శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
సికిల్ సెల్ వ్యాధికి సంబంధించిన భారతదేశపు మొదటి స్వదేశీ "సీఆర్ఐఎస్‌పీఆర్" ఆధారిత జన్యు చికిత్సను ఆవిష్కరించిన కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్
దేశంలోని గిరిజనుల్లో ప్రబలంగా ఉన్న వ్యాధి... ‘బిర్సా 101’ పేరుతో చికిత్స
కొన్ని రోజుల కిందటే బిర్సా150వ జయంతిని నిర్వహించుకున్నాం...
భగవాన్ బిర్సా ముండాకు ఈ చికిత్స అంకితం
సికిల్ సెల్ రహిత దేశం వైపు భారత్ చేపట్టిన నిర్ణయాత్మక ప్రయాణాన్ని తెలియజేస్తున్న ఈ స్వదేశీ చికిత్స
అందుబాటు ధరల్లో జన్యు చికిత్సల కోసం సీఎస్ఐఆర్-ఐజీఐబీ, సీరం ఇనిస్టిట్యూట్ మధ్య కుదిరిన సాంకేతిక బదిలీ ఒప్పందం
అందరికీ అందుబాటు ధరలో జన్యు చికిత్సను అందించేందుకు కట్టుబడి ఉన్నట్లు
సీరం ఇనిస్టిట్యూట్ ప్రకటన.. బలోపేతం కానున్న ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం
ప్రపంచ స్థాయి, తక్కువ-ధర జన్యు సవరణ పరిష్కారాలతో ఆత్మనిర్భర్ దిశగా మరో ముందడుగు వేసిన భారత్
प्रविष्टि तिथि:
19 NOV 2025 5:36PM by PIB Hyderabad
సికిల్ సెల్ వ్యాధికి సంబంధించిన భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ ‘సీఆర్ఐఎస్‌పీఆర్’ ఆధారిత జన్యు చికిత్సను ఈ రోజు కేంద్ర శాస్త్ర-సాంకేతిక మంత్రిత్వశాఖ, భూవిజ్ఞాన శాఖ, ప్రధాని కార్యాలయ, సిబ్బంది-ప్రజా ఫిర్యాదులు-పింఛన్లు, అణుశక్తి-అంతరిక్ష శాఖల (స్వతంత్ర బాధ్యతగల) సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఆవిష్కరించారు. దేశంలోని గిరిజన జనాభాలో ప్రబలంగా కనిపించే ఈ వ్యాధికి ‘బిర్సా 101' పేరుతో చికిత్సను ఇవ్వనున్నారు. కొన్ని రోజుల క్రితం 150వ జయంతిని నిర్వహించుకున్న గొప్ప గిరిజన స్వాతంత్ర్య సమరయోధుడైన భగవాన్స్ బిర్సా ముండాకు ఈ చికిత్సను అంకితం చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన కేంద్ర మంత్రి.. సికిల్ సెల్ వ్యాధి రహిత దేశంగా మారేందుకు భారత్ నిర్ణయాత్మక ప్రయాణాన్ని అధికారికంగా ప్రారంభించిందని, ఇది ప్రజారోగ్యం- జన్యు ఔషధ రంగంలో ఒక చారిత్రక ఘట్టాన్ని తెలియజేస్తోందని అన్నారు.
భారతదేశపు మొదటి స్వదేశీ సీఆర్ఐఎస్‌పీఆర్-ఆధారిత జన్యు చికిత్సను అభివృద్ధి చేయటం, సంబంధిత విజ్ఞాన బదిలీతో 2047 నాటికి సికిల్ సెల్ రహిత దేశాన్ని సాధించాలనే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతను నెరవేర్చడానికి ఒక ముందడుగు పడిందని కేంద్ర మంత్రి అన్నారు. ఇది అగ్రశ్రేణి వైద్య సాంకేతికతలలో ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్తోందని ఆయన పేర్కొన్నారు.
