భారత ప్రభుత్వ నూతన, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నవరత్న సీపీఎస్‌యూ అయిన సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంస్థ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పలు ఒప్పందాలు చేసుకుంది. నంద్యాలలో 1200 MWh బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్, 50 MW హైబ్రిడ్ సోలార్ ప్రాజెక్ట్ అభివృద్ధి కోసం పరస్పరం ప్రభుత్వ ఉత్తర్వులను ఇచ్చిపుచ్చుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరిశ్రమలు-అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం విశాఖపట్నంలో సీఐఐ సహకారంతో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ భాగస్వామ్య సదస్సు-2025 ఇంధన రంగ సమావేశాల సందర్భంగా ఈ ఒప్పందం జరిగింది.
ప్రాజెక్ట్ ఆమోదం - ఆదేశం
మార్కెట్ ఆధారిత కార్యకలాపాల కింద 1200 MWh బీఈఎస్ఎస్ ప్రాజెక్టు అమలు సంస్థగా ఎస్ఈసీఐని నియమిస్తూ విద్యుత్ మంత్రిత్వ శాఖ 2025, జనవరి 23న జారీ చేసిన ఉత్తర్వుల ద్వారా ఈ ప్రాజెక్టును ప్రకటించింది. ఎస్ఈసీఐ బోర్డు ఛైర్మన్ శ్రీ సంతోష్ కుమార్ సారంగి 2025, అక్టోబరు 22న ఈ ప్రాజెక్టును ఆమోదించారు. నూతన, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ ఈ రెండు ప్రాజెక్టుల పురోగతిని, అభివృద్ధిని నిశితంగా పర్యవేక్షిస్తోంది.
కాపెక్స్ మోడ్ ద్వారా ప్రాజెక్టులను అభివృద్ధి చేయనున్న ఎస్ఈసీఐ
బీఈఎస్ఎస్, హైబ్రిడ్ సోలార్ ప్రాజెక్టులు రెండింటినీ పూర్తి పెట్టుబడి బాధ్యలతో ఎస్ఈసీఐ కాపెక్స్ మోడ్ ద్వారా అభివృద్ధి చేస్తుంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ కె. విజయానంద్, ఎన్ఆర్ఈడీసీఏపీ వైస్ చైర్మన్ ఎం. కమలాకర బాబు సమక్షంలో ఆంధ్రప్రదేశ్ ఇంధన శాఖ మంత్రి శ్రీ గొట్టిపాటి రవి కుమార్ అధికారికంగా ప్రభుత్వ ఉత్తర్వులను ఎస్ఈసీఐకి అందజేశారు. ఎస్ఈసీఐ తరపున శ్రీ శివకుమార్ వెంకట్ వేపకొమ్మ, శ్రీ రోహిత్ చౌబే పాల్గొన్నారు.
భారత పరిశుద్ధ ఇంధన వ్యవస్థ బలోపేతం
ఆంధ్రప్రదేశ్ పునరుత్పాదక ఇంధన మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంలో ఈ ఒప్పందం కీలక ముందడుగును సూచిస్తుంది. మరింత పర్యావరణహితమైన, సమర్థమైన ఇంధన వ్యవస్థ దిశగా భారత్ పరివర్తనను వేగవంతం చేయడానికి రాష్ట్రాలు, కేంద్ర మంత్రిత్వ శాఖలతో కలిసి పనిచేయడం పట్ల తన నిబద్ధతను ఎస్ఈసీఐ పునరుద్ఘాటించింది. ఈ ప్రాజెక్టులు పరిశుద్ధ ఇంధన నిల్వ సామర్థ్యంలో కీలక ముందడుగును సూచిస్తాయి. రాష్ట్ర పునరుత్పాదక ఇంధన వ్యవస్థను బలోపేతం చేస్తాయి. మరింత సమర్థమైన, మెరుగైన నిల్వ-సామర్థ్యం గల గ్రీన్ గ్రిడ్ దిశగా భారత్ పరివర్తనకు శక్తినిస్తాయి.