వ్యవసాయ మంత్రిత్వ శాఖ
నవంబర్ 19న పీఎం-కిసాన్ 21వ విడత నిధులను విడుదల చేయనున్న ప్రధానమంత్రి
ఇప్పటివరకు 11 కోట్లకుపైగా రైతు కుటుంబాలకు పీఎం-కిసాన్ ద్వారా నేరుగా 3.70 లక్షల కోట్ల బదిలీ
ఆధార్ ఆధారిత ఈ-కేవైసీ, మొబైల్ యాప్, కిసాన్-ఈ మిత్రా వంటి డిజిటల్ ఆవిష్కరణలతో
పీఎం-కిసాన్ మరింత బలోపేతం
దేశవ్యాప్తంగా సామాజిక సంక్షేమ ప్రయోజనాలను సులభంగా అందించేందుకు రైతు రిజిస్ట్రీ ప్రారంభం
Posted On:
14 NOV 2025 5:00PM by PIB Hyderabad
కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 24, 2019న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్) యోజనను ప్రారంభించింది. అర్హత కలిగిన ప్రతి రైతు కుటుంబానికి ప్రతి సంవత్సరం రూ. 6000 ఆర్థిక సాయం అందిస్తుంది. ఇప్పటివరకు దేశంలోని 11 కోట్లకుపైగా రైతు కుటుంబాలకు 20 విడతల ద్వారా రూ. 3.70 లక్షల కోట్ల నిధులను పంపిణీ చేశారు. పీఎం-కిసాన్ పోర్టల్‌లో రైతు తన భూమిని నమోదు చేసి, ఆధార్‌తో అనుసంధానించిన బ్యాంకు ఖాతా కలిగి ఉండి, ఈ-కేవైసీ పూర్తి చేసిన రైతులకు మాత్రమే ఈ పథకం ప్రయోజనాలు అందుతున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద నేరుగా లబ్దిదారులకు నిధుల బదిలీ (డీబీటీ) కార్యక్రమాల్లో ఒకటిగా ఈ పథకం నిలిచింది. ఇది లబ్ధిదారుల ఖాతాలో నేరుగా, పారదర్శకంగా ఆర్థిక సహాయాన్ని అందించడంలో అత్యంత కీలకంగా వ్యవహరిస్తుంది. ఈ పథకం 25 శాతం కంటే ఎక్కువ మహిళా లబ్ధిదారులకే అందిస్తూ సంపూర్ణ సార్వజనీనతను ప్రోత్సహిస్తోంది.
ఆధునిక సాంకేతికత, ప్రక్రియల ఆధారంగా అమలు చేయడం వల్ల గరిష్ట సంఖ్యలో రైతులు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయోజనం పొందవచ్చు. రైతు-కేంద్రిత డిజిటల్ మౌలిక సదుపాయాలు విస్తృతంగా అందుబాటులో ఉండటం వల్ల అర్హులైన రైతులు సులభంగా పథకం ప్రయోజనాలను పొందేలా చేస్తుంది. డిజిటల్ ప్రజా వస్తువులను వ్యూహాత్మకంగా వినియోగించడం వల్ల మధ్యవర్తుల వ్యవస్థను పూర్తిగా తొలగించడంతో పాటు, మారుమూల ప్రాంతాలకు కూడా ప్రయోజనాలను అందించేందుకు మార్గం సుగుమమైంది. ఆధార్, ఆధార్ ఆధారిత చెల్లింపు వ్యవస్థను ఉపయోగించడం వల్ల లావాదేవీలు భద్రంగా, వేగంగా, పారదర్శకంగా జరుగుతున్నాయి.
లబ్ధిదారుల గుర్తింపును నిర్ధారించేందుకు ఈ-కేవైసీ పూర్తి చేయడంలో ఆధార్ అత్యంత కీలకం. ఇప్పుడు రైతులు తమ ఈ-కేవైసీని కింద పేర్కొన్న విధానాలను ఉపయోగించి పూర్తి చేసుకోవచ్చు:
1. ఓటీపీ ఆధారిత ఈ-కేవైసీ
2. బయోమెట్రిక్ ఆధారిత ఈ-కేవైసీ
3. ముఖ గుర్తింపు ఆధారిత ఈ-కేవైసీ
రైతు-కేంద్రీకృత డిజిటల్ మౌలిక వసతులు.. మధ్యవర్తుల ప్రమేయం లేకుండానే దేశంలో ఉన్న రైతులందరికీ పథకం ప్రయోజనాలు చేరేలా చేస్తున్నాయి.
