వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
అంతర్జాతీయ మార్కెట్లలో గిరిజన ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సిద్ధం: కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి
గిరిజన వర్గాలకు సాధికారత కల్పించేందుకు, వారి చేతివృత్తి నైపుణ్యాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శించడానికి సంయుక్తంగా కృషి చేయాలని కోరిన శ్రీ పీయూష్ గోయల్
‘వన్ ధన్ నుంచి వ్యాపార్ ధన్’గా పరివర్తన చెందాలన్న శ్రీ పీయూష్ గోయల్
Posted On:
12 NOV 2025 7:25PM by PIB Hyderabad
ఎగుమతి సామర్థ్యం ఉన్న అన్ని గిరిజన ఉత్పత్తులకు ఈ-కామర్స్ వేదికలు, వస్తు ప్రదర్శన - అమ్మకాలకు సంబంధించిన అంతర్జాతీయ సౌకర్యాలు, టోకు- రిటైల్ వాణిజ్య వ్యవస్థలతో సహా వివిధ మార్గాల ద్వారా వాణిజ్య శాఖ నుంచి పూర్తి మద్దతు లభిస్తుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ తెలిపారు. ఈ రోజు ఢిల్లీలో జరిగిన గిరిజన వ్యాపార సమ్మేళనం- 2025లో ఈ మేరకు వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి శ్రీ జువాల్ ఓరం కూడా హాజరయ్యారు.
గిరిజన వ్యవహారాలు, సాంస్కృతిక మంత్రిత్వ శాఖల సహకారంతో వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని పరిశ్రమల- అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) ఈ సమ్మేళనాన్ని నిర్వహించింది. బిర్సా ముండా 150వ జయంతిని పురస్కరించుకొని నిర్వహిస్తోన్న జనజాతీయ గౌరవ్ వర్ష్ సమయంలో చేపట్టిన ఈ సమ్మేళనం ఒక కీలక ఘట్టంగా నిలిచిపోతుంది.
దేశీయ, ప్రపంచ మార్కెట్లలో గిరిజన ఉత్పత్తులకు సరియైన గుర్తింపు, మార్కెట్ అవకాశాలను పొందేలా చూసుకునేందుకు ఎగుమతి ప్రోత్సాహక కార్యక్రమాలను బలపేతం చేయటానికి ఒక పథకాన్ని తయారు చేస్తున్నట్లు వాణిజ్య శాఖ మంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు.
దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లు.. గిరిజన వస్తువులు, చేతిపనులకు అపారమైన అవకాశాలను అందిస్తున్నాయని పీయూష్ గోయల్ అన్నారు. రాబోయే సంవత్సరాల్లో ఈ సామర్థ్యాన్ని వినియోగించుకునేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటోందని తెలిపారు.
గిరిజనులు అభివృద్ధి చెందినప్పుడే దేశం నిజంగా స్వయంసమృద్ధిగా మారుతుందని ప్రధానమంత్రి విశ్వసిస్తున్నారని మంత్రి ఉద్ఘాటించారు. గిరిజన, మారుమూల ప్రాంతాల్లోని ప్రతి ఇంటికీ ప్రగతి ఫలాలు అందేలా చూడటంలోనే భారతదేశ వృద్ధి, అభివృద్ధి ఆధారపడి ఉందని ఆయన అన్నారు. గిరిజన, దేశీయ వర్గాల అభ్యున్నతి ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమైన అంశంగా ఉందన్న ఆయన.. ఇది సమ్మిళిత, సుస్థిర అభివృద్ధి విషయంలో ప్రభుత్వ నిబద్ధతను తెలియజేస్తోందని పీయూష్ గోయల్ పునరుద్ఘాటించారు.
బిర్సా ముండాకు నివాళులర్పించిన కేంద్ర మంత్రి.. ఆయన గిరిజన సమాజానికి దిశనిర్దేశం చేయటంతో పాటు నాయకత్వాన్ని చూపించారని అన్నారు. గిరిజన సమాజాన్ని ఉద్ధరించడానికి, జీవనోపాధిని పెంచేందుకు, ప్రతి గిరిజన కుటుంబం సంతోషం - శ్రేయస్సుతో నిండి ఉండేలా చూసుకునే విషయంలో భారతదేశం బిర్సా ముండా జీవితం నుంచి స్ఫూర్తి పొందాలని.. ఆయన అడుగుజాడల్లో నడవాలని అన్నారు. ‘మన భూమి, మన రాజ్యం’ అనే బిర్సా ముండా మాటలను పీయూష్ గోయల్ గుర్తు చేశారు. చరిత్రలో గిరిజన సమాజం అపారమైన కష్టనష్టాలను ఎదుర్కొందని అన్నారు.