సీఎస్ఐఆర్– జెనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ సంస్థలో (ఐజీఐబీ) ఈ చికిత్సను అభివృద్ధి చేసినట్లు కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. దీని అభివృద్ధి చేయడానికి ప్రపంచ దేశాలు ఖర్చు చేస్తున్న దానికంటే మనకు తక్కువ అయిందని వెల్లడించారు. ఇది అధునాతన చికిత్సలను ఉత్పత్తి చేయగల భారత్ సామర్థ్యాన్ని ప్రదర్శించిందని డాక్టర్ జితేంద్ర సింగ్ ఉద్ఘాటించారు. విదేశాల్లో చికిత్సకు రూ. 20–25 కోట్లు ఖర్చవుతోందని, ఇకపై అంత ఖర్చు చేయాల్సిన అవసరంలేదన్నారు. ఈ ఆవిష్కరణకు జాతీయ ప్రాముఖ్యత ఉందనీ, ఈ వ్యాధి భారం అత్యధికంగా ఉన్న మధ్య, తూర్పు భారత్‌లోని గిరిజన వర్గాలకు ఇది ఎంతో ముఖ్యమని చెప్పారు.
ఈ కార్యక్రమానికి భారతదేశ శాస్త్రీయ వ్యవస్థకు చెందిన సీనియర్ నాయకత్వం హాజరైంది. వీరిలో సీఎస్ఐఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎన్. కలైసెల్వి, సీఎస్ఐఆర్-ఐజీఐబీ డైరెక్టర్ డాక్టర్ సౌవిక్ మైతి, సీరం ఇనిస్టిట్యూట్ కార్యనిర్వహక డైరెక్టర్ డాక్టర్ ఉమేష్ శాలిగ్రామ్, ఐజీఐబీకి చెందిన అధ్యాపకులు- పరిశోధకులు, శాస్త్రవేత్తలు, పర్యాటక మంత్రిత్వ శాఖకు చెందిన అతిథులు, మీడియా ప్రతినిధులు ఉన్నారు.
భగవాన్ బిర్సా ముండా గారి గౌరవార్ధం నామకరణం చేసిన స్వదేశీ సీఆర్ఐఎస్‌పీఆర్ వేదిక అయిన 'బిర్సా 101' అనేది అత్యాధునిక చికిత్సల విషయంలో భారత్‌ను ప్రపంచ నాయకత్వ స్థానంలో నిలబెట్టే కీలక శాస్త్రీయ వేదిక అని అన్నారు. జన్యు సవరణ విధానాన్ని సరళమైన పదాలలో వివరించిన ఆయన.. ఈ సాంకేతికత ‘ఖచ్చితమైన జన్యు శస్త్ర చికిత్స’లాగా పనిచేస్తుందని పేర్కొన్నారు. ఈ సాంకేతికత సికిల్ సెల్ వ్యాధిని నయం చేయడమే కాకుండా అనేక వంశపారంపర్య రుగ్మతలకు ఉన్న చికిత్స మార్గాలను కూడా మార్చగలదని అన్నారు.
ఈ చికిత్స ప్రాముఖ్యతను అందరు అర్థం చేసుకునేందుకు ఈ ఆవిష్కరణలను ఇన్ఫోగ్రాఫిక్స్, సామాజిక మాధ్యమాల ద్వారా సరళమైన భాషలో శాస్త్రీయ సంస్థలు ప్రజలకు తెలియజేయాలని ఆయన కోరారు.
ప్రభుత్వ శాస్త్ర విజ్ఞాన సంస్థలు, భారతీయ పరిశ్రమల మధ్య పెరుగుతున్న సమన్వయాన్ని.. ముఖ్యంగా ఇండియన్ సీరం ఇనిస్టిట్యూట్ ను డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రశంసించారు. ఇటువంటి భాగస్వామ్యాలు ఇప్పటికే కోవిడ్-19, హెచ్పీవీ, ఇతర కీలక వ్యాక్సిన్లతో సహా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఘనతలను సాధించాయన్న ఆయన.. జన్యు చికిత్సలో భారతదేశ నాయకత్వాన్ని వేగవంతం చేస్తాయని పేర్కొన్నారు.
