హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

గుజరాత్‌లోని భుజ్‌లో నిర్వహించిన సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) వజ్రోత్సవాల్లో ప్రసంగించిన కేంద్ర హోం, సహకార మంత్రి శ్రీ అమిత్ షా


బీఎస్ఎఫ్ రక్షణలో దేశంలోని అంగుళం భూమిని కూడా శత్రువులు చూడలేరు

నీరు, నేల, నింగి సరిహద్దుల్లో భారత్ భద్రతే బీఎస్ఎఫ్ ఏకైక లక్ష్యం

మన భద్రతా దళాల పరాక్రమం, అవిశ్రాంత కృషి కారణంగానే 2026, మార్చి 31 నాటికి నక్సలిజం నుంచి దేశానికి పూర్తిగా విముక్తి

2025లో ఇప్పటి వరకు 18,000 కిలోగ్రాములకు పైగా మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్న బీఎస్ఎఫ్... ఇది చరిత్రాత్మక విజయం

రాబోయే అయిదేళ్లలో ప్రపంచంలోనే అత్యంత ఆధునికమైన, సాంకేతికంగా అభివృద్ధి చెందిన సరిహద్దు భద్రతా దళంగా బీఎస్ఎఫ్

దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ రక్షణ కోసం చొరబాటుదారులను ఆపడం చాలా అవసరం

అందుకే ఎస్ఐఆర్ కార్యక్రమానికి పూర్తిగా సహకరించాలని పౌరులందరినీ కోరుతున్నా

తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఎస్ఐఆర్‌ని వ్యతిరేకిస్తున్న రాజకీయ పార్టీలకు నా స్పష్టమైన సందేశం: ఏది ఏమైనా చొరబాటుదారులను గుర్తించి... దేశం నుంచి బహిష్కరిస్తాం

దేశ పౌరులు ఎట్టి పరిస్థితుల్లోనూ చొరబాటుదారులను అంగీకరించరని బీహార్ ప్రజల తీర్పుతో స్పష్టమైంది

ఈ రోజు ఒక పోలీసు శౌర్య పతకం (మరణానంతరం), ఎనిమిది రాష్ట్రపతి పతకాలు, జనరల్ చౌదరి, మహారాణా ప్రతాప్, అశ్వినీ కుమార్ ట్రోఫీలను అందుకున్న సరిహద్దు భద్రతా దళ సిబ్బంది

సరిహద్దు భద్రతా దళం వజ్రోత్సవాల జ్ఞాపకార్థం ప్రత్యేక పోస్టల్ సాంపు విడుదల

प्रविष्टि तिथि: 21 NOV 2025 4:20PM by PIB Hyderabad

గుజరాత్‌లోని భుజ్‌లో ఈ రోజు నిర్వహించిన సరిహద్దు భద్రతా దళం వజ్రోత్సవాల్లో కేంద్ర హోం, సహకార మంత్రి శ్రీ అమిత్ షా ప్రసంగించారు. గుజరాత్ ఉప ముఖ్యమంత్రి శ్రీ హర్ష్ సంఘవి, బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ శ్రీ దల్జీత్ సింగ్ చౌదరి సహా అనేక మంది ప్రముఖులు ఈ వేడుకలకు హాజరయ్యారు. 

కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా మాట్లాడుతూ... బీఎస్ఎఫ్ రక్షణ ఉన్నంత వరకు శత్రువులు దేశంలోని అంగుళం భూమిని కూడా చూడలేరని భారత ప్రజలు మాత్రమే కాకుండా యావత్ ప్రపంచం భావిస్తోందన్నారు. ధైర్యం, అసాధారణ శౌర్యం, నైపుణ్యం, తమ ప్రాణాలను సైతం లెక్కచేయని తీరుతో 'మొదట స్పందించేవారిగా' తమ బాధ్యతను బీఎస్ఎఫ్ సైన్యం అద్భుతంగా నిర్వర్తిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. వీరిలో చాలామంది దేశం కోసం అత్యున్నత త్యాగాలూ చేశారన్నారు. దేశ హోంమంత్రిగా ఇది నా హృదయంలో అపారమైన గర్వాన్ని, గౌరవాన్ని నింపుతుందని శ్రీ షా తెలిపారు. ప్రధానమంత్రి, హోంమంత్రి మాత్రమే కాదు... యావత్ దేశం వారి ధైర్యసాహసాలకు సెల్యూట్ చేస్తోందనీ, వారి సామర్థ్యంపై అచంచల విశ్వాసం కలిగి ఉందని తెలిపారు. దేశాన్ని రక్షించడంలో వారి అచంచల సంకల్పం కారణంగానే దేశమంతా ప్రశాంతంగా నిద్రపోతుందని బీఎస్ఎఫ్ సిబ్బందినుద్దేశించి శ్రీ షా వ్యాఖ్యానించారు. ఇది బలగాలన్నింటి కోసం గర్వకారణం అని ఆయన పేర్కొన్నారు.

