|
గనుల మంత్రిత్వ శాఖ
జైపూర్‌లో ‘జీఎస్‌ఐ’ అంతర్జాతీయ సదస్సును ప్రారంభించనున్న కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి
Posted On:
18 NOV 2025 12:30PM by PIB Hyderabad
కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ పరిధిలోని భారత భూవిజ్ఞాన అధ్యయన సంస్థ (జీఎస్‌ఐ) ఈ నెల 20, 21 తేదీల్లో జైపూర్‌లోని రాజస్థాన్ ఇంటర్నేషనల్ సెంటర్ (ఆర్‌ఐసీ)లో ‘గతాన్ని తవ్వితీద్దాం... భవిష్యత్తుకు బాటలు వేద్దాం’: 175 ఏళ్ల జీఎస్‌ఐ” ఇతివృత్తంగా అంతర్జాతీయ సదస్సును నిర్వహిస్తోంది.
‘జీఎస్‌ఐ’ దేశానికి 175 ఏళ్లుగా చేస్తున్న సేవలను గుర్తు చేసుకుంటూ ఏడాది పాటు నిర్వహించే ఈ కార్యక్రమాన్ని కేంద్ర బొగ్గు-గనుల శాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి ప్రారంభిస్తారు. గనుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ పీయూష్ గోయల్, రాజస్థాన్ రాష్ట్ర గనులు-పెట్రోలియం శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ టి.రవికాంత్ కూడా ఇందులో పాల్గొంటారు.
ఈ సదస్సుకు ‘జీఎస్‌ఐ’ డైరెక్టర్ జనరల్, సంపోషకులు శ్రీ అసిత్ సాహా నిర్వహిస్తారు. పశ్చిమ ప్రాంత అదనపు డైరెక్టర్ జనరల్, విభాగాధిపతి, సదస్సు చైర్మన్ శ్రీ విజయ్ వి.ముగల్, ఇతర సీనియర్ అధికారులు, ప్రసిద్ధ భూవిజ్ఞాన శాస్త్రవేత్తలతోపాటు భారత్ సహా విదేశీ ప్రతినిధులు హాజరవుతారు.
‘జీఎస్‌ఐ’ 1851లో ఏర్పాటు కాగా- భౌగోళిక మ్యాపింగ్, ఖనిజాన్వేషణ, కీలక-వ్యూహాత్మక ఖనిజాల గుర్తింపు, భౌగోళిక ప్రమాద అధ్యయనాలు, దేశాభివృద్ధి దిశగా భౌగోళిక శాస్త్రీయ పరిశోధనలను కొనసాగించడంలో కీలక పాత్ర పోషించింది. ఈ నేపథ్యంలో నిర్వహిస్తున్న ప్రస్తుత అంతర్జాతీయ సదస్సులో భారత్ సహా వివిధ దేశాల నుంచి నిపుణులందరూ ఒక వేదికపైకి వస్తారు. ప్రపంచవ్యాప్తంగా తలెత్తే సవాళ్లు, సాంకేతిక పురోగమనం, భౌగోళిక శాస్త్రాల భవిష్యత్ ప్రగతి తదితర అంశాలపై వారు చర్చిస్తారు.
రెండు రోజులపాటు సాగే ఈ సదస్సులో 9 ప్రధానోపన్యాసాలు, 19 ప్రత్యేక ఉపన్యాసాలు సహా 11 నేపథ్య రంగాల్లో 300కు పైగా శాస్త్రీయ-పోస్టర్ ప్రదర్శనలు అంతర్భాగంగా ఉంటాయి. బ్రిటిష్ జియోలాజికల్ సర్వే (బీజీఎస్), యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (యూఎస్‌జీఎస్), జియోసైన్స్ ఆస్ట్రేలియా, లాంకాస్టర్ విశ్వవిద్యాలయం (యూకే), మిషిగన్ విశ్వవిద్యాలయం (అమెరికా), టెక్సాస్ విశ్వవిద్యాలయం (అమెరికా), ఇటాలియన్ నేషనల్ రీసెర్చ్ కౌన్సిల్ వంటి ప్రసిద్ధ సంస్థల నుంచి పలువురు ప్రముఖ శాస్త్రవేత్తలు ఈ సదస్సులో పాల్గొంటారు.
సదస్సులో భాగంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలు, జియోస్పేషియల్ ఉపకరణాలు, ప్రముఖ సంస్థల-పరిశ్రమల వినూత్న ఆవిష్కరణలతో ప్రదర్శన కూడా నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఐఐటీ-బాంబే, ఐఐటీ-ఖరగ్‌పూర్‌లతో అవగాహన ఒప్పందాలు సహా సరిహద్దు భూవిజ్ఞాన పరిశోధన, సామర్థ్య వికాసంలో సహకార విస్తృతి కూడా ప్రధానాంశాలుగా ఉంటాయి.
‘జీఎస్‌ఐ’ వారసత్వంలో ఈ అంతర్జాతీయ సదస్సు ఓ కీలక ఘట్టం. అంకిత భావంతో దేశానికి సేవలందిస్తున్న ఈ సంస్థ 175వ ఏట అడుగు పెడుతున్న నేపథ్యంలో దాని శాస్త్రీయ విశిష్ఠత, సుస్థిర వనరుల అభివృద్ధి, అంతర్జాతీయ జ్ఞాన ఆదానప్రదానం తదితరాలపై నిబద్ధత ప్రస్ఫుటమవుతుంది.
***
(Release ID: 2191222)
|