పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
బ్రెజిల్‌లోని బెలేంలో జరిగిన ‘యూఎన్‌ఎఫ్ సీసీసీ సీఓపీP30’ నాయకుల సదస్సులో సమాన వాతావరణ చర్యపై నిబద్ధతను ప్రకటించిన భారత్
అభివృద్ధి చెందిన దేశాలు తమ ఉద్గారాల తగ్గింపు చర్యలను వేగవంతం చేయాలన్న భారత్.. తగిన, స్థిరమైన మద్దతునందించేలా వాగ్దానం చేయాలని సూచన
బ్రెజిల్ ప్రారంభించిన ట్రాపికల్ ఫారెస్ట్స్ ఫరెవర్ ఫెసిలిటీ (టీఎఫ్‌ఎఫ్‌ఎఫ్) కార్యక్రమాన్ని స్వాగతించిన భారత్.. కార్యక్రమంలో పరిశీలకుడిగా చేరిన భారత్
प्रविष्टि तिथि:
08 NOV 2025 10:02AM by PIB Hyderabad
బ్రెజిల్‌లోని బెలేం నగరంలో జరుగుతున్న యూఎన్‌ఎఫ్‌సీసీసీ 30వ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ నాయకుల సదస్సులో నవంబర్ 7న భారత్ జాతీయ ప్రకటనను అందజేసింది. సమానత్వం, జాతీయ పరిస్థితులు, సాధారణమే అయినా భిన్నమైన బాధ్యతలు, సంబంధిత సామర్థ్యాల సూత్రాల ఆధారంగా వాతావరణ చర్యలకు భారత్ కట్టుబడి ఉన్నట్లు బ్రెజిల్‌లో భారత రాయబారి శ్రీ దినేష్ భాటియా స్పష్టం చేశారు. వాతావరణ మార్పులపై యూఎన్‌ఎఫ్‌సీసీసీకి సంబంధించిన 30వ పార్టీల సమావేశం నవంబర్ 10 నుంచి 21 వరకు బ్రెజిల్‌లోని బెలేం నగరంలో జరుగనుంది.
పారిస్ ఒప్పందం 10వ వార్షికోత్సవ సందర్భంగా సీఓపీ 30 సమావేశానికి ఆతిథ్యం ఇస్తున్నందుకు బ్రెజిల్‌కు భారత్ ధన్యవాదాలు తెలిపింది. రియో సదస్సు 33 ఏళ్ల వారసత్వాన్ని భారత్ గుర్తుచేసింది. గ్లోబల్ వార్మింగ్ సవాలుపై ప్రపంచ ప్రతిస్పందనను సమీక్షించేందుకు ఇదొక అవకాశంగా భారత్ తన ప్రకటనలో పేర్కొంది. రియో సదస్సులో స్వీకరించిన సమానత్వం, సీబీడీఆర్-ఆర్‌సీ సూత్రాలు అంతర్జాతీయ వాతావరణ విధానానికి పునాది వేశాయని, వాటి వారసత్వాన్ని జరుపుకోవడానికి ఇది ఒక సందర్భమని భారత్ తెలిపింది. ఇవే సూత్రాలు తరువాత పారిస్ ఒప్పందం సహా అంతర్జాతీయ వాతావరణ విధాన వ్యవస్థకు పునాదిగా నిలిచాయి.
ట్రాపికల్ ఫారెస్ట్స్ ఫరెవర్ ఫెసిలిటీని (టీఎఫ్‌ఎఫ్‌ఎఫ్) స్థాపించేందుకు బ్రెజిల్ తీసుకున్న నిర్ణయాన్ని భారత్ స్వాగతించింది. ఈ కార్యక్రమం ఉష్ణమండల అరణ్యాల సంరక్షణ కోసం సమిష్టి, దీర్ఘకాలిక ప్రపంచ చర్యల దిశగా కీలక అడుగుగా భారత్ పేర్కొంది. భారత్ ఈ ఫెసిలిటీలో పర్యవేక్షక దేశంగా చేరింది.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ చేపట్టిన తక్కువ కార్బన్ ను సాధించే మార్గాన్ని ప్రస్తావిస్తూ.. 2005 నుంచి 2020 మధ్య కాలంలో భారత జీడీపీ ఉద్గార తీవ్రతను 36 శాతం తగ్గించిందని, ఈ ధోరణి ఇంకా కొనసాగుతోందని పేర్కొంది. ఇప్పటికీ దేశంలో శిలాజేతర ఇంధన విద్యుత్ ఉత్పత్తి మొత్తం విద్యుత్ సామర్థ్యంలో 50 శాతం కంటే ఎక్కువ వాటా కలిగి ఉందని, దీని వల్ల భారత్ సవరించిన ఎన్‌డీసీ లక్ష్యాన్ని నిర్దేశించిన గడువు కంటే అయిదేళ్లు ముందుగానే సాధించగలిగిందని తెలిపింది.