ఇప్పటివరకు సరిహద్దు భద్రతా దళానికి చెందిన 2013 మంది వీర సైనికులు దేశ సరిహద్దుల రక్షణ కోసం తమ ప్రాణాలను త్యాగం చేశారని కేంద్ర హోంమంత్రి అన్నారు. సరిహద్దు రక్షణలో మాత్రమే కాకుండా... ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక కార్యకలాపాల్లో, దేశంలోని లెక్కలేనన్ని అంతర్గత అత్యవసర పరిస్థితుల్లో, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో, నక్సలిజాన్ని నిర్మూలించాలనే జాతీయ లక్ష్యాన్ని సాధించడంలోనూ బీఎస్ఎఫ్ సిబ్బంది ఎప్పుడూ వెనక్కి తిరిగి చూడలేదని ఆయన కొనియాడారు. వారు ఎల్లప్పుడూ అన్నింటికంటే ఎక్కువగా తమ విధులకే ప్రాధాన్యమిస్తూ ముందడుగు వేశారన్నారు. ఈ కారణంగానే భారత తూర్పు, పశ్చిమ సరిహద్దులు ఇప్పుడు శత్రు దుర్భేద్యంగా, సుస్థిరంగా, పూర్తి సురక్షితంగా ఉన్నాయని శ్రీ షా పేర్కొన్నారు. ఈ ఘనత ధైర్యవంతులైన బీఎస్ఎఫ్ సైనికులకే దక్కుతుందని కేంద్ర హోంమంత్రి తెలిపారు.

పరాక్రమానికి మారుపేరుగా నిలిచే ఈ కచ్ భూమి అజేయ ధైర్యానికి ప్రతీక అని శ్రీ అమిత్ షా అన్నారు. శతాబ్దాలుగా ప్రతికూల వాతావరణం, పరిస్థితులు ఉన్నప్పటికీ కచ్ ప్రజలు ఈ ప్రాంతాన్ని ధైర్యసాహసాలతో, సమర్థతతో అభివృద్ధి శిఖరాలకు తీసుకెళ్లారని ఆయన వ్యాఖ్యానించారు. 1970ల నుంచి నేటి వరకూ ప్రతి దురాక్రమణను కచ్ ప్రజలు బలమైన ప్రతిఘటనతో ఎదిరించారనీ... యావత్ దేశం దీనికి సాక్ష్యంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. కచ్ ప్రజలు సైన్యం, బీఎస్ఎఫ్ సిబ్బందితో భుజం భుజం కలిపి నడుస్తూ అనేక యుద్ధాల విజయంలోనూ కీలక పాత్ర పోషించారని శ్రీ షా అన్నారు. యుద్ధ సమయంలో ఎయిర్‌స్ట్రిప్‌లను మరమ్మతు చేయడం, గంటల్లోనే వాటిని తిరిగి పనిచేసేలా చేయడం ద్వారా దేశాన్ని సురక్షితంగా ఉంచడంలో ఈ ప్రాంత ధైర్యవంతులైన మహిళలు కీలక పాత్ర పోషించారని ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. కచ్ భూమి ఈ శతాబ్దంలోనే అత్యంత వినాశకరమైన భూకంపాన్నీ తట్టుకుందని కేంద్ర హోంమంత్రి అన్నారు. కచ్ ప్రజల అవిశ్రాంత కృషి కారణంగానే ఈ ప్రాంతం భూకంపం నుంచి కోలుకోవడమే కాకుండా, మునుపటి కంటే 100 రెట్లు సౌందర్యం, అభివృద్ధినీ సాధించిందని ఆయన గర్వంగా ప్రకటించారు. ఇది కచ్ ప్రజల అజేయ స్ఫూర్తి, సామర్థ్యాలకు ఒక చక్కని ఉదాహరణగా నిలుస్తుందన్నారు.

