కర్ణాటకలోని బెంగళూరులో తన ఏకైక కుమార్తెను కోల్పోయి దుఃఖంతో ఉన్న తండ్రి (64).. అంబులెన్స్ డ్రైవర్ కు, పోలీసులకు, శ్మశానవాటిక సిబ్బందికి, మున్సిపల్ అధికారులకు లంచాలు చెల్లించాల్సి వచ్చిందని మీడియాలో వచ్చిన వార్తలను జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్ఆర్‌సీ), ఇండియా సుమోటోగా విచారణకు స్వీకరించింది. అక్టోబర్ 30, 2025న మీడియాలో వచ్చిన కథనం ప్రకారం, శాంతియుతంగా జరగాల్సిన అంతిమ సంస్కారం కాస్తా.. అవినీతి, అధికారుల నిర్లక్ష్యం, అమానవీయ చర్యలకు నిదర్శనంగా మారింది.
ఒకవేళ వార్తా అంశాలు నిజమైతే, మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించి తీవ్రమైన సమస్యలు ఎదురవుతాయని కమిషన్ భావించింది. ఈ విషయంపై రెండు వారాల్లోపు పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని కోరుతూ కర్ణాటక ప్రధాన కార్యదర్శి, పోలీసు డైరెక్టర్ జనరల్ కు నోటీసులు జారీ చేసింది.
ఐఐటీ మద్రాస్, ఐఐఎం అహ్మదాబాద్‌లో చదువుకున్న ఓ యువతి బెంగుళూరులో పనిచేస్తున్నారు. మెదడులో రక్తస్రావం కారణంగా సెప్టెంబర్ 18, 2025న ఆమె మరణించారు. కూతురు చనిపోయిన తర్వాత, తండ్రి అంబులెన్స్‌కు కాల్ చేయగా, సేవలకు గానూ అంబులెన్స్ డ్రైవర్ అధిక ఛార్జీలు వసూలు చేశాడు. కూతురి మరణవార్త గురించి పోలీసులకు సమాచారం అందించినప్పుడు, వాళ్లు దయచూపక పోగా, లంచం తీసుకున్న తర్వాతే ఎఫ్ఐఆర్, పోస్టుమార్టం రిపోర్టులను అందించినట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి.
మరణించిన యువతి కుటుంబ సభ్యులు, ఆమె కళ్లను దానం చేశారు. దహన సంస్కారాలకు లంచం డిమాండ్ చేయగా, తండ్రి చెల్లించారు. మరణ ధ్రువీకరణ పత్రం జారీ చేయటంలోనూ మహాదేవపుర మున్సిపల్ అధికారులు జాప్యం చేశారు. సీనియర్ అధికారి ఈ విషయంలో జోక్యం చేసుకున్నప్పటికీ, లంచం చెల్లించిన తర్వాతే కుమార్తె మరణ ధ్రువీకరణ పత్రాన్ని తండ్రికి అందించినట్లు వార్తా కథనాలు వెల్లడించాయి.