దేశంలో అటవీ, వృక్షాల విస్తరణ గణనీయంగా పెరిగిందని భారత్ తన ప్రకటనలో.. తెలిపింది. 2005 నుంచి 2021 మధ్య 2.29 బిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ సమానమైన అదనపు కార్బన్ సింక్‌ను సృష్టించినట్లు పేర్కొంది. దాదాపు 200 గిగావాట్ల పునరుత్పాదక శక్తి సామర్థ్యంతో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద పునరుత్పాదక ఇంధన శక్తి ఉత్పత్తిదారుగా భారత్ అవతరించిందని తెలిపింది. అంతర్జాతీయ సౌర కూటమి వంటి ప్రపంచ కార్యక్రమాలు ప్రస్తుతం 120కి పైగా దేశాలను ఏకం చేస్తున్నాయని, ఇవి తక్కువ ఖర్చుతో సౌరశక్తిని ప్రోత్సహించడంతోపాటు దక్షిణ-దక్షిణ సహకారాన్ని బలపరుస్తున్నాయని చెప్పింది.
పారిస్ ఒప్పందానికి 10 సంవత్సరాలు పూర్తవుతున్న సమయంలో అనేక దేశాల ఎన్‌డీసీలు తగినంత స్థాయిలో లేవని, అభివృద్ధి చెందుతున్న దేశాలు నిర్ణయాత్మక వాతావరణ చర్యలు తీసుకుంటున్నప్పటికీ, ప్రపంచవ్యాప్త ఆశయానికి ఇది సరిపోదని భారత్ పేర్కొంది. మిగిలిన కార్బన్ బడ్జెట్ వేగంగా తగ్గుతున్నందున, అభివృద్ధి చెందిన దేశాలు ఉద్గారాల తగ్గింపును వేగవంతం చేయాలని సూచించింది. వాగ్దానం చేసినట్లుగా తగిన, స్థిరమైన ఆర్థిక సహాయాన్ని అందించాలని స్పష్టం చేసింది.
అభివృద్ధి చెందుతున్న దేశాలలో కఠినమైన వాతావరణ లక్ష్యాలను సాధించేందుకు తక్కువ ఖర్చుతో లభించే ఆర్థిక సహాయం, సాంకేతిక వ్యాప్తి, సామర్థ్య నిర్మాణం అవసరమని భారత్ పేర్కొంది. ప్రపంచ వాతావరణ లక్ష్యాలను సాధించడానికి సమానమైన, అంచనా వేయదగిన, రాయితీ వాతావరణ నిధులు కీలకమని తెలిపింది. సీబీడీఆర్-ఆర్‌సీ సూత్రాలు, జాతీయ పరిస్థితుల ఆధారంగా భారత్ ఇతర దేశాలతో కలిసి సుస్థిరత వైపు మార్పు కోసం సమగ్ర, న్యాయమైన, సమానమైన పరిష్కారాలను అమలు చేయడానికి సిద్ధంగా ఉందని తెలిపింది.
బహుపాక్షికతకు, పారిస్ ఒప్పందం నిర్మాణాన్ని పరిరక్షించడం, బలోపేతానికి కట్టుబడి ఉన్నట్లు భారత్ ప్రకటించింది. వచ్చే 10 సంవత్సరాలు తీసుకునే వాతావరణ చర్యలు కేవలం లక్ష్యాలకే పరిమితం కాకుండా, అమలు, స్థితిస్థాపకత, పరస్పర నమ్మకం, న్యాయబద్దత ఆధారంగా ఉండాలని అన్ని దేశాలకు భారత్ పిలుపునిచ్చింది.
***
(रिलीज़ आईडी: 2188166)
आगंतुक पटल : 29