రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

స్వావలంబన దిశగా పయనం: నాసిక్‌లోని ‘హెచ్‌ఏఎల్‌’లో ‘ఎల్‌సీఏ ఎంకే1ఏ' 3వ శ్రేణి... ‘హెచ్‌టీటీ-40’ 2వ శ్రేణి ఉత్పత్తి ప్రక్రియలకు రక్షణశాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్‌ సింగ్‌ శ్రీకారం


· ఈ ఫ్యాక్టరీలో తయారైన తొలి ‘ఎల్‌సీఏ ఎంకే1ఏ’ను గగన ప్రవేశం చేయించిన మంత్రి
· “రక్షణ రంగంలో స్వయంసమృద్ధ భారత్‌ సామర్థ్యానికి ‘ఎల్‌సీఏ ఎంకే1ఏ’ తిరుగులేని ఉదాహరణ”
· “ఎల్‌సీఏ ఎంకే1ఏ' 3వ శ్రేణి... ‘హెచ్‌టీటీ-40’ 2వ శ్రేణి ఉత్పత్తి ప్రక్రియలు ప్రభుత్వ-పారిశ్రామిక-విద్యా వ్యవస్థల సమన్వయానికి నిదర్శనం... సమష్టిగా ముందడుగు వేస్తే ఎంతటి సమస్యనైనా పరిష్కరించగలం”
· “ఆపరేషన్ సిందూర్ సందర్భంగా వివిధ కార్యకలాపాల ప్రదేశాల్లో ‘హెచ్‌ఏఎల్‌’ నిరంతర మద్దతుతో ‘ఐఏఎఫ్‌’ కార్యాచరణ సంసిద్ధతకు భరోసా ఇచ్చింది”

Posted On: 17 OCT 2025 4:07PM by PIB Hyderabad

నాసిక్‌లోని ‘హిందూస్థాన్‌ ఏరోనాటిక్స్ లిమిటెడ్’ (హెచ్‌ఏఎల్) కర్మాగారంలో తేలికపాటి యుద్ధ విమానం (లైట్‌ కంబాట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌-ఎల్‌సీఏ) ‘తేజస్‌ ఎంకే1ఏ’ మూడో శ్రేణి ఉత్పత్తి ప్రక్రియను రక్షణశాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్‌ సింగ్‌ ఇవాళ (2025 అక్టోబరు 17) ప్రారంభించారు. దీంతోపాటు ‘హిందూస్థాన్‌ టర్బో ట్రైనర్-40’ (హెచ్‌టీటీ) రెండో శ్రేణి ఉత్పత్తి ప్రక్రియకూ ఆయన శ్రీకారం చుట్టారు. అంతేకాకుండా ఇక్కడ తయారైన తొలి ‘ఎల్‌సీఏ ఎంకే1ఏ' యుద్ధ విమానాన్ని గగన ప్రవేశం చేయించారు.

ఈ సందర్భంగా ప్రసంగిస్తూ- రక్షణ రంగంలో స్వయంసమృద్ధ భారత్ సామర్థ్యానికి నేడు అత్యాధునిక విమానం ‘ఎల్‌సీఏ ఎంకే1ఏ’ గగన ప్రవేశమే తిరుగులేని ఉదాహరణ అని కేంద్ర మంత్రి అభివర్ణించారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వాన గత దశాబ్దంలో రక్షణ రంగ పరిణామాత్మక పురోగమనాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ- భారత్‌ ఒకనాడు 65-70 శాతం మేర సైనిక హార్డ్‌ వేర్‌ను దిగుమతి చేసుకునే దేశంగా ఉండేదని గుర్తుచేశారు. అయితే, నేడు 65 శాతం పరికరాలను దేశీయంగానే తయారు చేసుకుంటున్నదని, సమీప భవిష్యత్తులో సొంత గడ్డపైనే 100 శాతం సామర్థ్యం సాధించాలని ప్రభుత్వం సంకల్పించిందని ఆయన చెప్పారు.

