రక్షణ మంత్రిత్వ శాఖ
శాంతి పరిరక్షణలో కొత్తగా పుట్టుకొస్తున్న సవాళ్లను ఎదుర్కోవడానికి, ప్రపంచ శాంతిని పరిరక్షించడానికి మెరుగైన సంప్రదింపులు, సహకారం, సమన్వయం, సామర్థ్య నిర్మాణమే కీలకం: యూఎన్ దళాలకు సహకారమందిస్తున్న దేశాల ప్రధాన సైనికాధికారులతో రక్షణ మంత్రి
‘‘సాంకేతికత, ఆర్థిక సామర్థ్యాల్లో ముందున్న దేశాలు శాంతి పరిరక్షక కార్యకలాపాలను కొనసాగించడానికి అవసరమైన సాయాన్ని అందించాలి’’
‘‘వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించేలా, సభ్యదేశాలన్నింటికీ మాట్లాడే అవకాశాన్నిచ్చేలా, సమకాలీన సమస్యలను పరిష్కారించేలా, మానవ సంక్షేమంపై దృష్టి సారించేలా సంస్కరించిన బహుపాక్షిక విధానం పరస్పరం అనుసంధానమైన నేటి ప్రపంచానికి అవసరం’’
‘‘ఆఫ్రికా, మధ్యప్రాచ్యం వ్యాప్తంగా చేపడుతున్న కార్యకలాపాల్లో సేవలందించిన భారతీయ మహిళా అధికారులు సాధికారతకు ప్రపంచ చిహ్నంగా నిలిచారు’’
‘‘కొన్ని దేశాలు అంతర్జాతీయ నియమాలను బహిరంగంగా ఉల్లంఘిస్తున్నాయి.. కాలం చెల్లిన అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలను కోరుతూనే.. నియమ ఆధారిత విధానాన్ని భారత్ సమర్థిస్తుంది’’
Posted On:
14 OCT 2025 1:41PM by PIB Hyderabad
కొత్తగా పుట్టుకొస్తున్న సవాళ్లను ఎదుర్కోవడానికి, ప్రపంచ శాంతిని పరిరక్షించేందుకు ఐక్యరాజ్య సమితి చేస్తున్న శాంతి ప్రయత్నాలకు తోడ్పడుతున్న దేశాలకు మార్గనిర్దేశక సూత్రంగా మెరుగైన సంప్రదింపులు, సహకారం, సమన్వయం, సామర్థ్య నిర్మాణం అనే - 4సీ సూత్రాన్ని రక్షణ మంత్రి శ్రీ రాజనాథ్ సింగ్ సూచించారు. భారత్‌లో తొలిసారిగా నిర్వహిస్తున్న చీఫ్స్ కాంక్లేవ్ ప్రారంభ కార్యక్రమంలో యునైటెడ్ నేషన్స్ ట్రూప్ కంట్రిబ్యూటింగ్ కంట్రీస్ (యూఎన్‌టీసీసీ)కు చెందిన ఉన్నత స్థాయి సైనికాధికారులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఈ కార్యక్రమం న్యూఢిల్లీలోని మానెక్‌షా సెంటర్లో 2025 అక్టోబర్ 14 నుంచి 16 వరకు జరుగుతుంది.