1965 డిసెంబర్ 1న ఏర్పాటైనప్పటి నుంచీ సరిహద్దు భద్రతా దళం ప్రతి శిఖరాగ్రాన్ని విజయవంతంగా అధిరోహించిందని కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా అన్నారు. కేంద్ర సాయుధ పోలీసు దళాలన్నింటిలో దేశపు భూమి, నీరు, వాయు సరిహద్దుల రక్షణకు అంకితమైన ఏకైక శక్తిగా బీఎస్ఎఫ్ నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. మన వైమానిక సరిహద్దులు అయినా... చేరుకోవడానికి అత్యంత కష్టంగా ఉండే మన భూ సరిహద్దులు అయినా... అనేక అడ్డంకులతో కూడిన జల సరిహద్దులు అయినా... ఈ మూడు చోట్లా బీఎస్ఎఫ్ సిబ్బంది రక్షణ కవచంలా నిలిచారని కేంద్ర హోంమంత్రి వ్యాఖ్యానించారు. భారత సరిహద్దులను భద్రంగా ఉంచాలనే ఏకైక లక్ష్యంతో బీఎస్ఎఫ్ జవాన్లు విభిన్న సవాళ్లను, ప్రకృతి పెట్టే కఠినమైన పరీక్షలను ధైర్యంగా ఎదుర్కొంటూ విధులు నిర్వహిస్తున్న తీరు ప్రశంసనీయమని శ్రీ షా అన్నారు. నీరు, భూమి, ఆకాశ మార్గ సరిహద్దులను రక్షించాలనే ఏకైక లక్ష్యంతో బీఎస్ఎఫ్ ముందుకు సాగుతున్నదని తెలిపారు. 193 బెటాలియన్ల బలం, 2.76 లక్షలకు పైగా సిబ్బందితో ఈ రోజు బీఎస్ఎఫ్... పాకిస్తాన్‌తో కలిగి ఉన్న మొత్తం 2,279 కిలోమీటర్ల సరిహద్దును, బంగ్లాదేశ్‌తో కలిగి ఉన్న 4,096 కిలోమీటర్ల సరిహద్దును రక్షిస్తోందని, అప్రమత్తతో సరిహద్దులను పర్యవేక్షిస్తోందని ఆయన గర్వంగా ప్రకటించారు.

రాబోయే సంవత్సరం పూర్తిగా బీఎస్ఎఫ్ ఆధునికీకరణకు అంకితం చేశామన్న కేంద్ర  హోంమంత్రి... ఆ తర్వాతి సంవత్సరం పూర్తిగా మన ధైర్యవంతులైన జవాన్లు, వారి కుటుంబాల సంక్షేమానికి అంకితం చేస్తున్నట్లు తెలిపారు. ఈ కాలంలో బీఎస్ఎఫ్, హోం మంత్రిత్వ శాఖ అనేక పథకాలను ప్రారంభించడంతో పాటు... సిబ్బంది, వారి కుటుంబాల సంక్షేమం కోసం నిర్దిష్ట చర్యలు తీసుకోనున్నట్లు కేంద్ర హోం మంత్రి ప్రకటించారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో రాబోయే అయిదు సంవత్సరాల్లో ప్రపంచంలోనే అత్యంత ఆధునికమైన, అత్యంత సమర్థమైన సరిహద్దు భద్రతా దళంగా బీఎస్ఎఫ్‌ను మార్చాలని హోం మంత్రిత్వ శాఖ సంకల్పించిందని ఆయన అన్నారు. రాబోయే రోజుల్లో అనేక కొత్త కార్యక్రమాలు చేపడతామనీ, సరిహద్దుల్లో క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న జవాన్ల కుటుంబాల సంక్షేమం కోసం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుందని శ్రీ షా తెలిపారు.