పీఎం-కిసాన్ ప్రధాన లక్ష్యాలను బలోపేతం చేసేందుకు అనేక సాంకేతికతలను అమల్లోకి తీసుకొచ్చారు.
డిజిటలైజేషన్ ద్వారా రైతుల సాధికారత జరుగుతోంది. దేశంలోని ప్రతి గ్రామంలో రైతులు సహాయం పొందుతున్నారు. “రైతుల ఇంటి వద్దకు సాంకేతికత చేరుతోంది” అనే మాటను నిజం చేస్తూ.. లబ్ధిదారులకు నేరుగా సేవలను అందించేందుకు పీఎం-కిసాన్ మొబైల్ యాప్ వంటి సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఆధార్ ద్వారా ముఖ గుర్తింపు ఆధారిత ఈ-కేవైసీ సౌకర్యం అందుబాటులో ఉండటంతో రైతు తన గదిలో కూర్చొని తనతోపాటు ఇతర రైతుల ఈ-కేవైసీలను కూడా తన గదిలో కూర్చునే పూర్తి చేయవచ్చు.
రైతులకు మరింత సమచారం కోసం pmkisan.gov.in ని సందర్శించవచ్చు. ‘‘ఫార్మర్స్ కార్నర్’’విభాగంలో పీఎం-కిసాన్ ప్రయోజనాలను పొందుతున్న రైతులు కొత్తగా ప్రవేశపెట్టిన “నో యువర్ స్టేటస్” ఫీచర్ ద్వారా తమ వివరాలను సులభంగా తనిఖీ చేసుకోవచ్చు. ఈ పోర్టల్ ద్వారా రైతులు త్వరగా, సులభంగా స్వీయ-నమోదు ప్రక్రియను కూడా పూర్తి చేసుకోవచ్చు. రైతులు తమ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్లలో (సీఎస్సీ) కూడా నమోదు చేసుకోవచ్చు. రైతులు ఇండియా పోస్టు పేమెంట్స్ బ్యాంకు ద్వారా రైతులు ఇంటి వద్దనే ఆధార్ ఆధారిత బ్యాంకు ఖాతాలను తెరవవచ్చు.
పీఎం-కిసాన్ పథకం ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని.. పీఎం-కిసాన్ పోర్టల్, కేంద్రీకృత ప్రజా ఫిర్యాదుల పరిష్కార, పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేశారు. దీని ద్వారా రైతులు తమ సమస్యలను నేరుగా పీఎం-కిసాన్ వేదికలో నమోదు చేసుకోవడం ద్వారా వేగంగా, సకాలంలో సమాచారాన్ని పొందవచ్చు.
ఫిర్యాదులను సమయానుకూలంగా పరిష్కరించేందుకు కిసాన్-ఈమిత్రా చాట్‌బాట్‌ను కూడా రైతులకు అందుబాటులో తీసుకొచ్చారు. ఇది సాంకేతిక, భాషా అడ్డంకులను పరిష్కరించి, రైతులు వారి స్వంత భాషలో వారి సమస్యలను పరిష్కరించుకోవడానికి వీలు కల్పిస్తుంది.
బహు భాషా సాంకేతికతో నడిచే ఈ చాట్‌బాట్.. కిసాన్-ఈమిత్రా ముఖ్య లక్షణాలు, సేవలు వంటి అనేక ప్రయోజనాలను రైతులకు అందిస్తుంది.
· వివిధ భాషల్లో 24/7 అందుబాటులో: హిందీ, ఇంగ్లీష్, తమిళం, బెంగాలీ, ఒడియా, మలయాళం, గుజరాతీ, పంజాబీ, తెలుగు, మరాఠీ, కన్నడతో సహా 11 ప్రధాన ప్రాంతీయ భాషలకు మద్దతు ఇవ్వడం ద్వారా సాంకేతిక, భాషా అడ్డంకులను అధిగమిస్తుంది.
· రైతులు తమ దరఖాస్తు స్థితిని తనిఖీ చేయవచ్చు. చెల్లింపుల గురించి వివరాలను పొందవచ్చు. తమకు నచ్చిన భాషలో సంభాషించవచ్చు.
· స్వయంచాలక భాష గుర్తింపు (ఏఎల్‌డీ): చాట్‌బాట్ వాయిస్ ఇన్‌పుట్ ఆధారంగా 11 ప్రధాన భాషలను స్వయంచాలకంగా గుర్తించగలదు. ఇతర భాషల కోసం వినియోగదారులు మొదట తమ భాషను ఎంచుకోవాల్సి ఉంటుంది. భవిష్యత్తులో మిగతా భాషలకు కూడా ఏఎల్‌డీ విస్తరించనుంది.