అనేక సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ విలువలు, హస్తకళలు, సంప్రదాయ నైపుణ్యాలను పరిరక్షించుకున్నందుకు గిరిజన సమాజాన్ని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి ప్రశంసించారు. స్థిరత్వం, అంకితభావం ద్వారా గిరిజన వర్గాలు చరిత్ర, వారసత్వాన్ని సజీవంగా ఉంచిన విధానం నిజంగా ప్రశంసనీయం అన్నరు. గిరిజన సమాజానికి ఉన్న శక్తి, దృఢ సంకల్పం పట్ల ప్రగాఢ గౌరవంతో ఉన్నట్లు తెలిపారు. భారతదేశ సాంస్కృతిక, సామాజిక నిర్మాణానికి గిరిజన వర్గాల సహకారం అమూల్యమైందని పేర్కొన్నారు.
గిరిజన, దేశీయ ఉత్పత్తుల వాణిజ్యం, వ్యాపారాన్ని ప్రోత్సహించడంలో గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ, వాణిజ్య విభాగం సంయుక్తంగా కీలకమైన పాత్ర పోషించాయని పీయూష్ గోయల్ తెలిపారు. పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, వాణిజ్య సంస్థలు, ప్రభుత్వ సంస్థలు కలిసి దేశంలోని అత్యంత మారుమూల ప్రాంతాల నుంచి నాణ్యమైన గిరిజన ఉత్పత్తులు దేశవ్యాప్తంగా ఉన్న మార్కెట్లు, వినియోగదారులకు చేరేలా చూశాయని ఆయన అన్నారు.
గిరిజన సంక్షేమాన్ని మెరుగుపరచాలన్న లక్ష్యంతో ప్రభుత్వం వివిధ పథకాలు, కార్యక్రమాలను అమలు చేసిందని వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి ప్రధానంగా చెప్పారు. భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము దేశంతో పాటు గిరిజన సమాజానికి గర్వకారణమైన సమర్థవంతమైన ప్రతినిధిగా నిలుస్తున్నారని ఆయన పేర్కొన్నారు. 3900 వన్ ధన్ కేంద్రాలు 12 లక్షల గిరిజనుల అభ్యున్నతికి ఉత్ప్రేరకాలుగా పనిచేశాయని అన్నారు.
గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖకు ఈ సంవత్సరం బడ్జెట్ కేటాయింపును 50 శాతం పెంచినట్లు పీయూష్ గోయల్ తెలిపారు. పీఎం-జన్మన్ యోజన కింద అత్యంత వెనుకబడిన గిరిజన సమూహాలకు చెందిన దాదాపు 50 లక్షల కుటుంబాలు లబ్ధి పొందాయన్న ఆయన.. వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు రూ. 24000 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు.
మూలాలు, సంస్కృతి, సంప్రదాయాల పట్ల భారతదేశంలోని గిరిజన సమాజం అత్యంత గర్వంగా ఉందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి అన్నారు. మరిన్ని గిరిజన ఉత్పత్తులను నమోదు చేయటాన్ని పెంచేందుకు.. గిరిజిన హస్తకళలు, వారసత్వం ద్వారా దేశ చరిత్ర - సంప్రదాయాలు పరిరక్షణను చేపట్టేందుకు భౌగోళిక గుర్తింపుకు (జీఐ) సంబంధించి రుసుంను రూ. 5000 నుంచి రూ. 1000కి… అంటే 80 శాతం తగ్గించినట్లు తెలిపారు.
‘వన్ ధన్ నుంచి వ్యాపార్ ధన్‘గా పరివర్తన చెందాలని పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. గిరిజన, దేశీయ ఉత్పత్తులు అంతర్జాతీయ వేదికలకు చేరుకోవాలని.. తద్వారా ‘స్థానిక వస్తువుల ప్రపంచీకరణ‘ అనే దార్శనికతను నిజం చేయాలని అన్నారు. గిరిజన వర్గాలకు సాధికారత కల్పించడం, వారి చేతివృత్తి నైపుణ్యాన్ని ప్రపంచం ముందు ప్రదర్శించటం అనే ఈ ఉమ్మడి లక్ష్యాన్ని సాధించేందుకు భాగస్వాములందరితో కలిసి పనిచేయాలని కోరారు.
