వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
జెనీవాలో జరిగిన యూఎన్సీటీఏడీ 16వ సదస్సులో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ నాయకత్వంలో పాల్గొన్న భారత ప్రతినిధి వర్గం
Posted On:
22 OCT 2025 6:11PM by PIB Hyderabad
జెనీవాలో జరిగిన ఐక్య రాజ్య సమితి వాణిజ్యం, అభివృద్ధి సమావేశం (యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్‌మెంట్ -యూఎన్సిటీఏడీ) 16 వ సదస్సులో భారత ప్రతినిధివర్గానికి కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి శ్రీ పీయూష్ గోయల్ నాయకత్వం వహించారు. ఈ సదస్సులో ఆయన భారత జాతీయ ప్రకటనను చదివి వినిపించారు. కీలక చర్చలలో పాల్గొన్నారు. 1964లో ఏర్పాటయిన యూఎన్సిటీఏడీ వాణిజ్యం, పెట్టుబడి, స్థిరమైన అభివృద్ధి విధానాల ద్వారా అభివృద్ధి చెందుతున్న దేశాలను ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఏకీకృతం చేయడాన్ని ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషిస్తోంది.
సదస్సులో శ్రీ పీయూష్ గోయల్ ప్రసంగిస్తూ, ప్రపంచంలోని మొదటి ఐదు ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా భారత్ ఆవిర్భవించిందని చెప్పారు. గత మూడు సంవత్సరాలుగా సగటున 7% కంటే ఎక్కువ వార్షిక వృద్ధితో భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉందని అన్నారు. ప్రతి ఎనిమిది సంవత్సరాలకు భారత్ తన ఆర్థిక వ్యవస్థను రెట్టింపు చేసిందని, గత దశాబ్దంలో లక్షలాదిమంది ప్రజలను పేదరికం నుంచి బయటకు తెచ్చిందని శ్రీ గోయల్ తెలిపారు. వారంతా ఇప్పుడు కొత్త మధ్యతరగతి మారి ఆదాయాలు, డిమాండ్ పెరుగుదలకు దోహదపడుతున్నారని పేర్కొన్నారు.
భారత సుస్థిర నాయకత్వాన్ని ప్రస్తావిస్తూ, భారత స్థాపిత విద్యుత్ సామర్థ్యంలో సగం పునరుత్పాదక ఇంధనాల నుంచి వస్తుందని, స్వచ్ఛ ఇంధనం ప్రస్తుతం 250 గిగా వాట్ల వద్ద ఉందని, 2030 నాటికి 500 గిగా వాట్లను లక్ష్యంగా పెట్టుకుందని వివరించారు. వాతావరణ మార్పుల ప్రభావాలకు వ్యతిరేకంగా కూడా భారత్ చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ప్రపంచ జనాభాలో భారత్ 17 శాతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ ప్రపంచ ఉద్గారాల్లో కేవలం 3.5 శాతం మాత్రమే వెలువరిస్తోందని ఆయన పేర్కొన్నారు. తక్కువ వ్యయంతో, దీర్ఘకాలిక ఆర్థిక సహాయం ($100 బిలియన్), సాంకేతిక పరిజ్ఞాన బదిలీ విషయంలో అభివృద్ధి చెందిన దేశాలు పారిస్ ఒప్పందంలో చేసిన వాగ్దానాలను ఇప్పటికీ పూర్తిగా నెరవేర్చలేదని ఆయన గుర్తుచేశారు.
పర్యావరణ కారణాలను చూపించి బాధ్యతలను మోపడం లేదా వాణిజ్య అడ్డంకులను సృష్టించడం వంటి చర్యలను ఆయన ఖండించారు. సుస్థిరమైన అభివృద్ధి కోసం ప్రత్యేకమైన దృక్పథం అవసరమని ఇందుకోసం దేశాల పరిస్థితులకు అనుగుణంగా అమలు చేయగల పరిష్కారాలు అవసరమని అన్నారు. విపత్తుల నిరోధక మౌలిక సదుపాయాల కూటమి ( కొయెలేషన్ ఫర్ డిజాస్టర్ రిసీలియెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్), అంతర్జాతీయ సౌర కూటమి (ఇంటర్నేషనల్ సోలార్ అలయెన్స్), గ్లోబల్ జీవ ఇంధనాల కూటమి (గ్లోబల్ బయోఫ్యూయెల్స్ అలయెన్స్) వంటి అంతర్జాతీయ సంస్థలు ప్రపంచవ్యాప్తంగా భాగస్వామ్యాలను పెంపొందిస్తున్నాయని తెలిపారు.
