రక్షణ మంత్రిత్వ శాఖ
డీఆర్‌డీఓ దేశీయంగా అభివృద్ధి చేసిన సైనిక పోరాట పారాచూట్ సిస్టమ్... 32,000 అడుగుల ఎత్తులో విజయవంతమైన పరీక్ష
Posted On:
15 OCT 2025 8:34PM by PIB Hyderabad
రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన మిలిటరీ కాంబాట్ పారాచూట్ వ్యవస్థను 32,000 అడుగుల ఎత్తు నుంచి కాంబాట్ ఫ్రీఫాల్ జంప్ ద్వారా విజయవంతంగా పరీక్షించింది. దీనిని భారత వైమానిక దళానికి చెందిన టెస్ట్ జంపర్లు విజయవంతంగా నిర్వహించి.. స్వదేశీ వ్యవస్థ సామర్థ్యం, విశ్వసనీయత, ఆధునిక రూపకల్పనను ప్రదర్శించారు. ఈ విజయంతో 25,000 అడుగుల ఎత్తుకు పైగా వినియోగించగల సామర్థ్యం కలిగి ప్రస్తుత భారత సాయుధ దళాల్లో ఉపయోగంలో ఉన్న ఏకైక పారాచూట్ వ్యవస్థగా సైనిక పోరాట పారాచూట్ వ్యవస్థ (ఎంసీపీఎస్) నిలిచింది.
మిలిటరీ కాంబాట్ ప్యారాచూట్ వ్యవస్థను డీఆర్‌డీఓకు చెందిన ఆగ్రాలోని ఏరియల్ డెలివరీ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ విభాగం, బెంగళూరులోని డిఫెన్స్ బయోయింజనీరింగ్ అండ్ ఎలక్ట్రోమెడికల్ ల్యాబొరేటరీ ప్రయోగశాలలు కలిసి అభివృద్ధి చేశాయి. ఇది మెరుగైన వ్యూహాత్మక విధానాలను కలిగి ఉంటుంది. ఇందులో తక్కువ వేగంతో దిగువకు పడటం, మెరుగైన స్టీరింగ్ సామర్ధ్యం, సైనికులు విమానం నుంచి సురక్షితంగా బయటకు రావడం, నిర్ణీత ఎత్తుల్లో పారాచ్యూట్‌ను విస్తరించగలగడం, గమ్యస్థానానికి ఖచ్చితంగా చేరగలగడం లాంటివి ఉన్నాయి. ఇది దేశీయంగా అభివృద్ధి చేసిన ప్రాంతీయ ఉపగ్రహ వ్యవస్థతో అనుసంధాన సామర్థ్యం కలిగి ఉంది. ఏ ప్రత్యర్థిపైనైనా దీనిని ఉపయోగించే స్వేచ్ఛను అందిస్తుంది. బాహ్య దేశాలు లేదా సంస్థల దాడులకు గురికాకుండా స్వతంత్రంగా పనిచేసే సామర్థం కలిగి ఉంటుంది.
ఈ పరీక్ష విజయవంతమవడంతో దేశీయంగా అభివృద్ధి చేసిన పారాచూట్ వ్యవస్థలను భారత సాయుధ దళాల్లో ప్రవేశపెట్టేందుకు మార్గం సుగుమమైంది. దిగుమతి చేసుకున్న పారాచూట్‌లతో పోలిస్తే.. ఎంసీపీఎస్ నిర్వహణ, మరమ్మత్తు కోసం తక్కువ సమయం పడుతుండటం వల్ల వీటిని అధికంగా వినియోగించడానికి సాధ్యమవుతుంది. ఘర్షణలు, యుద్ద సమయాల్లో పారాచూట్ సేవల సామర్థ్యం కోసం ఇతర దేశాలపై ఆధారపడటాన్ని కూడా తగ్గిస్తుంది.
ప్రదర్శన విజయవంతమవ్వడంపై డీఆర్‌డీఓ, సాయుధ దళాలు, అధికారులను రక్షణశాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అభినందించారు. స్వదేశీ రక్షణ సామర్థ్యానికి ఇదొక ముఖ్యమైన మైలురాయిగా ఆయన అభివర్ణించారు.
ఈ ప్రయోగంలో పాల్గొన్న డీఆర్‌డీఓ బృందాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి విభాగం కార్యదర్శి, డీఆర్‌డీఓ చైర్మన్ డాక్టర్ సమీర్ వి కామత్ కూడా అభినందించారు. వైమానిక సరాఫరా వ్యవస్థల రంగంలో స్వయం సమృద్ది దిశగా సాగుతున్న ప్రయత్నాలలో ముందడుగుగా ఆయన పేర్కొన్నారు.
(Release ID: 2179952)
Visitor Counter : 14