ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
న్యూఢిల్లీలోని ఎయిమ్స్ 50వ స్నాతకోత్సవంలో ప్రసంగించిన కేంద్ర ఆరోగ్య మంత్రి శ్రీ జే.పీ. నడ్డా
వైద్య మౌలిక సదుపాయాల్లో దశాబ్దపు వృద్ధిని ప్రధానంగా ప్రస్తావించిన కేంద్ర ఆరోగ్య మంత్రి
దేశంలో మెరుగైన వైద్య విద్య: 819 కళాశాలలు... 1.29 లక్షల యూజీ సీట్లు
ఒకటి నుంచి ఇరవై మూడుకు పెరిగిన ఎయిమ్స్‌ల సంఖ్య ఆరోగ్య సంరక్షణ పట్ల భారత్ నిబద్ధతకు నిదర్శనం
గణనీయంగా తగ్గిన ఎమ్ఎమ్ఆర్, ఐఎమ్ఆర్, టీబీ రేటు - ప్రపంచ ఆరోగ్య ప్రమాణాలను అధిగమించిన భారత్
ఎయిమ్స్ గ్రాడ్యుయేట్లు అత్యుత్తమ ప్రతిభను చాటుతూ వైద్య విద్య- పరిశోధనలకు తోడ్పడాలి
ఎయిమ్స్ 50వ స్నాతకోత్సవంలో 326 మంది గ్రాడ్యుయేట్లకు డిగ్రీలు ప్రదానం... ఏడుగురు వైద్యులకు జీవిత సాఫల్య పురస్కారాలు
Posted On:
25 OCT 2025 2:06PM by PIB Hyderabad
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ జే.పీ. నడ్డా ఈ రోజు న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) 50వ వార్షిక స్నాతకోత్సవ కార్యక్రమంలో ప్రసంగించారు.
శ్రీ నడ్డా మాట్లాడుతూ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులను అభినందించారు. దేశంలో వైద్య శాస్త్రం, విద్య, రోగుల సంరక్షణను అభివృద్ధి చేయడంలో ఎయిమ్స్ అసమానమైన కృషిని ఆయన ప్రశంసించారు. యువ వైద్యులు సానుభూతితో సేవ చేయాలని, అత్యున్నత నైతిక ప్రమాణాలను పాటించాలని సూచించారు. దేశంలో పెరుగుతున్న ఆరోగ్య సంరక్షణ అవసరాలను తీర్చడానికి ఆవిష్కరణలను ఉపయోగించుకోవాలని కేంద్ర ఆరోగ్య మంత్రి ఉద్బోధించారు.
న్యూఢిల్లీలోని ఎయిమ్స్ గురించి శ్రీ నడ్డా మాట్లాడుతూ, “వైద్య శాస్త్రాలు, శిక్షణ, ఆరోగ్య సంరక్షణ రంగంలో ఎయిమ్స్ దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తనదైన స్థానాన్ని సంపాదించుకుంది” అని వ్యాఖ్యానించారు. వైద్య విద్య, అత్యాధునిక పరిశోధన, రోగుల సంరక్షణలో రాణించడం పట్ల సంస్థకు గల అపారమైన నిబద్ధతను ఆయన ప్రశంసించారు.
గత దశాబ్ద కాలంలో ఆరోగ్య సంరక్షణ, వైద్య విద్య రంగంలో దేశం సాధించిన అద్భుతమైన పురోగతిని ప్రముఖంగా ప్రస్తావిస్తూ... దశాబ్దానికి ముందు దేశంలో ఒకే ఒక ఎయిమ్స్ ఉండగా, నేడు దేశవ్యాప్తంగా వాటి సంఖ్య 23కు చేరిందని శ్రీ నడ్డా తెలిపారు. ఇది ప్రతి ప్రాంతానికీ నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ, వైద్య శిక్షణను విస్తరించడం పట్ల ప్రభుత్వ నిబద్ధతను ప్రతిబింబిస్తోందన్నారు.
గత 11 సంవత్సరాల్లో దేశంలో వైద్య కళాశాలల సంఖ్య 387 నుంచి 819 కి పెరిగిందని కేంద్ర ఆరోగ్య మంత్రి తెలిపారు. అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ సీట్లు 51,000 నుంచి 1,29,000 లకి, పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్లు 31,000 నుంచి 78,000 లకి పెరిగాయని ఆయన వివరించారు. రాబోయే ఐదు సంవత్సరాల్లో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయిల్లో అదనంగా 75,000 సీట్లు జోడిస్తున్నట్లు శ్రీ నడ్డా తెలిపారు.