జీవసాంకేతికత విస్తరణ భారాన్ని ప్రభుత్వం ఒక్కటే మోయలేదన్న కేంద్ర మంత్రి.. స్థాయి, అందుబాటులో ధరలు, ప్రపంచ పోటీతత్వం కోసం పరిశ్రమల భాగస్వామ్యం అత్యవసరమని చెప్పారు.
సీఎస్ఐఆర్-ఐజీఐబీలో ఒక కొత్త అత్యాధునిక పరిశోధన, పరిశోధనలను క్షేత్ర స్థాయిలు అమలు చేసే విధంగా మార్చే సౌకర్యాన్ని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలతో ఆయన మాట్లాడారు. జన్యు వైద్య కార్యక్రమాల విషయంలో జరుగుతున్న పనిని ఆయన సమీక్షించారు. 'ఒక వారం - ఒక ఇతివృత్తం' (వన్ వీక్- వన్ థీమ్) వంటి సమగ్ర జాతీయ నమూనాల ఆవశ్యకతను ప్రధానంగా పేర్కొన్న ఆయన.. ఇది సీఎస్ఐఆర్, డీబీటీ, భాగస్వామ్య సంస్థల మధ్య సహకార పరిశోధనను మరింత మెరుగుపరుస్తుందన్నారు.
అధికారిక సాంకేతిక బదిలీకి సంబంధించిన ఒప్పందాన్ని సీఎస్ఐఆర్-ఐజీఐబీ, సీరం ఇనిస్టిట్యూట్ (ఎస్ఐఐపీఎల్) మార్చుకున్నాయి. ఐజీఐబీ అభివృద్ధి చేసిన ఎన్-ఎఫ్ఎన్-క్యాస్9 సీఆర్ఐఎస్‌పీఆర్ వేదికను సికిల్ సెల్ వ్యాధి, ఇతర క్లిష్టమైన జన్యురుగ్మతల విషయంలో అందుబాటు ధరల్లో విస్తృత స్థాయి చికిత్సలుగా మార్చేందుకు ఈ ఒప్పందం వీలు కల్పిస్తుంది. గత దశాబ్దంలో అనేక టీకాలు, చికిత్సల అభివృద్ధి విషయంలో దేశంలో విజయవంతమైన ప్రభుత్వ-ప్రైవేటు నమూనాను ఈ భాగస్వామ్యం ప్రతిబింబిస్తుందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ప్రయోగశాలల్లో సాధించిన పురోగతి పరిశోధన పత్రాలకే పరిమితం కాకుండా వాస్తవ ప్రపంచంలో వైద్యారోగ్య వ్యవస్థకు ఉపయోగపడేలా ఈ భాగస్వామ్యం భరోసా ఇస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.
ప్రపంచంలోనే అగ్రగామి టీకా ఉత్పత్తిదారు అయిన సీరం సంస్థకు 'బిర్సా 101', సీఆర్ఐఎస్‌పీఆర్ వేదికలను అందించటం ద్వారా అందుబాటు ధరలు, విస్తరణ, ప్రపంచ-స్థాయి తయారీకి హామీ లభిస్తుందని కేంద్ర మంత్రి అన్నారు. ఇది అధునాతన జన్యు-సవరణ చికిత్సలు భారతీయ రోగులకు, ముఖ్యంగా సేవలు సరిగా అందని గిరిజనులకు అందుబాటులోకి వచ్చేలా చూస్తుందని తెలిపారు.
