వ్యవసాయ మంత్రిత్వ శాఖ
పంట బీమా క్లెయిములపై రైతుల ఫిర్యాదులను తీవ్రంగా పరిగణించిన కేంద్ర వ్యవసాయ మంత్రి శ్రీ శివ్‌రాజ్ సింగ్ చౌహాన్.. ఢిల్లీలో ఉన్నత స్థాయి సమావేశం
దృశ్య మాధ్యమం ద్వారా మహారాష్ట్ర రైతుల సమస్యలను విన్న వ్యవసాయ మంత్రి శ్రీ శివ్‌రాజ్ సింగ్
పంట బీమా విషయంలో రైతులకు ఇబ్బంది కలగకుండా దర్యాప్తునకు ఆదేశం
ఒక రూపాయి, 3 రూపాయలు, 5 రూపాయల క్లెయిముల చెల్లింపు రైతులను పరిహసించడమే..
ప్రభుత్వ ఆధ్వర్యంలో పూర్తి స్థాయి దర్యాప్తు: శ్రీ శివ్‌రాజ్ సింగ్
పంట బీమా క్లెయిము సొమ్ముల్లో తప్పులపై కేంద్ర వ్యవసాయ మంత్రి అసంతృప్తి
రైతుల ప్రయోజనాల దృష్ట్యా బీమా వాణిజ్య సంస్థలతో పాటు అధికారులకు
సూచనలు చేసిన కేంద్ర మంత్రి..
క్లెయిములు అందరికీ త్వరగా, ఏకకాలంలో అందించాలి: శ్రీ శివ్‌రాజ్ సింగ్
నష్టాల్ని కచ్చితమైన పద్ధతుల్లో పక్కాగా అంచనా: కేంద్ర మంత్రి శ్రీ శివ్‌రాజ్ సింగ్
రాష్ట్రాల జాప్యం కారణంగా కేంద్ర ప్రతిష్ఠ మసకబారవద్దు...
అధికారులు సమన్వయంతో పనిచేయాలన్న శ్రీ శివ్‌రాజ్ సింగ్
Posted On:
03 NOV 2025 7:31PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి పంట బీమా పథకానికి సంబంధించి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలనూ, క్లెయిము చెల్లింపులపై ఫిర్యాదులనూ పరిష్కరించడానికి కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ శివ్‌రాజ్ సింగ్ చౌహాన్ ఢిల్లీలో ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో భాగంగా మహారాష్ట్ర రైతులు కొందరితో దృశ్య మాధ్యమం ద్వారా మాట్లాడారు. రైతు సమస్యలపై అధికారుల్ని ప్రశ్నించారు. ఎట్టి పరిస్థితుల్లో రైతులను ఇబ్బందుల్ని పరిష్కరిస్తామని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.
ఒక రూపాయి, 3 రూపాయలు, 5 రూపాయలు, లేదా 21 రూపాయలు...వంటి చిన్న మొత్తాల్ని ఇచ్చి, రైతుల్ని పరిహసించడమే....ఇలాంటి తీరును ప్రభుత్వం ఇకపై సహించదు’’ అని శ్రీ చౌహాన్ అన్నారు. ఈ విషయంలో సమగ్ర పరిశీలన చేపట్టాల్సిందిగా ఆయన ఆదేశిస్తూ, రైతుల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని బీమా వాణిజ్య సంస్థలకూ, అధికారులకూ కఠినమైన ఆజ్ఞలిచ్చారు. క్లెయిములను త్వరితగతిన, ఏక కాలంలో చెల్లించాల్సిందేనన్నారు. నష్టాల అంచనాకు తప్పనిసరిగా నిర్దిష్ట ప్రణాళికను అనుసరించాలనీ, పొసగని అంశాలేవైనా ఉంటే వాటిని తొలగించడానికి పథకం నియమావళిలో తగిన మార్పులు చేయాలనీ అధికారులకు తేల్చి చెప్పారు.

