ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఉత్తరాఖండ్ రాష్ట్ర రజతోత్సవ కార్యక్రమం... ప్రత్యేక అంశాల్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి

Posted On: 09 NOV 2025 3:46PM by PIB Hyderabad

డెహ్రాడూన్ లో ఈ రోజు నిర్వహించిన ఉత్తరాఖండ్ రాష్ట్ర అవతరణ రజతోత్సవ కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొన్నారు. రూ.8,140 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి ప్రారంభోత్సవంతో పాటు శంకుస్థాపన చేశారు. అంకిత భావంతో, దీర్ఘ కాలం పోరాడిన ఫలితమే నవంబరు 9 సన్నివేశమనీ, ఈ రోజు మనందరిలోనూ ఆనందం వెల్లివిరిసేట్లు చేస్తోందనీ ప్రధానమంత్రి అన్నారు.

‘ఎక్స్’లో అనేక సందేశాల్లో శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:

‘‘ అభివృద్ధి పట్ల ప్రజల్లో వ్యక్తమవుతున్న తిరుగులేని సంకల్పం డెహ్రాడూన్‌లో నిర్వహిస్తున్న ఉత్తరాఖండ్ అవతరణ రజతోత్సవ కార్యక్రమాల్లో కొత్త శక్తిని నింపింది.’’

‘‘వికసిత్ భారత్‌ను సాకారం చేసే దిశగా ఉత్తరాఖండ్ తన వంతుగా శక్తిమంతమైన భాగస్వామ్యాన్ని అందిస్తోంది. రాష్ట్ర రజతోత్సవాన్ని వివరిస్తూ ఏర్పాటు చేసిన ఆకర్షణీయ ప్రదర్శనలో ఈ రాష్ట్ర అభివృద్ధి ప్రస్థానాన్ని నేను స్వయంగా చూశాను.’’

‘‘ఉత్తరాఖండ్ సంప్రదాయాలు, సంస్కృతితో పాటు ఈ రాష్ట్రం సాధించిన ప్రగతిని కళ్లకు కట్టిన కాఫీ టేబుల్ బుక్‌ను ఆవిష్కరించడం ఎంతో సంతోషాన్నిచ్చింది.’’

‘‘ఉత్తరాఖండ్ ఏర్పాటై ప్రస్తుతం రజతోత్సవాన్ని నిర్వహించుకొంటున్న సందర్భంగా, ప్రత్యేక తపాలా బిళ్లను నేను విడుదల చేస్తున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది.. ’’

‘‘ఉత్తరాఖండ్ ప్రజానీకం ఏళ్ల తరబడి కన్న కలలు, చేసిన తపస్సు ఫలితమే నవంబరు 9. రాష్ట్ర రజతోత్సవం సందర్భంగా అమరులందరికీ శ్రద్ధాంజలి ఘటించడంతో పాటు ఉద్యమంలో కదం తొక్కిన వారికి వందనం చేస్తున్నాను’’

‘‘ఉత్తరాఖండ్ ఏర్పడి, ఇవాళ్టితో 25 సంవత్సరాలు పూర్తి అవుతున్నాయి.. ఇది రాష్ట్ర పురోగతిలో చోటుచేసుకున్న మేలిమలుపన్న విశ్వాసం నాలో మరింతగా బలపడింది.’’

‘‘గడిచిన సంవత్సరాల్లో, ఉత్తరాఖండ్ అభివృద్ధి ప్రస్థానం అద్భుతం. ప్రతి రంగంలోనూ ఈ రాష్ట్రం ఎంతో ప్రగతిని సాధించింది. ఈ మార్పు.. అందరినీ కలుపుకొని ముందుకు సాగే మా విధానం ఫలితమే.’’

‘‘దేవభూమి ఆధ్యాత్మిక శక్తే దీని సిసలైన గుర్తింపుగా నిలుస్తోంది. ఉత్తరాఖండ్ సంకల్పం చెప్పుకొందంటే చాలు.. రాబోయే కొన్ని సంవత్సరాల్లో తనను తాను ‘‘ప్రపంచానికి ఆధ్యాత్మిక రాజధాని’’గా తీర్చిదిద్దుకోగలుగుతుంది.’’

‘‘స్వయంసమృద్ధి భారత్‌ను ఆవిష్కరించాలని దేశం సంకల్పం చెప్పుకొంది.. వోకల్ ఫర్ లోకల్ మార్గంలో పయనిస్తూ ఆ గమ్యాన్ని చేరుకొంటుంది. ఉత్తరాఖండ్ మొదటి నుంచీ కూడా ఈ దృష్టికోణాన్ని అనుసరిస్తూనే ఉంది.’’

‘‘ఉత్తరాఖండ్‌లో బీజేపీ డబల్ ఇంజన్ ప్రభుత్వం రాష్ట్ర ప్రగతి యాత్రలో ఎదురైన అనేక సవాళ్లను అధిగమించింది. ఈ వేగానికి బ్రేకు పడకుండా, తగిన జాగ్రత్తలు తీసుకున్నాం.’’

 

***


(Release ID: 2188154) Visitor Counter : 2