రాష్ట్రపతి సచివాలయం
తిరువనంతపురంలోని రాజ్‌భవన్లో మాజీ రాష్ట్రపతి శ్రీ కేఆర్ నారాయణన్ విగ్రహాన్ని ఆవిష్కరించిన రాష్ట్రపతి
శ్రీ కేఆర్ నారాయణన్ జీవితం.. ధైర్యం, పట్టుదల, ఆత్మవిశ్వాసం నిండిన కథ: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
Posted On:
23 OCT 2025 11:12AM by PIB Hyderabad
మాజీ రాష్ట్రపతి శ్రీ కేఆర్ నారాయణన్ విగ్రహాన్ని తిరువనంతపురంలోని, రాజ్‌భవన్లో రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపదీ ముర్ము ఈ రోజు (2025, అక్టోబర్ 23) ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్, కేరళ గవర్నర్ శ్రీ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్, బీహార్ గవర్నర్ శ్రీ ఆరిఫ్ మహ్మద్ ఖాన్, కేరళ ముఖ్యమంత్రి శ్రీ పినరయి విజయన్ ఇతర విశిష్ట అతిథులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ.. ధైర్యం, పట్టుదల, ఆత్మవిశ్వాసంతో కూడిన గాథే... శ్రీ కేఆర్ నారాయణన్ జీవితమన్నారు. అపరిమితమైన పట్టుదల, విద్య అందించిన శక్తి ద్వారా దేశంలోని అత్యున్నత రాజ్యాంగ పదవిని ఆయన అలంకరించారు. లక్ష్యాన్ని నిర్దేశించుకున్నప్పడు.. పట్టుదల, అవకాశం ఏం సాధిస్తాయో చెప్పడానికి ఆయన పాండిత్యం ఒక ఉదాహరణ. రాజకీయాల్లోకి రాక ముందు ఇండియన్ ఫారిన్ సర్వీస్‌లో శ్రీ నారాయణన్ గొప్పగా ఉద్యోగ జీవితాన్ని నిర్మించుకున్నారని ఆమె అన్నారు. శాంతి, న్యాయం, సహకారమనే భారతీయ విలువలను అత్యంత నిజాయతీతో నిలబెట్టారు. సమానత్వం, సమ్మిళిత్వమనే నియమాలకు శ్రీ నారాయణన్ ఎల్లప్పుడూ కట్టుబడి ఉన్నారని ఆమె అన్నారు.

స్వరాష్ట్రమైన కేరళతో శ్రీ నారాయణన్‌కు గొప్ప అనుబంధం ఉందని రాష్ట్రపతి వివరించారు. సామాజిక ప్రగతి, విద్య, సమ్మిళిత్వానికి ఆ రాష్ట్రమిచ్చిన ప్రాధాన్యం నుంచి ఆయన స్ఫూర్తి పొందారు. దేశ అత్యున్నత పదవిని స్వీకరించినప్పటికీ తన మూలాలతో అనుబంధాన్ని కొనసాగించారు. మానవ, జాతీయాభివృద్ధిలో విద్యకున్న ప్రాధాన్యాన్ని శ్రీ నారాయణన్ తన జీవితమంతా తెలియజేస్తూనే ఉన్నారని ఆమె ప్రశంసించారు. ఆయన దృష్టిలో విద్య కొందరికి మాత్రమే పరిమితమైన ప్రత్యేక అధికారం కాదు.. అది అందరి హక్కు. నాగరికత అభివృద్ధికి మానవతా విలువలు అవసరమని, సామాజిక అభివృద్ధికి అవే మూలమని శ్రీ నారాయణన్ విశ్వసించేవారు.

నైతికత, చిత్తశుద్ధి, కరుణ, ప్రజాస్వామ్య స్ఫూర్తి అనే ఘనమైన వారసత్వాన్ని శ్రీ కేఆర్ నారాయణన్ మిగిల్చి వెళ్లారని రాష్ట్రపతి అన్నారు. ఈ రోజు ఆయనను స్మరించుకుంటున్న నేపథ్యంలో.. జాతి నిర్మాణానికి, మరింత సమ్మిళిత్వం సాధించిన, న్యాయబద్ధమైన, కరుణతో నిండిన భారత్‌ను నిర్మించడానికి అంకితమైన ఆయన జీవితం నుంచి మనం స్ఫూర్తి పొందాలి. ఆయన పాటించిన సమానత్వం, నీతి, ప్రజాసేవ విలువను నిలబెట్టడంలో ఆయన స్మృతిచిహ్నం ప్రజలకు స్ఫూర్తినిస్తుందనే విశ్వాసాన్ని ఆమె వ్యక్తం చేశారు.
రాష్ట్రపతి ప్రసంగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి-
***
(Release ID: 2181799)
Visitor Counter : 7