వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
భారత్ ఇంటర్నేషనల్ రైస్ కాన్ఫరెన్స్ (బీఐఆర్‌సీ)-2025 నిర్వహణకు వాణిజ్య శాఖ మద్దతుపై స్పష్టత
Posted On:
27 OCT 2025 5:16PM by PIB Hyderabad
సమష్టిగా నిర్ణయాలు తీసుకోవడం, వాణిజ్యాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో భారత ప్రభుత్వం ఆర్థిక రంగంలోని సంబంధిత వాటాదారులందరితో క్రమం తప్పకుండా చర్చిస్తోంది. దేశ వ్యవసాయ సంబంధిత ఎగుమతుల్లో బియ్యం అగ్రస్థానంలో ఉంది. 2024-25లో 12.95 బిలియన్ డాలర్ల ఎగుమతుల విలువతో ప్రపంచంలోనే భారత్ అతిపెద్ద బియ్యం ఉత్పత్తిదారుగా ఉంది. ఈ రంగం ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని భారత్ ఇంటర్నేషనల్ రైస్ కాన్ఫరెన్స్ (బీఐఆర్‌సీ)-2025కు వాణిజ్యశాఖ, ఇతర సంబంధిత మంత్రిత్వ శాఖలు-విభాగాలు సంయుక్తంగా ఆర్థికేతర మద్దతును అందిస్తున్నాయి.
ఈ నెల 30–31 తేదీల్లో న్యూఢిల్లీ ప్రగతి మైదాన్‌లోని భారత్ మండపంలో బీఐఆర్‌సీ-2025 నిర్వహిస్తున్నారు. బియ్యం రంగానికి చెందిన ప్రైవేట్ వాణిజ్య సంస్థ ఇండియన్ రైస్ ఎక్స్‌పోర్టర్స్ ఫెడరేషన్ (ఐఆర్ఈఎఫ్) ఈ సదస్సును నిర్వహిస్తోంది. ఇందులో రైస్ సెక్టార్‌కు చెందిన ఎగుమతిదారులు, ఈ వ్యవస్థతో సంబంధం ఉన్న వ్యక్తులంతా పాల్గొంటారు. ఐఆర్ఈఎఫ్ సభ్యులు, అధ్యక్షుడి నియామకంలో వాణిజ్యశాఖ పాత్ర ఉండదు.
ఐఆర్ఈఎఫ్‌తో పాటు దేశంలోని ఇతర ప్రముఖ బియ్యం ఎగుమతి సంఘాలైన (బాస్మతియేతర బియ్యం కోసం) ది రైస్ ఎక్స్‌పోర్టర్స్ అసోసియేషన్, ఛత్తీస్గఢ్ (టీఆర్ఈఏ-సీజీ)... ది రైస్ ఎక్స్‌పోర్టర్స్ అసోసియేషన్ (టీఆర్ఈఏ), కాకినాడ వంటి సంఘాలు ఈ కార్యక్రమానికి సహ-భాగస్వామ్యం అందిస్తున్నాయి.
వ్యవసాయ సంబంధిత, శుద్ధి చేసిన ఆహార ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించే బాధ్యత కలిగిన వ్యవసాయ-శుద్ధి చేసిన ఆహార ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి అథారిటీ (ఏపీఈడీఏ)... బియ్యం ఎగుమతుల విస్తరణ, ప్రోత్సాహానికి సమగ్రమైన, సమన్వయంతో కూడిన చర్యలను నిర్ధారించడానికి సమావేశంలో సంబంధిత మంత్రిత్వ శాఖలు-విభాగాలను భాగస్వామ్యం చేయడం ద్వారా ఈ కార్యక్రమానికి మద్దతునిస్తోంది.
వేదిక బుక్ చేయడం, కొనుగోలుదారులకు ఆతిథ్యం (ప్రయాణ ఛార్జీలు, వసతి) వంటి అన్ని రవాణా సంబంధిత ఏర్పాట్ల కోసం అయ్యే మొత్తం ఖర్చులను ఐఆర్ఈఎఫ్, దాని ఇతర సహ-భాగస్వాములు తమ సొంత నిధులతో గానీ, ప్రైవేట్ స్పాన్సర్‌షిప్‌ల ద్వారాగానీ చెల్లిస్తాయి. ప్రదర్శన నిర్వహణ ఖర్చులు, కొనుగోలుదారు-అమ్మకందారుల సమావేశాలు, సాంకేతిక సమావేశాల ఖర్చులతో పాటు వీడియోలు, బ్యానర్లు, పోస్టర్లు, ప్రదర్శనకు అయ్యే సృజనాత్మక ఖర్చులనూ పూర్తిగా నిర్వాహకులే భరిస్తున్నారు.
ఐఆర్ఈఎఫ్ జాతీయ అధ్యక్షుడిపైన గానీ, ఐఆర్ఈఎఫ్ కార్యకలాపాల గురించి గానీ పత్రికల్లో వచ్చే నిర్దిష్ట ఆరోపణలకు సంబంధించి వాణిజ్య శాఖ ఎటువంటి వ్యాఖ్యలు చేయదు. ఇది పూర్తిగా వ్యక్తిగతమైన, ప్రైవేట్ వాణిజ్య సంస్థ వ్యక్తిగత వ్యవహారం కాబట్టి... ప్రభుత్వ వాణిజ్యశాఖ దీనిలో ఎలాంటి జోక్యం చేసుకోదు.
***
(Release ID: 2183056)
Visitor Counter : 12