రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

పాకిస్థాన్‌కు తీవ్ర హెచ్చరికను ఇచ్చిన ఆపరేషన్ సిందూర్: రక్షణ మంత్రి


ఇకమీదట పాకిస్థాన్ భారతదేశంపై ఏదైనా దుస్సాహసానికి పాల్పడే ముందు ఒకటి రెండు సార్లు ఆలోచిస్తుంది: రక్షణ మంత్రి

"మన శత్రువులు ఎప్పుడూ నిద్రించరు.. సాయుధ దళాలు ఎల్లప్పుడూ అప్రమత్తంగా సంసిద్ధతతో ఉండాలి": రక్షణ మంత్రి

Posted On: 23 OCT 2025 9:02PM by PIB Hyderabad

"ఆపరేషన్ సిందూర్‌తో మన సాయుధ దళాలు పాకిస్థాన్‌కు తీవ్ర స్థాయిలో హెచ్చరికను ఇచ్చినందున ఆ దేశం ఇకమీదట భారత్‌పై ఏదైనా దుస్సాహసానికి పాల్పడే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తుంది" అని రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. 2025 అక్టోబర్ 23న రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో సైనిక విందు‌లో (బరాఖానా) సైనికులతో మాట్లాడుతూ ఈ విధంగా వ్యాఖ్యానించారు. ఆపరేషన్ ముగియలేదని కేవలం  ఆగిపోయిందని పునరుద్ఘాటించిన ఆయన.. పాకిస్థాన్ ఏదైనా దుస్సాహసానికి పాల్పడితే మరింత తీవ్రస్థాయిలో స్పందించనున్నట్లు ఆయన హెచ్చరించారు. "మన పైలట్లు పాకిస్థాన్‌కు భారతదేశ సామర్థ్యాన్ని పరిచయం చేశారు. అవకాశం ఇస్తే వారు మన వాస్తవ బలాన్ని తెలియజేస్తారు" అని ఆయన వ్యాఖ్యానించారు. 

దేశ శత్రువులు ఎప్పుడూ నిద్రించరని తెలియజేసిన శ్రీ రాజ్‌నాథ్ సింగ్.. సాయుధ దళాలు ఎల్లప్పుడూ అప్రమత్తంగా సంసిద్ధతతో ఉండాలని కోరారు. దీనితో పాటు శత్రువుల చర్యలకు తగిన ప్రభావవంతమైన చర్యలు తీసుకోవాలన్నారు. 

2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన స్వావలంబన దేశంగా తయారుచేయాలనే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వ దార్శనికతను సాకారం చేయడంలో సాయుధ దళాలు పోషించే పాత్రను రక్షణ మంత్రి ప్రధానంగా ప్రస్తావించారు. “మన సైనికులు సరిహద్దులను రక్షించేవారు మాత్రమే కాదు.. జాతి నిర్మాణానికి మార్గదర్శకులు. ఈ శతాబ్దం మనది.. భవిష్యత్తు మనది. స్వావలంబన దిశగా మనం సాధించిన పురోగతితో మన సైన్యం నిస్సందేహంగా ప్రపంచంలోనే అత్యుత్తమంగా మారుతుందన్న నమ్మకం నాకు ఉంది” అని ఆయన వ్యాఖ్యానించారు. 

సరిహద్దు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం నిబద్ధతతో ఉన్నట్లు తెలిపిన ఆయన.. రక్షణ సంసిద్ధతను మరింత పెంచేందుకు సరిహద్దు వెంబడి అభివృద్ధి కార్యకలాపాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.

సైనిక విందులో ప్రతి ఒక్కరిని సమానంగా చూస్తారని, భారత సంస్కృతి, నాగరికత, విలువలకు ఈ విందు ఓ చిహ్నమని రక్షణ మంత్రి చెప్పారు. "మన దళాలు వివిధ మతాలు, కులాలు, భాషలు, ప్రాంతాల వారికి నిలయంగా ఉన్నాయి. ఇక్కడ చాలా వైవిధ్యత ఉంటుంది. సైనిక విందులో ఒక భోజన పళ్లేన్ని ఇది ప్రతిబింబిస్తోంది. ఇదే ఇతర అన్ని విందుల కంటే దీనిని గొప్పదిగా చేస్తోంది" అని ఆయన అన్నారు.

సైనిక విందుకు ముందు రక్షణ మంత్రి జైసల్మేర్‌లో ఒక ప్రత్యేకమైన కాక్టి-కమ్-బొటానికల్ గార్డెన్ 'శౌర్యవన్'ను ప్రారంభించారు. భారత సైన్యం చేపట్టిన 'శౌర్యవన్' కార్యక్రమం ద్వారా థార్ ఎడారిని.. ధృడత్వం, పర్యావరణ పరిరక్షణ, ఆవిష్కరణలకు ప్రతీకగా నిలిచే ఒక శక్తిమంతమైన ఒయాసిస్‌గా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. 

'భారత్ రణభూమి దర్శన్' కార్యక్రమంలో 'శౌర్య గాంతవ్య' అయిన జైసల్మేర్ యుద్ధ స్మారక చిహ్నం వద్ద అమరవీరులకు శ్రీ రాజ్‌నాథ్ సింగ్ నివాళులర్పించారు. స్మారక చిహ్నానికి సంబంధించిన మ్యూజియంలో భద్రపరిచిన యుద్ధ ట్రోఫీలు, కళాఖండాల విస్తృతమైన సేకరణ గురించి ఆయనకు వివరించారు. వివిధ సంక్షిష్ట పరిస్థితుల్లో భారత సైన్యం చూపించిన పరాక్రమానికి శాశ్వత సాక్ష్యాలుగా ఇవి ఉన్నాయి. స్మారక చిహ్నం వద్ద హోలోగ్రాఫిక్ లైట్, సౌండ్ కార్యక్రమ ప్రారంభ ప్రదర్శనను ఆయన వీక్షించారు. ఈ అత్యాధునిక సాంకేతికత వల్ల ప్రధాన గమ్యస్థానంగా ఈ స్మారక చిహ్నానికి ఉన్న స్థానం బలోపేతం అవుతుంది. 

ఈ కార్యక్రమంలో భారత సైన్యం చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, రక్షణ కార్యదర్శి శ్రీ రాజేష్ కుమార్ సింగ్, ఆర్మీ వైస్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ పుష్పేంద్ర సింగ్, ఆర్మీ కమాండర్లందరూ, భారత సైన్యంలోని ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

2025 అక్టోబర్ 24న రక్షణ మంత్రి సరిహద్దు ప్రాంతాలను సందర్శించి.. దక్షిణ కమాండ్ నిర్వహించే 'సామర్థ్య ప్రదర్శన విన్యాసాలను' వీక్షించనున్నారు. జైసల్మేర్‌లో జరిగే ఆర్మీ కమాండర్ల సమావేశంలో ఆయన ప్రసంగిస్తారు.

 

***


(Release ID: 2182035) Visitor Counter : 8