· స్వయంచాలక పథకం గుర్తింపు (ఏఎస్‌డీ): రైతు మొదటి ప్రశ్న ఆధారంగా సంబంధిత పథకాన్ని స్వయంచాలకంగా గుర్తించి, ప్రక్రియను సులభతరం చేస్తుంది.
· స్పర్శ-రహిత వ్యవస్థ: చేతితో స్పర్శ లేకుండా సులభంగా ఉపయోగించుకోవచ్చు.
· రైతుల అవసరం ఆధారంగా పనిచేస్తుంది. రైతు ప్రశ్న స్పష్టంగా లేకపోయినా ఉద్దేశ్యాన్ని గుర్తించి సరైన సమాచారం అందిస్తుంది.
· వాయిస్ ఇంటరాక్షన్ ఎంపిక: రైతులు పురుష/మహిళా గొంతును ఎంచుకొని మాట్లాడవచ్చు. దీని ద్వారా వ్యక్తిగత అనుభవాన్ని పొందగలరు
· లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్: రైతుల ప్రశ్నలను అర్థం చేసుకుని, ఖచ్చితమైన, సందర్భానుసారమైన సమాధానాలు ఇవ్వగల సామర్థ్యాన్ని పెంచుతుంది.
· (kisanemitra.gov.in) ప్రత్యేక యూఆర్‌ఎల్ ద్వారా రైతులకు స్వతంత్ర డిజిటల్ గుర్తింపు కల్పిస్తుంది.
కేంద్ర ప్రభుత్వం పీఎం-కిసాన్ పథకం కింద సాగు భూమి కలిగిన రైతులను గుర్తించి, ధ్రువీకరించి, చేర్చేందుకు ఎప్పటికప్పుడు వివిధ గ్రామ స్థాయి ప్రత్యేక ప్రచారాలను కూడా చేపట్టింది.
రైతుల జీవితాల్లో పీఎం-కిసాన్ పథకం ప్రభావాన్ని తెలుసుకునేందుకు 2019లో అంతర్జాతీయ ఆహార, విధాన పరిశోధనా సంస్థ ఒక అధ్యయనం నిర్వహించింది. ఈ పథకం ద్వారా పంపిణీ చేసిన నిధులు గ్రామీణ ఆర్థిక వృద్ధికి కీలకంగా పనిచేశాయని, రైతులకు ఉన్న రుణ సమస్యలను తగ్గించడంలో సహాయపడినట్లు, వ్యవసాయ రంగంలో పెట్టుబడులను పెంచాయని అధ్యయనంలో వెల్లడైంది. ఈ పథకం రైతులు వ్యవసాయంలో ప్రమాదాలను భయపడకుండా, అవి కలిగించే లాభాల కోసం ప్రయత్నించే సామర్థ్యాన్ని పెంచినట్లు తేలింది, పీఎం- కిసాన్ ద్వారా లబ్ధిదారులు పొందే నిధులను వ్యవసాయ అవసరాలకు మాత్రమే కాకుండా, విద్య, వైద్యం, వివాహం వంటి ఇతర ఖర్చులను కూడా సహాయపడుతున్నట్లు వెల్లడైంది.
రైతులకు చివరి స్థాయి వరకు ప్రయోజనాలు అందించడమే పీఎం-కిసాన్ పథకం ముఖ్య ఉద్దేశం. డిజిటల్, పారదర్శక ప్రయోజనాలను అందించడమే లక్ష్యంగా పనిచేస్తుంది. దీనికి అనుగుణంగా వ్యవసాయ మంత్రిత్వ శాఖ కొత్తగా రైతు రిజిస్ట్రీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇది క్షుణ్ణంగా పరిశీలించిన డేటాబేస్. దీని ద్వారా రైతులు సామాజిక సంక్షేమ లబ్ధాలను పొందేందుకు కష్టమైన ప్రక్రియల ద్వారా వెళ్ళాల్సిన అవసరం ఉండదు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికత, రైతు సంక్షేమంపై ఆయనకున్న అచంచలమైన నిబద్ధత ద్వారా రైతు రిజిస్ట్రీ సాధ్యమైంది. దీని ఏర్పాటుకు ముందు సామాజిక సంక్షేమ పథకాలను పొందడం రైతులకు కష్టంగా ఉండేది. కానీ రిజిస్ట్రి అమలు తర్వాత రైతులు ఈ ప్రయోజనాలను సులభంగా, అడ్డంకులు లేకుండా పొందగలుగుతున్నారు.
***
(Release ID: 2190449)
Visitor Counter : 3