ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
ఆధార్ మస్కట్‌ను రూపొందించడానికి దేశంలోని సృజనాత్మక నిపుణులను ఆహ్వానించిన యుఐడీఏఐ
బహుమతి మొత్తం రూ. లక్ష - 31 అక్టోబర్ 2025 వరకు దరఖాస్తుల స్వీకరణ
యూఐడీఏఐ సందేశ చిత్రంగా సేవా దృక్పథం, భద్రత, అన్ని వయసుల వారికి లభ్యత...అంశాలతో ఆధార్ మస్కట్
డిజిటల్ ఆవిష్కరణగా విశ్వాసం, సమ్మిళితం, సాధికారత వంటి ప్రధాన విలువలు
Posted On:
17 OCT 2025 4:15PM by PIB Hyderabad
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడిఏఐ) మైగవ్ వేదికపై దేశవ్యాప్తంగా మస్కట్ డిజైన్ పోటీని ప్రారంభించింది. యూఐడిఏఐ అధికారిక మస్కట్ డిజైన్ చేయడానికి పౌరులను ఆహ్వానిస్తోంది. డిజైన్లు పంపడానికి ఈ నెల 31 చివరి తేదీ. విశ్వాసం, సమ్మిళితత్వం, సాధికారత, డిజిటల్ ఆవిష్కరణ వంటి ఆధార్ ప్రధాన విలువలను ప్రతిబింబించే ప్రత్యేకమైన, గుర్తుండిపోయే మస్కట్‌ను రూపొందించడం లక్ష్యంగా ఈ పోటీ నిర్వహిస్తున్నారు.
ఈ మస్కట్ యూఐడిఏఐ చిత్ర సందేశంగా ఉండాలి. యూఐడిఏఐ సమాచారం అన్ని వయసుల వారికి మరింత సన్నిహితంగా, ఆకట్టుకునేలా ఉండాలి. ఇది ఆధార్ గురించి వివరాలను సులభంగా అందిస్తూ, ఆధార్ సేవ, భద్రత, లభ్యత స్ఫూర్తిని ప్రతిబింబించాలి.
భారత పౌరులంతా - వ్యక్తులు లేదా బృందాలుగా పోటీలో పాల్గొనవచ్చు. డిజైన్లను ప్రత్యేకంగా మైగవ్ పోటీ పేజీ ద్వారా సమర్పించవచ్చు. పాల్గొనేవారు ఒక ఒరిజినల్ మస్కట్ డిజైన్‌ను, దానితో పాటు ఒక సంక్షిప్త కాన్సెప్ట్ నోట్, మస్కట్ పేరును పంపాలి. సృజనాత్మకత, వాస్తవికత, సౌందర్య ఆకర్షణ, యూఐడిఏఐ విలువల ఆధారంగా వాటి పరిశీలన, ఎంపిక జరుగుతాయి.
విజేతలకు ఆకర్షణీయమైన బహుమతులు ఉన్నాయి. మొదటి బహుమతి రూ. 50,000. ఆ తర్వాత వరుసగా రెండో, మూడో బహుమతులకు రూ. 30,000 రూ. 20,000 గుర్తింపు పత్రాలతో పాటు అందచేస్తారు. మస్కట్ పేరు విషయంలో కూడా ఉత్తమ ఎంట్రీలకు బహుమతి ఇస్తారు. ప్రజలు తమ సృజనాత్మకతకు జీవం పోసి, ఆధార్ సమ్మిళిత, సాధికారత ప్రయాణానికి సహకరించాలని యూఐడిఏఐ కోరుతోంది.
వివరణాత్మక మార్గదర్శకాలు, పోటీలో పాల్గొనడం కోసం, https://innovateindia.mygov.in/uidai-mascot-competition/ ను సందర్శించవచ్చు.
***
(Release ID: 2180751)
Visitor Counter : 4