పాకిస్తాన్ ప్రాయోజిత ఉగ్రవాద సంస్థ పహల్గామ్‌లో మన పర్యాటకులపై దాడి చేసి, వారిని దారుణంగా చంపారని శ్రీ అమిత్ షా అన్నారు. ఈ దాడి తర్వాత ప్రధానమంత్రి తగిన, కఠినమైన సమాధానం ఇస్తామని ప్రకటించారనీ... అందుకు 'ఆపరేషన్ సిందూర్' ద్వారా కొంత మేర మన ప్రతిస్పందనను శత్రువులకు గట్టిగా తెలియజేశామన్నారు. అయినా ఉగ్రవాదులపై దాడిని తనపై జరిగిన దాడిగా పాకిస్తాన్ ప్రచారం చేసిందని శ్రీ షా అన్నారు. పాకిస్తాన్ సైన్యం చర్యలకు మన బీఎస్ఎఫ్ జవాన్లు తగిన సమాధానం గట్టిగా ఇవ్వడంలో వెనకబడలేదన్నారు. బీఎస్ఎఫ్, సైన్యం ప్రదర్శించిన శౌర్యం, ధైర్యం కారణంగా కొద్ది రోజుల్లోనే పాకిస్తాన్ ఏకపక్ష కాల్పుల విరమణ ప్రకటించాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. దీని ద్వారా భారత సరిహద్దుల జోలికి ఎవరూ వెళ్లకూడదని, భారత భద్రతా దళాలను ఎవరూ సవాలు చేయకూడదని, అలా చేసిన వారు తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుందని ప్రపంచానికి స్పష్టమైన సందేశం వెళ్లిందని శ్రీ షా వ్యాఖ్యానించారు.

'ఆపరేషన్ సిందూర్' సమయంలో మన దళాలు జైష్-ఎ-మొహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్, లష్కరే-ఎ-తోయిబా సంస్థల ప్రధాన కార్యాలయాలు, శిక్షణా శిబిరాలు, లాంచ్ ప్యాడ్లు సహా తొమ్మిది కీలక ప్రదేశాలను పూర్తిగా ధ్వంసం చేశాయని కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా తెలిపారు. ఈ ఆపరేషన్ లక్ష్యం ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించడం, మన పౌరుల భద్రతను, సరిహద్దు ప్రాంతాల భద్రతను నిర్ధారించడమేనని ఆయన పేర్కొన్నారు. ఈ ఆపరేషన్ సమయంలో సబ్-ఇన్‌స్పెక్టర్ మహ్మద్ ఇంతియాజ్ అహ్మద్, కానిస్టేబుల్ దీపక్‌లు అసమాన ధైర్యాన్ని ప్రదర్శిస్తూ... దేశ భద్రత కోసం అత్యున్నత త్యాగం చేశారని తెలిపారు. ఈ ధైర్యవంతుల త్యాగాలకు కేంద్ర హోం మంత్రి హృదయపూర్వక నివాళులు అర్పించారు.

నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లోనూ బీఎస్ఎఫ్ అద్భుతమైన విజయాన్ని సాధించిందని కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా ప్రశంసించారు. మన భద్రతా దళాల శౌర్యం, అవిశ్రాంత కృషి కారణంగా 2026, మార్చి 31 నాటికి దేశం నక్సలిజం నుంచి పూర్తిగా విముక్తి పొందుతుందని ఆయన అన్నారు. దేశం నుంచి నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించడమే తమ దృఢ సంకల్పమని హోంమంత్రి పునరుద్ఘాటించారు. తద్వారా మన గిరిజన సోదరీ సోదరుల సర్వతోముఖాభివృద్ధికి మార్గం సుగమం చేస్తున్నామని శ్రీ షా పేర్కొన్నారు. సాయుధ నక్సలైట్లు ఒకప్పుడు 'తిరుపతి-నుంచి-పశుపతి' వరకు రెడ్ కారిడార్ గురించి కలలు కన్నారనీ, ఇప్పుడు ఆ కారిడార్ పూర్తి సురక్షితంగా మారి... ఆ ప్రాంతాల్లో అపూర్వమైన అభివృద్ధి కూడా జరుగుతోందని శ్రీ షా తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌లో 127 మంది మావోయిస్టులు లొంగిపోవడానికి బీఎస్ఎఫ్ దోహదపడిందనీ, 73 మంది మావోయిస్టులను అరెస్టు చేయడంతో పాటు, 22 మంది మావోయిస్టులను హతమార్చినట్లు కేంద్ర హోంమంత్రి పేర్కొన్నారు.