టీకాలు, యాంటీ బయాటిక్స్‌లతో పాటు ఇప్పుడు జన్యు చికిత్సల వేగవంతమైన అభివృద్ధిని చూశామన్న డాక్టర్ జితేంద్ర సింగ్.. ఈ పురోగతులన్నీ భారత్‌కు ఉన్న శాస్త్ర విజ్ఞాన సామర్థ్యాలను తెలియజేస్తున్నాయని అన్నారు. వేగంగా ఫలితాలను సాధించేందుకు, భారతదేశ శాస్త్ర విజ్ఞాన పురోగతి ఎల్లప్పుడూ కనిపించేలా చూసుకునేందుకు శాస్త్ర విజ్ఞాన సంస్థలు, ప్రైవేటు భాగస్వాములు, విధాన నిర్ణయ సంస్థలు.. ఏకీకృత ‘ఒక వారం- ఒక ఇతివృత్తం’ విధానంలో కలిసి పనిచేయాలని ఆయన కోరారు.
దిగుమతి అయ్యే జీవ సాంకేతికతలపై ఆధారపడటం నుంచి ఔషధాల అభివృద్ధి, టీకాలు ప్రస్తుత సీఆర్ఐఎస్‌పీఆర్ చికిత్సల విషయంలో ప్రపంచ నాయకుడిగా ఎదగడం వరకు భారత్ చేసిన ప్రయాణం గౌరవ ప్రధానమంత్రి దార్శనిక నాయకత్వం, ప్రపంచ వేదికపై భారతీయ శాస్త్ర విజ్ఞానానికి పెరుగుతున్న విశ్వాసానికి నిదర్శనమని మంత్రి అన్నారు.
"మనం ఇకపై కేవలం ప్రపంచ సాంకేతికతలను ఉపయోగించటమే చేయటం లేదు.. వాటిని తయారు చేస్తున్నాం. అందుబాటు ధరల్లో అత్యాధునిక ఆరోగ్య సంరక్షణతో ఉండే భవిష్యత్తు కోసం ప్రపంచం ఇప్పుడు భారత్ వైపు చూస్తుంది" అని అన్నారు.
సీరం ఇనిస్టిట్యూట్ కార్యనిర్వాహక డైరెక్టర్ డాక్టర్ ఉమేష్ శాలిగ్రామ్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఐజీఐబీ ఆవిష్కరణ వాస్తవ పరిస్థితుల్లో ప్రభావం చూపించేలా మార్చేందుకు తమ సంస్థ పూర్తి నిబద్ధతతో ఉన్నట్లు తెలిపారు.
"ప్రపంచవ్యాప్తంగా జన్యు చికిత్సల ధర మూడు మిలియన్ డాలర్ల కంటే ఎక్కువగా ఉంది. ఇది ధనవంతులకు కూడా అందుబాటులో లేదు. భారతీయ ఆవిష్కరణల ద్వారా అత్యంత పేదవారికి కూడా అందుబాటులోకి తీసుకురావలన్నది మా లక్ష్యం. సీరం ఇనిస్టిట్యూట్ అందుబాటు ధరల్లో టీకాల ద్వారా 30 మిలియన్లకు పైగా ప్రాణాలను రక్షించింది. మేం 2047 నాటికి సికిల్ సెల్ రహిత భారత్ అనే ప్రధానమంత్రి దార్శనికతకు పూర్తిగా కట్టుబడి ఉన్నాం. మంత్రి గారి నుంచి లభించిన ఈ శక్తి, ప్రోత్సాహంతో మేం ఈ సాంకేతికతను ప్రాణాలను రక్షించేలా మార్చేందుకు వీలైన అన్ని ప్రయత్నాలను చేస్తాం" అని డాక్టర్ ఉమేష్ శాలిగ్రామ్ వ్యాఖ్యానించారు.
ఎవరికైతే అత్యవసరమో వారికి ఈ ఆధునిక చికిత్సలు చేరేలా చూసుకునేందుకు ఐజీఐబీ, సీఎస్ఐతో సీరం ఇనిస్టిట్యూట్ సన్నిహితంగా పని చేస్తుందని కూడా ఆయన తెలిపారు.




***
(रिलीज़ आईडी: 2191964)
आगंतुक पटल : 28