శ్రీమతి అనుప్రియ పటేల్, బీజేపీ గుజరాత్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ జగదీష్‌భాయ్ విశ్వకర్మ, గుజరాత్ రాష్ట్ర ఆహార,పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ రామన్ భాయ్ సోలంకి, గుజరాత్ రాష్ట్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి శ్రీ కమలేష్‌భాయ్ పటేల్, క్రీడలు, యువజన వ్యవహారాలు, సాంస్కృతిక కార్యకలాపాల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జయరామ్ భాయ్ గమిత్, గుజరాత్ విద్యాపీఠ్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డాక్టర్ హర్షద్‌భాయ్ పటేల్, సర్దార్ పటేల్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ నిరంజన్ పి. పటేల్, పారాలింపిక్ పతక విజేతలు సప్నా వ్యాస్, మాన్సీ జోషి, అహిరి శివోహం, మాజీ క్రికెటర్ శ్రీ రాకేష్ చౌహాన్ వంటి ప్రముఖులతో పాటు మై భారత్ వాలంటీర్లు, వేలాది మంది ఔత్సాహిక యువత ఈ యాత్ర ప్రారంభ వేడుకలో పాల్గొంటారు.
దీనికి ముందస్తుగా దేశవ్యాప్తంగా జరిగిన కార్యక్రమాలకు విశేష స్పందన లభించింది. నవంబర్ 24 నాటికి, 780 జిల్లాలలో 613 జిల్లాల వరకు ఈ ప్రచారం చేరింది.. 431 లోక్‌సభ నియోజకవర్గాల పరిధి లోని జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలలో 1,422 పాదయాత్రలను నిర్వహించారు. ఈ పాదయాత్రలు ఇప్పటివరకు 2 నుంచి 15 కిలోమీటర్ల పొడవున్న మార్గాల్లో,ప్రతి ప్రాంత సాంస్కృతిక, చారిత్రక ప్రాముఖ్యత ఆధారంగా ఎంపిక చేసిన మార్గాల్లో, మొత్తం 7,200 కిలోమీటర్లకు పైగా సాగాయి. ఇవి ఐక్యత, క్రమశిక్షణ, జాతీయ విశ్వాసాన్ని ప్రతిబింబించాయి. ఈ ఐక్యతా యాత్రలలో పెద్ద ఎత్తున యువత భాగస్వామ్యాన్ని సూచిస్తూ, 14.3 లక్షల మందికి పైగా పౌరులు పాల్గొన్నారు. దేశవ్యాప్త జాతీయ ఐక్యతా యాత్రకు ఇవి రంగం సిద్ధం చేశాయి.
నవంబర్ 26వ తేదీ ఉదయం 9:00 గంటలకు జాతీయ ఐక్యతా యాత్ర ప్రారంభ సూచనగా కరమ్సాద్‌లోని సర్దార్ పటేల్ పూర్వీకుల నివాసంలో పూలమాలలతో ప్రముఖులు నివాళులు అర్పిస్తారు. ఆ తర్వాత వల్లభ్ విద్యనగర్‌లోని శాస్త్రి మైదాన్‌లో సర్దార్ సభ జరుగుతుంది. ఇందులో నాయకులు, పండితులు, యువజన ప్రతినిధులు సర్దార్ పటేల్ నాయకత్వ శాశ్వత ప్రభావం గురించి మాట్లాడతారు. అనంతరం మధ్యాహ్నం 12:00 గంటలకు జెండా ఊపడంతో కెవాడియాలోని ఐక్యతా మూర్తి విగ్రహం వరకు దాదాపు 180 కిలోమీటర్లు ప్రయాణించే 11 రోజుల ఐక్యతా యాత్ర ప్రారంభమవుతుంది.
***
(రిలీజ్ ఐడి: 2194431)
సందర్శకుల సూచీ సంఖ్య : : 23