ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
నర్సింగ్ విద్యను, వ్యవస్థను ప్రోత్సహించేలా సమాలోచనలు జరిపేందుకు, అనుభవాలను పంచుకొనేందుకు జాతీయ వర్క్‌షాపు నిర్వహిస్తున్న కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ
భారత ఆరోగ్య రంగానికి నర్సులు, మిడ్‌వైఫులు వెన్నెముక లాంటి వారు, ఈ వ్యవస్థకు మూల స్తంభాలుగా నిలిచారు: కేంద్ర ఆరోగ్య కార్యదర్శి
భారత్‌లో ఆరోగ్య సేవల నాణ్యతకు నర్సుల సామర్థ్యం, అంకితభావమే కారణం: వీకే పాల్, నీతి ఆయోగ్ సభ్యులు
అంతర్జాతీయంగా నర్సింగ్ నిపుణులను అందిస్తున్న ప్రధాన దేశాల్లో ఒకటిగా భారత్ ఎదిగింది: భారత్‌లో డబ్ల్యూహెచ్‌వో ప్రతినిధి
Posted On:
12 NOV 2025 12:39PM by PIB Hyderabad
నర్సింగ్ విధాన ప్రాధాన్యాలు, ఉత్తమ పద్ధతులపై సమాలోచనలు చేయడానికి, అనుభవాలను పంచుకోవడానికి మూడు రోజుల జాతీయ వర్క్ షాపును కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది. నర్సింగ్, మిడ్వైఫరీ రంగంలో విధాన చర్చలను బలోపేతం చేయడం, సంస్కరణలను ముందుకు తీసుకెళ్లడం కోసం.. ఈ వర్క్ షాపును ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో), జపైగో సహకారంతో మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది.
దేశవ్యాప్తంగా ఉన్న విధాన నిర్ణేతలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, నియంత్రణా వ్యవస్థలు, నర్సింగ్ ఉపాధ్యాయులు, నిపుణుల సంఘాలు, అభివృద్ధి భాగస్వాములు, తదితరులను ఈ వర్క్‌షాపు ఒక్కచోటకు చేర్చింది. భారత ఆరోగ్య రంగం ప్రాధాన్యాలు, సుస్థిరాభివృద్ధి లక్ష్యాల (ఎస్డీజీ)కు అనుగుణంగా నర్సింగ్ విధానాన్ని, విద్యను, నిపుణుల నిర్వహణను బలోపేతం చేయడానికి కొనసాగుతున్న కార్యక్రమాలను సమీక్షించడం, కొత్తగా ఎదురవుతున్న సవాళ్లను గుర్తించడం, వినూత్న విధానాలను పంచుకోవడమే ఈ చర్చల లక్ష్యం.
ఈ సందర్భంగా ఆరోగ్య కార్యదర్శి శ్రీమతి పుణ్య సలిల శ్రీ వాస్తవ మాట్లాడుతూ.. భారత ఆరోగ్య రంగానికి నర్సులు, మిడ్‌వైఫులు వెన్నెముక లాంటి వారని, ఈ వ్యవస్థ మూలస్తంభాలలో ఒకరిగా నిలిచారన్నారు. వీరంతా సార్వత్రిక ఆరోగ్య కవరేజి (యూహెచ్‌సీ) సాధనకు ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు, ఆశా వర్కర్లతో పాటు కీలక పాత్ర పోషిస్తున్నారని వివరించారు.
జాతీయ నర్సింగ్, మిడ్ వైఫరీ కమిషన్ (ఎన్‌ఎన్‌ఎంసీ) ఏర్పాటు, సామర్థ్య ఆధారిత పాఠ్యాంశాల స్వీకరణ, విధాన నియంత్రణలను ఆధునికీకరించడం లాంటి తాజా సంస్కరణలు భారత నర్సింగ్ వ్యవస్థను బలోపేతం చేయడంలో ప్రధాన విజయాలుగా నిలుస్తాయని ఆమె అన్నారు.
ప్రతి రాష్ట్రంలోనూ అనుసరిస్తున్న ఉత్తమ పద్ధతులు ఈ వర్కుషాపు ద్వారా జాతీయ విధాన రూపకల్పనకు మార్గనిర్దేశం చేస్తాయన్నారు. ఈ నమూనాలను విస్తృతంగా అమలు చేయడానికి, దేశవ్యాప్తంగా నర్సింగ్ రంగాన్ని మెరుగుపరచడానికి ఇతర రాష్ట్రాలు వాటి వివరాలను రాసుకోవాలని సూచించారు.
