మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ
ప్రపంచ మత్స్య దినోత్సవాన్ని ఈ నెల 21న న్యూఢిల్లీలో నిర్వహించనున్న మత్స్య విభాగం
భారత్ నీలి ఆర్థిక వ్యవస్థలో మార్పులను చాటిచెప్పే కార్యక్రమం.. మత్స్య పరిశ్రమ దీర్ఘకాలం మనుగడ సాగించేలా చూడడానికీ,
విలువ ఆధారిత సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతికి కొత్త కార్యక్రమాల ప్రకటన
Posted On:
19 NOV 2025 3:28PM by PIB Hyderabad
ప్రపంచ మత్స్య దినోత్సవాన్ని మత్స్య, పశు సంవర్ధక, పాడి పరిశ్రమ శాఖలో భాగమైన మత్స్య పరిశ్రమ విభాగం ఈ నెల 21న న్యూఢిల్లీలోని సుష్మా స్వరాజ్ భవన్లో నిర్వహించనుంది. ‘‘భారత్లో నీలి పరివర్తన: సముద్ర ఆహారోత్పత్తుల విలువ పెంచే ప్రక్రియను బలోపేతం చేయడం’’ ఈ సంవత్సర ఇతివృత్తంగా ఉంది. ఈ ఇతివృత్తం సముద్ర, మంచినీటి జలాల్లోని ఆక్వాటిక్ ఉత్పత్తుల్ని ప్రపంచ దేశాలతో పోటీ పడే స్థాయికి అభివృద్ధి చేయాలన్న భారత్ సంకల్పాన్ని ప్రతిబింబిస్తుంది. ప్రారంభ సదస్సులో మత్స్య, పశు సంవర్ధక, పాడి పరిశ్రమ శాఖ (ఎంఓఎఫ్ఏహెచ్ అండ్ డీ), పంచాయతీ రాజ్ శాఖ కేంద్ర మంత్రి శ్రీ రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లలన్ సింగ్ దృశ్య మాధ్యమం ద్వారా పాలుపంచుకుంటారు. న్యూఢిల్లీ నుంచి ఎంఓఎఫ్ఏహెచ్ అండ్ డీ, పంచాయతీ రాజ్ శాఖ సహాయ మంత్రి ప్రొఫెసర్ ఎస్.పి. సింగ్ బఘెల్, ఎంఓఎఫ్ఏహెచ్ అండ్ డీ, మైనారిటీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీ జార్జి కురియన్ కూడా పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి మన దేశంతో పాటు, 27 దేశాల ప్రతినిధులు హాజరవుతారు. విదేశాల భాగస్వామ్యం... నీలి ఆర్థిక వ్యవస్థలో భారత్ ప్రపంచ స్థాయి భాగస్వామ్యాలు అంతకంతకూ విస్తరిస్తుండటాన్ని సూచిస్తోంది.

మత్స్య పరిశ్రమతో పాటు చేపలు, రొయ్యల పెంపకంలో ట్రేసెబిలిటీ అంశంపై జాతీయ ప్రణాళికా పత్రాన్ని ఈ కార్యక్రమంలో విడుదల చేస్తారు. మత్స్య పరిశ్రమ, చేపలు, రొయ్యల పెంపకంలో ఒక కేంద్రీకృత డిజిటల్ ట్రేసెబిలిటీ వ్యవస్థను ఏర్పాటుచేయాలనేదే ఈ ప్రణాళికా పత్రం లక్ష్యం. దేశీయ, అంతర్జాతీయ నియమావళిని తప్పక అనుసరించేటట్లు చూస్తూ, ఆహార భద్రతను ప్రోత్సహించడం, దీర్ఘకాలిక అవసరాలను దృష్టిలో పెట్టుకోవడం, మార్కెట్ల లభ్యతను మెరుగుపరచడం అనేవి కూడా జాతీయ ప్రణాళిక పత్రం లక్ష్యాలే. దీనికి అదనంగా, మత్స్య పరిశ్రమతో పాటు చేపలు, రొయ్యల పెంపకంలో దీర్ఘకాలిక ప్రాతిపదికతో ఉండే అనేక ప్రధాన కార్యక్రమాల్ని ప్రారంభిస్తారు.ఈ కార్యక్రమాల్లో... జలచరాల విషయంలో ఎస్ఓపీలు, స్మార్ట్, ఏకీకృత హార్బర్లకూ, చేపల ల్యాండింగ్ కేంద్రాలకూ, రిజర్వాయర్ ఫిషరీస్ మేనేజ్‌మెంటుతో పాటు తీర ప్రాంతాల్లో చేపలు, రొయ్యల పెంపకానికీ మార్గదర్శకాల్ని సూచిస్తారు. భారత్‌లో చేపలు, రొయ్యల పెంపక రంగం అంతటా బాధ్యతాయుత అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొన్న ఒక సమగ్ర నమూనా చిత్రాన్ని ఈ కార్యక్రమాలు కళ్లెదుట నిలపనున్నాయి.
ఈ కార్యక్రమంలో భాగంగా రెండు సాంకేతిక సదస్సుల్ని కూడా నిర్వహిస్తారు. విధాన రూపకర్తలు, సముద్ర ఆహారోత్పత్తుల ఎగుమతిదారులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, అంకుర సంస్థలు, ఇతర ఆసక్తిదారులు ఈ సాంకేతిక సదస్సుల్లో పాల్గొంటారు. ‘‘మత్స్య పరిశ్రమ, చేపలు, రొయ్యల పెంపకం రంగాల్లో విలువ జోడింపును అమలుచేస్తూ అభివృద్ధిని ప్రోత్సహించడం’’పై ఒకటో సాంకేతిక సదస్సును నిర్వహిస్తారు. విలువను జోడించిన సముద్ర ఆహారోత్పత్తుల్లో వివిధీకరణ, నవకల్పన, బ్రాండింగ్, ప్యాకేజింగ్, ప్రమాణాలనూ, ధ్రువీకరణనూ మెరుగుపరుస్తూ, మౌలిక సదుపాయాలను పటిష్ఠపరచడంపై ఈ సాంకేతిక సదస్సులో చర్చిస్తారు. ‘‘పరిశుభ్ర జలాల్లో చేపల పెంపకంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ భారత్లోని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఎగుమతి సామర్థ్యాన్ని సమర్థంగా వినియోగించుకోవడం’’ అంశంపై రెండో సాంకేతిక సదస్సును నిర్వహిస్తారు. ఈ సదస్సులో నిపుణులు, వక్తలు తమ ఆలోచనలు తెలియజేస్తారు.
(Release ID: 2191865)
Visitor Counter : 7