శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
వైద్య విద్యలో మారుతున్న పరిణామం- దేశంలో మరింత చవకగా అందుబాటులోకి రానున్న ఆరోగ్య సేవలను ప్రస్తావించిన డాక్టర్ జితేంద్ర సింగ్
దేశీయంగా అభివృద్ధి చేసిన డీఎన్‌ఏ వ్యాక్సిన్, జన్యు చికిత్సతో ప్రపంచ ఆరోగ్య రంగంలో నాయకత్వం వైపు దూసుకెళ్తున్న భారత్: కేంద్ర మంత్రి
రోగ నిర్ధారణ, రోగుల సంరక్షణ విధానాలను పునర్నిర్వచించనున్న కృత్రిమ మేధ: డాక్టర్ జితేంద్ర సింగ్
యూసీఎంఎస్ 54వ వ్యవస్థాపక దినోత్సవం స్నాతకోత్సవం; కొత్త వైద్య పట్టభద్రులకు డిగ్రీలు ప్రదానం చేసిన డాక్టర్ జితేంద్ర సింగ్
Posted On:
25 OCT 2025 4:04PM by PIB Hyderabad
దేశంలో వైద్య విద్య, ఆరోగ్య సంరక్షణలో వేగంగా మారుతున్న పరిణామాలను కేంద్రమంత్రి శ్రీ డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రస్తావించారు. గత 10 ఏళ్లలో భారత్‌లో ఆరోగ్య సేవలు మరింత చేరువలో, చవకగా, సమగ్రంగా మారాయని అన్నారు.
ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (యూసీఎంఎస్)54వ వ్యవస్థాపక దినోత్సవం, కళాశాల స్నాతకోత్సవంలో డాక్టర్ జితేంద్ర సింగ్ పాల్గొని ప్రసంగించారు. డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు డిగ్రీలు అందించారు. నేటి తరం వైద్య విద్యార్థులు మానవీయతను అలవర్చుకోవాలని.. నూతన ఆవిష్కరణలను స్వీకరించాలని ప్రోత్సహించారు.
గత పదేళ్ల కాలంలో దేశంలో వైద్య విద్యలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నట్లు కేంద్రమంత్రి శ్రీ జితేంద్ర సింగ్ తెలిపారు. వైద్య కళాళాలలు, శిక్షణ అవకాశాల బాగా పెరిగాయని అన్నారు. పదేళ్ల క్రితం కేవలం 45,000 యూజీ మెడికల్ సీట్లు మాత్రమే ఉండేవని వాటి సంఖ్య ఇప్పుడు 1.5 లక్షల దాకా పెరిగియని చెప్పారు. ఏయిమ్స్ వంటి సంస్థల విస్తరణ దేశంలోని వివిధ ప్రాంతాల్లో మెడికల్ విద్యను పొందే అవకాశాన్ని ప్రజాస్వామ్యీకరించిందని తెలిపారు. అధిక సంఖ్యలో మహిళలు వైద్య వృత్తిని కొనసాగించడానికి అవకాశం కలిగినట్లు పేర్కొన్నారు.
ఆరోగ్య సేవల సేవల మార్పును కేంద్రమంత్రి మూడు విధాలుగా ‘సులభంగా, చవకగా, అందుబాటులో’ అంటూ వర్ణించారు. ఆయుష్మాన్ భారత్, జన్ ఔషధి కేంద్రాలు వంటి పథకాలు ఆరోగ్య సంబంధిత విషయాల్లో రాష్ట్రం, పౌరుల మధ్య సంబంధాన్ని పునర్నిర్వచించడానికి కారణమని ఆయన ప్రశంసించారు. తన వైద్య వృత్తి నుంచి కథలను పంచుకుంటూ.. దేశంలో ఆరోగ్య బీమా అప్పటికే ఉన్న వ్యాధులను కూడా వర్తించేలా ఎలా అభివృద్ధి చెందిందో వివరించారు. ఈ మార్పును ఆయన ‘ప్రజారోగ్య విధానంలో అత్యంత మానవీయ ఆవిష్కరణలలో ఒకటి’గా పేర్కొన్నారు.
దేశంలో తొలి స్వదేశీ యాంటిబయోటిక్ ‘నాఫిథ్రోమైసిన్’ హీమోఫీలియాకు విజయవంతమైన జన్యు చికిత్స పరీక్షలను ‘న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్’లో ప్రచురించినట్లు, డా. జితేంద్ర సింగ్ తెలిపారు. ఇలాంటి ఆవిష్కరణలు రోగ నివారణ, చికిత్సా రంగంలో దేశాన్ని నాయకత్వం వైపు ఎదిగేందుకు దోహదపడతాయని అన్నారు. అధునాతన క్లినికల్ ట్రయల్స్, పరిశోధనలను నిర్వహించడంలో ప్రైవేట్ రంగంతో సహకరించాలని యూసీఎంఎస్, ఇతర సంస్థలను కోరారు ‘సొంత సెక్టర్లలో పని చేసే యుగం ముగిసింది’” అని వ్యాఖ్యానిస్తూ.. విద్యాసంస్థలు పరిశ్రమ, ప్రభుత్వ ప్రయోగశాలలతో సమన్వయం కావాలని ప్రోత్సహించారు.
