రైల్వే మంత్రిత్వ శాఖ
ఛఠ్ పండగ రద్దీ దృష్ట్యా రాబోయే 5 రోజుల్లో 1,500 ప్రత్యేక రైళ్లను నడపనున్న భారతీయ రైల్వేలు
ప్రయాణికులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణం అందించడంపై ప్రధానంగా దృష్టి
దీపావళికి ప్రజలను సురక్షితంగా ఇంటికి చేర్చేందుకు వీలుగా సాధారణ రైళ్లతో పాటు గత 21 రోజుల్లో 4,493 ప్రత్యేక రైళ్లు, సగటున రోజుకు 213 ట్రిప్పులు
పండగ రద్దీ సమయంలో ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరచేందుకు దేశవ్యాప్తంగా రైల్వే శాఖ చేసిన ప్రత్యేక ఏర్పాట్లను అభినందిస్తున్న ప్రయాణికులు
Posted On:
22 OCT 2025 7:08PM by PIB Hyderabad
దేశవ్యాప్తంగా ప్రజలను అనుసంధానించడంలో... ముఖ్యంగా పండగల సీజన్‌లో ప్రజలకు సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందించడంలో భారతీయ రైల్వేలు కీలక పాత్ర పోషిస్తూనే ఉన్నాయి. ఛఠ్ పూజ ఉత్సవాలకు ముందు ప్రయాణికుల రద్దీ అధికంగా పెరుగుతుండడంతో ప్రయాణికులందరూ సురక్షితంగా, సౌకర్యవంతంగా తమ గమ్యస్థానాన్ని చేరుకునేలా రైల్వే శాఖ చర్యలు చేపట్టింది. సాధారణ రైలు సేవలతో పాటుగా రాబోయే ఐదు రోజుల్లో రోజుకు సగటున 300 ప్రత్యేక రైళ్లతో 1500 ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. సమర్థమైన ఏర్పాట్లు... ప్రయాణికులకు మెరుగైన సేవలు, సౌలభ్యం, సంరక్షణ అందించడం పట్ల నిబద్ధతతో... ఈ పండగ సీజన్‌లో ప్రయాణికులందరికీ రైలు ప్రయాణంలో నాణ్యమైన సేవలు అందించేలా భారతీయ రైల్వే చర్యలు చేపట్టింది. సాధారణ రైళ్లతో పాటుగా గత 21 రోజుల్లో 4,493 ప్రత్యేక రైలు ప్రయాణాలు, రోజుకు సగటున 213 ట్రిప్పులతో దీపావళి పండగ కోసం ప్రయాణికులు సురక్షితంగా ఇంటికి చేరుకునేలా రైల్వే శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
ఈ సంవత్సరం రాబోయే ఛఠ్ పూజ, ప్రస్తుతం కొనసాగుతున్న దీపావళి సీజన్ కోసం పండగ ప్రయాణ రద్దీ నిర్వహణకు భారత రైల్వే పటిష్టమైన ప్రత్యేక రైలు షెడ్యూల్‌ను అమలు చేస్తోంది. అక్టోబర్ 1 నుంచి నవంబర్ 30 వరకు 61 రోజుల వ్యవధిలో దేశవ్యాప్తంగా 12,000 కంటే ఎక్కువ ప్రత్యేక రైళ్లు నడిపిస్తోంది. ఇప్పటివరకు మొత్తం 11,865 ట్రిప్పులు (916 రైళ్లు) నమోదు కాగా... వీటిలో 9,338 రిజర్వ్డ్, 2,203 అన్‌రిజర్వ్డ్ ట్రిప్పులు ఉన్నాయి. గత సంవత్సరం కంటే ఇది గణనీయమైన పెరుగుదలను సూచిస్తుంది. పండగ సీజన్‌లో ప్రయాణికులకు సజావుగా, సౌకర్యంగా ఉండే ప్రయాణ అనుభవాన్ని అందించడం పట్ల భారతీయ రైల్వే నిరంతర నిబద్ధతను ఇది ప్రతిబింబిస్తోంది.
***
(Release ID: 2181824)
Visitor Counter : 9