|
ఉప రాష్ట్రపతి సచివాలయం
భారత్‌లో పెట్టుబడులకు తరుణమిదే: ఉప రాష్ట్రపతి శ్రీ సి.పి.రాధాకృష్ణన్
· విశాఖపట్నంలో ‘సీఐఐ’ 30వ భాగస్వామ్య సదస్సులో ప్రసంగిస్తూ సంపూర్ణ ఆర్థిక వృద్ధి గురించి ప్రముఖంగా ప్రస్తావన · “భవిష్యత్ వృద్ధికి సారథ్యం వహించేది సాంకేతికత.. విశ్వసనీయత.. వాణిజ్యమే” · “ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు నేతృత్వం వహించడానికి సిద్ధంగా భారత అంకురావరణ వ్యవస్థ.. కాలుష్యరహిత సాంకేతికత ఎగుమతులకు సంసిద్ధత” · “కోట్లాది ప్రజలను పేదరిక విముక్తులను చేయడంలో ప్రధానమంత్రి మోదీ చారిత్రక విజయం సాధించారు” · “భారత్ పురోగమన చోదకశక్తి సంస్కరణలే: ప్రపంచ పెట్టుబడిదారులకు అసాధారణ అవకాశాలు” · “పారిశ్రామిక వృద్ధికి జాతీయ నమూనాగా ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవిస్తోంది” · “విశాఖపట్నం నగరం పెట్టుబడులకు స్వర్గధామంగా రూపొందుతుంది”
Posted On:
14 NOV 2025 3:54PM by PIB Hyderabad
విశాఖపట్నంలో నిర్వహిస్తున్న భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) 30వ భాగస్వామ్య సదస్సు ప్రారంభోత్సవంలో ఉప రాష్ట్రపతి శ్రీ సి.పి.రాధాకృష్ణన్ ఇవాళ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విధాన నిర్ణేతలు, అగ్రశ్రేణి వాణిజ్య-పారిశ్రామికవేత్తలు, అంతర్జాతీయ భాగస్వాములు సహా 2,500 మందికి పైగా ప్రతినిధులు హాజరైన విశిష్ట సమావేశంలో ఆయన ప్రసంగించారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వాన భారత్ పారిశ్రామికంగా, ఆర్థికంగా శరవేగంతో వృద్ధిని సాధిస్తున్నదని ఆయన వివరించారు.
దేశంలో కోట్లాది ప్రజానీకాన్ని పేదరిక విముక్తులను చేయడంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చారిత్రక విజయం సాధించారని శ్రీ సి.పి.రాధాకృష్ణన్ చెప్పారు. సంపదతోపాటు అవకాశాలను సృష్టించే సుస్థిర ఆర్థిక కార్యకలాపాలకు ఉత్తేజమివ్వడం ద్వారా ఈ విజయం సాధ్యమైందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ ఎన్.చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం దేశంలోనే అత్యంత సానుకూల వ్యాపార వాతావరణాన్ని సృష్టించిందని ఉప రాష్ట్రపతి ప్రశంసించారు. రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పన, ఆవిష్కరణ, వ్యాపారానుకూల వ్యవస్థను ప్రోత్సహించే దిశగా ఆయన చేసిన కృషి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ నేడు పారిశ్రామిక వృద్ధికి జాతీయ నమూనాగా నిలిచిందని పేర్కొన్నారు.
ప్రపంచంలో నాలుగో అతిపెద్ద, శరవేగంగా పురోగమించే ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్‌కుగల గుర్తింపును ఉప రాష్ట్రపతి ప్రముఖంగా ప్రస్తావించారు. కార్మిక చట్టాలు, పన్ను సంస్కరణలు, మౌలిక సదుపాయాల కల్పన లేదా డిజిటల్ ఇండియా వంటి కార్యక్రమాలు సహా ప్రతి రంగంలో సంస్కరణల అమలుతో దేశంలో వాణిజ్య సౌలభ్యం అత్యుత్తమ స్థాయిలో ఉందని ఆయన పేర్కొన్నారు. కాబట్టి, భారత్‌లో పెట్టుబడులకు ఇదే సరైన తరుణమని పిలుపునిచ్చారు. మరోవైపు భారత్ నేడు ప్రపంచంలో మూడో అతిపెద్ద అంకురావరణ వ్యవస్థగా నిలిచిందని గుర్తుచేశారు. పర్యావరణం పరంగా సుస్థిర ప్రగతిపై దేశం నిబద్ధతను చాటుకుంటూ అగ్రశ్రేణి కాలుష్య రహిత సాంకేతికత ఎగుమతిదారుగా ఆవిర్భవించేందుకు సిద్ధంగా ఉందని ప్రకటించారు.
