వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
భారతదేశ మౌలిక సదుపాయాలు, అభివృద్ధి ప్రయాణంలో పీఎం గతిశక్తి సృష్టించిన మార్పును ప్రశంసించిన కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్
ప్రణాళికలతో పాటు నిర్ణయాలు తీసుకోవటాన్ని మెరుగుపరిచేందుకు ఏకీకృత భౌగోళిక ప్రాదేశిక ఇంటర్‌ఫేస్ ద్వారా ప్రధానమంత్రి గతిశక్తి సమాచారాన్ని అందరికి అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించిన కేంద్ర మంత్రి
పీఎం గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ వేదికను (పీఎంజీఎస్-ఎన్ఎంపీ) అవసరం మేరకు విశ్లేషించే విధానంలో
ప్రైవేటు రంగానికి అందుబాటులోకి తీసుకొచ్చిన శ్రీ పీయూష్ గోయల్
ఉత్తమ పద్ధతులు, విజయవంతమైన ఘట్టాలను ప్రధానంగా తెలియజేసే పీఎం గతిశక్తి సంకలనం 3వ సంపుటిని విడుదల చేసిన కేంద్ర మంత్రి
ఎన్ఎంపీ డ్యాష్‌బోర్డ్, తీరప్రాంతేతర అభివృద్ధి ప్రణాళిక వేదిక, ప్రత్యక్ష డేటా నిర్వహణ వ్యవస్థ, ఆకాంక్షిత జిల్లాలకు సంబంధించిన జిల్లా మాస్టర్ ప్లాన్.. సమర్థవంతమైన రవాణా కోసం ఉద్దేశించిన లీప్స్ 2025లను ప్రారంభించిన పీయూష్ గోయల్
Posted On:
13 OCT 2025 4:54PM by PIB Hyderabad
ప్రధానమంత్రి గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్‌కు (ఎన్ఎంపీ) నాలుగు సంవత్సరాల నిండిన సందర్భంగా ఢిల్లీలో ఇవాళ నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల మంత్రి శ్రీ పీయూష్ గోయల్.. ఈ ప్రణాళిక తీసుకొచ్చిన భారీ మార్పును ప్రత్యేకంగా పేర్కొన్నారు. నాలుగు ఏళ్ల క్రితం ఇదే రోజున ఎన్ఎంపీ ప్రారంభమైంది.
ప్రధానమంత్రి గతిశక్తి వేగం, సామర్థ్యాన్ని.. రెండింటినీ తీసుకొస్తుందన్న పీయూష్ గోయల్.. ఇది సాధారణ కార్యక్రమం కాదని పేర్కొన్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికత నుంచి ఇది వచ్చిందని తెలిపారు. ప్రజలకు ఉపయోగపడే మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రణాళికతో మెరుగైన రీతిలో చేపట్టే విధానంపై దాదాపు రెండు దశాబ్దాల సుదీర్ఘ ఆలోచన దీని వెనుక ఉందని అన్నారు. ప్రభుత్వాధినేత శ్రీ నరేంద్ర మోదీ పరిపాలనలో వినూత్న ఆలోచనలను తీసుకొచ్చారని తెలిపారు. ఆయన భారత్‌ను సుసంపన్న అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే స్పష్టమైన లక్ష్యాన్ని కలిగి ఉన్నారని కేంద్ర మంత్రి అన్నారు. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు భాగస్వాములందరూ కలిసికట్టుగా అంకితభావంతో ఉన్నారని.. ఈ ప్రయాణంలో ప్రధానమంత్రి గతిశక్తి కీలక పాత్ర పోషిస్తుందని శ్రీ పీయూష్ గోయల్ చెప్పారు.