దేశంలోకి మాదకద్రవ్యాల చొరబాటుకు వ్యతిరేకంగా బీఎస్ఎఫ్ అనేక ఆపరేషన్లు ప్రారంభించి, అద్భుతమైన విజయాన్ని సాధించిందని కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా కొనియాడారు. 2025లో ఇప్పటివరకు బీఎస్ఎఫ్ 18,000 కిలోగ్రాములకు పైగా మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకుందని ఆయన తెలియజేశారు. ఇది ఒక చరిత్రాత్మక విజయమని ఆయన పేర్కొన్నారు. మన సరిహద్దుల వెంబడి చొరబాట్లను నిరోధించడంలో బీఎస్ఎఫ్ పూర్తిగా నిమగ్నమై ఉందని ఆయన అన్నారు. చొరబాట్లను నిరోధించడం దేశ భద్రతకు మాత్రమే కాకుండా... మన ప్రజాస్వామ్య వ్యవస్థ కలుషితం కాకుండా కాపాడటానికీ చాలా ముఖ్యమని శ్రీ షా పేర్కొన్నారు. దురదృష్టవశాత్తూ, కొన్ని రాజకీయ పార్టీలు 'ఘుస్పైథియా హటావో' ప్రచారాన్ని బలహీనపరిచేందుకు చురుగ్గా ప్రయత్నిస్తున్నాయని పేర్కొన్నారు. ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియ ద్వారా ఎన్నికల కమిషన్ నిర్వహిస్తున్న ఓటరు జాబితా సవరణ ప్రక్రియనూ ఈ రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయని శ్రీ షా అన్నారు. ఈ దేశం నుంచి ప్రతీ చొరబాటుదారుడిని ఒక్కొక్కరిగా గుర్తించి... తిప్పిపంపుతామని ఆయన దృఢ సంకల్పాన్ని ప్రకటించారు.

ఈ దేశంలో ఏ రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి కావాలో... దేశానికి ఎవరు ప్రధానమంత్రి కావాలో భారత పౌరులే నిర్ణయిస్తారని హోంమంత్రి అన్నారు. మన ప్రజాస్వామ్య వ్యవస్థను కలుషితం చేసే... మన ప్రజాస్వామ్య నిర్ణయాలను ప్రభావితం చేసే హక్కు ఏ చొరబాటుదారునికీ లేదన్నారు. మన ప్రజాస్వామ్యాన్ని చొరబాటుదారుల నుంచి రక్షించడం, ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంలో ఎస్ఐఆర్ కార్యక్రమం ఒక కీలక ముందడుగు అవుతుందని ఆయన అన్నారు. ఈ ప్రక్రియకు సంపూర్ణ మద్దతునివ్వాలని ఆయన దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దేశ పౌరులు ఎట్టిపరిస్థితుల్లోనూ చొరబాటుదారులను అంగీకరించరనే స్పష్టమైన సందేశాన్ని బీహార్ ప్రజలు తమ తీర్పు ద్వారా అందించారని శ్రీ షా పేర్కొన్నారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఎస్ఐఆర్‌ను వ్యతిరేకించే రాజకీయ పార్టీలకు... చొరబాటుదారులను కచ్చితంగా దేశం నుంచి తరిమికొడతామనే స్పష్టమైన సందేశం ఇస్తున్నానని శ్రీ షా తెలిపారు.

