రైల్వే మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

రైళ్లలో చెత్తను క్రమపద్ధతిలో నిర్మూలించేలా జోనల్ రైల్వేలకు విస్తృత మార్గదర్శకాలు జారీ చేసిన రైల్వే బోర్డు


రైళ్లలోనే హౌస్‌కీపింగ్, పాంట్రీ కార్ సిబ్బంది ద్వారానిర్దిష్ట విధానంలో చెత్త సేకరించి, సురక్షిత పద్ధతిలో మార్గమధ్యంలోని స్టేషన్లలో వేసేలా మార్గదర్శకాలు

చెత్త నిర్మూలనను పటిష్టపరచడం, స్వచ్ఛతను ప్రోత్సహించడం, చురుకుగా, బాధ్యతగా నడుచుకునేలా
ఆన్-బోర్డ్ హౌస్‌కీపింగ్ సిబ్బందికి ‘సంవాద్’ చర్చా కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా సీనియర్ సూపర్‌వైజర్లకూ, అధికారులకూ ఆదేశాలు

క్షేత్ర స్థాయిలో డివిజన్ వారీ ఫీడ్‌బ్యాక్ సేకరణతో పాటు, అన్ని రైళ్లనూ కవర్ చేయడానికి నెల రోజుల పాటు ‘సంవాద్’ ప్రక్రియ

ఓబీహెచ్ఎస్, పాంట్రీ కార్ లైసెన్సుల్ని పొందిన సంస్థలకు ఖచ్చితమైన మార్గదర్శకాలు జారీ చేసిన రైల్వే బోర్డు..
ఈ మార్గదర్శక సూత్రాల పాలన తప్పనిసరి.. ఉల్లంఘిస్తే సేవల రద్దుకూ ఆస్కారం

प्रविष्टि तिथि: 13 NOV 2025 8:20PM by PIB Hyderabad
రైలు ప్రయాణాల్లో పోగయ్యే చెత్తను క్రమ పద్ధతిలో నిర్మూలించడానికి  అన్ని జోనల్ రైల్వేలకూ విస్తృత మార్గదర్శకాల్ని రైల్వే బోర్డు జారీ చేసింది. స్వచ్ఛతను పెంచి, ప్రయాణికులకు మరింత ఆహ్లాదకర అనుభూతులను పంచడమే ఈ ఆదేశాల ముఖ్యోద్దేశం.

ఈ మార్గదర్శకాల్లో ఒక కచ్చితమైన పద్ధతిని సూచించారు. దీని ప్రకారం, ఆన్-బోర్డ్ హౌస్‌కీపింగ్ సేవల (ఓబీహెచ్ఎస్)తో పాటు పాంట్రీ కార్ సిబ్బంది ప్రయాణికుల కంపార్ట్‌మెంట్లలోని చెత్తను ఎత్తి, మార్గంలో ఎంపిక చేసిన స్టేషన్లలో ఏర్పాటు చేసిన సంచుల్లో వేయాల్సి ఉంటుంది. రైళ్ల లోపలే కాక, రైల్వే స్టేషన్లలో కూడా స్వచ్ఛతకు ప్రాధాన్యాన్నివ్వాలన్న ఉద్దేశంతో ఈ వ్యవస్థను రూపొందించారు.

చక్కని ప్రయాణానుభూతిని కలిగించేందుకు ఆన్-బోర్డ్ సిబ్బంది నిర్వర్తించాల్సిన విధుల్లో కొన్ని కొత్త సూచనలను తాజా ఉత్తర్వులో చేర్చారు. రైలు పెట్టెల్లో, టాయిలెట్లలో చెత్త పోగుపడకుండా పరిశుభ్రతకు పెద్దపీట వేస్తూ, ప్రయాణికులకు సౌఖ్యాన్నీ, భద్రతనూ అందించడంలో ప్రముఖ పాత్రను పోషిస్తున్నది ఈ సిబ్బందే. ముందు వరుసలో నిలిచే వీరిలో చాలా మంది సిబ్బంది కాంట్రాక్టుపై పనిచేస్తున్నారు. వారు బాధ్యతల్ని సేవాభావం ఉట్టిపడేలా సమర్థంగా నిర్వహించడానికి తగిన శిక్షణనీ, అవసరమైన సామగ్రినీ జోనల్ రైల్వేలు అందించితీరాలని బోర్డు ఆదేశించింది.

ఈ విధానాలను క్షేత్ర స్థాయిలో అమలుపరిచేలా చూడడానికి రైళ్లలో పనిచేసే సిబ్బందితో పెద్ద ఎత్తున ‘సంవాద్’ (చర్చ) కార్యక్రమాన్ని మొదలు పెట్టాలని రైల్వే బోర్డు ఆదేశించింది. ఈ అవగాహన కార్యక్రమాన్ని అన్ని జోనల్ రైల్వేల్లో సీనియర్ సూపర్‌వైజర్లు, వాణిజ్య, మెకానికల్ విభాగాల అధికారులు నిర్వహించాల్సి వుంటుంది. సిబ్బందిని నేరుగా కలుసుకొని, స్వచ్ఛ భారత్ మిషన్లో వారి పాత్రకు ఉన్న ప్రాముఖ్యాన్ని వివరించడంతో పాటు, సిబ్బందికి ఎదురవుతున్న ఇబ్బందుల్ని కూడా అర్థం చేసుకోవాలన్నదే ఈ కార్యక్రమ ప్రధానోద్దేశం.

