యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
చరిత్రాత్మకంగా సాయ్‌లో అసిస్టెంట్ కోచ్‌ల నియామకాలను చేపట్టనున్నట్లు ప్రకటించిన కేంద్ర క్రీడా మంత్రి డా. మన్‌సుఖ్ మాండవీయ
రాబోయే సంవత్సరాల్లో భారత క్రీడా ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంలో
కీలక పాత్ర పోషించనున్న ఈ వ్యూహాత్మక నియామకం: కేంద్ర క్రీడా మంత్రి
భారత్‌ను ప్రపంచ క్రీడా శక్తిగా మార్చాలన్న ప్రధానమంత్రి ఆశయం కోసం
ఈ నియమకాలు: కేంద్ర క్రీడా మంత్రి
25 క్రీడా విభాగాల్లో 320కి పైగా అసిస్టెంట్ కోచ్ పోస్టులను భర్తీ చేయనున్న సాయ్
మరింత బలోపేతం కానున్న కోచింగ్ వ్యవస్థ
50 శాతం పోస్టులు మహిళలకు కేటాయింపు
Posted On:
10 NOV 2025 6:16PM by PIB Hyderabad
చరిత్రాత్మకంగా భారత క్రీడా ప్రాధికార సంస్థలో (సాయ్) అసిస్టెంట్ కోచ్ పోస్టుల (7వ సీపీసీ వేతనాలు, స్థాయి- 06) కోసం నియామక కార్యక్రమానికి యువజన వ్యవహారాలు- క్రీడల మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. 2017 తర్వాత నియామకాలు జరగడం అదీ ఈ స్థాయిలో, ఇదే మొదటిసారి. భారతీయ క్రీడలలో ముఖ్య పాత్ర పోషించే ఈ పోస్టుల కోసం చేపట్టే అతిపెద్ద నియామక ప్రక్రియ కూడా ఇదే. ఈ రోజు మీడియాతో మాట్లాడిన కేంద్ర యువజన వ్యవహారాలు - క్రీడలు, కార్మిక - ఉపాధి శాఖ మంత్రి శ్రీ డా. మన్‌సుఖ్ మాండవీయ ఈ విషయాన్ని ప్రకటించారు.
"ప్రతిభ ఆధారంగా నిష్పాక్షికత, పారదర్శకతతో నియామకం జరిగేలా చూసుకునేందుకు.. ప్రతిభావంతులైన ఉత్తమ కోచ్‌లను గుర్తించి ఎంపిక చేసేందుకు ఒక సమగ్ర ప్రక్రియను ఏర్పాటు చేయనున్నాం. రాబోయే సంవత్సరాల్లో భారత క్రీడా రంగపు ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంలో ఈ వ్యూహాత్మక నియామకం కీలక పాత్ర పోషిస్తుంది" అని శ్రీ డా. మన్‌సుఖ్ మాండవీయ వ్యాఖ్యానించారు.
“ఈ నియామక కార్యక్రమం భారత్‌ను ప్రపంచ క్రీడా శక్తిగా మార్చటంతో పాటు పారదర్శక- ప్రతిభ ఆధారిత వ్యవస్థలు, సంస్థాగత సామర్థ్యం పెంపుదల ద్వారా దేశ క్రీడా వ్యవస్థను బలోపేతం చేయాలనే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆశయానికి అనుగుణంగా ఉంది. ” అని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు.
25 క్రీడా విభాగాలలో 320కి పైగా ఖాళీలు నేరుగా భర్తీ చేయనున్నారు. దేశ క్రీడా అభివృద్ధిలో అసిస్టెంట్ కోచ్ క్యాడర్ ఒక ముఖ్యమైన అనుసంధాన పాత్ర పోషిస్తుంది. క్షేత్ర స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు క్రీడా ప్రతిభావంతులను గుర్తించి, వారిని మరింత మెరుగుపరిచే పునాదిగా అసిస్టెంట్ కోచ్‌లు పనిచేస్తారు. ఈ క్యాడర్‌ను బలోపేతం చేయడం అనేది భారత్‌లోని అథ్లెట్లకు నిర్మాణాత్మక, అధిక-నాణ్యత గల కోచింగ్ అందించేందుకు దోహదపడుతుంది.
ఒలింపిక్, ఆసియా క్రీడల్లో పతకాలు సాధించేందుకు ప్రభుత్వం అనుసరిస్తోన్న వ్యూహానికి అనుగుణంగా ఈ నియామక ప్రక్రియను రూపొందించనున్నారు. పతకాలు సాధించే అవకాశం ఎక్కువ ఉన్న నీటిలో ఆడే ఆటలు, సైక్లింగ్ వంటి క్రీడా విభాగాలపై ఇది దృష్టి సారిస్తుంది. వీటితో పాటు దేశంలో విస్తృత క్రీడా సంస్కృతి, సమగ్ర క్రీడా వ్యవస్థను తయారుచేసేందుకు దోహదపడే క్రీడలకు కూడా ప్రాధాన్యత లభించనుంది. గతంలో తక్కువ దృష్టి సారించిన లాన్ టెన్నిస్, కయాకింగ్, కానోయింగ్ వంటి ఆటల్లో అవకాశాలు, ప్రాముఖ్యత పెరుగుతున్నందున.. ఈ క్రీడా విభాగాలలో కోచ్‌లను నియమించటంపై కూడా ఈ విడత ఎంపిక ప్రక్రియ ప్రత్యేక దృష్టి సారించనుంది.
లింగ సమ్మిళితత్వం పట్ల ప్రభుత్వ నిబద్ధతకు అనుగుణంగా 50 శాతం కంటే ఎక్కువ పోస్టులను మహిళలకు కేటాయించారు. ఇది దేశంలో మహిళా కోచ్‌ల కొరతను తీర్చడమే కాకుండా సురక్షితమైన క్రీడా వాతావరణాన్ని కూడా బలోపేతం చేస్తుంది. తద్వారా దేశానికి గర్వకారణమైన మహిళా క్రీడాకారులందరికీ భద్రత, ఆత్మవిశ్వాసం, సాధికారత లభిస్తాయి.
ప్రపంచ క్రీడా శక్తిగా ఎదగాలనే భారతదేశ ఆశయానికి అనుగుణంగా పనితీరు ఆధారిత బలమైన, సమ్మిళితమైన కోచింగ్ వ్యవస్థను తయారు చేసేందుకు మంత్రిత్వ శాఖ చేస్తున్న నిరంతర ప్రయత్నాలకు ఈ నియామకాలే నిదర్శనం.
***
(Release ID: 2188594)
Visitor Counter : 7