నౌకారవాణా మంత్రిత్వ శాఖ
ముంబయిలో ‘ఇండియా మారిటైమ్ వీక్-2025’: అతి పెద్ద ప్రపంచ సముద్ర రంగ సదస్సు 27న ప్రారంభం
· కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ మంత్రి శ్రీ అమిత్ షా శ్రీకారం
· ప్రారంభోత్సవంలో పాల్గొంటున్న మహారాష్ట్ర.. గుజరాత్.. గోవా.. ఒడిశా రాష్ట్రాల ముఖ్యమంత్రులు
· 29న సముద్ర రంగ అగ్రగాముల సమావేశంలో గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం… ‘గ్లోబల్ సీఈవో ఫోరమ్’ సదస్సుకు అధ్యక్షత
· ఈ కార్యక్రమానికి 11 దేశాల నుంచి విదేశాంగ మంత్రుల హాజరు
Posted On:
26 OCT 2025 5:09PM by PIB Hyderabad
దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో ఈ నెల 27 నుంచి 31వ తేదీవరకూ “ఇండియా మారిటైమ్ వీక్-2025 (ఐఎండబ్ల్యూ) నిర్వహణకు రంగం సిద్ధమైంది. కేంద్ర ఓడరేవులు-నౌకారవాణా-జలమార్గాల మంత్రిత్వ శాఖ నగరంలోని ‘నెస్కో’ (ఎన్‌ఈఎస్‌సీఓ) మైదానంలో 5 రోజులపాటు ఈ అతిపెద్ద సముద్ర రంగ సదస్సును నిర్వహిస్తోది. సముద్రావరణ వ్యవస్థలోని కీలక భాగస్వాములను ఒకే వేదికపైకి చేర్చడం దీని లక్ష్యం. ఈ సదస్సును “సముద్రాల ఏకీకరణ-ఏకైక సముద్ర దృక్పథం” ఇతివృత్తంగా నిర్వహిస్తున్నారు. ప్రపంచ సముద్ర రంగ కూడలిగా, నీలి ఆర్థిక వ్యవస్థలో అగ్రగామిగా భారత్ ఎదుగుదలపై వ్యూహాత్మక దృక్కోణాన్ని ఇది ప్రస్ఫుటం చేస్తుంది.
గౌరవనీయ హోంశాఖ మంత్రి శ్రీ అమిత్ షా ఈ సదస్సును ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర, గుజరాత్, గోవా, ఒడిశా రాష్ట్రాల ముఖ్యమంత్రులు శ్రీ దేవేంద్ర ఫడణవీస్, శ్రీ భూపేంద్ర పటేల్, డాక్టర్ ప్రమోద్ సావంత్, శ్రీ మోహన్ చరణ్ మాఝీ కూడా పాల్గొంటారు.
ఈ సదస్సులో 11 దేశాల నుంచి విదేశీ వ్యవహారాల మంత్రులు తమతమ పారిశ్రామిక రంగ ప్రతినిధులతో వివిధ చర్చాగోష్ఠులలో పాలుపంచుకుంటారు. భారత సముద్ర రంగంపై ప్రపంచ దేశాల్లో పెరుగుతున్న ఆసక్తిని ఈ సదస్సు ప్రతిబింబిస్తుంది.
“ఇండియా మారిటైమ్ వీక్’ ఓ సాధారణ కార్యక్రమానికి పరిమితమైనది కాదు. ఇది భారత్‌ను ప్రపంచ సముద్ర రంగ కూడలిగా రూపొందించగలదు. అంతేగాక కాలుష్య రహిత, సుస్థిర నౌకా రవాణాను ప్రోత్సహించడం సహా అంతర్జాతీయ సముద్ర వాణిజ్యం, అనుసంధానాన్ని ఇనుమడింపజేస్తుంది” అని ఓడరేవులు-నౌకారవాణా-జలమార్గాల మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ అన్నారు.