ఈ సమ్మేళనానికి ఫిక్కీ పరిశ్రమ భాగస్వామిగా, ప్రయోగి విజ్ఞాన భాగస్వామిగా ఉన్నాయి. వికసిత భారత్ 2047 కోసం దేశ అభివృద్ధి ఎజెండాలో గిరిజన వ్యాపారాన్ని ప్రధాన బిందువుగా ఉంచాలని తెలియజేసిన ఈ కార్యక్రమం గిరిజనుల స్థిరత్వం, సృజనాత్మకతను వేడుక చేసింది.
ఈ కార్యక్రమంలో 250కి పైగా గిరిజన సంస్థలు పాల్గొన్నాయి. 150 మంది ఎగ్జిబిటర్లు, 100కి పైగా గిరిజన అంకురాలు ఆవిష్కరణలను “రూట్స్ టు రైజ్” పిచ్చింగ్ వేదికలో ప్రదర్శించాయి. పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, కార్పొరేట్ సంస్థలు, ప్రభుత్వ కొనుగోలుదారుల మధ్య ప్రత్యక్ష అనుసంధానతను కల్పించిన ఈ కార్యక్రమం.. సహకారం, వృద్ధికి సంబంధించిన ఒక సజీవ వ్యవస్థను సృష్టించింది.
ఈ సమ్మేళనంలో ఆరు అత్యున్నత ప్రభావవంతమైన ప్యానెల్ చర్చలు, నాలుగు మాస్టర్‌క్లాస్‌లు నిర్వహించారు. ఇందులో ప్రభుత్వం, విద్యా రంగం, పరిశ్రమలకు చెందిన 50 మందికి పైగా ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సెషన్‌లు.. పెట్టుబడి - భాగస్వామ్యాలు, నైపుణ్యం - సాధికారత, సుస్థిరత - భౌగోళిక గుర్తింపు, బ్రాండింగ్ - మార్కెట్ ఆవిష్కరణ వంటి అంశాలపై దృష్టి సారించాయి.
గ్రామ స్థాయి నుంచి అంతర్జాతీయ మార్కెట్ల వరకు గిరిజన వాణిజ్య కార్యకలాపాలను బలోపేతం చేయాలన్న లక్ష్యంతో మార్కెట్ సదుపాయం, నైపుణ్యాభివృద్ధి, విధాన సిఫార్సుల కోసం కార్యాచరణ మార్గాలను తయారుచేసేందుకు కొనుగోలుదారు-అమ్మకందారుల సమావేశాలను కూడా నిర్వహించారు.
‘గిరిజన భారత్ 2047: సంస్కృతిని నిలబెట్టడం, వాణిజ్యాన్ని విస్తరించడం’ అనే ఇతివృత్తం కింద ఒక ప్రత్యేక పెవిలియన్, సాంస్కృతిక ప్రదర్శనలతో కూడిన కార్యక్రమం గిరిజన వారసత్వాన్ని తెలియజేసింది.
సమ్మేళనంలో కీలక ప్రకటనలు:
1. గ్రామ్య యువ అర్థ్ నీతి (గ్యాన్) ల్యాబ్ ప్రారంభం: వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ మద్దతుతో ఐఐటీ బాంబేలోని అశాంక్ దేశాయ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ, ప్రయోగి ఫౌండేషన్ ఏర్పాటు చేసిన ల్యాబ్ ఇది. క్షేత్రస్థాయి అనుభవం, సాంకేతికత, విధానాలను కలిసి పరీక్షించటం ద్వారా గిరిజన, గ్రామీణ సంస్థలకు సంబంధించిన కొత్త నమూనాలను రూపొందించటంపై గ్యాన్ ల్యాబ్ పనిచేయనుంది. వాస్తవ ప్రయోగాలు, విధానాలు, డిజిటల్ ఆవిష్కరణ, సామర్థ్య నిర్మాణాల ద్వారా ఇది.. సమ్మిళిత, సుస్థిర సంస్థల వృద్ధి కోసం అమలు చేయదగిన పరిష్కారాలను తయారుచేస్తుంది. రానున్న సంవత్సరంలో గిరిజన వ్యవస్థాపకత సూచిక, మైక్రో-ఈక్విటీ ఆధారిత ఇంక్యుబేషన్ నమూనాల వంటి ప్రయోగాలను చేపట్టటం ద్వారా ఈ ల్యాబ్.. క్షేత్ర స్థాయిలో నేర్చుకున్న అంశాలను విధాన నిర్ణయాలుగా మార్చేందుకు దోహదపడుతుంది. ప్రభుత్వం, విద్యా రంగం, పరిశ్రమల మధ్య ఈ సహకారం వ్యవస్థాపకత, ఆవిష్కరణల ద్వారా భారత గిరిజన వర్గాలకు సాధికారత కల్పించేందుకు ఉద్దేశించిన ఒక ప్రధాన ఘట్టంగా ఉంటుంది.