భారతదేశ మౌలిక సదుపాయాల విషయంలో ప్రణాళిక, సంబంధిత వ్యవస్థ అభివృద్ధిని మరింత బలోపేతం చేసేందుకు ఉద్దేశించిన పలు కీలక కార్యక్రమాలను శ్రీ పీయూష్ గోయల్ ప్రారంభించారు. పీఎం గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ (ఎన్ఎంపీ) వేదికను అవసరం మేరకు విశ్లేషించే విధానంలో ప్రైవేట్ రంగానికి అందిస్తున్నారు. ఈ విశ్లేషణ పద్ధతిని భాస్కరాచార్య నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ స్పేస్ అప్లికేషన్స్ అండ్ జియో-ఇన్ఫర్మేటిక్స్ (బీఐఎస్ఏజీ-ఎన్) అభివృద్ధి చేసింది. ఇది భౌగోళిక ప్రాదేశిక డేటా, అధునాతన విశ్లేషణలకు వీలు కల్పిస్తుంది. విజయవంతమైన ఘట్టాలు, ఉత్తమ పద్ధతులను తెలిపే పీఎం గతిశక్తి సంకలనం 3వ సంపుటిని ఆయన విడుదల చేశారు. పురోగతిని పర్యవేక్షించటం, కార్యాచరణ విషయంలో లోతైన విషయాలను పొందేందుకు సమగ్ర బహుళ రంగాల రిపోర్టింగ్ వ్యవస్థ అయిన పీఎంజీఎస్ ఎన్ఎంపీ డ్యాష్‌బోర్డ్‌ను ప్రారంభించారు. మంత్రిత్వ శాఖలు- విభాగాలు, రాష్ట్రాలు- కేంద్రపాలిత ప్రాంతాలు మధ్య క్రాస్ లెర్నింగ్‌తో పాటు విజ్ఞాన మార్పిడిని ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన కేఎంఎస్‌ను (నాలెడ్జ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్) ప్రారంభించారు. బహుళ రంగాలలో తీరప్రాంతేతర అభివృద్ధి, సమగ్ర ప్రణాళిక- నిర్వహణకు సంబంధించిన పీఎం గతిశక్తి- ఆఫ్‌షోర్ అనే ప్రత్యేక డిజిటల్ వేదికను ఆవిష్కరించారు. ప్రత్యక్ష డేటా యాజమాన్యం, జవాబుదారీతనాన్ని మెరుగుపరిచేందుకు ఉద్దేశించిన వికేంద్రీకృత డీయూఎమ్ఎస్‌ను (డేటా అప్లోడింగ్- మేనేజ్‌మెంట్ సిస్టమ్) ఆయన ప్రారంభించారు. డేటా ఆధారిత స్థానిక మౌలిక సదుపాయాల అభివృద్ధి, సమగ్ర ప్రాంతీయ వృద్ధిని బలోపేతం చేసేందుకు ఆకాంక్షిత జిల్లాలకు సంబంధించిన పీఎంజీస్ జిల్లా మాస్టర్ ప్లాన్ (డీఎంపీ)ను ప్రారంభించారు. రవాణా రంగంలో ఉత్తమ నాయకత్వం, ఆవిష్కరణలను గుర్తించేందుకు ఉద్దేశించిన లీప్స్-2025ను (లాజిస్టిక్స్ ఎక్సలెన్స్, అడ్వాన్స్మెంట్- పెర్ఫార్మెన్స్ షీల్డ్) ఆవిష్కరించారు.
ప్రధానమంత్రి గతిశక్తిని ప్రారంభించినప్పుడు ప్రధానమంత్రి.. ఆత్మనిర్భర్ భారత్ సంకల్పంతో రాబోయే 25 సంవత్సరాల అభివృద్ధికి పునాది పడుతున్నట్లు తెలిపారని పీయూష్ గోయల్ అన్నారు. స్థూల స్థాయి ప్రణాళిక, సూక్ష్మ స్థాయి అమలు మధ్య కీలకమైన వారధిగా మారిన ప్రధానమంత్రి గతిశక్తి.. వివిధ రంగాలు, సంస్థలను మార్చేసే ప్రభావవంతమైన సాధనంగా పనిచేస్తోందని అన్నారు. జాతీయ అభివృద్ధి పథాన్ని మార్చే సామర్థ్యం ఈ కార్యక్రమానికి ఉందన్నారు. ఇది ఇకమీదట రోడ్లు, రైల్వే మార్గాల ప్రణాళికకు మాత్రమే పరిమితం కాదన్న ఆయన.. వీటిని జాతీయ ప్రణాళిక, అమలులో మరింత లోతుగా ఏకీకృతం చేయటాన్ని సులభతరం చేస్తుందని అన్నారు.