విస్తృత అంతర్జాతీయ- జాతీయ ప్రాతినిధ్యం
“ఇండియా మారిటైమ్ వీక్-2025”లో 85కుపైగా దేశాల నుంచి ధ్రువీకృత ప్రతినిధులు సహా మొత్తం 100,000 మందికి పైగా ప్రాతినిధ్యం వహిస్తారు. ప్రపంచ సముద్ర రంగ పరిశ్రమ దిగ్గజాలు, అంతర్జాతీయ సంస్థలు, విధాన నిర్ణేతలు హాజరవుతారు. అలాగే జాతీయంగా వివిధ రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి మంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు కూడా పాల్గొంటారు. తద్వారా పెట్టుబడి అవకాశాలను, ప్రాంతీయ సముద్ర రంగ సామర్థ్యాన్ని ప్రతినిధులకు వివరిస్తారు.
ప్రధానమంత్రి ప్రసంగం... వ్యూహాత్మక చర్చలు
ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొనడం ఒక విశేషం మాత్రమేగాక, 29నాటి సాయంత్రం ప్రత్యేక సమావేశంలో ఆయన దేశ ప్రజలతోపాటు ప్రపంచ సముద్ర రంగ అగ్రగాములు, భాగస్వాములను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
అంతేకాకుండా ప్రపంచవ్యాప్త ప్రముఖ సముద్ర రంగ కంపెనీల నుంచి ఎంపిక చేసిన ముఖ్య కార్యనిర్వహణాధికారులతో కూడిన ఉన్నత స్థాయి ‘గ్లోబల్ సీఈవో ఫోరమ్’ సమావేశానికి ప్రధానమంత్రి స్వయంగా అధ్యక్షత వహిస్తారు.
పరిశ్రమలకు.. పెట్టుబడికి అపార అవకాశాలు
ఈ కార్యక్రమంలో 350 మందికిపైగా అంతర్జాతీయ వక్తలు ప్రసంగించనున్న నేపథ్యంలో ‘ఐఎండబ్ల్యూ-2025’ పారిశ్రామిక నైపుణ్య-వ్యూహాత్మక చర్చలకు కేంద్రం అవుతుంది. ఇందులో భాగంగా ₹10 లక్షల కోట్లకుపైగా పెట్టుబడులకు భరోసా ఇస్తూ 600కు పైగా అవగాహన ఒప్పందాలు కుదుర్చుకునే వీలుంది.
సమగ్ర ప్రదర్శన… విస్తృత సమావేశ శ్రేణి
ఈ సదస్సు 400కు పైగా సంస్థలు సమగ్ర ప్రదర్శనతోపాటు విస్తృత సమావేశాలతో 5 రోజులపాటు సాగుతుంది. ఈ మేరకు ‘గ్లోబల్ మారిటైమ్ ఇండియా సమ్మిట్ (జీఎంఐఎస్-2025)’, ‘క్వాడ్- పోర్ట్స్ ఆఫ్ ది ఫ్యూచర్ కాన్ఫరెన్స్’, ‘సాగర మంథన్- ది గ్రేట్ ఓషన్స్ డైలాగ్’, ‘షీయో కాన్ఫరెన్స్, ‘ది యూనిస్కాప్ ఆసియా-పసిఫిక్ డైలాగ్’ తదితరాలు సహా మొత్తం 12 ప్రధాన చర్చగోష్ఠులకు ‘ఐఎండబ్ల్యూ-2025’ వేదిక అవుతుంది. మరోవైపు నార్వే, నెదర్లాండ్స్, డెన్మార్క్, స్వీడన్‌లతో కూడిన చతుర్దేశ (4 దేశాల) సదస్సుతోపాటు ఆంధ్రప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఒడిశా, ఉత్తరప్రదేశ్, అస్సాం, అండమాన్-నికోబార్ సహా 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల స్థాయి గోష్ఠులను కూడా నిర్వహిస్తారు.
***
(Release ID: 2182733)
Visitor Counter : 7