“రక్షణ రంగంలో స్వావలంబనతోనే దేశ భద్రత సాధ్యమని 2014లో మేం అధికారంలోకి వచ్చిన నాడే గ్రహించాం. ఈ దిశగా కృషి ప్రారంభించినపుడు అనేక సవాళ్లను ఎదుర్కొన్నాం. వాటిలో ‘పరిమిత రక్షణ సంసిద్ధత’, ‘దిగుమతి పరాధీనత’ అత్యంత కీలక సమస్యలు. అప్పట్లో ఏది తయారు చేయాలన్నా ప్రభుత్వ సంస్థలకే పరిమితం. ఉత్పాదకావరణ వ్యవస్థలో ప్రైవేట్ రంగానికి గణనీయ భాగస్వామ్యం ఇవ్వలేదు. మరోవైపు మునుపటి ప్రభుత్వాలు రక్షణ ప్రణాళిక, అత్యాధునిక సాంకేతికత, ఆవిష్కరణలపై దృష్టి సారించిన పాపాన పోలేదు. ఫలితంగా సంక్లిష్ట పరికరాలు, ఆధునిక వ్యవస్థల కోసం ఇతర దేశాలపై ఆధారపడక తప్పలేదు. దీంతో వ్యయభారంతోపాటు వ్యూహాత్మక దౌర్బల్యం దేశాన్ని పీడించాయి. ఈ సవాళ్లే సరికొత్త ఆలోచనలు, సంస్కరణల వైపు మమ్మల్ని ప్రోత్సహించింది. ఆ నిర్విరామ కృషి ఫలితాలు నేడు ప్రస్ఫుటం అవుతున్నాయి. దిగుమతి పరాధీనతను తగ్గించడమేగాక దేశీయీకరణపై మా నిబద్ధతను కూడా బలోపేతం చేశాం. లోగడ ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్న ప్రతిదాన్నీ ఇప్పుడు మనమే తయారు చేసుకుంటున్నాం. ఈ మేరకు యుద్ధ విమానాలు, క్షిపణులు, ఇంజిన్లు, ఎలక్ట్రానిక్ యుద్ధ వ్యవస్థల వంటివి నేడు దేశంలోనే తయారవుతున్నాయి” అని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ వివరించారు.

ప్రభుత్వ నిరంతర కృషితో సాధించిన ఇతర విజయాలను కూడా మంత్రి ఏకరవు పెట్టారు. భారత్‌ వార్షిక రక్షణ రంగ ఉత్పాదన విలువ 2014-15లో రూ.46,429 కోట్లు కాగా, 2024-25లో అది రూ.1.50 లక్షల కోట్ల స్థాయిని అధిగమిస్తూ రికార్డు సృష్టించిందని చెప్పారు. అలాగే దశాబ్దం కిందట మన ఎగుమతులు రూ.1,000 కోట్లకన్నా తక్కువగా ఉంటే- నేడు రూ.25,000 కోట్లకు చేరాయని పేర్కొన్నారు. ఈ విజయాల స్ఫూర్తితో “2029 నాటికి రక్షణ తయారీ విలువను రూ.3 లక్షల కోట్లకు, ఎగుమతులను రూ.50,000 కోట్లకు పెంచాలని లక్ష్యనిర్దేశం చేసుకున్నాం” అని ఆయన ఉద్ఘాటించారు.

ఆధునిక యుద్ధరీతులు ఎప్పటికప్పుడు మారిపోతున్న నేటి పరిస్థితుల్లో కృత్రిమ మేధ, సైబర్ యుద్ధం, డ్రోన్ వ్యవస్థలు, భావితరం యుద్ధ విమానాలు భవిష్యత్తును శాసిస్తాయని శ్రీ రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పష్టం చేశారు. అందువల్ల వాటికి తగినట్లుగా బహుముఖ సంసిద్ధతతో ముందంజ వేయాల్సిన అవసరాన్ని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. “ఈ కొత్త పరుగు పందెంలో భారత్‌ సదా అగ్రస్థానంలో నిలవాలి తప్ప ఏ మాత్రం  వెనుకబడరాదు” అన్నారు. ఈ దిశగా ‘ఎల్‌సీఏ తేజస్’ లేదా హెచ్‌టీటీ-40’ వంటివాటికి పరిమితం కాకుండా భవిష్యత్తరం యుద్ధ విమానాలు, మానవరహిత వ్యవస్థలు సహా పౌర విమానయాన రంగంలోనూ ‘హెచ్‌ఏఎల్‌’ తనదైన ముద్ర వేయాలని ఆయన పిలుపునిచ్చారు.