ఈ సందర్భంగా సంస్థ 54 సంవత్సరాల ప్రయాణాన్ని గుర్తుచేసే ఒక సావనీర్ విడుదల చేశారు. ఇది వైద్య విద్య, పరిశోధన, ప్రజా సేవలో కళాశాల సాధించిన మైలురాళ్లను ప్రతిబింబిస్తుంది. దేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో పెరుగుతున్న సహకారాన్ని, ముఖ్యంగా సమూహ ఆధారిత ఆరోగ్య కార్యక్రమాల్లో జీటీబీ ఆసుపత్రి భాగస్వామ్యాన్ని ఈ ప్రచురణ ప్రస్తావించింది.
విద్యా రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరచిన విద్యార్థులు, వైద్య పరిశోధన, బోధనకు చేసిన కృషికి గుర్తింపుగా అధ్యాపకులకు పురస్కారాలు, పతకాలను డా. జితేంద్ర సింగ్ ప్రదానం చేశారు. అవార్డు గ్రహీతలను మంత్రి అభినందించారు. దేశంలోని రాబోయే వైద్య విద్యార్థులు దేశ ఆరోగ్య ప్రాధాన్యతలను రూపొందించడంలో కీలక పాత్ర పోషిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఆరోగ్య రంగంలో మారుతున్న సవాళ్లను కేంద్ర మంత్రి శ్రీ డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రస్తావించారు. నేటి వైద్యులు ‘‘బై-ఫేసిక్ డిసీజ్ స్పెక్ట్రం’’ అనే కొత్త దశను ఎదుర్కోవాల్సి వస్తోందని,అంటే సంక్రమణ వ్యాధులు, అసంక్రమణ వ్యాధులు రెండూ కలిసి ఉండే పరిస్థితి, దీనికి తోడు వృద్ధాప్య జనాభా పెరుగుదల, వేగంగా మారుతున్న సాంకేతిక పరిణామాలు కూడా సవాళ్లుగా మారాయని చెప్పారు. కృత్రిమ మేధను వైద్య రంగంలో అనుసంధానించడం ద్వారా పెద్ద మార్పు తీసుకొచ్చే దిశగా సాగుతోందన్నారు. టెలీ-మొబైల్ క్లినిక్స్ ద్వారా ఏఐ వినియోగాన్ని ఆయన స్వయంగా ప్రయోగాత్మకంగా ఉపయోగించినట్లు పేర్కొన్నారు. ఏఐ రోగి మాతృ భాషలో మాట్లాడగలదని, మానవీయ పరస్పర చర్య ద్వారా ఓదార్పు అందించగలదని ఆయన అన్నారు, దీనిని సానుభూతితో ఆవిష్కరణను కలిపే హైబ్రిడ్ మోడల్‌గా అభివర్ణించారు.
ఆరోగ్య రంగ భవిష్యత్తును రూపొందించడంలో యువ గ్రాడ్యుయేట్ల ప్రత్యేక స్థానాన్ని గుర్తు చేస్తూ డాక్టర్ జితేంద్ర సింగ్ తన ప్రసంగాన్ని ముగించారు. ‘‘నేడు డిగ్రీలు పొందుతున్న వారు 2047లో దేశ స్వాతంత్య్ర శతాబ్ది ఉత్సవాలు జరుపుకునే సమయానికి తమ వృత్తి జీవితంలో అత్యున్నత స్థానంలో ఉంటారు’’ అని తెలిపారు. “మీరు దేశాన్ని ఆరోగ్యంగా, ఆత్మనిర్భరంగా తీర్చిదిద్దే శిల్పులు కావడానికి విధి మీకు ఈ అవకాశం ఇచ్చింది” అని ఆయన పేర్కొన్నారు
ఈ కార్యక్రమం యూసీఎంఎస్ పాలకమండలి ఛైర్మన్ ప్రొఫెసర్ మహేష్ వర్మ స్వాగత ప్రసంగంతో ప్రారంభమైంది. ఆ తర్వాత ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని కళాశాలల డీన్, ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ బలరాం పాణి ప్రసంగించారు. కార్యక్రమానికి యూసీఎంఎస్‌కు చెందినక అధ్యాపకులు, విద్యార్థులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ వేడుక వైద్య విద్యను దేశీయ శాస్త్ర, సాంకేతిక ఆవిష్కరణ లక్ష్యాలతో సమన్వయం చేయాలన్న ప్రభుత్వ దృష్టిని ప్రతిబింబిస్తుంది.
***
(Release ID: 2182553)
Visitor Counter : 5