2. గిరిజన వ్యవహారాల గ్రాండ్ ఛాలెంజ్: స్టార్టప్ ఇండియా, డీపీఐఐటీ సహకారంతో గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ దీనిని ప్రకటించింది. ఇందులో గిరిజన వర్గాల కోసం అత్యంత ప్రభావవంతమైన పరిష్కారాలను రూపొందించడానికి అంకురాలు, సంస్థలను అహ్వానిస్తారు. తద్వారా వాటికి గుర్తింపు, మార్గదర్శకత్వం, నిధులు అందుతాయి.
3. రూట్స్ టు రైజ్ : పిచ్చింగ్ సెషన్
* రెండు విడతల పరీక్షల అనంతరం 115 సంస్థలను ఎంపికచేశారు. వీటిలో 43 సంస్థలకు డీపీఐఐటీ రిజిస్ట్రేషన్ ఉంది. ఎంపిక చేసిన సంస్థలకు ఇంక్యుబేషన్ మద్దతు అందించేందుకు 10 ఇంక్యుబేటర్లు అంగీకరించాయి. ఏఐఎఫ్, ఏంజెల్ ఇన్వెస్టర్లతో సహా 50 కంటే ఎక్కువ వెంచర్ క్యాపిటలిస్టులు 57 సంస్థల్లో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి కనబరిచాయి. మొత్తం రూ. 10 కోట్ల కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టేందుకు సంసిద్ధంగా ఉన్నట్లు ఇవి తెలిపాయి.
* ఐఎఫ్‌సీఐ వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ లిమిటెడ్, అరోరా వెంచర్ పార్ట్‌నర్స్ వంటి సంస్థలు 33 సంస్థలలో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపాయి.
* ఈ అంకురాలు, సంస్థలు సుమారు 1500 ప్రత్యక్ష ఉద్యోగాలను.. 10,000 కంటే ఎక్కువ పరోక్ష ఉద్యోగాలను సృష్టించాయి. ఇవి వివిధ రంగాలలో మొత్తం 20000 మందికి పైగా గిరిజనులకు సేవలు అందిస్తున్నాయి.
4. ప్రభుత్వ ఈ-మార్కెట్‌ప్లేస్ (జీఈఎం) వేదికపై ఎక్కువ ఆసక్తి కనబర్చటం మరో విశేషం. 60 కంటే ఎక్కువ రిజిస్ట్రేషన్లు, టీబీసీ ఉత్పత్తుల కోసం 50కి పైగా విచారణలు వచ్చాయి.
5. జీఐ ధ్రువపత్రాల పంపిణీ: దేశవ్యాప్తంగా ఉన్న గిరిజన చేతివృత్తులవారి కళాత్మకతను తెలియజేసేలా ఈ కార్యక్రమంలో భాగంగా భౌగోళిక గుర్తింపు (జీఐ) ధ్రువపత్రాలను పంపిణీ చేశారు. కేరళకు చెందిన కన్నాదిప్పాయ (వెదురు చాప), అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన అపటాని వస్త్రాలు, తమిళనాడుకు చెందిన మార్తాండం తేనె, సిక్కింకు చెందిన లెప్చా తుంగ్బుక్, అస్సాంకు చెందిన బోడో అరోనై, గుజరాత్‌కు చెందిన అంబాజీ తెల్ల పాలరాయి, ఉత్తరాఖండ్‌కు చెందిన బేడు- బద్రీ ఆవు నెయ్యి వంటి చేతిపనులు, ఉత్పత్తులు ఈ విధంగా తగిన గుర్తింపును పొందాయి. ఈ గుర్తింపు గిరిజన ఉత్పత్తులకు మార్కెట్ సదుపాయం, బ్రాండ్ విలువ - జాతీయ గుర్తింపును పెంచడంలో ఒక కీలక ముందడుగుగా ఉంటుంది. ఇది చేతివృత్తులవారికి సాధికారత కల్పించటంతో పాటు భారత సుసంపన్నమైన దేశీయ వారసత్వాన్ని పరిరక్షిస్తుంది.
***
(Release ID: 2189486)
Visitor Counter : 3