అత్యాధునిక, స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాలను అనుసరించడంలో ప్రభుత్వ నిబద్ధతను వివరిస్తూ-  ప్రభుత్వ రంగ సంస్థలను దేశ రక్షణ రంగానికి వెన్నెముకగా మంత్రి అభివర్ణించారు. ఈ దార్శనికతను కొనసాగించడంలో ‘హెచ్‌ఏఎల్‌’ ప్రశంసనీయ పాత్ర పోషిస్తున్నదని కొనియాడారు. భారత వైమానిక దళం నుంచి ఇటీవల మిగ్‌-21 యుద్ధ విమానాలకు స్వస్తి పలికే దిశగా ‘హెచ్‌ఏఎల్‌’ గణనీయ మద్దతునిచ్చిందని తెలిపారు. అంతేగాక ఆపరేషన్ సిందూర్ సమయంలో ఆ సంస్థ అమూల్య సహకారం చిరస్మరణీయమని అభినందించారు.

“మన భద్రత చరిత్రలో వ్యవస్థ మొత్తాన్నీ ఏకకాలంలో వాస్తవికంగా పరీక్షించిన సందర్భాలు అత్యంత అరుదు. అటువంటి వాటిలో ఆపరేషన్ సిందూర్ ఒకటి. ఈ మన దళాలు ప్రదర్శించిన నిబద్ధత, శౌర్యపరాక్రమాలు స్వదేశీ వేదికలపై సైన్యం నమ్మకాన్ని బలమైన రీతిలో చాటిచెప్పాయి. ఆపరేషన్ సిందూర్‌ సందర్భంగా వివిధ కార్యకలాపాల ప్రదేశాలలో ‘హెచ్‌ఏఎల్‌’ 24 గంటలూ మద్దతునిచ్చింది. ఆ మేరకు ఫైటర్ జెట్‌లు, హెలికాప్టర్ల సత్వర నిర్వహణ ద్వారా భారత వైమానిక దళం (ఐఏఎఫ్‌) కార్యాచరణ సంసిద్ధతకు భరోసా ఇచ్చింది. ముఖ్యంగా ఉగ్రవాద స్థావరాల విధ్వంసానికి వీలుగా ఎస్‌యూ-30 విమానాలకు బ్రహ్మోస్ క్షిపణిని అమర్చే కీలక కర్తవ్యాన్ని నాసిక్ బృందం విజయవంతంగా నిర్వర్తించింది. జాతీయ భద్రత విషయానికొస్తే, మనకు అవసరమైన పరికరాలను సొంతంగా తయారు చేసుకుంటూ పటిష్ఠ స్వీయ రక్షణకు తోడ్పడగలమని నిరూపించింది” అని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ కొనియాడారు.

ఆరు దశాబ్దాలకు పైగా కాలంలో మిగ్-21, 27 వంటి యుద్ధ విమానాల తయారీ, మరమ్మతుల నుంచి ఎస్‌యూ-30 విమానాల ఉత్పాదక కేంద్రంగా రూపొందే వరకూ భారత రక్షణ తయారీ సామర్థ్యాన్ని కొత్త శిఖరాలకు చేర్చడంలో ‘హెచ్‌ఏఎల్‌ నాసిక్‌’ కీలక పాత్ర పోషించిందంటూ రక్షణ మంత్రి ప్రశంసించారు. ఈ ప్రాంగణాన్ని స్వావలంబనకు దీటైన చిహ్నంగా అభివర్ణించారు.

దేశంలో ‘ఎల్‌సీఎ తేజస్, హెచ్‌టీటీ-40’ విమానాల తయారీ దేశంలోని వివిధ పరిశ్రమ భాగస్వాముల మధ్య సహకారం ఫలితమేనని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. “ప్రభుత్వ, పారిశ్రామిక, విద్యా వ్యవస్థల సమన్వయానికి ఇదే నిదర్శనం. సమష్టిగా ముందడుగు వేస్తే ఎంతటి సమస్యనైనా పరిష్కరించగలం” అని ఆయన వ్యాఖ్యానించారు. ‘తేజస్’, హెచ్‌టీటీ-40 వంటి విమానాలపై ‘ఐఏఎఫ్‌’  నమ్మకాన్ని ఆయన ప్రశంసించారు.

