ఉక్కు మంత్రిత్వ శాఖ
పైప్‌లైన్ సరఫరా వ్యవస్థలో ఉపయోగించే వెల్డెడ్ స్టీలు పైపు కోసం హాట్ రోల్డ్ స్టీలుకు దేశంలో బీఐఎస్ లైసెన్స్ పొందిన తొలి సంస్థగా నిలిచిన ఎన్ఎండీసీ
Posted On:
16 OCT 2025 1:44PM by PIB Hyderabad
దేశంలో భారత ప్రమాణాలు (ఐఎస్) లైసెన్సును అందుకొన్న తొలి సంస్థగా అత్యాధునిక స్టీల్ ప్లాంట్ అయిన ఎన్ఎండీసీ స్టీల్ లిమిటెడ్ (ఎన్ఎస్ఎల్) చారిత్రక విజయాన్ని సాధించింది. ‘‘పైప్‌లైన్ సరఫరా వ్యవస్థల్లో ఉపయోగించే వెల్డెడ్ స్టీల్ పైపు కోసం ఉపయోగించే హాట్ రోల్డ్ స్టీలు స్ట్రిప్, షీటు, ప్లేట్లు - సాధారణ అవసరాలు (ఐఎస్ 18384:2023)’’ కోసం ఈ లైసెన్స్ జారీ చేశారు.
అంతర్జాతీయ ప్రమాణాల దినోత్సవం 2025 సందర్భంగా రాయపూర్‌లోని పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో ఈ ధ్రువపత్రాన్ని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) అందజేసింది. ఈ కార్యక్రమాన్ని రాయపూర్‌లోని బీఐఎస్ కార్యాలయం నిర్వహించింది.
చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి శ్రీ విష్ణు దేవ్ సాయ్ నుంచి ఈ పురస్కారాన్ని ఎన్ఎండీసీ స్టీల్, చీఫ్ జనరల్ మేనేజర్ (స్టీల్) శ్రీ అమృత్ నారాయణ స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆహారం, పౌర సరఫరాల మంత్రి శ్రీ దయాల్ దాస్ బఘేల్, బీఐఎస్ రాయపూర్ డైరెక్టర్, అధిపతి శ్రీ ఎస్కే గుప్త పాల్గొన్నారు.
నాణ్యత, ఆవిష్కరణ, సుస్థిరాభివృద్ధి పట్ల ఎన్ఎండీసీ స్టీల్ సంస్థకున్న అంకిత భావాన్ని ఈ ధ్రువీకరణ తెలియజేస్తుంది. పెట్రోలియం, సహజవాయు రంగాల్లో నాణ్యత, పనితీరు ప్రమాణాలకు అనుగుణంగా.. అంతర్జాతీయ స్థాయి స్టీలు ఉత్పత్తులను తయారు చేయాలనే ఎన్ఎస్ఎల్ దార్శనికతను ఇది బలపరుస్తుంది.
పెట్రోలియం, సహజవాయు రంగంలో పైప్‌లైన్ సరఫరా వ్యవస్థల కోసం నాణ్యమైన స్టీలు ఉత్పత్తులను రూపొందించడానికి ఐఎస్ 18384:2023 ధ్రువీకరణ ప్రామాణికంగా నిలుస్తుంది. ఇది సాంకేతిక పురోగతి, ఉత్పత్తిలో అత్యుత్తమ నాణ్యత, సుస్థిరమైన తయారీ పద్ధతులకు ఎన్ఎండీసీ ఇస్తున్న ప్రాధాన్యాన్ని తెలియజేస్తుంది.
ఈ సందర్భంగా ఎన్ఎండీసీ స్టీల్ సీఎండీ శ్రీ అమితవ ముఖర్జీ మాట్లాడుతూ.. ‘‘భారత్‌లో బీఐఎస్ లైసెన్స్ తీసుకున్న మొదటి సంస్థగా నిలవడం గర్వంగా ఉంది. ఇది మా నాణ్యత పట్ల మా చిత్తశుద్ధికి, భారత పారిశ్రామిక ప్రమాణాలు, మౌలిక వసతులను బలోపేతం చేయడంలో మా భాగస్వామ్యానికి నిదర్శనం’’ అని అన్నారు.
3.0 ఎంపీటీఏ సామర్థ్యంతో నడిచే ఎన్ఎండీసీ స్టీల్ లిమిటెడ్.. ఉక్కు రంగంలో స్వావలంబన దిశగా భారత్‌ను నడిపించడంలో తన కీలకపాత్రను కొనసాగిస్తుంది.
****
(Release ID: 2179986)
Visitor Counter : 14