యుద్ధం, ఉగ్రవాదం, సున్నితమైన రాజకీయ పరిస్థితులు నెలకొన్న అస్థిర వాతావరణంలో మోహరింపుల దగ్గర నుంచి.. మానవతా సంక్షోభాలు, మహమ్మారులు, ప్రకృతి వైపరీత్యాలు, అసత్య ప్రచారాలను ఎదుర్కోవడం వరకు శాంతి రక్షక బలగాలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లలో పెరుగుతున్న సంక్లిష్టతను రక్షణ మంత్రి వివరించారు. బలగాలు, పోలీసులు, రవాణా సదుపాయాలు, సాంకేతికత, ప్రత్యేక సామర్థ్యాల ద్వారా శాంతి పరిరక్షణ కార్యకలాపాలను కొనసాగించేందుకు సహకారాన్ని మరింత విస్తరించాలని సభ్యదేశాలకు.. ముఖ్యంగా సాంకేతికంగా ముందంజలో ఉన్న, ఆర్థిక సామర్థ్యాలున్న వాటిని కోరారు. భద్రమైన సమాచార ప్రసార, పర్యవేక్షణ వ్యవస్థలు, మానవ రహిత వాహనాలు వంటి ఆవిష్కరణలను.. శాంతి కార్యకలాపాలను మరింత సురక్షితంగా, ప్రభావవంతంగా చేపట్టేందుకు దోహదపడతాయని స్పష్టం చేశారు.
‘‘కొత్తగా ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కోడానికి భాగస్వామ్య దేశాల బలగాల్లో ధైర్యం, అనుసరణ, ఆవిష్కరణల కంటే, యుద్ధ వాతావరణాన్ని ప్రభావితం చేయడానికి సంబంధిత రాజకీయ నాయకులు, ఆర్థిక భాగస్వామ్యం అందించే దేశాలు, ఇతర కీలక వ్యక్తులను భాగం చేసే మిషన్ స్థాయిలో సమగ్ర విధానం అవసరం. మోహరింపులో ఆలస్యం, వనరుల కొరత, యుద్ధాలకు మూల కారణాలను పరిష్కరించేందుకు తగిన ఆదేశాలు లేకపోవడం వల్ల ఈ కార్యకలాపాలు ప్రభావాన్ని చూపడంలో తరచూ వెనకబడిపోతున్నాయి. కాలం చెల్లిన బహుపాక్షిక సంస్థలతో ఆధునిక సమస్యలను పరిష్కరించలేం. సమగ్ర సంస్కరణలు లేకపోతే.. ఐక్యరాజ్య సమితిపై విశ్వాసం లోపిస్తుంది. ప్రస్తుతం ఉన్న పరస్పరం అనుసంధానమైన ప్రపంచంలో సంస్కరించిన బహుపాక్షిక విధానం అవసరం. ఇది వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించేలా, సభ్యదేశాలన్నింటికీ మాట్లాడే అవకాశాన్నిచ్చేలా, సమకాలీన సమస్యలను పరిష్కరించేలా, మానవ సంక్షేమంపై దృష్టి సారించేలా ఉండాలి’’ అని రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ స్పష్టం చేశారు
అంతర్జాతీయ శాంతి భద్రతలను కాపాడేందుకు ఐక్యరాజ్యసమితి చేపట్టే కార్యక్రమాలకు భారత్ ఎల్లప్పుడూ అండగా నిలిచిందని, ఈ నిబద్ధత పట్ల దృఢంగా వ్యవహరిస్తోందని రక్షణ మంత్రి తెలియజేశారు. ‘‘గడచిన దశాబ్దాల్లో 2,90,000 మంది భారతీయ సిబ్బంది 50కి పైగా యూఎన్ శాంతి పరిరక్షక కార్యకలాపాల్లో సేవలందించారు. వారి వృత్తి నిబద్ధత, ధైర్యం, కరుణ అంతర్జాతీయ గుర్తింపు పొందాయి. కాంగో, కొరియా నుంచి దక్షిణ సూడాన్, లెబనాన్ వరకు దుర్బల పరిస్థితుల్లో ఉన్నవారిని రక్షించడానికి, ఆయా ప్రాంతాలను పునర్నిర్మించడానికి మా సైనికులు, పోలీసులు, వైద్య నిపుణులు అంతర్జాతీయ సమాజంతో కలసి పనిచేశారు. శాంతి పరిరక్షణను మరింత ప్రభావవంతంగా, జవాబుదారీతనంగా మార్చేందుకు బలగాలను అందించడానికి, నైపుణ్యాలను పంచుకోవడానికి, సంస్కరణలకు మద్దతు ఇవ్వడానికి మేం సిద్దంగా ఉన్నాం. సహకారం, సాంకేతికతను పంచుకోవడం ద్వారా మెరుగుపరిచిన సన్నద్ధత, మరింత అనుసరణీయత కలిగిన, మరింత మానవత్వం నిండిన మిషన్లను మనం ఏర్పాటు చేయగలం’’ అని ఆయన తెలిపారు.
