నూతన మరియు పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రధాని మోదీ సమర్థ కార్యాచరణతో సౌర విప్లవానికి నాంది.. 21వ శతాబ్దం భారత్‌దే: కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి


· గుజరాత్ స్థాపిత విద్యుత్ సామర్థ్యంలో 60% పునరుత్పాదక ఇంధనం నుంచే...

· 2014లో 2.8 గిగావాట్ల నుంచి నేడు 125 గిగావాట్లకు పెరిగిన భారత సౌర విద్యుత్ సామర్థ్యం

· మెహసానాలోని గణపత్ విశ్వవిద్యాలయంలో జరిగిన ‘వైబ్రెంట్ గుజరాత్’ ప్రాంతీయ సదస్సులో ప్రసంగించిన కేంద్ర మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి

Posted On: 09 OCT 2025 5:27PM by PIB Hyderabad

మెహసానాలోని గణపత్ విశ్వవిద్యాలయంలో ఈ రోజు నిర్వహించిన ‘వైబ్రంట్ గుజరాత్’ ప్రాంతీయ సదస్సులో కేంద్ర నూతన, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి ప్రసంగించారు. శుద్ధ ఇంధన రంగంలో గుజరాత్ సాధించిన విజయాలను ప్రశంసించిన ఆయన.. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశంలో పునరుత్పాదక ఇంధన విప్లవం వెల్లువెత్తడం గర్వకారణమన్నారు.

ప్రధానమంత్రి నేతృత్వంలోముఖ్యమంత్రి శ్రీ భూపేంద్రభాయ్ పటేల్ కృషితో గుజరాత్ స్థాపిత సామర్థ్యంలో 60 శాతం ఇప్పుడు పునరుత్పాదక ఇంధనం నుంచే లభిస్తోందని కేంద్ర మంత్రి అన్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 25 ఏళ్ల కిందట మొదటిసారిగా సౌర ఇంధన కార్యక్రమాన్ని ప్రారంభించేనాటికి ఒక్కో యూనిట్ ధర రూ.18 నుండి రూ. 20 వరకు ఉండేదన్నారు. 20- 25 ఏళ్ల అనంతరం ఏం జరుగుతుందో ముందుచూపుతో మెలిగేవారే దార్శనికులవుతారన్నారు. ప్రధానమంత్రి ఆనాడే దీనిని ఊహించారని శ్రీ ప్రహ్లాద్ జోషి వ్యాఖ్యానించారు. ఆ దార్శనికతే నేడు విప్లవాత్మక ఫలితాలనిస్తోందన్నారు. ఇటీవల మధ్యప్రదేశ్‌లో రూ. 2.15 కే లభించేంతగా ఒక సోలార్ యూనిట్ ధర తగ్గిందన్నారు. బ్యాటరీ స్టోరేజీకి సంబంధించి కూడా.. యూనిట్ ధర రూ. 2.70 గా నమోదైంది. చాలా మంది సందేహాలు వ్యక్తపరిచిన ఈ కార్యక్రమం నేడు ప్రపంచ సౌర విప్లవంలో భారత్‌ను ముందంజలో నిలిపిందని ఆయన అన్నారు.

2014లో ప్రధానమంత్రి మోదీ అధికారం చేపట్టిన సమయానికి దేశం మొత్తం సౌర విద్యుదుత్పత్తి 2.8 గిగావాట్లు మాత్రమే ఉండేదని మంత్రి గుర్తు చేశారు. కాగా, నేడు దేశంలో 125 గిగావాట్ల విద్యుత్ ఒక్క సౌరశక్తి నుంచే లభిస్తోందన్నారు.

‘‘మెహసానా ఉత్తేజకరమైన ప్రాంతం. దీన్ని స్వచ్ఛ ఇంధన దీపస్తంభంగా పిలుస్తారు’’ అంటూ మెహసానా ప్రాంతాన్ని మంత్రి శ్రీ జోషి ప్రశంసించారు. జిల్లాలోని మొధేరాను ప్రస్తావిస్తూ.. బహుశా ప్రపంచంలో 24 గంటలూ పర్యావరణ హిత పద్ధతిలో విద్యుత్తును అందిస్తున్న ఏకైక గ్రామం ఇదే అయి ఉంటుందని, మనందరికీ ఇది గర్వకారణమని వ్యాఖ్యానించారు.

తీవ్ర సవాలుగా పరిణమిస్తున్న వాతావరణ మార్పులపై మాట్లాడుతూ.. ‘‘పెరుగుతున్న డిమాండ్ కారణంగా మనం అస్థిరంగా మారుతున్నాంసుస్థిరతను కోల్పోతున్నాం. ప్రకృతిని, జీవవైవిధ్యాన్ని ధ్వంసం చేస్తున్నాం’’ అని కేంద్ర మంత్రి అన్నారు. పారిశ్రామిక విప్లవం అనంతరం భూమి ఉష్ణోగ్రత 1.1 డిగ్రీల సెల్సియస్ పెరిగిందనిదీనివల్ల ధ్రువపు ఎలుగుబంటి, ధ్రువపు నక్క వంటి జీవులు అంతరించిపోయే పరిస్థితులు ఉత్పన్నమయ్యాయని ఆయన హెచ్చరించారు. ఉష్ణోగ్రత 1.5 డిగ్రీలు పెరగడానికి మనకు గరిష్టంగా మరో ఏడేళ్ల సమయం ఉందని, అది దాటితే పరిస్థితి చాలా తీవ్రంగా మారుతుందని శ్రీ జోషీ చెప్పారు.

మనం భూమిని రక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని, జీవ వైవిధ్యాన్ని పరిరక్షించాలని దేశంలోని యువత, పారిశ్రామికవేత్తలకు ఆయన విజ్ఞప్తి చేశారు. గుజరాత్ సౌర కార్యక్రమాన్ని ఆయన ప్రశంసించారు. ప్రతిఒక్కరూ సౌర, శుద్ధ ఇంధనాన్ని ప్రోత్సహించాలని కోరారు.

 

***


(Release ID: 2179673) Visitor Counter : 8