కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

విశాఖపట్నంలో గూగుల్ 1 గిగావాట్ హైపర్‌స్కేల్ డేటా సెంటర్‌తో ఆంధ్రప్రదేశ్‌కు రూ. 10,000 కోట్ల ఆదాయం: కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని


స్వర్ణాంధ్రప్రదేశ్ ప్రగతి, స్వావలంబన ప్రస్థానంలో గూగుల్ ప్రాజెక్టు కీలక మైలురాయిగా అభివర్ణించిన కేంద్ర మంత్రి

Posted On: 14 OCT 2025 2:29PM by PIB Hyderabad

విశాఖపట్నంలో ఏర్పాటు చేయనున్న ఒక గిగావాట్ హైపర్‌స్కేల్ గూగుల్ డేటా సెంటర్ ఆంధ్రప్రదేశ్‌కు దాదాపు రూ. 10,000 కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తుందని కేంద్ర కమ్యూనికేషన్లు, గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఈ రోజు పేర్కొన్నారు.

స్వర్ణాంధ్రప్రదేశ్ అభివృద్ధి, స్వావలంబన ప్రస్థానంలో కీలక మైలురాయిగా కేంద్ర మంత్రి ఈ ప్రాజెక్టును అభివర్ణించారు. అయిదేళ్ల కాలంలో (2026-2030) దాదాపు 15 బిలియన్ డాలర్ల పెట్టుబడి ద్వారా రాష్ట్రంలో 5,000 – 6,000 ప్రత్యక్ష ఉద్యోగాలు, మొత్తంగా 20,000 – 30,000 ఉద్యోగావకాశాలు లభిస్తాయని వివరించారు. అదే సమయంలో విశాఖపట్నం నగరానికి అవసరమైన మానవ వనరులు, మౌలిక సదుపాయాలు, విద్యుత్తు, శీతలీకరణ సదుపాయాలను అందిస్తుందని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గణనీయంగా ఎన్నో రెట్లు మెరుగుపరుస్తుందని వివరించారు.

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు.. న్యూఢిల్లీలో నిర్వహించిన భారత్ ఏఐ శక్తి కార్యక్రమం సందర్భంగా గూగుల్ ప్రకటించిన అనంతరం కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడారు. దేశంలో మొదటి గిగా వాట్ పరిమాణం గల డేటా సెంటర్, గూగుల్‌కు చెందిన తొలి ఏఐ హబ్ ఈ ప్రాజెక్టులో ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సహకారాన్ని డాక్టర్ చంద్రశేఖర్ ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్‌కు గూగుల్‌ను తీసుకురావడంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, శ్రీ నారా లోకేశ్ నిరంతర కృషిని అభినందించారు.

రాష్ట్రాన్ని డిజిటల్ హబ్‌గా నిలపడంలో, దేశవ్యాప్తంగా ఏఐ ఆధారిత పరివర్తనను వేగవంతం చేయడంలో ఈ ప్రాజెక్టు కీలక ముందడుగు అని ఆయన వ్యాఖ్యానించారు.

కేంద్ర రైల్వే, సమాచార - ప్రసార, ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖల మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్, ఆర్థిక- కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ ఎన్. చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖా మంత్రి శ్రీ నారా లోకేశ్, గూగుల్ క్లౌడ్ సీఈవో శ్రీ థామస్ కురియన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

***


(Release ID: 2178965) Visitor Counter : 6