మధ్యప్రదేశ్ లోని సీహోర్ జిల్లాలో తన పార్లమెంటరీ నియోజకవర్గ రైతుల నుంచి ఫిర్యాదులు అందడంతో, కేంద్ర మంత్రి శ్రీ శివ్‌రాజ్ సింగ్ చౌహాన్ ఈ విషయాన్ని తీవ్రంగా తీసుకున్నారు. ప్రత్యేకించి మహారాష్ట్రలో రైతులకు క్లెయిముల రూపంలో నామమాత్రపు చెల్లింపులే జరగడంతో, ఆయన ఎంతో బాధపడ్డారు. సోమవారం ఉదయం విమానంలో ఢిల్లీకి చేరుకోవడంతోనే నేరుగా కృషిభవన్లోని కేంద్ర వ్యవసాయ శాఖ ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. ప్రధానమంత్రి పంట బీమా పథకం అమలులో పాలుపంచుకొంటున్న సీనియర్ అధికారులందరితో ఒక సమావేశాన్ని నిర్వహించారు. అన్ని బీమా వాణిజ్య సంస్థల ఉన్నతాధికారుల్ని కూడా సమావేశానికి పిలిపించారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో అమలవుతున్న పంట బీమా పథకం దేశంలో రైతుల పంటల్ని ప్రకృతి వైపరీత్యాల బారి నుంచి రక్షించడానికి ఉద్దేశించిన ఒక వరం అని మంత్రి స్పష్టం చేశారు. అయితే కొన్ని ఘటనలు ఈ కీలక పథకం పేరుప్రతిష్ఠలకు మచ్చ తెచ్చి దీనిని పరిహాసాస్పదంగా, ప్రచారాంశంగా మార్చివేశాయని ఆందోళన వ్యక్తం చేశారు.

సీహోర్ జిల్లాకు చెందిన కొందరు రైతుల పేర్లను మంత్రి సమావేశంలో పాల్గొన్న అధికారులకు ఉదాహరణగా చెప్తూ ఆ రైతులు పంట బీమా పథకంలో చేరినా నష్టమేమీ వాటిల్లలేదని పత్రాల్లో పేర్కొంటూనే, క్లెయిముగా ఒక రూపాయి చెల్లించిన సంగతిని ప్రస్తావించారు. మరో రైతుకు 0.004806 శాతం పంటనష్టాన్ని నమోదు చేసినా, క్లెయిము సొమ్ము కింద ఒక్క రూపాయిని మాత్రమే చెల్లించారని కేంద్ర మంత్రి చెప్తూ, ‘‘నష్టాన్ని నిర్ధారించడానికి ఈ రకమైన పద్ధతా పాటించేది?’’ అంటూ రైతుల పక్షాన తానే ప్రశ్నించారు.
మరో రైతుకూ వాటిల్లిన పంటనష్టం, క్లెయిము ఇదే మాదిరిగా ఉన్నాయి. ఈ వివరాల్ని అధికారులకు మంత్రి తెలియజేస్తూ, ఇది రైతులకు అన్యాయం చేయడం కాదా అని నిలదీశారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేపడతానని అక్కడికక్కడే ప్రకటించారు. పంట బీమా జోక్ కాదు. ఈ పరిహాసాస్పద ఉదంతాలు ఇకపై నేను కొనసాగనివ్వనన్నారు. సీహోర్ జిల్లా కలెక్టరును దృశ్య మాధ్యమం ద్వారా సమావేశంలో పాల్గొనాలనీ, పూర్తి సమాచారాన్ని ఇవ్వాలనీ మంత్రి ఆదేశించారు. ఢిల్లీ అధికారులతో పాటు కంపెనీ ప్రతినిధులనూ ఈ విషయాలపై మంత్రి ప్రశ్నించారు.
మంత్రి ఆదేశాలతో, మహారాష్ట్ర వ్యవసాయ కమిషనరూ, ఆ రాష్ట్రానికి చెందిన ఇతర సీనియర్ అధికారులూ దృశ్య మాధ్యమం సాయంతో సమావేశంలో పాల్గొన్నారు.
క్లెయిముల రూపంలో 5 రూపాయలు, 21 రూపాయలు అందాయని ఫిర్యాదు చేసిన మహారాష్ట్రలోని అకోలా జిల్లాకు చెందిన రైతులు కూడా ఆన్‌లైన్లో ఈ సమావేశానికి హాజరయ్యే ఏర్పాట్లు చేశారు. వారిని జరిగిందేమిటో అడిగి, పూర్తి వివరాలు తెలుసుకున్నారు.
క్లెయిము కింద అంత తక్కువ సొమ్ము చెల్లింపులు ఎలా, ఎందుకు అందుకోవాల్సివచ్చిందో వివరించాల్సిందిగా రైతులను శ్రీ శివ్‌రాజ్ సింగ్ కోరారు.
అధికారులు స్పందిస్తూ వేర్వేరు పొలాలకూ, పంటలకూ రైతులు విడివిడిగా దరఖాస్తులను దాఖలు చేశారనీ, మొదటిసారి క్లెయిముల సొమ్మును ముందుగానే చెల్లించామనీ, మిగతా మొత్తాలను సర్వే పూర్తయ్యాక సర్దుబాట్లు చేశామన్నారు. అందుకే చివరిగా చేసిన చెల్లింపులు చిన్న మొత్తాల్లో ఉన్నాయని వివరించారు.