వాస్తవ పరిష్కారాల కోసం వర్ధమాన దేశాల మధ్య సహకారం అవసరమని శ్రీ పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. ముఖ్యంగా అత్యవసర ఖనిజాల లభ్యత, ఎరువుల ఉత్పత్తి, సరఫరా శ్రేణుల నిర్వహణ వంటి అంశాలలో సహకారం ప్రాముఖ్యతను వివరించారు. భారతదేశం డిజిటల్ మౌలిక సదుపాయాల ద్వారా భారత్ కోట్లాది మందికి సాధికారత కల్పిస్తూ సాంకేతిక అంతరాన్ని తగ్గిస్తోందని చెప్పారు. దేశంలో వంద కోట్లకు పైగా ఇంటర్నెట్ వినియోగదారులు ఉన్నారని, ప్రపంచవ్యాప్తంగా చాట్ జీపీటీ వినియోగదారుల సంఖ్యలో భారత్ రెండో స్థానంలో ఉందని పేర్కొన్నారు. 28.5 సంవత్సరాల సగటు వయసు కలిగిన యువ జనాభా, ప్రజాస్వామ్యం, చట్టబద్ధమైన పాలన భారత్ అభివృద్ధికి చోదకశక్తిగా ఉన్నాయని వివరించారు.
భారతదేశంలో సమ్మిళిత అభివృద్ధికి 14% పారిశ్రామికవేత్తలు, లక్షలాది ఉద్యోగాలను సృష్టించి, మద్దతిస్తున్న ఎంఎస్ఎంఈలు ఉదాహరణ అని మంత్రి పేర్కొన్నారు. సేవల రంగం జీడీపీకి 55% దోహదం చేస్తోందని, ఇది దశాబ్ద కాలంగా రెండంకెల ఎగుమతి వృద్ధిని కనబరిచిందని, దీని ద్వారా సమాన అవకాశాలున్న ఉద్యోగ కల్పన సాధ్యమైందని చెప్పారు. భాగస్వామ్య దేశాల మధ్య పోటీని, ప్రపంచ పరిధిని పెంచడానికి భారత్ పాత్రను బలోపేతం చేస్తోందని ఆయన పేర్కొన్నారు.
ప్రపంచ స్థాయిలో ఉన్న కీలక సవాళ్లను కూడా శ్రీ గోయల్ ప్రస్తావించారు. ఇవి బహుళపాక్షిక సంస్థలపై నమ్మకాన్ని, నియమాధారిత వాణిజ్య వ్యవస్థపై విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ సవాళ్లలో మార్కెట్‌కు విరుద్ధమైన విధానాలు, సుంకాలు, సుంకాల రహిత అడ్డంకులు, ఉత్పత్తి కేంద్రాల వద్ద లేదా వినియోగ స్థాయిలో మితి మించిన సరఫరా వ్యవస్థల కేంద్రీకృతం వంటి అంశాలు ఉన్నాయి. అలాగే, ప్రత్యేక భిన్నమైన పద్ధతులలోని లోపాలు, ఏకపక్ష పర్యావరణ చర్యలు, పరిమిత నియంత్రణలతో కూడిన సాంకేతిక అంతరం వంటి అంశాలు కూడా ప్రపంచ గ్లోబల్ వాణిజ్యానికి ప్రధాన సవాళ్లుగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. నిర్బంధ విధానాలు సేవల రంగంపై తీవ్ర ప్రభావం చూపాయని శ్రీ పీయూష్ గోయల్ పేర్కొన్నారు. ఇందువల్ల అభివృద్ధి చెందుతున్న దేశాలే అత్యధికంగా నష్టపోతున్నాయని ఆయన అన్నారు. గ్లోబల్ సౌత్ దేశాలన్నీ ఏకతాటిపైకి వచ్చి ఒకే గొంతుతో మాట్లాడాల్సిన అవసరాన్ని ఆయన స్పష్టం చేశారు.
స్వతంత్ర విధానాలు, స్థిరమైన అభివృద్ధి దిశగా నిబద్ధత,వృద్ధి మార్గంలో ఉన్న భారత్.. అభివృద్ధి చెందుతున్న, అభివృద్ధి చెందిన దేశాలు రెండింటి విశ్వాసాన్ని పొందిన అగ్రగామి దేశంగా నిలిచిందని శ్రీ గోయల్ పేర్కొన్నారు. సమానమైన, సమ్మిళితమైన, సుస్థిరమైన అభివృద్ధి సాధనలో వాణిజ్యాన్ని సమర్థంగా వినియోగించడంలో యూఎన్సిటీఏడీ పాత్ర కీలకమని ఉద్ఘాటించారు. సాంకేతికత, సహకారం, సుస్థిర సరఫరా వ్యవస్థల నిర్మాణంలో అభివృద్ధి చెందుతున్న దేశాలకు భారత్ మద్దతును మంత్రి ప్రకటించారు. వాణిజ్యం అభివృద్ధికి ఒక సాధనమని, దేశాలన్నీ కలిసికట్టుగా అందరి కోసం ఒక భవిష్యత్తును నిర్మించగలవని అన్నారు. ఈ దిశగా భారత్ “ సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్” అనే సూత్రాన్ని అనుసరిస్తోందని, అందరి సహకారం, అందరి అభివృద్ధి, పరస్పర విశ్వాసం, సమష్టి ప్రయత్నం ద్వారా సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన ఉద్ఘాటించారు. ప్రపంచమంతా ఒక కుటుంబమనే వసుధైక కుటుంబ భావనను భారత్ విశ్వసిస్తుందని ఆయన ప్రసంగాన్ని ముగించారు.
