ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
భారత్‌లో తగ్గిన కొత్త టీబీ కేసుల సంఖ్య: 2015లో ప్రతీ లక్ష జనాభాకు 237 కేసులు నమోదవగా, 2024లో 187 తగ్గిన సంఖ్య... ప్రపంచవ్యాప్త తగ్గుదలతో పోలిస్తే దాదాపు రెట్టింపు
· ప్రపంచవ్యాప్తంగా టీబీతో మరణాల సంఖ్యతో పోలిస్తే భారత్‌లో భారీ తగ్గుదల (హెచ్ఐవీ నెగెటివ్ వ్యక్తుల్లో టీబీ మరణాలు)
· 92% వ్యాధిగ్రస్తులకు చికిత్స.. టీబీ భారాన్ని అధికంగా ఎదుర్కొంటున్న ఇతర దేశాలతో పోల్చినా, ప్రపంచవ్యాప్తంగా సార్వత్రిక ఆరోగ్య కవరేజీలోనూ ముందువరుసలో భారత్: కేసుల గుర్తింపు కోసం వినూత్న వ్యూహాలు, వైద్య సంరక్షణను మెరుగుపరచడంలో మన విజయానికి ఇది నిదర్శనం
· 2024లో 26.18 లక్షలకు పైగా టీబీ రోగుల గుర్తింపు
· టీబీ ముక్త్ భారత్ అభియాన్ కింద 90 శాతానికి పెరిగిన విజయవంతమైన చికిత్సల రేటు... ప్రపంచవ్యాప్తంగా ఇది 88 శాతం
· విస్తృతంగా రిఫాంపిసిన్ గ్రహణశీల పరీక్ష ద్వారా ఔషధ నిరోధక టీబీ గుర్తింపు భారత్‌లో 92%... ప్రపంచవ్యాప్తంగా ఇది 83%
· 2024 డిసెంబరులో ప్రారంభించిన టీబీ ముక్త్ భారత్ అభియాన్ కింద ఏఐ ఆధారిత రిపోర్టింగుతో చేతిలో ఇమిడే ఎక్స్ రే పరికరాల వంటి కొత్త సాంకేతికతలు, నాట్ మౌలిక వసతుల విస్తరణ, ముప్పు పొంచి ఉన్న ప్రజానీకంపై ప్రత్యేకంగా దృష్టిపెడుతూ సామాజిక సమీకరణ చర్యలు, జన్ భాగిదారీ వల్ల... 24.5 లక్షల మందికి రోగ నిర్ధారణ: వీరిలో 8.61 లక్షల మందికి లక్షణరహిత టీబీ
· గత తొమ్మిదేళ్లలో పది రెట్లు పెరిగిన సంబంధిత వార్షిక బడ్జెట్.. కొత్త నివారణ చర్యలు, రోగనిర్ధారణ సాధనాలు, చికిత్సా విధానాలు, సామాజిక చేయూతకు అవకాశం
· ని-క్షయ పోషణ్ యోజన ద్వారా.. 2018 ఏప్రిల్ నుంచి 1.37 కోట్ల మంది లబ్ధిదారులకు రూ. 4,406 కోట్లకు పైగా పంపిణీ
Posted On:
12 NOV 2025 8:49PM by PIB Hyderabad
భారత్‌లో టీబీ కేసుల సంఖ్య (ఏటా కొత్తగా నమోదయ్యే కేసుల సంఖ్య) 21 శాతం తగ్గింది. ఈ సంఖ్య 2015లో ప్రతీ లక్ష జనాభాకు 237గా ఉండగా.. 2024 నాటికి 187కి చేరింది. ప్రపంచవ్యాప్తంగా ఈ తగ్గుదల 12 శాతంగా ఉండగా, భారత్ లో అది దాదాపు రెట్టింపు ఉండడం గమనార్హం. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచ టీబీ నివేదిక- 2025 ఈ వివరాలను వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా టీబీ కేసుల సంఖ్య అత్యధికంగా తగ్గిన దేశాలలో భారత్ ఒకటి. టీబీ భారం ఎక్కువగా ఉన్న ఇతర దేశాల్లో తగ్గుదల కన్నా మన దేశంలో తగ్గుదల చాలా వేగంగా నమోదైంది.