ఇప్పుడు ఒకే ఇంటిగ్రేటెడ్ డాటాబేస్‌తో మ్యాప్ అయిన 112 ఆంకాక్షిత జిల్లాలకు సంబంధించిన ప్రధానమంత్రి గతిశక్తి జిల్లా మాస్టర్ ప్లాన్‌ను ప్రారంభించటం వల్ల ఈ ప్రాంతాలు సమగ్రంగా అభివృద్ధి చెందుతాయని కేంద్ర మంత్రి శ్రీ పీయూష్ గోయల్ తెలియజేశారు. వృద్ధి చివరి వ్యక్తిని చేరేలా చూసుకోవటం ద్వారా సమ్మిళిత, సుస్థిరాభివృద్ధిని ప్రోత్సహించేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు తెలిపారు. ఆరోగ్య సంరక్షణ, విద్య, రవాణా, పారిశ్రామికాభివృద్ధి, పర్యావరణ నిర్వహణ, భద్రత, ఖనిజ వనరుల వినియోగం, పునరుత్పాదక ఇంధనోత్పత్తి వంటి కీలక రంగాలలో ప్రాంతీయ ప్రణాళికకు జిల్లా మాస్టర్ ప్లాన్ మద్దతునిస్తుంది. విడివిడి అభివృద్ధి విధానాల నుంచి ఉమ్మడి విధానాల ద్వారా ప్రాంతాలను అభివృద్ధి చేసే సమగ్ర ప్రణాళికకు మారటాన్ని ఇది తెలియజేస్తోందని అన్నారు.
చివరి మైలు అనుసంధానత మెరుగవటంతో రవాణా ఖర్చులు తగ్గాయని పీయూష్ గోయల్ ప్రముఖంగా ప్రస్తావించారు. గతంలో గనుల నుంచి విద్యుతుత్పత్తి కేంద్రాలకు బొగ్గు రవాణాలో పలు సార్లు లోడింగ్, అన్లోడింగ్ చేయాల్సి ఉండటం వల్ల అసమర్థతకు, వ్యయాలు పెరిగేందుకు, నష్టాలకు దారితీసిందని అన్నారు. గనులు, విద్యుతుత్పత్తి కేంద్రంలో చివరి మైలు అనుసంధానతను క్రమబద్ధీకరించడం వల్ల విద్యుత్ ఖర్చు భారీగా తగ్గి మొత్తం రవాణా సామర్థ్యం పెరిగిందని తెలిపారు. గత నాలుగు సంవత్సరాలుగా పలు ప్రాంతాలకు చేరుకున్న పీఎం గతిశక్తి ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న పట్టణ ప్రణాళిక సంస్థలు- వ్యక్తులు, రాష్ట్రాలు, మంత్రిత్వ శాఖలు లబ్ధిపొందాయని అన్నారు.
ఉత్తమ పద్ధతులు, విజయవంతమైన సందర్భాలను తెలియజేసే సంకలనాన్ని (వాల్యూమ్-3) కేంద్ర మంత్రి విడుదల చేశారు. పీఎం గతిశక్తి చేపట్టిన కార్యక్రమాలు, ప్రజల జీవితాలపై చూపించిన స్పష్టమైన ప్రభావాలను ఇది తెలియజేస్తోంది.
ప్రధానమంత్రి గతిశక్తి డేటాబేస్‌లను ప్రజలకు అందుబాటులోకి తెస్తామని గత బడ్జెట్‌లో చేసిన ప్రకటనను మంత్రి ప్రస్తావించారు. యూనిఫైడ్ భౌగోళిక ప్రాదేశిక ఇంటర్‌ఫేస్ ద్వారా పీఎం గతిశక్తి డేటాబేస్‌ను ప్రజలందరూ ఉపయోగించుకునేలా భాస్కరాచార్య నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ స్పేస్ అప్లికేషన్స్ అండ్ జియో-ఇన్ఫర్మేటిక్స్ (బీఐఎస్ఏజీ-ఎన్), మంత్రిత్త్వ శాఖ కృషి చేసిందని అన్నారు. ప్రణాళిక తయారుచేయటం, నిర్ణయాలు తీసుకునే విషయంలో డేటాను ఉపయోగించటం, డేటాను సులభంగా పొందేందుకు వీలు కల్పిస్తుందని మంత్రి తెలిపారు.