నీతి ఆయోగ్ ఆరోగ్య రంగ సభ్యుడు ప్రొఫెసర్ వీకే పాల్ ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న కుటుంబ, ఆరోగ్య సంక్షేమ మంత్రిత్వ శాఖను, డబ్ల్యూహెచ్‌వోను ప్రశంసించారు. నాణ్యమైన ఆరోగ్య సేవలను అందించడంలోనూ.. సమర్థులైన, అంకితభావం కలిగిన నర్సింగ్ నిపుణులను తయారు చేయడంలోనూ భారత ఆరోగ్య రంగం అంతర్జాతీయ గుర్తింపు సాధించిందన్నారు. భారత సమగ్ర ఆరోగ్య వ్యవస్థకు నర్సింగ్ వెన్నెముక అని పునరుద్ఘాటించారు.
నర్సులకు అందించే శిక్షణ నాణ్యతపై ఆందోళన వ్యక్తం చేసిన డాక్టర్ పాల్.. ఇది సునిశిత దృష్టి సారించాల్సిన రంగమని తెలియజేశారు. నర్సింగ్ విద్యలో సంస్కరణలు చేపట్టాల్సిన అవసరాన్ని స్పష్టం చేస్తూ.. సేవలు, వృత్తిపరమైన నైపుణ్యాల్లో ఉన్నత ప్రమాణాలను సాధించడానికి ఇన్-సర్వీసు శిక్షణ, నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యమివ్వాలని పిలుపునిచ్చారు.
భారత్‌లో డబ్ల్యుహెచ్‌వో ప్రతినిధి డాక్టర్ పేడెన్ మాట్లాడుతూ.. నర్సింగ్, మిడ్ వైఫరీ రంగంలో దేశం సాధించిన గణనీయమైన ప్రగతిని ప్రశంసించారు. అంతర్జాతీయంగా నర్సింగ్ నిపుణులను ఎక్కువ అందిస్తున్న దేశాల్లో ఒకటిగా భారత్ ఎదిగిందని ఆమె అన్నారు. 2030 నాటికి ఆగ్నేయాసియా ప్రాంతంలో నర్సుల కొరత తీరుతుందని, దీనికి భారత్ చేపట్టిన ప్రగతిశీల, విధానపరమైన నిర్ణయాలే కారణమని వివరించారు.
నర్సింగ్ నిపుణులకు సమాన అవకాశాలు, విద్య, శిక్షణ సంస్థల్లో నాణ్యతకు హామీ, నాయకత్వ అభివృద్ధి, కెరీర్ వృద్ధి మార్గాలను అందించడంలో విధాన ప్రాధాన్యాలపై ఈ కార్యక్రమంలో చర్చించారు. ప్రపంచ నర్సింగ్ స్థితిగతులు 2025 నివేదిక ఫలితాలకు అనుగుణంగా జాతీయ నర్సింగ్ వ్యూహాలకు ప్రాధాన్యమివ్వడం, సామర్థ్య నిర్మాణం, ఉత్తమ పద్ధతులను ముందుకు తీసుకెళ్లడానికి అంతర్జాతీయ భాగస్వామ్యాలను ఏర్పాటు చేసుకోవడం గురించి స్పష్టంగా వివరించారు.
మూడు రోజుల పాటు జరిగే ఈ వర్కుషాపులో సాంకేతిక సెషన్లు, ప్యానెల్ చర్చలు, నర్సింగ్ విద్య, శ్రామిక శక్తి ప్రణాళిక, డిజిటల్ లెర్నింగ్‌లో రాష్ట్రాలు అనుసరిస్తున్న వినూత్న విధానాలకు సంబంధించిన ప్రజెంటేషన్లు ఉంటాయి. దేశవ్యాప్తంగా స్థిరమైన, నైపుణ్యాలున్న, సాధికారత కలిగిన నర్సింగ్ నిపుణులను తయారు చేయడానికి సాక్ష్యం ఆధారిత విధాన రూపకల్పనను ప్రోత్సహించడం, రాష్ట్రాల మధ్య నేర్చుకొనే వీలును కల్పించడమే ఈ చర్చల లక్ష్యం.
ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన ‘‘స్టేట్ ఆఫ్ ది వరల్డ్స్ నర్సింగ్ రిపోర్టు’’ అంతర్జాతీయంగా నర్సింగ్ నిపుణుల సరళి, ప్రాధాన్యాలకు సంబంధించిన సమగ్ర వివరాలను అందిస్తుంది. ఈ రిపోర్టును ఇక్కడ చదవండి:
https://www.who.int/publications/i/item/9789240110236
***
(Release ID: 2189456)
Visitor Counter : 7