అవకతవకలు చోటుచేసుకున్నాయని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు. క్లెయిములను చెల్లించేటప్పుడు రైతుల్లో గందరగోళాన్ని తొలగించేలా ఈ అవకతవకలకు ముగింపు పలకాలనీ, ప్రభుత్వాన్ని వేలెత్తిచూపే ఆస్కారాన్నివ్వకూడదనీ, హాస్యాస్పదంగా మారకుండా పంట బీమా పథకాన్ని పటిష్ఠంగా అమలుచేయాలనీ మంత్రి తేల్చిచెప్పారు.
ఒక రూపాయి, 2 లేదా 5 రూపాయలు.. ఇలాంటి క్లెయిముల చెల్లింపు ఎందుకు చోటుచేసుకొందో తెలుసుకోవడానికి ఆయా ప్రాంతాల్లో సమగ్ర దర్యాప్తు చేయాల్సిందిగా ప్రధానమంత్రి పంట బీమా పథకం ముఖ్య కార్యనిర్వహణ అధికారిని మంత్రి శ్రీ శివ్‌రాజ్ సింగ్ చౌహాన్ ఆదేశించారు. ఆయా జిల్లాల కలెక్టర్లతో, బీమా రక్షణకు నమోదు చేసుకున్న రైతులతో మాట్లాడి నిజాలను నిర్ధారించుకోవాలని కూడా మంత్రి సూచించారు. అంతేకాక, రిమోట్ సెన్సింగ్ ఆధారంగా నష్టాన్ని అంచనా వేసిన తీరు ఎంత ప్రామాణికంగా ఉన్నదీ శాస్త్రీయపరంగా పరిశీలన నిర్వహించాల్సిందిగా కూడా ఆయన ఆదేశించారు. అతి తక్కువ మొత్తాలకూ బీమా చేయవచ్చని అనుమతిని ఇస్తున్న మార్గదర్శక సూత్రాల్ని సమీక్షించి, అవసరమైన మార్పుచేర్పులను చేయాలన్నారు. క్లెయిము సొమ్ము చెల్లింపులు ఆలస్యం కాకూడదని ఆయన చెప్పారు. ఎలాంటి అస్తవ్యస్తతకూ తావివ్వకుండా, రైతులు వారికి హక్కుగా లభించాల్సిన నష్టపరిహారాన్ని అందుకొనేటట్లు చూడటానికి నష్ట నిర్ధారణ సర్వేలో బీమా కంపెనీల ప్రతినిధులు తప్పనిసరిగా పాల్గొనేటట్లు చూడాలని ఆయా కంపెనీలను మంత్రి ఆదేశించారు.
కొన్ని రాష్ట్రాలు వాటి వంతు రాయితీని ఆలస్యంగా చెల్లిస్తుండడం, లేదా వాటి వంతు రాయితీని నెలల తరబడి చెల్లించకపోవడం వంటి అంశాల్ని శ్రీ శివ్‌రాజ్ సింగ్ ప్రస్తావిస్తూ, అన్ని రాష్ట్రాలు అందించాల్సిన మొత్తాలను సకాలంలో జమ చేసేటట్లు వాటితో అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఇది జరిగితే నష్టపోయిన రైతులు తమ క్లెయిము సొమ్మును సమయానికి అందుకోగలుగుతారని మంత్రి చెప్పారు. రైతుల మేలు కోరి కేంద్రం పెద్ద ఏర్పాటు చేసిందనీ, వాటాను చెల్లించడంలో ఆలస్యం చేసే రాష్ట్రాలకు 12 శాతం వడ్డీని విధించాలన్నారు. రాయితీ చెల్లింపులో రాష్ట్రాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటే, ఆ కారణంగా కేంద్ర ప్రభుత్వం ఎందుకు అపఖ్యాతి పాలు కావాలని మంత్రి ప్రశ్నించారు. ఈ పథకానికి మరిన్ని మెరుగులు దిద్దడానికి తగిన సూచనలూ, సలహాలూ ఇవ్వాల్సిందిగా సీహోర్ కలెక్టరును, మహారాష్ట్ర వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో పాటు వాణిజ్య సంస్థల ప్రతినిధులను కేంద్ర మంత్రి కోరారు.
పూర్తి పారదర్శకతకు పెద్దపీట వేసేటట్లు రైతులకు సాంకేతిక పరిజ్ఞానం పట్ల అవగాహనను ఏర్పరచాల్సిన అవసరం ఎంతైనా ఉందని శ్రీ శివ్‌రాజ్ సింగ్ అన్నారు. ఇలా చేస్తే మన రైతు సోదరీసోదరులు అన్ని విషయాలపై అవగాహనను పెంచుకొంటారనీ, ఎక్కడా ఎలాంటి అవకతవకలకూ అవకాశాన్ని ఇవ్వకుండా చూడవచ్చనీ చెప్తూ మంత్రి సమావేశాన్ని ముగించారు.
***
(Release ID: 2186517)
Visitor Counter : 6