శాంతి పరిరక్షణ విజయం అంకెల్లో కాదని, సన్నద్ధతలోనే ఉంటుందన్న శ్రీ రాజనాథ్ సింగ్, న్యూఢిల్లీలో ఉన్న యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ సెంటర్ ద్వారా 90 దేశాలకు చెందినవారికి శిక్షణ ఇచ్చామని తెలిపారు. మిషన్ విజయానికి అవసరమైన పరస్పర అవగాహనను పెంపొందించడానికి.. మిత్ర దేశాలకు చెందిన శాంతి పరిరక్షకులకు శిక్షణ ఇవ్వడానికి, వారి మధ్య సమన్వయ కార్యాచరణను అభివృద్ధి చేయడానికి అవసరమైన సామర్థ్యాలు భారత్ వద్ద ఉన్నాయని తెలియజేశారు.
ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమం ద్వారా తక్కువ ఖర్చులోనే దేశీయ సాంకేతికతలను భారత్ అభివృద్ధి చేసిందని రక్షణ మంత్రి అన్నారు. ఇవి వాహనాలు, భద్రమైన సమాచార ప్రసార, పర్యవేక్షణ వ్యవస్థలు, మానవ రహిత వైమానిక వాహనాలు, వైద్య సహాయ పరిష్కారాల ద్వారా శాంతి పరిరక్షక కార్యకలాపాలను బలోపేతం చేస్తాయని వివరించారు.
శాంతి పరిరక్షక దళాల్లో పెరుగుతున్న మహిళల భాగస్వామ్యాన్ని స్ఫూర్తిదాయకమైన పరివర్తనల్లో ఒకటిగా శ్రీ రాజనాథ్ సింగ్ వర్ణించారు. వారి భాగస్వామ్యం మిషన్ ప్రభావాన్ని మరింత పెంచుతుందని, స్థానిక ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించడానికి, కార్యకలాపాల్లో సహానుభూతిని పెంచడానికి తోడ్పడుతుందన్నారు. ‘‘ఈ విషయంలో భారత్ మార్గదర్శిగా ఉంది. 2007లో లైబీరియాలో మోహరించిన పూర్తిగా మహిళలతో కూడిన పోలీస్ యూనిట్ సాధికారతకు అంతర్జాతీయ చిహ్నంగా మారింది. వృత్తి పట్ల వారి నిబద్ధత, కరుణ జాతీయ పోలీస్ విభాగంలో చేరేలా ఒక తరానికి చెందిన లైబీరియన్ మహిళలకు స్ఫూర్తినిచ్చింది. ప్రస్తుతం దక్షిణ సూడాన్, గోలన్ హైట్స్, లెబనాన్‌లో చేపడుతున్న కార్యకలాపాల్లో భారతీయ మహిళా అధికారులు సేవలందిస్తున్నారు. వారు గస్తీ నిర్వహణలో, సమాజంతో మమేకమవ్వడంలో, స్థానిక మహిళలు, యువతకు మార్గనిర్దేశం చేయడంలో గణనీయమైన కృషి చేస్తున్నారు. సమ్మిళిత్వం, గౌరవం, నమ్మకం ద్వారా ఆధునిక శాంతి పరిరక్షణ కార్యకలాపాల్లో ఏం సాధించవచ్చో వారు చేసి చూపిస్తున్నారు. డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో చేపట్టిన యూఎన్ శాంతి పరిరక్షణ కార్యకలాపాల్లో అత్యుత్తమ సేవలందించిన భారతీయ సైనిక దళానికి చెందిన శాంతి పరిరక్షకురాలికి 2024లో యునైటెడ్ నేషన్స్ మిలటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్ పురస్కారం లభించింది’’ అని మంత్రి తెలిపారు.