ప్రస్తుతం అవలంబిస్తోన్న ప్రాంతీయ ప్రణాళిక విధానంలో వివిధ ప్రాంతాల అభివృద్ధిపై పీఎం గతిశక్తి ప్రభావం చూపించే తీరును తెలుసుకునేందుకు సమగ్ర బహుళ-రంగ నివేదిక వ్యవస్థను ప్రారంభించినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. వికేంద్రీకృత డేటా షేరింగ్ మాడ్యూల్.. సమాచారాన్ని అందుబాటులో ఉండేలా చూసుకోవటంతో పాటు డేటాబేస్‌లను తాజాగా ఉంచే ప్రాముఖ్యతను తెలియజేస్తోందన్నారు. సరైన డ్యాష్‌బోర్డ్ ప్రణాళికకు ఉపయోగపడటంతో పాటు ప్రజలకు డేటాను అందుబాటులోకి తీసుకొస్తుందన్నారు. తద్వారా పారదర్శకతను పెంచటం, ఆధారాలతో కూడిన నిర్ణయాలు తీసుకోవటాన్ని సులభతరం చేస్తుందని తెలిపారు.
ఆయా ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల లోటును భర్తీ చేస్తూ ప్రాంత-నిర్దిష్ట ప్రణాళికలో భాగంగా స్థానిక అవసరాలను తీర్చడం ద్వారా ఆకాంక్షిత జిల్లాలను చేరుకోవటం అనేది ఈ కార్యక్రమ ముఖ్య లక్ష్యమని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. సమగ్ర అభివృద్ధి, వనరులను అందరికి సమానంగా అందుబాటులో ఉంచే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం.. రెండింటి సమష్టి నిబద్ధతను ఈ కార్యక్రమం తెలియజేస్తోందని మంత్రి అన్నారు.
దేశవ్యాప్తంగా రవాణా సామర్థ్యం, దాని ప్రభావాన్ని మెరుగుపరచడంలో భాగస్వాముల కృషిని గుర్తించేందుకు ఉద్దేశించిన లీప్స్‌ను (లాజిస్టిక్స్ ఎక్సలెన్స్, అడ్వాన్స్మెంట్, పెర్ఫార్మెన్స్ షీల్డ్) ప్రారంభించటం మరో కీలక ఘట్టమని శ్రీ పీయూష్ గోయల్ అన్నారు. గత నాలుగు సంవత్సరాల విజయాలు అద్భుతమైనవన్న మంత్రి.. మంత్రిత్వ శాఖలు- విభాగాలు, రాష్ట్రాలు - కేంద్రపాలిత ప్రాంతాలనే పరిధిని దాటేందుకు పీఎం గతిశక్తికి స్పష్టమైన దార్శనికత కలిగి ఉందని పేర్కొన్నారు.
సముద్ర వనరుల మ్యాపింగ్, పవన శక్తి ప్రణాళిక, తీరప్రాంతేతర - భూగర్భ కేబుల్ మార్గాలు, టెలికాం - డేటా నెట్‌వర్క్‌లతో పాటు భవిష్యత్తులో సముద్రగర్భ విద్యుత్ ప్రసారం వంటి విభాగాలకు విస్తరిస్తోన్న దృష్ట్యా.. పీఎం గతి శక్తి పరిధి, స్థాయి, ప్రభావం భారీ మార్పుకు లోనవుతున్నాయని మంత్రి అన్నారు. భౌతిక, సామాజిక మౌలిక సదుపాయాలకు మించి ప్రజలు, పరిశ్రమలు, ప్రణాళికలు తయారుచేసే సంస్థలను అనుసంధానించే వేదికగా ఈ కార్యక్రమాన్ని మార్చేందుకు ప్రభుత్వ పనిచేస్తోందని ఆయన అన్నారు. దీనివల్ల పీఎం గతిశక్తి జాతీయ, మానవ అభివృద్ధికి కేంద్ర సాధనంగా మారటంతో పాటు దేశాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తుందన్నారు. మొత్తంగా వికసిత్ భారత్ 2047 దార్శనికతను సాకారం చేస్తుందని అన్నారు.