భౌగోళిక విస్తీర్ణంతో నిమిత్తం లేకుండా ప్రపంచ దేశాలన్నిటినీ భారత్ సమ దృష్టితో చూస్తుందని శ్రీ సి.పి.రాధాకృష్ణన్ స్పష్టం చేశారు. ఆ మేరకు సముచిత, సార్వజనీన అంతర్జాతీయ భాగస్వామ్యాలపై భారత్ దృఢ నిబద్ధతతో ఉందని పునరుద్ఘాటించారు. ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలన్న ఆంధ్రప్రదేశ్ ఆకాంక్షాత్మక లక్ష్యం తప్పక నెరవేరగలదని ఆయన ఆశాభావం వెలిబుచ్చారు. ఈ నేపథ్యంలో సాంకేతికత, విశ్వసనీయత, వాణిజ్యాలను ముందుకు తీసుకెళ్లడంలో ప్రస్తుత శిఖరాగ్ర సదస్సు కీలక వేదిక కాగలదని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం క్వాంటం టెక్నాలజీ, గ్రీన్ హైడ్రోజన్‌కు కూడలి కానుందని, అలాగే విశాఖపట్నం పెట్టుబడులకు స్వర్గధామంగా మారగలదని ఉప రాష్ట్రపతి ఆశాభావం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ ఎస్.అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి శ్రీ ఎన్.చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు శ్రీ పీయూష్ గోయల్ (వాణిజ్యం-పరిశ్రమలు), శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు (పౌర విమాన యానం), శ్రీ భూపతిరాజు శ్రీనివాస వర్మ (ఉక్కు-భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి), డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని (గ్రామీణాభివృద్ధి-కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి) సహా ఇతర ప్రముఖులు పలువురు ఈ సదస్సులో పాల్గొన్నారు.
విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సాగే ‘సీఐఐ’ 30వ భాగస్వామ్య సదస్సును కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో సీఐఐ నిర్వహిస్తోంది. ఈ మేరకు కేంద్ర వాణిజ్య-పరిశ్రమల మంత్రిత్వశాఖ పరిధిలోని అంతర్గత వాణిజ్యం, పరిశ్రమల ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) ‘సీఐఐ’కి సహకరిస్తుండగా- ఆంధ్రప్రదేశ్ ఈ సదస్సును నాలుగోసారి నిర్వహిస్తుండటం గమనార్హం.
వాణిజ్యం-పెట్టుబడుల భవిష్యత్తు రూపకల్పనలో దార్శనికులు, విధాన నిర్ణేతలు, పరిశ్రమ అగ్రగాములు, ప్రపంచ భాగస్వాములకు ఈ సదస్సు ఒక వేదికగా నిలుస్తుంది. “టెక్నాలజీ, ట్రస్ట్ అండ్ ట్రేడ్: నావిగేటింగ్ ది న్యూ జియో ఎకనమిక్ ఆర్డర్’ ఇతివృత్తంగా ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. ఈ విశిష్ట కార్యక్రమంలో భాగమైన 45 చర్చాగోష్ఠులలో 72 మంది అంతర్జాతీయ వక్తలతోపాటు 45 దేశాల నుంచి 300 మంది విదేశీ భాగస్వాములు సహా 2,500 మంది ప్రతినిధులు పాల్గొంటున్నారు.
***
(Release ID: 2190450)
|