పట్టణాభివృద్ధి మంత్రుల రెండో ప్రాంతీయ సమావేశం కేంద్ర గృహనిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రి శ్రీ మనోహర్ లాల్ అధ్యక్షతన ఈ రోజు హైదరాబాద్‌లో జరిగింది.
2025, జూలై 17న న్యూఢిల్లీలో జరిగిన పట్టణాభివృద్ధి మంత్రుల జాతీయ స్థాయి సమావేశం ఈ ప్రాంతీయ స్థాయి సంప్రదింపులకు పునాది వేసింది. అక్టోబర్ 30న బెంగళూరులో జరిగిన మొదటి ప్రాంతీయ సమావేశం తరహాలో సమష్టిగా ముందుకు సాగాలని నిర్ణయించిన ఈ సమావేశంలో... పట్టణాభివృద్ధిలో కీలకమైన సమస్యలు, సవాళ్లు, అవకాశాలు కేంద్రంగా చర్చలు జరిగాయి.

తెలంగాణ ముఖ్యమంత్రి, మున్సిపల్ పరిపాలన-పట్టణాభివృద్ధి శాఖల మంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి, తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్-కమ్యూనికేషన్లు, పరిశ్రమలు-వాణిజ్యం, శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీ డి. శ్రీధర్ బాబు, గుజరాత్ మంత్రి శ్రీ కనుభాయ్ దేశాయ్, ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి శ్రీ డాక్టర్ పొంగూరు నారాయణ, సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాల సీనియర్ అధికారులు, పట్టణ వ్యవహారాలు, గృహనిర్మాణ మంత్రిత్వ శాఖ కార్యదర్శి, ఇతర సీనియర్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
తెలంగాణ ప్రభుత్వ పట్టణాభివృద్ధి శాఖ సహకారంతో ఈ ప్రారంభ ప్రాంతీయ సమావేశాన్ని భారత ప్రభుత్వ గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహించింది. ఈ సమావేశంలో నైరుతి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలైన ఆంధ్రప్రదేశ్, దాద్రా-నగర్ హవేలి, డామన్-డయ్యూ, గోవా, గుజరాత్, మహారాష్ట్ర, తెలంగాణలకు చెందిన ప్రధాన కార్యదర్శులు, అదనపు ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు సహా పట్టణాభివృద్ధి మంత్రులు, సీనియర్ స్థాయి అధికారులు సమావేశమయ్యారు.
ప్రారంభ ప్రసంగంలో గౌరవనీయ కేంద్ర మంత్రి మాట్లాడుతూ... "నగరాలు వికసిత్ భారత్‌కు దర్పణాలు" అని వ్యాఖ్యానించారు. ఏకకాలంలో నిర్వహించిన రెండు సమావేశాల్లో చర్చలు జరిగాయి. మొదటి సమావేశం హైదరాబాద్ పట్టణ ప్రాధాన్యాలను ప్రదర్శించే తెలంగాణ రైజింగ్ 2047 దార్శనికతపై దృష్టి సారించింది. రెండో సమావేశం భాగస్వామ్య రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలు, చేపట్టిన చర్యల పురోగతిని సమీక్షించింది. గౌరవనీయ కేంద్ర మంత్రి వివిధ కేంద్ర మిషన్ల పురోగతినీ సమీక్షించారు.
స్వచ్ఛ భారత్ మిషన్-అర్బన్ కింద డంప్‌సైట్ రెమిడియేషన్ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్, లెగసీ వేస్ట్ డంప్‌సైట్‌ల స్థితిని గౌరవనీయ కేంద్ర మంత్రి సమీక్షించారు. డంప్‌సైట్‌ల సమస్యలను 100 శాతం పరిష్కారించాలని మంత్రులు, సీనియర్ అధికారులను ప్రోత్సహించారు. డంప్‌సైట్ రెమిడియేషన్ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్ కింద మొత్తం 214 సైట్‌లకు ఇంటెన్సివ్, రెగ్యులర్ పర్యవేక్షణ అవసరమని గుర్తించారు.
అటల్ మిషన్ ఫర్ రిజువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్‌ఫర్మేషన్ (అమృత్) పథకం కింద సంపూర్ణ నీటి సరఫరా స్థితి, నీటి శుద్ధి ప్రక్రియలో వృధా అయ్యే నీటి పునర్వినియోగ ప్రణాళికలు, వర్షపు నీటి సేకరణ, నీటి భద్రత కోసం నీటి నిల్వల పునరుజ్జీవనం గురించి చర్చించారు.
అమృత్ 2.0 కింద గుజరాత్, తెలంగాణ, గోవా రాష్ట్ర ప్రభుత్వాలు రాబోయే మూడు సంవత్సరాల్లో తమ నగరాల్లో 100 శాతం నీటి సరఫరా కవరేజీని సాధిస్తాయనీ... మహారాష్ట్ర, డామన్ నగరాలు 90 శాతం కంటే ఎక్కువ నీటి సరఫరా కవరేజీని చేరుకుంటాయని పేర్కొన్నారు.
నీటిని శుద్ధి చేసే సమయంలోని వృధా నీటిని తిరిగి ఉపయోగించుకునే లక్ష్యాలను చర్చించారు. అమృత్ 2.0 కింద మహారాష్ట్ర 3,000 ఎమ్ఎల్‌డీలను రీసైకిల్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. గుజరాత్ 2030 నాటికి నీటి శుద్ధి ప్రక్రియలో వృధా అయ్యే నీటిలో కనీసం 40 శాతం రీసైకిల్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ప్రధానమంత్రి ఆవాస్ యోజన - అర్బన్ పథకం కింద వివిధ విభాగాల ఆధ్వర్యంలో గృహ నిర్మాణ పురోగతితో పాటు, ఖాళీగా ఉన్న ఇళ్ల సమస్య, ఎస్ఎన్ఏ స్పర్శ్ ఖాతాలను తెరవడం గురించి చర్చించారు. డిమాండ్ల ఆధారంగా గృహ లక్ష్యాలు, జేఎన్ఎన్‌యూఆర్ఎమ్ గృహాలను అంచనా వేయడానికి కమిటీని ఏర్పాటు చేశారు. చివరగా మెట్రో ప్రాజెక్టులు, ఫుట్‌పాత్‌లు, పీఎమ్-ఇబస్ సేవా పథకానికి సంబంధించి పట్టణ రవాణా సమస్యలపై చర్చించారు. ఇటువంటి ప్రత్యక్ష చర్చల ద్వారా ప్రాంతీయ వాటాదారులతో చర్చించడంలో మంత్రిత్వ శాఖ అనుసరిస్తున్న క్రియాశీల విధానాన్ని రాష్ట్ర మంత్రులు ప్రశంసించారు. కీలకమైన అంశాలపై ఫాలో-అప్ నిర్వహించడానికి, కొనసాగుతున్న వివిధ మిషన్ల పురోగతిని పర్యవేక్షించడానికి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో క్షేత్రస్థాయి సందర్శనలు, ఒక్కొక్కరితో వీడియో సమావేశాలనూ ఎంవోహెచ్‌యూఏ ప్రారంభించింది.
భారత పట్టణ పరివర్తన ప్రయాణాన్ని వేగవంతం చేయగల విధానాల సహ అభ్యసనం కోసం సమష్టి ప్రాధాన్యాలు, ప్రాంతీయ అవకాశాలు, సంస్కరణ మార్గాలను గుర్తించడానికి ఈ ప్రాంతీయ సమావేశాలు దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ రెగ్యులర్‌గా నిర్వహించనున్నారు.
***