ఇప్పుడు ప్రధానమంత్రి గతిశక్తి భౌతిక మౌలిక సదుపాయాలకు మించి సామాజిక మౌలిక సదుపాయాలు, మానవ అభివృద్ధి, పరిశ్రమల భాగస్వామ్యం, డిజిటల్ ఏకీకరణ విషయంలో పనిచేస్తోందని కేంద్ర మంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. ఇది సమగ్ర, సమ్మిళిత, డేటా ఆధారిత వృద్ధిని ప్రోత్సహిస్తూ జాతీయ అభివృద్ధికి కేంద్రంగా మారిందన్నారు. ఇప్పుడు పీఎం గతిశక్తి.. పవన శక్తి, తీరప్రాంతేతర కేబుల్స్, భూగర్భ కేబుల్స్, టెలికాం కేబుల్స్, డేటా ఆప్టికల్ కేబుల్స్ పాటు తీరప్రాంతేతర వనరుల మ్యాపింగ్, అన్వేషణకు వర్తిస్తోందని తెలిపారు. భవిష్యత్తులో సముద్రగర్భంలో విద్యుత్ ప్రసారంపై కూడా పనిచేయనుందని పేర్కొన్నారు. ప్రధానమంత్రి గతిశక్తి పరిధి, వర్తించే అంశాలు భారీ మార్పు లోనవుతున్నాయని.. దీనిని తదుపరి స్థాయికి చేర్చేందుకు ప్రభుత్వం చురుకుగా పనిచేస్తోందని తెలిపారు. ఈ విస్తరణ భౌతిక, సామాజిక మౌలిక సదుపాయాలను ఏకీకృతం చేయడం.. ప్రజలు, పరిశ్రమల భాగస్వామ్యాన్ని పెంచటం.. మానవాభివృద్ధి, దేశ పురోగతికి ప్రధానమంత్రి గతిశక్తిని ఒక వ్యూహాత్మక సాధనంగా మార్చటం, అంతిమంగా వికసిత్ భారత్ 2047 దార్శనికతకు దోహదపడటమే లక్ష్యంగా పెట్టుకుందని మంత్రి తెలిపారు.
భారతదేశం ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రణాళిక, అమలు చేసే పద్ధతిలో పీఎం గతిశక్తి భారీ మార్పును తీసుకొచ్చిందని పీయూష్ గోయల్ తెలిపారు. పలు మంత్రిత్వ శాఖలు, రాష్ట్రాల నుంచి డేటాను ఒకే చోట అందుబాటులో ఉంచటం ద్వారా ఈ కార్యక్రమం ఫలితాల ఆధారంగా నిర్ణయం తీసుకునే సాధనాన్ని సృష్టించిందని అన్నారు. ఎన్ఎంపీ వేదికను ప్రైవేట్ రంగానికి అందుబాటులోకి తీసుకురావటం, విజ్ఞాన నిర్వహణ వ్యవస్థను ప్రారంభించటం, పీఎం గతిశక్తి- ఆఫ్‌షోర్ ఆవిష్కరణతో సహా ప్రారంభించిన కొత్త కార్యక్రమాలు.. డేటా ఆధారిత ప్రణాళికను మరింత మెరుగుపరుస్తాయని అన్నారు. దీనితో పాటు విభిన్న రంగాల సహకారాన్ని పెంపొందిస్తాయని, దేశవ్యాప్తంగా సమగ్ర - స్థిరమైన అభివృద్ధిని వేగవంతం చేస్తాయని కేంద్ర మంత్రి తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రిత్వ శాఖలు- విభాగాలు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, పరిశ్రమ సంఘాలకు చెందిన వారు 200 మందికి పైగా పాల్గొన్నారు. కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీ జితిన్ ప్రసాద.. మధ్యప్రదేశ్ ప్రజా పనుల మంత్రి శ్రీ రాకేష్ సింగ్ ఈ కార్యక్రమంలో మాట్లాడారు. ప్రధానమంత్రి గతిశక్తి పరిణామాన్ని వారు ప్రధానంగా ప్రస్తావించారు.