కొత్త సాంకేతికతలను వేగంగా అందిపుచ్చుకుంటూ వ్యాధిగ్రస్తులను గుర్తించడంలో భారత్ అనుసరిస్తున్న వినూత్న పద్ధతులు, సేవల వికేంద్రీకరణ - భారీగా సామాజిక సమీకరణ వల్ల.. దేశంలో 2015లో 53 శాతంగా ఉన్న చికిత్స కవరేజీ 2024 నాటికి 92 శాతానికి పైగా పెరిగింది. 2024లో 27 లక్షల టీబీ కేసులు నమోదవుతాయని అంచనా వేయగా.. అందులో 26.18 లక్షల మందిలో వ్యాధిని గుర్తించారు. ఫలితంగా టీబీ ఉన్నప్పటికీ ప్రభుత్వ కార్యక్రమం పరిధిలోకి రాకుండా పోయిన ‘మిస్సింగ్ కేసుల’ సంఖ్య బాగా తగ్గింది. ఇది 2015లో 15 లక్షల నుంచి 2024 నాటికి లక్ష కన్నా తక్కువకు చేరిందని అంచనా. దేశంలో ఎండీఆర్ టీబీ రోగుల సంఖ్య కూడా పెద్దగా పెరగలేదు. టీబీ ముక్త భారత్ అభియాన్ కింద విజయవంతమైన చికిత్సల రేటు 90 శాతానికి పెరిగింది. కాగా, ప్రపంచవ్యాప్తంగా ఈ రేటు 88 శాతంగా ఉంది.
అదేవిధంగా దేశంలో టీబీతో మరణాల రేటు 2015లో ప్రతీ లక్ష జనాభాకు 28గా ఉండగా.. 2024 నాటికి అది 21కి తగ్గింది. టీబీ కారణంగా మరణాలను తగ్గించడంలో విశేష పురోగతికి ఇది నిదర్శనం. ప్రభుత్వ బలమైన నిబద్ధత వల్లే ఈ పురోగతి సాధ్యమైంది. మునుపెన్నడూ లేనివిధంగా.. గత తొమ్మిదేళ్లలో టీబీ కార్యక్రమానికి ప్రభుత్వ నిధులు దాదాపు పది రెట్లు పెరిగాయి.
2024 డిసెంబరులో ప్రారంభించినప్పటి నుంచి.. భారత ప్రతిష్ఠాత్మక టీబీ నిర్మూలన మిషన్ అయిన ‘టీబీ ముక్త భారత్ అభియాన్’ విస్తృత స్థాయిలో ప్రజల్లోకి చేరుకుంది. దీనికింద దేశవ్యాప్తంగా 19 కోట్లకు పైగా బలహీన వర్గాల ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి, 24.5 లక్షల మందికి పైగా టీబీ రోగులను గుర్తించారు. వీటిలో 8.61 లక్షల లక్షణరహిత టీబీ కేసులున్నాయి. అధిక టీబీ కేసులున్న ప్రాంతాల్లో.. వ్యాధి లక్షణాలు కనిపించకుండా టీబీ వ్యాప్తిపై ప్రపంచవ్యాప్తంగాను, స్థానికంగాను ఉదాహరణల దృష్ట్యా ఈ క్రియాశీల విధానాన్ని రూపొందించారు.
భారత్ తన ముందస్తు టీబీ నిర్ధారణ లక్ష్యాలను నెరవేర్చడంలో ప్రపంచంలో అతిపెద్ద టీబీ ప్రయోగశాలల వ్యవస్థ కీలకంగా ఉంది. ఇందులో 9,391 రాపిడ్ మాలిక్యులర్ టెస్టింగ్ కేంద్రాలు, 107 కల్చర్ & డ్రగ్ సెన్సిటివిటీ టెస్టింగ్ ప్రయోగశాలలు ఉన్నాయి. అంతేకాకుండా.. సామూమిక పరీక్ష బలోపేతం చేయడం కోసం.. 500కు పైగా చేతిలో ఇమిడే ఏఐ ఆధారిత ఛాతి ఎక్స్ రే యూనిట్లు దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్నాయి. అదనంగా 1,500 యంత్రాలను రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలకు పంపిణీ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా 1.78 లక్షల ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల ద్వారా.. ఈ కార్యక్రమం సేవలను వికేంద్రీకరించడంతోపాటు టీబీ సంరక్షణను ప్రజలకు మరింత చేరువ చేయగలిగింది.
ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కూడా టీబీ రోగులకు అందించే పోషకాహార సాయాన్ని విస్తరించింది. ని-క్షయ్ పోషణ యోజన (ఎన్‌పీవై) కింద ప్రత్యక్ష ప్రయోజన బదిలీని ఒక్కో వ్యాధిగ్రస్తుడికి నెలకు రూ. 500 నుంచి రూ.1000కి పెంచారు. చికిత్స పొందినంత కాలం ఈ మొత్తం అందుతుంది. 2018 ఏప్రిలులో పథకం ప్రారంభమైనప్పటి నుంచి.. 1.37 కోట్ల మంది లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి రూ. 4,406 కోట్లు ప్రభుత్వం నేరుగా పంపిణీ చేసింది. అలాగే ఇప్పటి వరకు 6,77,541 మంది వ్యక్తులు, సంస్థలు ని-క్షయ మిత్రలుగా నమోదు చేసుకుని.. టీబీ రోగులకు 45 లక్షలకు పైగా ఫుడ్ బాస్కెట్లను పంపిణీ చేశారు. టీబీపై భారత్ చేస్తున్న పోరాటంలో ప్రభుత్వ-ప్రైవేట్-సమాజ భాగస్వామ్యం పెరుగుతుండడాన్ని ఇది సూచిస్తుంది. క్షయపై పోరాటంలో సామాజిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం కోసం.. ‘సమగ్ర సమాజ భాగస్వామ్య స్ఫూర్తి’తో రెండు లక్షలకు పైగా యువ వలంటీర్ల శక్తిని కూడా మంత్రిత్వ శాఖ వినియోగించుకుంది. రెండు లక్షలకు పైగా మై భారత్ వలంటీర్లు ని-క్షయ మిత్రలుగా సేవలందించడానికి ముందుకొచ్చారు. దేశవ్యాప్తంగా టీబీ రోగులకు మానసిక చేయూతను, ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. యువత నేతృత్వంలోని ఈ ఉత్తేజకరమైన కార్యక్రమం.. టీబీ నిర్మూలనను ప్రజా ఉద్యమంగా మలచడంలో, అలాగే స్వస్థతా ప్రయాణంలో ఏ వ్యాధిగ్రస్తుడూ తాము ఒంటరి కాదన్న భరోసా కల్పించేందుకు భారత్ కట్టుబడి ఉందని సూచిస్తోంది.
వ్యాధిగ్రస్తుల అవసరాలను బట్టి వివిధ సంరక్షణ పద్ధతులను కూడా దేశవ్యాప్తంగా మంత్రిత్వ శాఖ విస్తృతంగా అమలు చేసింది. ఈ విధానం కింద.. చికిత్స ఫలితాలను ప్రభావితం చేసే క్లినికల్ అంశాలు, ఇతర సహసంబంధ వ్యాధుల ఆధారంగా అత్యంత ప్రమాదంలో ఉన్న టీబీ రోగులను గుర్తిస్తారు. వారు కోలుకునేందుకు వీలుగా, వారి అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక చికిత్సను అందిస్తారు. అలాగే, టీబీ రోగులను తక్షణమే ఉన్నత చికిత్సా కేంద్రాలకు తరలించేందుకు వీలుగా.. ఆయా ప్రాంతాల్లోని టీబీ రోగుల్లో ముందస్తు ప్రమాద సంకేతాలను గుర్తించేలా ఆశా కార్యకర్తలకూ శిక్షణ ఇచ్చారు.
గౌరవ ప్రధానమంత్రి సమర్థ నాయకత్వం, మార్గదర్శకత్వం, నిర్దేశాల మేరకు.. ప్రమాదంలో ఉన్న ప్రజలందరికీ క్రియాశీలంగా వైద్య పరీక్షలు నిర్వహించడంపై టీబీ ముక్త్ భారత్ అభియాన్ ద్వారా ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారిస్తుంది. లక్షణాలు లేని వ్యక్తులు, సామూహిక నివాసాల్లో ఉన్న వ్యక్తులు సహా అందరికీ చేతిలో ఇమిడే ఎక్స్ రేల ద్వారా వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. వ్యాధిగ్రస్తులను ముందస్తుగానే మాలిక్యులర్ పరీక్షల ద్వారా గుర్తించి- వారికి చికిత్సతోపాటు పోషకాహార, మానసిక-సామాజిక చేయూతను కూడా అందిస్తూ.. సమగ్రమైన, నాణ్యమైన వైద్య సంరక్షణ అందిస్తారు. తద్వారా వారు కోలుకోవడంతోపాటు ఇతరులకు వ్యాప్తి చెందకుండా నిరోధించవచ్చు. ఈ సమగ్ర విధానం టీబీ కేసులను, మరణాలను మరింత తగ్గించి... టీబీ ముక్త భారత్ లక్ష్యానికి దేశాన్ని చేరువ చేస్తుంది.
***
(Release ID: 2189761)
Visitor Counter : 4