రైళ్లలో ఉండి విధుల్ని నిర్వహించే ఓబీహెచ్ఎస్ సిబ్బందికి సూచనలను చేసే కొన్ని వీడియోలను ‘సంవాద్’ (చర్చ) సదస్సుల్లో ప్రదర్శిస్తారు. ఇది చెత్త తొలగింపు ప్రక్రియలపై వారికి అవగాహన కలిగిస్తుంది.  స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా రైళ్లనూ, రైల్వేస్టేషన్లనూ అద్దంలా ఉంచాలన్న వారి బాధ్యతలను విడమరచి చెప్పడంపై కూడా శ్రద్ధ తీసుకుంటారు. చెత్తనూ, అన్నపానాదుల అనంతరం మిగిలే వ్యర్థ పదార్థాలనూ పోగు చేసి తగిన చర్యలను తీసుకోవడానికి సంబంధించి జారీ చేసిన ఆదేశాలకు తోడు, ప్రతి ఒక్క రైలుకూ నిర్ధారిత స్టేషన్లలో చెత్తను వేయడానికి చేసిన ఏర్పాట్ల గురించి కూడా సిబ్బందికి సమాచారాన్ని అందిస్తారు.

ఓబీహెచ్ఎస్, పాంట్రీ కార్ సిబ్బంది చురుగ్గానూ, బాధ్యతాయుతంగానూ నడుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సదస్సుల్లో స్పష్టం చేస్తారు. చెత్త తొలగించే సందర్భాల్లో వారికి ఎదురయ్యే ఇబ్బందులు ఎలాంటివో అడిగి తెలుసుకుంటారు. క్షేత్ర స్థాయిలో ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ (పీసీసీఎమ్), ప్రిన్సిపల్ చీఫ్ మెకానికల్ ఇంజినీర్ (పీసీఎమ్ఈ)ల అభిప్రాయాలకు డివిజన్లు తమ స్పందనను కూడా కలిపి మరీ పంచుకోవాల్సి ఉంటుంది. ఈ దశను పూర్తి చేసిన తరువాత 10 రోజుల లోపల పీసీసీఎమ్ లే ఒక సమగ్ర నివేదికను రైల్వే బోర్డు కార్యనిర్వాహక డైరెక్టరు, టూరిజం, క్యాటరింగ్ కార్యాలయానికి సమర్పించాల్సి ఉంటుంది.

విస్తృత స్థాయిలో చేపట్టే ఈ ప్రక్రియను ఒక నెల రోజుల్లో పూర్తి చేయాలి. దీనిలో భాగంగా అన్ని రైళ్లనూ లెక్కలోకి తీసుకోవాలి. ఇది జరిగాక, డివిజన్ల నుంచి వచ్చిన అభిప్రాయాలను జోనల్ స్థాయిలో సంకలనం చేసి, సమీక్ష కోసం రైల్వే బోర్డుకు పంపుతారు.

నియమావళిని ఖచ్చితంగా పాటించే యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడానికి చొరవ తీసుకోవాలని కూడా బోర్డు పంపించిన సందేశంలో స్పష్టం చేశారు. ఓబీహెచ్ఎస్, పాంట్రీ కార్ సేవల లైసెన్సులు పొందిన సంస్థలకు ఈ మార్గదర్శక సూత్రాల విషయంలో లాంఛనంగా సూచనలనూ, సలహాలనూ ఇస్తారు. ఏ విధమైన ఉల్లంఘనకు పాల్పడినా, కాంట్రాక్టును అమలు చేయడంలో భంగం కలిగిందని భావించి, దోషులుగా తేలే పక్షాలకు వ్యతిరేకంగా సదరు కాంట్రాక్టును సమాప్తం చేసే దిశగా తగిన చర్యలను తీసుకోవడం మొదలుపెడతారు.


కిందటేడాది జులైలో జారీ చేసిన ఆదేశాలకు తరువాయిగా, ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. మార్గమధ్యంలోని స్టేషన్లలో చెత్తను పారబోయడానికి ఒక వ్యవస్థను రూపొందించామని మునుపటి ఆదేశాల్లో పేర్కొన్నారు. చెత్త ఎక్కడెక్కడ పోగవుతోందో అంచనా వేయడానికి ఓ అధ్యయనాన్ని మొదలుపెట్టడం, నిర్దిష్ట స్టేషన్లలో చెత్త సమీకరణకు కనీస సంఖ్యలో ఎన్ని సంచులు ఏర్పాటు చేయాలో సూచించడం, పక్కా పర్యవేక్షణ కోసం ఈ సమాచారాన్నంతా ఓ కేంద్రీకృత నిర్వహణ వ్యవస్థ (సీఆర్ఐఎస్‌కు చెందిన సీఎమ్ఎమ్ వ్యవస్థ)లో పొందుపరచడం వంటి చర్యలు ఈ వ్యవస్థలో భాగంగా ఉన్నాయి.

‘సంవాద్’ రూపేణా ఖచ్చితమైన విధివిధానాలను భారతీయ రైల్వేలు అనుసరిస్తూ, దీనికి మానవీయ దృష్టికోణాన్ని కూడా జతపరిచి, ఆన్‌బోర్డ్ ఆతిథ్యాన్నీ, పారిశుధ్యాన్నీ, ప్రయాణికులకు మొత్తంమీద కలిగే యాత్రానుభూతినీ మెరుగుపరిచే దిశగా కీలక నిర్ణయాలను తీసుకొంటోంది.  

***
 

(रिलीज़ आईडी: 2190026) आगंतुक पटल : 19
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Malayalam