గత నాలుగు సంవత్సరాల్లో సాధించిన కీలక విజయాలు:
* నెట్‌వర్క్ ప్లానింగ్ గ్రూప్ (ఎన్పీజీ) పీఎం గతిశక్తి ప్రమాణాలను ఉపయోగించి 300కి పైగా ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను సమీక్షించింది. వీటిలో ఇంటిగ్రేటెడ్ ప్లానింగ్, పూర్తిస్థాయి అనుసంధానత, ఇంటర్‌మోడల్ లింకేజీలు, రవాణా సామర్థ్యం పెంపు, సమన్వయంతో ప్రాజెక్టులను చేపట్టటం తదితరాలు ఉన్నాయి.
* 36 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు జాతీయ మాస్టర్ ప్లాన్‌తో అనుసంధానమైన రాష్ట్ర మాస్టర్ ప్లాన్ (ఎస్ఎంపీ) పోర్టల్‌లను తయారుచేసుకున్నాయి. ఇవి మూలధన పెట్టుబడిని క్రమబద్ధీకరించేందుకు, ప్రాజెక్ట్ అమలును వేగవంతం చేయడానికి ఉపయోగపడతాయి. పీఎం గతిశక్తి పోర్టల్‌లో 600కి పైగా ప్రాజెక్టుల ప్రణాళిక, మ్యాపింగ్ చేసారు.
* సామాజిక-ఆర్థిక అభివృద్ధి కోసం పీఎం గతిశక్తిని ఉపయోగించటంపై దృష్టి సారిస్తూ సామాజిక- ఆర్థిక మంత్రిత్వ శాఖలకు ఈ కార్యక్రమం విస్తరించింది. పాఠశాలలు, ఆసుపత్రులు, అంగన్వాడీలలో మౌలిక సదుపాయాల లోటును గుర్తించడం… సంబంధిత డేటా కోసం ప్రణాళిక సాధనాలను తయారు చేయటం ద్వారా ఈ వేదిక ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ, విద్య, పోస్టల్ సేవలు, గిరిజన అభివృద్ధిలో మరింత ప్రభావవంతమైన ప్రణాళికకు దారితీసింది. మారుమూల, వెనుకబడిన ప్రాంతాలు కూడా దేశంలోని మౌలిక సదుపాయాల వృద్ధి నుంచి ప్రయోజనం పొందేలా పీఎం గతిశక్తి చూసుకుంది.
* జాతీయ మాస్టర్ ప్లాన్ ఆధారంగా బీఐఎస్ఏజీ-ఎన్ ఇచ్చిన సాంకేతిక సహకారంతో అభివృద్ధి చేసిన పీఎం గతిశక్తి జిల్లా మాస్టర్ ప్లాన్ (డీఎంపీ) పోర్టల్.. 28 ఆకాంక్షిత జిల్లాల విషయంలో జిల్లా స్థాయి సహకార ప్రణాళికను తయారుచేయటాన్ని సులభతరం చేస్తుంది. విభాగాల మధ్య సహకారం, ఏఐ- ఐఓటీ వంటి వర్థమాన సాంకేతికలను ఉపయోగించటం ద్వారా ఈ పోర్టల్ సమగ్ర సామాజిక-ఆర్థిక ప్రణాళికను చేపట్టనుంది. అరుణాచల్ ప్రదేశ్ వెస్ట్ కామెంగ్‌లోని బిచోమ్‌లో పర్యాటక ప్రణాళిక, ఒడిశాలోని కళింగనగర్‌లో ఆర్థిక అభివృద్ధి ప్రణాళికతో సహా ఈ వేదికను సమగ్రాభివృద్ధికి వేదికగా ఉపయోగించేందుకు వివిధ భాగస్వాములకు శిక్షణ ఇచ్చాయి.