ఎస్ఆర్ఎస్ డేటా ప్రకారం మాతాశిశు ఆరోగ్యంలో దేశం గణనీయమైన పురోగతి సాధించిందని తెలిపిన కేంద్ర మంత్రి... ఎమ్ఎమ్ఆర్ 130 నుంచి 88కి, ఐఎమ్ఆర్ 39 నుంచి 27కి తగ్గిందన్నారు. యూ5ఎమ్ఆర్, ఎన్ఎమ్ఆర్‌లలోనూ వరుసగా 42 శాతం, 39 శాతం గణనీయ తగ్గుదల నమోదవడంతో పాటు.. ఈ రెండూ ప్రపంచ సగటులను మించిపోయినట్లు శ్రీ నడ్డా వివరించారు.
దేశంలో టీబీ వ్యాప్తి 17.7 శాతం తగ్గిందనీ, ఇది ప్రపంచ రేటు 8.3 శాతం కంటే రెండింతలు మెరుగైనట్లు ది లాన్సెట్ రిపోర్ట్ చెబుతోందని ఆయన పేర్కొన్నారు.
గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులంతా ఉన్నత విద్యకు, పరిశోధనలకు చురుగ్గా తోడ్పడాలని కేంద్ర మంత్రి సూచించారు. వృత్తిపరమైన, నైతిక ప్రవర్తనలో రాణించడం ద్వారా ఎయిమ్స్ ప్రతిష్టాత్మక వారసత్వాన్ని, బ్రాండ్‌ను నిలబెట్టాలని వైద్య విద్యార్థులను కోరారు. జీవితాంతం అభ్యాసకులుగా, ఆవిష్కర్తలుగా ఉంటూ వైద్య శాస్త్ర అభివృద్ధికీ, కరుణతో సమాజ సేవ చేయడానికి కట్టుబడి ఉండాలని వారిని ప్రోత్సహిస్తూ శ్రీ నడ్డా తన ప్రసంగాన్ని ముగించారు.
నీతి ఆయోగ్ సభ్యుడు ప్రొఫెసర్ వీ.కే. పాల్ మాట్లాడుతూ, "మనల్ని పెంచి పోషించిన సమాజానికి తిరిగి ఇవ్వాల్సిన గొప్ప సామాజిక బాధ్యత మనపై ఉంది. మీరు ముందుకు సాగుతున్న కొద్దీ శ్రేష్ఠతను మీ రోజువారీ అభ్యాసంగా... ఆవిష్కరణలను మీ మార్గదర్శక సూత్రాలుగా మార్చుకోండి" అని సూచించారు.
ఉన్నత విద్యను కొనసాగించడం, బోధించడం, మార్గనిర్దేశం చేయడం, తదుపరి తరం ఆరోగ్య సంరక్షణ నిపుణులకు స్ఫూర్తినివ్వడం గురించి విద్యార్థులు ఆలోచించాలనీ, తద్వారా 'వికసిత్ భారత్' దార్శనికత సాకారం కోసం సహకారం అందించాలని ఆయన కోరారు. జ్ఞానం, కరుణ, నిరంతర అభ్యాసం అనే బలమైన పునాదులపైనే నిజమైన జాతి నిర్మాణం సాధ్యపడుతుందని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ కార్యక్రమంలో 50 మంది పీహెచ్‌డీ విద్యార్థులు, 95 మంది డీఎం/ఎంసీహెచ్ నిపుణులు, 69 మంది ఎండీలు, 15 మంది ఎంఎస్‌లు, నలుగురు ఎండీఎస్‌లు, 45 మంది ఎంఎస్సీ, 30 మంది ఎంఎస్సీ (నర్సింగ్), 18 మంది ఎం.బయోటెక్ గ్రాడ్యుయేట్లు సహా 326 మంది గ్రాడ్యుయేట్లకు పట్టాలు ప్రదానం చేశారు. ఆదర్శప్రాయమైన కృషి, అంకితభావంతో కూడిన సేవకు గానూ ఏడుగురు ఎయిమ్స్ వైద్యులను జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరించారు.
***
(Release ID: 2182555)
Visitor Counter : 8