వైద్య శాంతి పరిరక్షకుల భాగస్వామ్యం గురించి రక్షణ మంత్రి మాట్లాడుతూ.. ఆఫ్రికా వ్యాప్తంగా ఉన్న యూఎన్ ఫీల్డ్ ఆసుపత్రుల్లో వేలాది మంది ప్రజలకు, శాంతి పరిరక్షకులకు భారతీయ వైద్య బృందం చికిత్స అందించిందని వెల్లడించారు. ‘‘తరచూ ప్రతికూలతలు ఎదురయ్యే పరిస్థితుల మధ్య వారు అందించే సేవలో.. భారతీయ శాంతి పరిరక్షకుల ఉత్తమ సంప్రదాయాలు, మానవత్వ స్ఫూర్తి నిండిన యూఎన్ విధానం నిండి ఉన్నాయి’’ అని వివరించారు.
విశ్వగురువుగా ఎదగాలన్న భారత దేశ ఆకాంక్ష.. ఆధిపత్యాన్ని ప్రకటించడం కోసం కాదని సహకారాత్మక, సమ్మిళిత అభివృద్ధికి ఇస్తున్న పిలుపు అని శ్రీ రాజనాథ్ సింగ్ స్పష్టం చేశారు. అహింస, అంతర్గత శాంతి అనే వారసత్వ విలువలను పంచుకోవడం ద్వారా ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షణ, శాంతి నిర్మాణ కార్యకలాపాలను బలోపేతం చేయవచ్చని, సామరస్యంతో నిండిన ప్రపంంచ శాంతిని ప్రోత్సహించవచ్చనే భారత నమ్మకాన్ని ఆయన తెలియజేశారు.
‘‘ఇటీవలి కాలంలో అంతర్జాతీయ చట్టాలను కొన్ని దేశాలు బహిరంగంగా ఉల్లంఘిస్తున్నాయి. ఆ చట్టాలను అణచివేసేందుకు మరికొన్ని ప్రయత్నిస్తున్నాయి. ఇంకొన్ని దేశాలు సొంత నియమాలు రూపొందించుకొని రాబోయే శతాబ్దంలో ఆధిపత్యం చెలాయించాలని ప్రయత్నిస్తున్నాయి. వీటన్నింటి మధ్య.. కాలం చెల్లిన అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలను కోరుతూనే.. నియమ ఆధారిత అంతర్జాతీయ వ్యవస్థను సమర్థించాలని భారత్ బలంగా వాదిస్తోంది. మహాత్మా గాంధీ పుట్టిన భూమి భారత్. అహింస, శాంతి మూలాలు మా విధానంలో బలంగా పాతుకుపోయాయి. మహాత్మాగాంధీ దృష్టిలో శాంతి అంటే యుద్ధం జరగకపోవడం కాదు.. న్యాయం, సామరస్యం, నైతిక బలాల సానుకూల స్థితి’’ అని రక్షణమంత్రి అన్నారు.
చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ప్రారంభోపన్యాసం చేస్తూ.. ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షణలో దీర్ఘకాలంగా భారత్ అందిస్తున్న సహకారాన్ని తెలియజేశారు. న్యూఢిల్లీలో ఉన్న యూన్ శాంతి పరిరక్షణ కేంద్రం లాంటి సంస్థల ద్వారా కార్యాచరణ నైపుణ్యం, సాంకేతిక ఆవిష్కరణలు, సామర్థ్య నిర్మాణం అందించేందుకు భారత సైన్యం సంకల్పాన్ని ఆయన పునరుద్ఘాటించారు.
