వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
ఆంధ్రప్రదేశ్ సరకు రవాణా వ్యవస్థను డిజిటలైజ్ చేయడానికి కుదిరిన అవగాహన ఒప్పందం
రియల్ టైం రవాణా సమాచారాన్ని అందించే యూనిఫైడ్ లాజిస్టిక్స్ ఇంటర్ఫేస్ ప్లాట్ ఫామ్
Posted On:
15 NOV 2025 1:24PM by PIB Hyderabad
విశాఖపట్నంలో 2025 నవంబర్ 14న జరిగిన 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ఐసీడీసీ), లాజిస్టిక్స్ డేటా సర్వీసెస్ (ఎన్ఎల్‌డీఎస్ఎల్) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ ఎన్ చంద్రబాబు నాయుడు సమక్షంలో ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. యూనిఫైడ్ లాజిస్టిక్స్ ఇంటర్ఫేస్ ప్లాట్ఫామ్ (యూఎల్ఐపీ)ని ఉపయోగించుకోవడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో రవాణాను డిజిటలీకరించడమే ఈ ఒప్పందం లక్ష్యం.
దీనిలో భాగంగా.. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ, ప్రైవేటు విభాగాలకు రాష్ట్రంలోని రవాణా కార్యకలాపాలు, వాటి పనితీరు సూచీలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించడానికి దృఢమైన ఏకీకృత డిజిటల్ వేదికను అభివృద్ధి చేసి అమలు చేస్తారు. ఇది అన్ని రంగాల్లోనూ సమన్వయాన్ని పెంపొందించేందుకు, సామర్థ్యాన్ని మెరుగుపరచేందుకు, సమాచార ఆధార నిర్ణయాలు తీసుకొనేందుకు తోడ్పడుతుంది. అలాగే రియల్ టైమ్ సమాచారాన్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా భాగస్వాములకు అందించే వీలు కల్పిస్తుంది.
వివిధ రాష్ట్ర విభాగాల్లో రవాణా సంబంధిత కీలక పనితీరు సూచీ (కేపీఐ)లను పర్యవేక్షించేలా ఏకీకృత డ్యాష్ బోర్డును రూపొందించేందుకు ఎన్ఎల్‌డీఎస్ఎల్ సహకారంతో ఇన్‌క్యాప్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పనిచేస్తుంది. యూఎల్ఐపీ సామర్థ్యాలను వినియోగించుకుంటూ... రాష్ట్ర రవాణా వ్యవస్థను బలోపేతం చేయడానికి, మెరుగు పరచడానికి ఈ డ్యాష్ బోర్డు ద్వారా తయారు చేసిన విశ్లేషణలు, కార్యాచరణ నివేదికలను ఉపయోగిస్తారు.
లాజిస్టిక్స్ అభివృద్ధితో అధునాతన సాంకేతిక పరిష్కారాలను ఏకీకరించడంలో సాధించిన ప్రధాన విజయాన్ని ఈ ఎంవోయూ సూచిస్తుంది. అలాగే సమర్థమైన, ఆధునికమైన, స్థిరమైన సరఫరా మౌలిక వసతుల్లో అగ్రగామిగా భారత్ స్థానాన్ని బలోపేతం చేసేందుకు తోడ్పడుతుంది.
ఎన్ఐసీడీసీ సీఈవో, ఎండీ, ఎన్ఎల్ఎస్డీఎల్ ఛైర్మన్ శ్రీ రజత్ కుమార్ సైనీ సమక్షంలో ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఇన్‌క్యాప్ వీసీ, ఎండీ శ్రీ సీవీ ప్రవీణ్ ఆదిత్య, ఎన్ఎల్‌డీఎస్ఎల్ సీఈవో శ్రీ తకాయుకీ కనో ఈ ఒప్పందంపై అధికారికంగా సంతకాలు చేశారు. జాతీయ లాజిస్టిక్స్ విధానానికి (ఎన్ఎల్‌పీ)కి అనుగుణంగా అంతర్జాతీయ స్థాయి రవాణా మౌలిక వసతులను నిర్మించే దిశగా వేసిన ముందడుగును ఈ భాగస్వామ్యం సూచిస్తుంది.
ఏపీఐ ఆధారిత ఏకీకరణ ద్వారా వివిధ ప్రభుత్వ వ్యవస్థల నుంచి సేకరించిన రవాణా సంబంధిత సమాచారాన్ని పారిశ్రామిక భాగస్వామ్యులకు అందుబాటులో ఉంచే డిజిటల్ గేట్ వేలా యుఎల్ఐపీ పనిచేస్తుంది. 136 ఏపీఐల ద్వారా 11 మంత్రిత్వ శాఖలు, 44 విభాగాలతో అనుసంధానమైన యుల్ఐపీ 2,000కు పైగా డేటాసెట్లను అందిస్తుంది. యూఎల్ఐపీని ఉపయోగించి 210కు పైగా అప్లికేషన్లను సంస్థలు అభివృద్ధి చేశాయి. ఫలితంగా 200 కోట్లకు పైగా ఏపీఐ లావాదేవీలు జరిగాయి. దీనికి అదనంగా ప్రైవేటు రంగ వినియోగంతో పాటు బొగ్గు, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ)తో సహా మంత్రిత్వ శాఖలు, విభాగాలు, వివిధ రాష్ట్ర ప్రభుత్వాల రవాణా సమాచారాన్ని అందించడం ద్వారా డేటా ఆధారిత పాలనకు యూఎల్ఐపీ సహకారం అందిస్తోంది..
***
(Release ID: 2190436)
Visitor Counter : 15