పౌర-సైనిక విమాన రంగాల సంయుక్త నిర్వహణ, మరమ్మతు, ఓవరాల్‌ కోసం నాసిక్ డివిజన్‌లో ఏర్పాటు చేసిన కర్మాగారం పరిసర ప్రాంతాల్లో కొత్త ఉపాధి అవకాశాలను సృష్టిస్తుందని రక్షణ మంత్రి ఆశాభావం వెలిబుచ్చారు. ‘హెచ్‌ఏఎల్‌’ ప్రాంగణం యావత్తూ ఇప్పుడు కాగితరహితం, డిజిటల్‌గా పూర్తి సుస్థిరతను సాధించడాన్ని ఆయన కొనియాడారు. నవ భారత సాంకేతిక పురోగమనానికి నిజమైన ఉదాహరణగా దీన్ని అభివర్ణించారు.

అనంతరం రక్షణ మంత్రిత్వ శాఖ (రక్షణ ఉత్పత్తి విభాగం) కార్యదర్శి శ్రీ సంజీవ్‌ కుమార్‌ మాట్లాడుతూ- ఇనుమడిస్తున్న దేశీయ సాంకేతిక విశ్వాసానికి, పారిశ్రామిక సామర్థ్యానికి, వ్యూహాత్మక దూరదృష్టికి రెండు శ్రేణుల ఉత్పత్తి ప్రక్రియలకు మంత్రి శ్రీకారం చుట్టడాన్ని నిదర్శనంగా అభివర్ణించారు. “ఈ కార్యక్రమం హెచ్‌ఏఎల్‌ ప్రగతి పయనంలో కొత్త అధ్యాయానికి సంకేతం. ఇది మన దేశీయ రక్షణరంగ ఉత్పాదక సామర్థ్యాన్ని పెంచుతూ బలమైన, స్వావలంబిత గగనావరణ వ్యవస్థ బలమైన పునాదిని శక్తిమంతం చేస్తుంది” అన్నారు.

అలాగే, ‘ఎల్‌సీఏ ఎంకే1' కేవలం ఒక యుద్ధ విమానం కాదని, భారత రూపకల్పన-తయారీ నైపుణ్యానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ‘హెచ్‌ఏఎల్‌, ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ, డీఆర్‌డీవో, ఐఏఎఫ్‌’ల సహకారంతో దేశీయ ప్రణాళిక, రూపకల్పన, తయారీకి ఈ విమానం ఒక ఉదాహరణ అని తెలిపారు. అంతేకాకుండా ‘హెచ్‌ఏఎల్‌’ పూర్తిస్థాయిలో రూపొందించి, తయారుచేసిన ‘హెచ్‌టీటీ-40’ ఆ సంస్థ సామర్థ్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. కీలక రక్షణ వేదికలకు ప్రణాళిక, రూపకల్పన ఉత్పాదనలో పూర్తి దేశీయ పరిజ్ఞానం వినియోగించడం కంపెనీ నిశిత దృష్టికి చిహ్నమన్నారు.

నాసిక్‌లోని ‘హెచ్‌ఏఎల్‌’లో ‘ఎల్‌సీఏ ఎంకే1ఏ', ‘హెచ్‌టీటీ-40’లను విజయవంతంగా తయారు చేయడం సంస్థ విస్తరణ సామర్థ్యానికి నిదర్శనమని ‘హెచ్‌ఏఎల్‌’ సీఎండీ డాక్టర్ డి.కె.సునీల్ అన్నారు. “ఎస్‌యూ-30ఎంకేఐ’తోపాటు స్వదేశీ అధునాతన యుద్ధ విమానాల ఉత్పత్తి సామర్థ్యమే కాకుండా సకాలంలో సరఫరా దిశగానూ సాగుతున్న కృషికి ఈ కర్మాగారం ఊతమిచ్చింది. అలాగే నాసిక్ సహా పరిసర ప్రాంతాల్లో దాదాపు 1,000 ఉద్యోగాల సృష్టికి, 40కిపైగా పరిశ్రమ భాగస్వాముల ముందంజకు తోడ్పడింది. సమర్థ ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం రూపకల్పనపై ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చింది” అని ఆయన వివరించారు.