శాంతి పరిరక్షణలో ఆవిష్కరణలు, సమ్మిళిత్వం, కార్యకలాపాల్లో సమన్వయం అవసరాన్ని చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్ స్పష్టం చేశారు. అంతర్జాతీయ భాగస్వాములకు రక్షణ రంగంలో సమర్థవంతమైన పరిష్కారాలను భారత్ అనుసరిస్తున్న ఆత్మనిర్భర భారత్ ఇస్తుందని స్పష్టం చేశారు.
ప్రపంచ శాతి కార్యకలాపాల భవిష్యత్తును సమష్టిగా రూపొందించడానికి చేపట్టిన ఈ కార్యక్రమంలో త్రివిధ దళాదిపతి జనరల్ అనిల్ చౌహాన్, వాయుసేన అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్, శాంతి కార్యకలాపాల అండర్-సెక్రటరీ-జనరల్ జీన్ పియర్ లక్రోయిక్స్, ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్, ఇతర సైనిక ఉన్నతాధికారులు, ప్రభుత్వాధికారులు, ప్రత్యేక ఆహ్వానితులు పాల్గొన్నారు.
యూఎన్ శాంతి కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషిస్తున్న 32 దేశాలకు చెందిన సైనిక ఉన్నతాధికారులను ఒక్క చోట చేర్చిన యూఎన్‌టీసీసీ చీఫ్స్ కాంక్లేవ్‌కు భారతీయ ఆర్మీ ఆతిథ్యమిచ్చింది. అల్జీరియా, ఆర్మేనియా, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, భూటాన్, బ్రెజిల్, బురుండీ, కాంబోడియా, ఈజిప్టు, ఇథియోపియా, ఫిజీ, ఫ్రాన్స్, ఘనా, ఇటలీ, కజకిస్థాన్, కెన్యా, కిర్గిస్థాన్, మడగాస్కర్, మలేషియా, మంగోలియా, మొరాకో, నేపాల్, నైజీరియా, పోలండ్, రువాండా, శ్రీలంక, సెనెగల్, టాంజానియా, థాయ్‌లాండ్, ఉగాండా, ఉరుగ్వే, వియత్నాం దేశాలు ఈ కాంక్లేవ్‌లో పాల్గొన్నాయి. ఉమ్మడి సామర్థ్య నిర్మాణానికి ఉద్దేశించిన రక్షణ ఎగ్జిబిషన్లు ఈ కాంక్లేవ్‌లో ఏర్పాటు చేశారు.
కార్యాచరణ సవాళ్లను, కొత్తగా పుట్టుకొస్తున్న ముప్పులను పరిష్కరించడానికి, కార్యకలాపాల నిర్వహణలో దేశాల మధ్య సమన్వయానికి, నిర్ణయాల్లో సమ్మిళిత్వానికి, యూఎన్ శాంతిపరిరక్షణను బలోపేతం చేయడంలో సాంకేతికత, శిక్షణ ప్రాధాన్యాన్ని బలోపేతానికి కృషి చేసే వేదికగా యూఎన్‌టీసీసీ పనిచేస్తుంది. కార్యాచరణ సవాళ్లు, కొత్తగా పుట్టుకొస్తున్న ముప్పులు, ఉత్తమ పద్ధతులను పంచుకోవడం, భవిష్యత్తు శాంతి కార్యకలాపాలపై ఉమ్మడి అవగాహనను పెంపొందించడంపై చర్చించేందుకు ఈ ఉన్నత స్థాయి సమావేశాన్ని యూఎన్ కార్యకలాపాల్లో అతిపెద్ద భాగస్వాముల్లో ఒకరిగా ఉన్న భారత్ నిర్వహించింది. వసుధైవ కుటుంబకం - ప్రపంచమంతా ఒకటే కుటుంబం అనే సూత్రాన్ని ఈ కాంక్లేవ్ ప్రతిబింబిస్తుంది.
****
(Release ID: 2179262)
Visitor Counter : 6