గత కొన్ని సంవత్సరాలుగా మేం సరిహద్దు కంచెను వేగంగా బలోపేతం చేస్తున్నాం... దానిని అభేద్యంగా మార్చాం... అని కేంద్ర హోం మంత్రి అన్నారు. కంచెకు సంబంధించిన చాలా ప్రయత్నాలు ఇప్పుడు పూర్తయ్యాయనీ... రాబోయే రోజుల్లో మేం 'ఇ-బోర్డర్ సెక్యూరిటీ' అనే కొత్త విప్లవాత్మక భావననూ తీసుకువస్తున్నామని శ్రీ షా పేర్కొన్నారు. ఈ భావనను క్షేత్రస్థాయిలో అమలు చేయడంలో బీఎస్ఎఫ్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. రాబోయే ఒక సంవత్సరంలోపు దీనిని క్షేత్రస్థాయిలో పూర్తిగా అమలు చేయడానికి సాధ్యమైన ప్రతి ప్రయత్నం చేస్తున్నామని కేంద్ర హోంమంత్రి తెలిపారు. రాబోయే అయిదు సంవత్సరాల్లో మన దేశ భూ సరిహద్దు మొత్తం ఇ-సెక్యూరిటీ కవచం కింద సురక్షితంగా ఉంటుందని శ్రీ షా విశ్వాసం వ్యక్తం చేశారు.

భారత సముద్ర సరిహద్దులను దుర్భేద్యంగా మార్చే దిశగా ఒక చరిత్రాత్మక అడుగులో భాగంగా... దేశంలోనే తొలిసారిగా కోస్టల్ పోలీసింగ్ కోసం జాతీయస్థాయి అకాడమీ (ఎన్‌ఏసీపీ)ని గుజరాత్‌లోని ఓఖాలో స్థాపించామని కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా అన్నారు. దీని నిర్వహణ బాధ్యత బీఎస్ఎఫ్ చూసుకుంటోందని ఆయన తెలిపారు. రాబోయే కాలంలో ఈ అకాడమీ మన మెరైన్ పోలీస్ బలగాలకు ప్రపంచ స్థాయి శిక్షణను అందిస్తుందనీ, దేశ తీరప్రాంత భద్రతా యంత్రాంగాన్ని మరింత బలోపేతం చేస్తుందని ఆయన అన్నారు. మన బీఎస్ఎఫ్ జవాన్ల సంక్షేమానికి సంబధించి మూడు ప్రధాన సవాళ్లు ఉన్నాయని శ్రీ అమిత్ షా తెలిపారు. మెరుగైన ఆరోగ్య సంరక్షణ సేవలు, గృహనిర్మాణ సంతృప్తి నిష్పత్తిలో మెరుగుదల, సుదీర్ఘ పని వేళలు ప్రధాన సవాళ్లుగా ఉన్నాయన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ మూడు రంగాల్లోనూ మేం అనేక ధృడమైన, విప్లవాత్మక చర్యలు తీసుకున్నామని శ్రీ షా వివరించారు.

గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు శ్రీ హరేకృష్ణ మహతాబ్, పరమ వీర చక్ర అవార్డు గ్రహీత సుబేదార్ జాదునాథ్ సింగ్, భారతరత్న డాక్టర్ సి.వి. రామన్‌ల జయంతి సందర్భంగా కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా తన ప్రసంగంలో వారికి వినయపూర్వక నివాళులర్పించారు. ఈ రోజు మన సరిహద్దు భద్రతా దళ సిబ్బంది ఒక పోలీసు శౌర్య పతకం (మరణానంతరం), ఎనిమిది రాష్ట్రపతి పతకాలు, జనరల్ చౌదరి ట్రోఫీ, మహారాణా ప్రతాప్ ట్రోఫీ, అశ్వినీ కుమార్ ట్రోఫీలను అందుకున్నారని ఆయన పేర్కొన్నారు. బీఎస్ఎఫ్ వజ్రోత్సవాల జ్ఞాపకార్థం ప్రత్యేక పోస్టల్ స్టాంపును విడుదల చేసినట్లు శ్రీ షా తెలియజేశారు. ఈ స్టాంపు రాబోయే శతాబ్దాల పాటు 60 సంవత్సరాల బీఎస్ఎఫ్ అద్భుత ప్రయాణాన్ని ఎప్పటికీ సజీవంగా ఉంచుతుందని శ్రీ అమిత్ షా వ్యాఖ్యానించారు.

 

***


(रिलीज़ आईडी: 2192929) आगंतुक पटल : 14
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Odia , English , Urdu , Marathi , हिन्दी , Gujarati , Tamil , Kannada