* సామర్థ్యం, నైపుణ్యాలను పెంపొందించేందుకు ఐజీఓటీ కోర్సులు, వర్క్‌షాప్‌లు, ఇంటరాక్టివ్ సెషన్‌ల ద్వారా డీపీఐఐటీ విస్తృత స్థాయిలో శిక్షణ కార్యక్రమాలను చేపట్టింది. వీటికి 20,000 మందికి పైగా అధికారులు హాజరయ్యారు. పీఎం గతిశక్తి మాడ్యూళ్లను కేంద్ర శిక్షణా సంస్థల పాఠ్యాంశాల్లో చేర్చారు. మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ విభాగాలు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో దాదాపు 250 ఇంటరాక్టివ్ కార్యక్రమాలను నిర్వహించారు.
* సామర్థ్య పెంపుదలకు నిబద్ధతను తెలియజేసేలా డీపీఐఐటీ.. మౌలిక సదుపాయాలు, రవాణా ప్రణాళికలో నైపుణ్య అభివృద్ధి, క్రాస్-లెర్నింగ్, సాంకేతిక సహాయాన్ని పెంపొందించే ఉద్దేశంతో గతిశక్తి విశ్వవిద్యాలయం, కొరియా రవాణా సంస్థతో (కేఓటీఐ) అవగాహన ఒప్పందం చేసుకుంది.
* సమీకృత మౌలిక సదుపాయాల ప్రణాళికలో ప్రధానమంత్రి గతిశక్తి, భౌగోళిక ప్రాదేశిక సాంకేతికతల ఉపయోగాన్ని ప్రోత్సహించేందుకు నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక, మడగాస్కర్, సెనెగల్, గాంబియా వంటి దేశాలతో అంతర్జాతీయ భాగస్వామ్యం కొనసాగుతోంది.
* గత సంవత్సరం ఇదే రోజున ఢిల్లీలోని ఐటీపీఓలో ప్రధానమంత్రి గతిశక్తి అనుభూతి కేంద్రాన్ని (ఎక్స్‌పీరెన్సియల్ సెంటర్) ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. హోలోగ్రాఫిక్ ప్రదర్శనలు, ఏఆర్-వీఆర్ అనుభవాలు, ఇంటరాక్టివ్ సిమ్యూలేషన్లతో ఉన్న ఈ కేంద్రం.. అంతర్జాతీయ ప్రతినిధులు, దౌత్యవేత్తలు, ప్రభుత్వాధికారులు, విద్యార్థులు, సాధారణ ప్రజలను స్వాగతం పలుకుతూ పీఎం గతిశక్తిని ప్రపంచానికి తెలియజేసే, ప్రజలకు అందుబాటులో ఉండే కేంద్రంగా పనిచేసింది.
గత నాలుగు సంవత్సరాలుగా పీఎం గతిశక్తి భారతదేశంలోని మౌలిక సదుపాయాలకు సంబంధించిన ప్రణాళికను.. వినూత్న డిజిటల్ సాధనాలు, సమీకృత వేదికలు, వివిధ రంగాల మధ్య సహకారం అనే అంశాల ద్వారా మార్చేసింది. నిరంతర విస్తరణ, నూతన భాగస్వామ్యాల రాకతో పీఎం గతిశక్తి.. మౌలిక సదుపాయాల విషయంలో భారత్‌కు ఉన్న దార్శనికతను సాధించే దిశగా ప్రయాణాన్ని వేగవంతం చేయటం, ఆర్థిక పురోగతిని ముందుకు తీసుకెళ్లటం, ప్రజల జీవన నాణ్యతను మెరుగుపరిచేందుకు సిద్ధంగా ఉంది. పీఎం గతిశక్తి ప్రాజెక్టులను చేపట్టటం మాత్రమే కాదు.. ఇది భారతదేశ భవిష్యత్తును రూపొందిస్తోంది.
***
(Release ID: 2178750)
Visitor Counter : 21