సుస్థిరమైన, నిలకడైన, సమగ్ర సరఫరా వ్యవస్థలు - వాణిజ్య రవాణా మార్గాలు అనే అంశంపై జరిగిన మంత్రుల స్థాయి రౌండ్ టేబుల్ సమావేశంలో శ్రీ పీయూష్ గోయల్ మాట్లాడుతూ, ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమం కింద భారత్ సాధించిన స్వావలంబనను, ముఖ్యంగా ఔషధాలు, కోవిడ్ టీకాల తయారీలో సాధించిన విజయాలను ప్రస్తావించారు.నమ్మకం, విశ్వసనీయతపై ఆధారపడ్డ వాణిజ్య సంబంధాలను బలపరచడంపై భారత్ నిబద్ధతను పునరుద్ఘాటించారు. ట్రిలియన్ డాలర్ మాస్టర్ ప్లాన్ గురించి ప్రముఖంగా ప్రస్తావిస్తూ, దేశీయ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రతి సంవత్సరం సుమారు 130 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడుతున్నట్టు చెప్పారు. విమానాశ్రయాలను 74 నుంచి 158కి విస్తరించడం, బలమైన అంతర్గత రవాణా నెట్‌వర్క్ కోసం రైలు, రహదారి, అంతర్గత జలమార్గాలను మెరుగుపరచడం, తయారీ వ్యవస్థను బలోపేతం చేయడం, రాబోయే దశాబ్దాలలో వేగవంతమైన వృద్ధి కొనసాగుతుందన్న అంచనాలతో, భారత్ ను ప్రపంచవ్యాప్తంగా విశ్వసనీయ భాగస్వామిగా నిలబెట్టడం వంటి కీలక పురోగతుల గురించి వివరించారు. చెల్లింపు వ్యవస్థలు, లావాదేవీలు, రవాణా భాగస్వామ్యం, పోర్టు సమయాలను తగ్గించడం వంటి సేవలను పంచుకోవడానికి అభివృద్ధి చెందుతున్న పెద్ద దేశాల మధ్య చర్చలు జరగాలని ఆయన ప్రతిపాదించారు. పరస్పర ప్రయోజనం కోసం అభివృద్ధి చెందుతున్న దేశాలు సహకరించుకోవాలని, కలిసి పనిచేయాలని కోరారు.
సదస్సు నేపథ్యంలో శ్రీ గోయల్ అంతర్జాతీయ భాగస్వామ్యాలను బలోపేతం చేయడానికి ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. యూరోపియన్ కమిషన్ ఫర్ క్లీన్, జస్ట్ , కాంపిటీటివ్ ట్రాన్సిషన్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ తెరెసా రిబెరా రోడ్రిగేజ్‌తో భారత ఎగుమతులపై, ముఖ్యంగా ఉక్కు రంగంపై కార్బన్ బోర్డర్ అడ్జస్ట్‌మెంట్ మెకానిజం (సీబీఏఎం) ప్రభావం గురించి చర్చించారు. అలాగే, స్వచ్ఛ ఇంధన మార్పు కొత్త ఆధారపడే పరిస్థితులకు దారి తీయకూడదని అన్నారు. యూఎన్సిటీఏడీ సెక్రటరీ జనరల్ రెబెక్కా గ్రిన్స్పాన్ తో జరిగిన సమావేశంలో, సమానమైన ఆర్థిక మార్పులో యూఎన్సిటీఏడీ పాత్రను ముందుకు తీసుకెళ్లడం, అభివృద్ధి చెందిన దేశాల పారిస్ ఒప్పంద కట్టుబాట్లను నెరవేర్చడంలో లోపం, అన్యాయమైన ఏకపక్ష చర్యలు అభివృద్ధి చెందుతున్న దేశాల సహకారంపై చర్చించారు. దృష్టి సారించారు.
భవిష్యత్ రూపకల్పన, సమానమైన, సమ్మిళితమైన, స్థిరమైన అభివృద్ధికి ఆర్ధిక మార్పును ముందుకు నడిపించడం - అనే యూఎన్సిటీఏడీ 16వ సదస్సు ఇతివృత్తాన్ని ప్రతిబింబిస్తూ, ప్రపంచ వాణిజ్యం, అభివృద్ధిలో విశ్వసనీయ భాగస్వామిగా భారత్ కట్టుబాటును ఈ పర్యటన మరోసారి చాటిచెప్పింది. శ్రీ గోయల్ పాల్గొన్న కార్యక్రమాలు అన్ని దేశాలకు పరస్పర సౌభాగ్యం, సుస్థిరత, సమ్మిళిత వృద్ధిని ప్రోత్సహించే నిబంధనల ఆధారిత బహుపాక్షిక వ్యవస్థ పట్ల భారతదేశ దార్శనికతను ఆవిష్కరించాయి.
***
(Release ID: 2181819)
Visitor Counter : 12