‘హెచ్‌ఏఎల్‌’ చీఫ్ టెస్ట్ పైలట్ (ఫిక్స్‌డ్ వింగ్), గ్రూప్ కెప్టెన్ కె.కె.వేణుగోపాల్ (రిటైర్డ్) ‘తేజస్ ఎంకే1ఏ’ని నడిపారు. ఆ తర్వాత ఎస్‌యూ-30ఎంకేఐ, హెచ్‌టీటీ-40 విమానాలు అద్భుత ప్రదర్శన ఇచ్చాయి. అనంతరం ‘తేజస్ ఎంకే1ఏ’ కూడా జల ఫిరంగుల గౌరవ వందనం అందుకుంది.

నేపథ్యం

‘హెచ్‌ఏఎల్‌’ రెండేళ్ల రికార్డు సమయంలో ‘ఎల్‌సీఏ ఎంకే1ఏ’ మూడో శ్రేణి ఉత్పత్తి ప్రక్రియను ప్రారంభించింది. ఈ మేరకు “సెంటర్, ఫ్రంట్, రియర్ ఫ్యూజ్‌లేజ్‌లు, వింగ్స్, ఎయిర్ ఇన్‌టేక్‌ సహా విమానం అన్ని ప్రధాన మాడ్యూళ్ల కోసం 30కిపైగా స్ట్రక్చర్ అసెంబ్లీ జిగ్‌లను పూర్తిగా సన్నద్ధం చేసింది. ప్రస్తుతం ఇది పూర్తిస్థాయిలో పనిచేస్తూ, ఏటా 8 విమానాలను ఉత్పత్తి చేయగలదు. ఇప్పుడు మూడో శ్రేణి ప్రక్రియ ప్రారంభం ద్వారా 24 విమానాల ఉత్పత్తి సామర్థ్యం సాధించగలదు.

నాసిక్‌ హెచ్‌ఏఎల్‌ రెండో శ్రేణి హెచ్‌టీటీ-40 ఉత్పత్తి ప్రక్రియను ప్రారంభించింది. అసెంబ్లీ కాంప్లెక్స్ ఫ్యూజ్‌లేజ్‌లు, వింగ్స్, కంట్రోల్ సర్ఫేస్‌ల తయారీకి తగిన అసెంబ్లీ విభాగాలు ఇక్కడున్నాయి.

‘హెచ్‌ఏఎల్‌’ నాసిక్ డివిజన్ గురించి

ఈ డివిజన్‌ను 1964లో మిగ్‌-21 యుద్ధ విమానాల తయారీ లైసెన్స్‌తో ఏర్పాటు చేశారు. ఇది ఇప్పటిదాకా 900కుపైగా విమానాలను ఉత్పత్తి చేయడంతోపాటు ‘మిగ్‌-21, 27 సహా ఎస్‌యూ-30 ఎంకేఐ’ దాకా 1,900కుపైగా సైనిక విమానాలను మరమ్మతు చేసింది విస్తృత డిజైన్, తయారీ, ఇంటిగ్రేషన్ సామర్థ్యాలతో ‘ఎస్‌యూ-30 ఎంకేఐ’కి బ్రహ్మోస్ క్షిపణులతోపాటు అదనపు స్వదేశీ ఆయుధాలను ఈ విభాగం విజయవంతంగా అమర్చింది.

పూర్తిస్థాయి విమానాల తయారీ, మరమ్మతు, డిజైన్ సామర్థ్యంగల అత్యాధునిక కర్మాగారమిది. ఇక్కడ తయారయ్యే విమానాల పూర్తి జీవితచక్రం పర్యంతం మద్దతునివ్వగల వారసత్వం ఈ విభాగం సొంతం. ప్రస్తుతం ఇక్కడ ‘ఎస్‌యూ-30ఎంకేఐ’ విమానాలకూ సమగ్ర ఓవర్‌హాల్, మరమ్మతు సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి.

****

 


(Release ID: 2180745) Visitor Counter : 4