భారత ఎన్నికల సంఘం
బీహార్ ఎన్నికల నేపథ్యంలో నగదు, మాదకద్రవ్యాలు, మద్యం, ఇతర ప్రభావాలకు అడ్డుకట్ట వేయడానికి భద్రతాదళాలు, నేరనియంత్రణ సంస్థల అధిపతులతో సమావేశాన్ని నిర్వహించిన ఈసీఐ
Posted On:
17 OCT 2025 2:56PM by PIB Hyderabad
1. భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఈ రోజు న్యూఢిల్లీలోని నిర్వాచన్ సదన్ లో భిన్న విభాగాలతో కూడిన ఎన్నికల నిఘా కమిటీతో సమావేశాన్ని నిర్వహించింది.
2. ఎన్నికల కాలంలో చోటు చేసుకోగల విభిన్న ప్రతికూల చర్యల విషయంలో ముందస్తుగా అంచనా వేసి మరీ వాటికి సంబంధించిన నివారణ చర్యలను చేపట్టడంలో నేర నియంత్రణ సంస్థలు పోషించాల్సిన పాత్రపై ఎన్నికల సంఘం ప్రధానాధికారి శ్రీ జ్ఞానేశ్ కుమార్, ఎన్నికల సంఘం అధికారులు డాక్టర్ సుఖ్‌బీర్ సింగ్ సంధూ, డాక్టర్ వివేక్ జోషీలతో కలసి దిశానిర్దేశం చేశారు.
3. ఎన్నికల్లో నగదు, ఇతర ప్రలోభాల దుష్ప్రభావాన్ని అడ్డుకొనేందుకు సంపూర్ణ మార్గసూచీని రూపొందించాలనే ఉద్దేశంతో ఈ సమావేశాన్ని నిర్వహించారు.
4. ఈ సమావేశానికి హాజరైన వారిలో సీబీడీటీ, సీబీఐసీ, ఈడీ, డీఆర్ఐ, సీఈఐబీ, ఎఫ్ఐయూ- ఐఎన్డీ, భారతీయ రిజర్వు బ్యాంకు, ఐబీఏ, ఎన్సీబీ, ఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్, సరిహద్దు భద్రతా దళం, ఎస్ఎస్బీ, బీసీఏఎస్, ఏఏఐ, తపాలా విభాగం సహా వివిధ నేర నియంత్రణ సంస్థల అధిపతులు ఉన్నారు. బీహార్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, రాష్ట్ర పోలీస్ నోడల్ అధికారి (ఎస్పీఎన్ఓ) ఆన్లైన్ మాధ్యమం ద్వారా ఈ సమావేశంలో పాలుపంచుకొన్నారు.
5. ఎన్నికలు ఎలాంటి ప్రలోభాలకూ తావు లేకుండా జరిగేటట్టు చూసే దిశగా వివిధ ఏజెన్సీలు తాము ఏ మేరకు సన్నద్ధమైందీ, ఏయే చర్యలను తీసుకుందీ కమిషన్ దృష్టికి తీసుకువచ్చాయి. ఎన్నికల వాతావరణానికి చేటు చేసే అంశాలు, డబ్బు పంపిణీకి సంబంధించిన అనేక అంశాలపై చర్చించారు.
6. పటిష్ట చర్యలను తీసుకొనే దృష్టితో, ఆర్థిక నేరాల రహస్య సమాచారాన్ని నేర నియంత్రణ సంస్థలు ఇచ్చి పుచ్చుకోవడంలో పరస్పరం సహకరించుకోవాలని కమిషన్ ఆదేశించింది.
7. ప్రతి నేర నియంత్రణ సంస్థలోనూ జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయులతో పాటు వివిధ అంచెల్లో చక్కని సమన్వయం అవసరమని కూడా కమిషన్ స్పష్టం చేసింది.
8. రాష్ట్రాల సరిహద్దుల్లోనూ, అంతర్జాతీయ సరిహద్దుల నుంచీ వస్తువులు, డ్రగ్స్, మద్యం, నగదు, నకిలీ నోట్ల దొంగరవాణాను అడ్డుకోవడానికి నియోజకవర్గాలపై పక్కా నిఘా పెట్టాలనీ, నియోజకవర్గాలను మ్యాప్ చేయాలనీ కూడా ఎన్నికల సంఘం ఆదేశించింది.
9. బీహార్ లో ఎన్నికలు స్వేచ్ఛగా, న్యాయబద్ధంగా జరిగేందుకు నిబంధనలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలిచ్చింది.
(Release ID: 2180742)
Visitor Counter : 5