లోక్‌సభ సచివాలయం
పార్లమెంట్ ఆవరణలో భగవాన్ బిర్సా ముండాకు పుష్పాంజలి ఘటించిన భారత రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, లోక్‌సభ స్పీకర్
Posted On:
15 NOV 2025 4:11PM by PIB Hyderabad
గిరిజన గౌరవ దినోత్సవం, భగవాన్ బిర్సా ముండా జయంతి సందర్భంగా పార్లమెంట్ ప్రాంగణంలోని ప్రేరణ స్థలం వద్ద భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము, భారత ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ శ్రీ సీపీ రాధాకృష్ణన్, లోక్‌సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా, పార్లమెంటరీ వ్యవహారాలు, మైనారిటీ వ్యవహారాల మంత్రి శ్రీ కిరణ్ రిజీజు, రాజ్యసభ ఉపాధ్యక్షుడు శ్రీ హరివంశ్, పార్లమెంట్ సభ్యులు, మాజీ ఎంపీలు, ఇతర ప్రముఖులు బిర్సా ముండా విగ్రహానికి పుష్పంజలి ఘటించారు.
అంతకముందు శ్రీ బిర్లా సామాజిక మాధ్యమం ఎక్స్లో ఇలా పేర్కొన్నారు.
‘‘అసాధారణ స్వాతంత్య్ర సమరయోధుడు, గిరిజనుల గుర్తింపు, ఆత్మ గౌరవానికి శాశ్వత ప్రతీక అయిన ధర్తి ఆబా భగవాన్ బిర్సా ముండా 150 జయంతి సందర్భంగా ఆయనకు వినమ్ర నివాళులు. గిరిజన గౌరవ దినోత్సవం సందర్భంగా పౌరులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు’’
పరిమిత వనరులు ఉన్నప్పటికీ, నీరు, అడవి, భూమి హక్కుల కోసం ఆయన నేతృత్వంలో జరిగిన ధైర్యవంతమైన పోరాటం విదేశీ పాలనకు వ్యతిరేకంగా ఒక విప్లవ జ్వాలగా ఎదిగింది.దేశవ్యాప్తంగా స్వాతంత్య్ర చైతన్యాన్ని విస్తరించింది. అణగారిన, గిరిజన వర్గాల గొంతుకగా.., భగవాన్ బిర్సా ముండా తన అంచలంచలమైన సంకల్పం, త్యాగం, అసాధారణ నాయకత్వం ద్వారా ఎంతోమంది యువతలో జాతీయత, ఆత్మ గౌరవం, న్యాయ జ్వాలను రగలించారు.
ఆయన జీవితం ఎల్లప్పుడూ దేశానికి స్ఫూర్తి శక్తిగా ఉండి, మనకు స్థిరమైన కర్తవ్యం, సామాజిక న్యాయం, సాంస్కృతిక గౌరవానికి మార్గాన్ని చూపుతుంది.
బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఉల్గులాన్ (విప్లవం)కి నాయకత్వం వహించిన భగవాన్ బిర్సా ముండా.. ప్రతిఘటనకు ఒక శక్తివంతమైన చిహ్నంగా నిలిచారు. ఆయన దార్శనిక నాయకత్వం జాతీయ చైతన్యాన్ని రగలించింది. ఆయన వారసతాన్ని భారత్‌లోని గిరిజన సమూహాలు ఇప్పటికీ ఎంతో గౌరవిస్తున్నాయి.
2021 నుంచి గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరిస్తూ, గౌరవించేందుకు నవంబర్ 15ను గిరిజన గౌరవ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. భారత స్వాతంత్య్ర పోరాటంలో గిరిజన సమూహాలు కీలక పాత్ర పోషించాయి. అనేక విప్లవ ఉద్యమాల ద్వారా స్వేచ్ఛ కోసం పోరాడాయి. వారి సంపన్నమైన చరిత్ర, సంస్కృతి, వారసత్వాన్ని గౌరవిస్తూ ఈ రోజును నిర్వహిస్తారు. దేశవ్యాప్తంగా ఐక్యత, గర్వం, గుర్తింపు కోసం గిరిజన సమాజం చేసిన అమూల్యమైన కృషిని గుర్తిస్తూ, దేశ అభివృద్ధిలో వారి సహకారాన్ని స్మరించేందుకు దేశవ్యాప్తంగా కార్యక్రమాలు జరుగుతాయి.
వేడుకల భాగంగా దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన గిరిజన జానపద కళాకారులు పార్లమెంట్ ప్రాంగణంలోని ప్రేరణ స్థలంలో ప్రదర్శనలు ఇచ్చారు. ఈ సాంస్కృతిక కార్యక్రమాలతో వారు అతిథులను ఆహ్వానించారు.
***
(Release ID: 2190431)
Visitor Counter : 4